విజయనగరం

పింఛన్ పంపిణీలో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మే 31: మీ- ఇంటికి పెద్ద కొడుకై ఆదుకుంటూ ఆపదలో అండగా ఉంటా.. ఆర్థిక ఇబ్బందు ల్లేకుండా చూస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నారు. అయితే ఆయన ప్రకటనలకు, ఆచరణలకు ఎక్కడ పొంతన కుదరడంలేదు. ప్రతి నెల ఒకటో తేదీ నాటికే ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి అందరికీ పూర్తిస్థాయిలో పింఛన్లు అందిస్తామని ఎన్నికల ముందు చెప్పినమాట నేడు ఆచరణ సాధ్యం కావటం లేదు. ప్రతీ నెల ఒకటవ తేదీ నాటికి పింఛన్లు పంపిణీకి కావాల్సిన మొత్తంలో ప్రభుత్వం కోత విధిస్తూ వాయిదాల పద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నది. దీంతో విడతల వారీగా పంచాయతీ కార్యదర్శులు వారికిచెందిన నగదును పింఛన్‌దారులకు చెల్లింపులు చేస్తున్నారు. గత నెల మొదటి వారంలో 70శాతం నిధులు విడుదల చేయగా ఈ నెల 74శాతం నిధులు విడుదల చేశారు. మిగతా నిధులు రెండవ వారంలో విడుదలచేస్తే మిగిలిన పింఛన్‌దారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. గజపతినగరం మండలంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్‌దారులు 70,62మంది ఉండగా వారికి పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయాలంటే 75,21,000 అవసరం కాగా 55,64,600నిధులను తొలివిడతలో విడుదల చేశారు. మిగిలిన నిధులు విడుదల అయితేగానీ పూర్తిస్థాయిలో పింఛన్లు పంపిణీ పూర్తికాని పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకటో తేదీనాటికి పింఛన్ల సొమ్ము కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వ చేస్తున్న జాప్యానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీ నాటికి పింఛన్ల పంపిణీ హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

జగన్‌పై ఆరోపణలు నిరూపించగలరా?
విజయనగరం(టౌన్), మే 31: రాజధాని నిర్మాణానికి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలను ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారని చేస్తున్న విమర్శలకు సాక్ష్యాధారాలు టిడిపి నాయకులు చూపించగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేక, కేంద్రం నుండి రాష్ట్ర అవసరాలకు తగిన నిధులు రాబట్టలేక ప్రజల దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని కోలగట్ల అన్నారు. ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు అటుకేంద్రం వద్ద ఇటు తెలంగాణ విషయంలో గట్టిగా నిలదీయలేని స్థితిలో ఉన్న ఆయన తనమీద ఉన్న కేసులు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. రాజ్యసభ సీటు విషయంలో ఎ1 ముద్దాయి ఎ2 ముద్దాయికి సీటు ఇచ్చారని చంద్రబాబు విమర్శలు చేయడం గురివింద సామెతను గుర్తుచేస్తోందని అన్నారు. కోటీశ్వరులైన సుజనాచౌదరి, టిజి. వెంకటేష్‌లకు రాజ్యసభ టిక్కెట్లు ఇవ్వడానికి ఎన్నికోట్ల రూపాయలు చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని విమర్శించారు. రైల్వే మంత్రి సురేష్‌బాబుకు టిక్కెట్‌ను కేటాయించిన టిడిపి ప్రత్యేక రైల్వే జోన్ రాష్ట్రానికి ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయడంలేదని ప్రశ్నించారు. మహానాడు తీర్మానాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని, అమలుకు నోచుకోవడంలేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు వివాదాస్పదం

విజయనగరం (్ఫర్టు), మే 31: విజయనగరం మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుఅంశం వివాదస్పదంగా మారుతోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. అయితే చైర్మన్ స్పీడ్‌కు బ్రేక్‌లు వేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌కి చెందిన సీనియర్ కౌన్సిలర్ ఎస్‌వివి రాజేశ్వరరావురంగంలోకి దిగారు. చైర్మన్ మొండిగా వ్యవహరిస్తుండటంతో ఉద్యోగులకు న్యాయం జరిగేవిధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో ఈ వ్యవహారం తీవ్రస్థాయికి చేరుకుంది. అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఎట్టి పరిస్థితులలోను ఔట్ సోర్సింగ్ కార్మికులను తొలగించవలసిందేనని ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ వౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత విభాగాల అధికారుల ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇక నుంచి కార్యాలయానికి రానవసరం లేదంటూ చెప్పాలని సూచించారు. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెప్పలేక, చెర్మన్‌కు ఎదురు సమాధానం చెప్పలేక అధికారులు సతమతమవున్నారు. ఉద్యోగులను తొలగించవలసిందేనని చైర్మన్ భీష్మించడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో భయం పట్టుకుంది. అర్థాంతరంగా తమను తొలగిస్తే తమ కుటుంబాలు వీధిన పడతాయని అధికారులకు విన్నవించుకున్నారు. అయితే ఈ విషయంలో తామేమి చేసేదేమి లేదంటూ అధికారులు తప్పించుకోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు కూడా చేతులేత్తి వేయడంతో వారంతా మున్సిపాలిటీలో ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యునిగా వ్యవహరిస్తున్న రాజేశ్వరరావును ఆశ్రయించారు. దీంతో ఇక్కడ కథ అడ్డం తిరిగింది. గత కొనే్నళ్ల నుంచి పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏలా తొలగిస్తారంటూ అధికారులను ఆయన నిలదీశారు. ఏ ప్రాతిపదిన తొలగిస్తారో ప్రభుత్వ జిఓల ప్రకారం తెలియజేయాలని ఆయన డిమాండ్ చేయడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చైర్మన్ ఆదేశాలు వౌఖిక అమలు చేయలేక, ప్రతిపక్ష సభ్యుడి డిమాండ్‌కు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మున్సిపల్ పాలకవర్గసభ్యులు పంతాలకు పోవడంతో అధికారులు నలిగిపోతున్నారు. ఒకవైపుమున్సిపల్ చైర్మన్ రామకృష్ణ ఒత్తిడి...మరోవైపుప్రతిపక్ష కౌన్సిలర్ రాజేశ్వరరావుబెదిరింపులతో కొంతమంది అధికారులు, ఉద్యోగులు సెలవుపై వెళ్లిపోయారు. మరింతకొంతమంది సెలవుపై వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.

రేపటి నుంచి నవనిర్మాణ దీక్షలు
* నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం
విజయనగరం(టౌన్), మే 31: జూన్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాలతో చేపట్టనున్న నవనిర్మాణ దీక్ష కార్యక్రమాల నిర్వహణకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఎం ఎం నాయక్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రెండవ తేదీన ఉదయం 11గంటలకు నవనిర్మాణ దీక్షపై ముఖ్యమంత్రి ప్రసంగం, ప్రతిజ్ఞ, లైవ్ ప్రసారం ఉంటుందని తెలిపారు. 3నుండి 7వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలు. 8న మహాసంకల్పం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులుగా కురుపాం నియోజకవర్గానికి పార్వతీపురం ఆర్డీవో గోవిందరావు, గిరిజన సంక్షేమశాఖ ఎస్ ఇ ఎవి.సుబ్బారావు (పార్వతీపురం), డి ఎఫ్ ఓ రమణమూర్తి(బొబ్బిలి), డి ఆర్‌డి ఎ పిడి ఢిల్లీరావు(గజపతినగరం), జడ్పీసి ఇ ఓ రాజకుమారి (విజయనగరం), భూసేకరణ ప్రత్యేక ఉపకలెక్టర్ అనిత(నెల్లిమర్ల), ఆర్‌డి ఓ శ్రీనివాసమూర్తి (చీపురుపల్లి), పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గణపతిరావు( సాలూరు) నియోజకవర్గ ప్రత్యేకాధికారులుగా నియమించారు.

50వేల పంటగుంతల
నిర్మాణం లక్ష్యం
*కలెక్టర్ ఎం ఎం నాయక్
గజపతినగరం, మే 31: జిల్లాలో 50వేల పంటగుంతలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా కలెక్టర్ ఎం ఎం నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని మరుపల్లి గ్రామంలో పంటగుంతల కార్యక్రమాన్ని కలెక్టర్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 29వేల పంటగుంతలు నిర్మించామని జూన్ 15వ తేదీ నాటికి లక్ష్య సాధనకు కృషి చేస్తామని చెప్పారు. పంటగుంతల నిర్మాణానికి ముందుకువచ్చిన రైతులకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో లక్షా 20వేల ఇంకుడుగుంతలు నిర్మించామని, దీనికి లక్ష్యం అంటూ లేదని అన్నారు. మండలంలో పంటగుంతల నిర్మాణం స్థితిగతుల గురించి కలెక్టర్ నాయక్ ఎపి ఓ ఆదిబాబును అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఇప్పటి వరకు 1500 పంట సంజీవని గుంతలు నిర్మించామని చెప్పగా జూన్ 15వ తేదీ నాటికి 3,500 పంటగుంతలకు ప్రతిపాదనలు తయారు చేసుకుని కనీసం మూడువేల పంటగుంతలు నిర్మించాలని ఆదేశించారు. అలాగే పందెళ్లమీద కూరగాయలు పెంపకానికి రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. ప్రతీ రైతుకు అర ఎకరా భూమి, బోరువెల్ ఉంటే 98వేల రూపాయలు ఉచితంగా అందించే నిధులతో పందెళ్లు వేయించాలని చెప్పారు. గంగచోళ్లపెంట, మరుపల్లి, కాలమరాజుపేట తదితర గ్రామాలలోని కూరగాయల రైతులు కూరగాయలు పండించడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఎపి ఓ ఆదిబాబు, సాంకేతిక సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

పైపులైన్‌కు మరమ్మతులు
* ఆంధ్రభూమి వార్తకు స్పందన
విజయనగరం (్ఫర్టు), మే 31: పట్టణంలో మహారాజా కళాశాల రోడ్డులో పాడైన మంచినీటి పైపులైన్‌కు మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు మంగళవారం మరమ్మతులు చేశారు. పైపులైన్ లీకు...వృథాగా పోతున్న మంచినీరు శీర్షికతో ఈనెల 29వతేదీన ఆంధ్రభూమిలో వచ్చిన వార్తకు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు స్పందించారు. పైపులైన్ లీకు కావడంతో మంచినీరు వృథాగా పోతోంది. ఈ నేపధ్యంలో మంగళవారం పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టారు.
రహదారి వంతెన నిర్మాణానికి రూ.127 కోట్లతో ప్రతిపాదన
దత్తిరాజేరు, మే 31: మండలంలోని పెదమానాపురం గ్రామం దగ్గర జాతీయరహదారి-26పై 127కోట్ల రూపాయలు వ్యయంతో వంతెన నిర్మాణంతోపాటు ఇరుపక్కల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని ఎన్‌హెచ్ ఆర్ అండ్‌బి డి ఇ సత్యప్రసాద్ విలేఖరులకు తెలిపారు. జాతీయ రహదారి 26పై గుడివాడ రహదారి జంక్షన్ గజాలఖానా దగ్గర నుండి పెదమానాపురం సంతతోట బ్రిడ్జివరకు మూడు కిలోమీటర్ల మేర బి.టి.రోడ్డు నిర్మాణానికి కోటి 50లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి కిరువైపులా గ్రావెల్ బర్మాలు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే పెదమానాపురం ఆర్ ఓబి వద్ద నూతనంగా మరోవంతెన నిర్మాణంతోపాటు ఇరుపక్కల రహదారి నిర్మించడానికి నిధుల సేకరణకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రతిపాదనలు పంపామని డి ఇ సత్యప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో జె.ఇ. అరుణవల్లి పాల్గొన్నారు.
పైడితల్లి అమ్మవారికి విశేషపూజలు
విజయనగరం(పూల్‌బాగ్),మే 31: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. వేకువజామున అమ్మవారికి కుంకుమపూజలు అభిషేక అర్చనలు ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు జరిపారు. అనంతరం అమ్మవారిని ఆపిల్ పళ్లతో అలంకరించి పూజలు జరిపారు. మంగళవారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న వనంగుడిలో అమ్మవారిని డ్రైఫ్రూట్స్‌తో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
తారకరామ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయండి
విజయనగరం(టౌన్), మే 31: తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామం సారిపల్లి ప్రజలకు తగిన న్యాయం చేయాలని జిల్లా బిజెపి నాయకులు మంగళవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి కంభంపాటి హరిబాబుకు వినతిపత్రం అందజేశారు. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, ఇతరత్రా ఆస్తులు కోల్పోతున్న గ్రామస్థులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిర్వాసితులు కోరిన విధంగా మంజూరు చేయాలని హరిబాబుకు జిల్లా బిజెపి అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు సూచించారు. సారిపల్లి నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ రైతులకు ఇచ్చి ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని కోరారు. స్పందించిన హరిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా దృష్టికి తీసుకు వెళతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, నెల్లిమర్ల ఇన్‌చార్జ్ కృష్ణారావు, సారిపల్లి సర్పంచ్ భూషణరావు, గురునాథ్, రామారావు, శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.
ఖరీఫ్‌కు 2,960 క్వింటాళ్ల వరి విత్తనాలు
గంట్యాడ, మే 31: మండలంలోని రైతుల ఖరీఫ్ వ్యవసాయ అవసరాల కోసం 2,960 క్వింటాళ్ల వరి విత్తనాలను సిద్ధం చేస్తున్నామని మండల వ్యవసాయాధికారి హర్షలత మంగళవారం విలేఖరులకు తెలిపారు. ఎం.టి.యు.1001 రకం వరి విత్తనాలు 1774క్వింటాళ్లు, సాంబామసూరి 269 క్వింటాళ్లు స్వర్ణ 602 క్వింటాళ్లు, నెల్లూరు సన్నాలు రకం 267 క్వింటాళ్లు, పుష్యమిరకం 10 క్వింటాళ్లు, ఇంద్రరకం 17 క్వింటాళ్లు, అమనారకం 16క్వింటాళ్లు, కృతి రకం ఐదు క్వింటాళ్ల వంతున వరివిత్తనాలు మండలానికి మంజూరయ్యాయని చెప్పారు. జూన్ మొదటి వారం నాటికి వరి విత్తనాలు గంట్యాడకు వస్తాయని, అవిరాగానే విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపారు. వరి విత్తనాలకు సంబంధించి పది సంవత్సరాలు పైబడిన పాత రకాలకు కేజీకి ఐదు రూపాయలు, పదేళ్లులోపు ఉన్న కొత్త రకాలకు పది రూపాయలు వంతున ప్రభుత్వం రాయితీ ఇస్తుందని చెప్పారు. విత్తనాలను ఏగ్రామ రైతులకు ఎప్పుడు పంపిణీ చేస్తామన్న విషయం ముండుగా దండోరా మూలకంగా తెలియజేస్తామని వ్యవసాయాధికారి హర్షలత చెప్పారు. జింక్, బోరాన్, బిప్సం నిల్వలు రాయితీతో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
ఆర్థిక సంఘం నిధులు ఖర్చుచేయండి
పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అప్పలనాయుడు
విజయనగరం(టౌన్), మే 31: 13 ఆర్థిక సంఘం నిధులుపై ఆంక్షలు ఎత్తివేసిన అధికారులు మిగిలిన నిధులను వ్యయం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు అన్నారు. మంగళవారం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధుల ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా అధికారులు అనవసర ఆంక్షలు విధించడంవల్ల 150కోట్ల రూపాయలు ఖర్చుకాకుండా మిగిలిపోయాయని అన్నారు. అయితే ప్రభుత్వానికి పంచాయితీరాజ్ ఛాంబర్ చేసిన విజ్ఞప్తితో స్పందించిన ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఖర్చుచేయడానికి అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఇందులోభాగంగాజిల్లాకు సంబంధించి 20కోట్ల రూపాయల వరకు ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయని వాటిని ఖర్చుచేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు కర్రోతు సత్యం, సభ్యుడు రాంబాబు పాల్గొన్నారు.

పరి‘శుభ్రత’కు తూట్లు!
గజపతినగరం, మే 31: తాగునీటి పథకాల నిర్వహణకు ప్రభుత్వం ప్రతి ఏడాది లక్షల్లో ఖర్చుపెడుతున్నది. అయితే వాటి పరిశుభ్రత మాత్రం గాలికొదిలేస్తున్నది. గజపతినగరం మండలానికి సంబంధించి పిడబ్ల్యుడి పథకంలో 35గ్రామాలలోను 27 తాగునీటి పథకాలు ఉన్నాయి. అదేవిధంగా పిపి డబ్ల్యు పథకాలు కూడా ఉన్నాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఖర్చుచేస్తున్నా పంచాయతీ అధికారులు మాత్రం శుభ్రం చేస్తున్న దాఖలాలు కానరావడంలేదు. దీంతో తాగునీరు కలుషితం అవుతుందని ఆయా గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా పలు గ్రామాలలో తాగునీటి పథకాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నా వాటి మరమ్మతుల గురించి అధికారులు పట్టించుకోవడంలేదు. వాస్తవానికి పథకాలను ప్రతి రెండు నెలలకు ఒకసారి శుభ్రం చేయాలి. అయితే ఏడాదికి ఒకసారి శుభ్రం చేసే దాఖలాలు కనిపించలేదు. మండలంలోని సీతారాంపురంలో ఉన్న తాగునీటి పథకానికి అడుగుభాగం శిథిలమై ప్రమాదకరంగా తయారైంది. ఈ ట్యాంకు మరమ్మతు చేసేందుకు అధికారులు ముందుకు రావడంలేదు. అలాగే గంగచోళ్లపెంటలోని తాగునీటి పథకం వద్ద నాచుపట్టి అపరిశుభ్రంగా తయారైంది. దీనిని అధికారులు పట్టించుకోలేదు. ఈ లెక్కన గ్రామాలలోని 28 పంచాయతీలలో ఐదు పంచాయతీలకు ఇప్పటికే తాగునీటి పథకాలు లేవు. పరిశుభ్రతకోసం లక్షల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా వాటిని వినియోగించడంలో అధికారులు విఫలమవుతున్నారు. గ్రామాల్లోని ప్రతి తాగునీటి పథకం మూడు నెలలకు ఒకసారి పిపి డబ్ల్యూ పథకాలు, ఆరు నెలలకు ఒకసారి శుభ్రం చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రతి ఏడాది వేలల్లో ఖర్చు చేయాలి. సకాలంలో శుభ్రం చేయడంలేదని గ్రామస్థులు అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రజలు రోగాల భారిన పడుతున్నారని, నిర్ణీత గడువులోగా పరిశుభ్రం చేస్తే అనారోగ్యాలకు గురి అవరు.
జె ఇ వివరణ:
ఈవిషయమై సంబంధిత గ్రామీణ నీటి పారుదల శాఖ జె ఇ భవానీని వివరణ కోరగా పథకాల పరిశుభ్రత కోసం సర్పంచ్‌లు పనులు చేయించాలని చెప్పారు. దీనికి సంబంధించిన నిధులు అకౌంట్లలో జమ చేస్తున్నామని అన్నారు. శిథిలమైన పథకాల గురించి ప్రణాళికలు రూపొందించి చర్యలు చేపడతామని తెలిపారు.

వేడుకగా హనుమజ్జయంతి వేడుకలు
విజయనగరం(టౌన్), మే 31: పట్టణంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామివారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే స్వామివారి సేవలో భక్తులు పోటెత్తారు. పట్టణంలోని కంటోనె్మంట్, ఉడాకాలనీ, పోలీస్‌బ్యారెక్స్, దాసన్నపేట, కొత్తఅగ్రహారం, నాగోజీపేట, లాంకాపట్నం, జొన్నగుడ్డి, కలెక్టరేట్, మండలంలోని అన్నిగ్రామాల్లో శ్రీంజనేయస్వామివారి ఆలయాలకు భక్తజనం పెద్దసంఖ్యలో హాజరై ప్రత్యేకపూజలు చేసారు. లోకకల్యాణంకోసం స్వామివారి సన్నిధిలో హోమాలు నిర్వహంచారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మంగళవారం ఈపర్వదినం రావడంతో పలు ఆంజనేయస్వామివారి ఆలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. ఉదయం స్వామివారికి పాలభిషేకాలు, ఆకుపూజలు, సింధూరంతో పూజలు, భక్తుల గోత్రనామాలతో నిర్వహించారు. స్వామివారికి అతంమత ప్రీతికరమైన వడలు, అప్పాలు నైవేద్యంగా భక్తులు సమర్పించినవి స్వామివారికి సమర్పించారు. ఉడాకాలనీలోని ఆంజనేయస్వామివారి ఆలయంలో కమిటీ అధ్యక్షుడు గౌరీశ్వరరావు,కోశాధికారి మోహనరావుల ఆధ్వర్యంలో పూజాదికాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్ధాపకులు కోట్ల సుగుణాకరరావు దంపతులచే స్వామివారికి హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం ,సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేసారు. పోలీస్‌బ్యారెక్స్‌లోని ఆలయంలో కమిటీ అధ్యక్షుడు ఈశ్వరరారావు విశ్రాంత పోలీస్ అధికారుల కుటుంబాల ఆధ్వర్యంలో పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. 26 వనెంబర్ జాతీయరహదారిపై వెలసి భక్తుల పూజలు అందుకుంటున్న అభయాంజనేయ స్వామివారి ఆలయంలో పూజల అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. నాగోజిపేటలో స్వామివారికి ఆకుపూజలు నిర్వహించారు. పట్ణంలోని హనుమంతుని ఆలయాలు స్వామివారి నామస్మరణతో మారుమ్రోగాయి.