తెలంగాణ

మోడల్ పోలీస్ స్టేషన్లతో సత్వర న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, డిసెంబర్ 13: నర్సంపేట మోడల్ పోలీసుస్టేషన్‌లో సీసీ ఫ్లోరింగ్ పనులను బుధవారం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హన్మకొండ, హసన్‌పర్తి, నర్సంపేట పోలీసుస్టేషన్లను మోడల్ పోలీసుస్టేషన్లుగా తీర్చిదిద్దుతున్న విషయం పాఠకులకు తెల్సిందే. ఈక్రమంలో నర్సంపేట పోలీసుస్టేషన్‌లోని ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో సీసీ ఫ్లోరింగ్ చేపడుతున్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ మోడల్ పోలీసుస్టేషన్ల ఏర్పాటు వల్ల ప్రజలకు సత్వర న్యాయం లభించే అవకాశం ఉంటుందని చెప్పారు. పోలీసుస్టేషన్ అభివృద్ధి పనులకు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి తగినన్ని నిధులు మంజూరు చేయిస్తానని పెద్ది హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సునీతా మోహన్, సీఐ కొత్త దేవేందర్ రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నాయకుల మునిగాల వెంకట్‌రెడ్డి, గోనె యువరాజు, దార్ల రమాదేవి, కొల్లూరి లక్ష్మీనారాయణ, పుట్టపాక కుమారస్వామి, ఎంవీ రామారావు, మండల శ్రీనివాస్, పాలడుగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లిలో యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావల్సిందిగా పిలుపునిచ్చారు. సర్పంచ్ అందె వీరయ్యతో పాటు ఐదువందల మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి పెద్ది సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేతిరి వీరారెడ్డి, మాజీ జడ్పీటీసీ బుర్రి తిరుపతి, టీఆర్‌ఎస్ మండల నాయకుడు బాల్నె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో
తెలంగాణ పరుగులు
రేగొండ, డిసెంబర్ 13: దేశంలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందంజలో ఉండి పరుగులు పెడుతోందని రాష్ట్ర శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బుధవారం రేగొండ మండల కేంద్రంలోని ఎంపిడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపిడీవో రమేష్ అధ్యక్షతన బహిరంగ మల విసర్జన , మరుగుదొడ్ల నిర్మాణం, వాడకం పై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధితులగా సిరికొండ మధుసూదనాచారి, జిల్లా కలెక్టర్ ఆకూనురి మురళి హాజరయ్యారు. స్పీకర్ మాట్లాడుతూ వివిధ గ్రామాలలో ఇప్పటివరకు ఎంత శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి అని అడిగి తెలుసుకున్నారు. ఎందుకు వంద శాతం నిర్మాణాలు చేసుకోలేకపోతున్నాం అని విశే్లషించారు.
కాకతీయ రాజులే తనకు స్ఫూర్తి అని, ముందు చూపుతో భవిష్యత్తు తరాలకు ఉపయోగ పడే ఎన్నో చెరువులను నిర్మించారని, ఎన్నో ఆలయాలను కట్టారని అంతంటి గొప్ప కాకతీయ వారసులమైన మనం అభివృద్ధిని చేసుకోవాలని అన్నారు. మరుగుదొడ్లను వాడకంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. తక్కవ శాతం మరుగుదొడ్లు ఉన్న జిల్లాగా భూపాలపల్లి ఉందని పేర్కొన్నారు.

రానున్న రోజులలో బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా భూపాలపల్లిని తీర్చిదిద్దాలని అన్నారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మించుకున్న ప్రతి గ్రామానికి రూ: 10 లక్షల నుండి 15లక్షల వరకు నిధులు కేటాయించి అభవృద్ధి పనులును చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దేశంలోనే రాష్ట్రం అన్ని రంగాలలోఅభివృద్ధిలో పరుగులు పెడుతుందని అయన అన్నారు.

వైద్య ఉద్యోగుల రాష్ట్ర మహాసభలను
జయప్రదం చేయండి
నర్సంపేట, డిసెంబర్ 13: హైద్రబాద్‌లోని కోఠిలో గురువారం జరిగే తెలంగాణ వైద్య, ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం మూడవ రాష్ట్ర మహాసభలకు ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా టీఆర్‌ఎస్‌కేవీ రూరల్ జిల్లా ఇన్‌చార్జి గోనె యువరాజు కోరారు. నర్సంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా గోనె యువరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విధాన రంగంలో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు తీసుకపోవడంలో ఉద్యోగులు ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు. ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెరిగాయని అన్నారు. రాష్ట్ర మహాసభలకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హెల్త్ కమిషనర్ వాకాటి కరుణ, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, మాజీ అధ్యక్షుడు రూప్‌సింగ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్టు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ, కౌన్సిలర్ నాయిని నర్సయ్య, పాలడుగుల రమేష్ పాల్గొన్నారు.

కొల్లూరి లక్ష్మీనారాయణ, హన్మకొండ సంజీవ, సుజాత, కవిత, రజిత, కిరణ్, రవి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
తెలుగు మహాసభల సన్నాహక ప్రదర్శన
భీమదేవరపల్లి, డిసెంబరు 13: అమ్మ భాషకు పట్టంకట్టేందుకు, మాతృభాష పరిరక్షణకు ప్రపంచ తెలుగుమహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని ఎస్‌ఆర్‌కె, ఫాతిమా పాఠశాలల యాజమాన్యం కాశిరెడ్డి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ర్యాలీ అనంతరం విద్యార్ధుల నుద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ ఆదిరెడ్డి మాట్లాడుతూ తెలుగు మహాసభలను విజయవంతం చేసి తెలుగుదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నారు. క్రీ.శ 961లో కురిక్యాల శాసనం ద్వారా తెలుగుభాష విరాజిల్లిందన్నారు. అప్పటి నుండి ఎందరో మహానుభావులు తెలుగుభాష ఔన్నత్యానికి కృషి చేశారని, కాని పాశ్చాత్య జీవనంలో తెలుగుభాష ఉనికి కోల్పోయిందన్నారు. కావున అమ్మ భాషను పరిరక్షించుకోవడానికి అందరము ఏకమై ఇతర భాషలను అవసరం మేరకే ఉపయోగించుకోవాలని సూచించారు. దేశ భాషలందు తెలుగులెస్స అని సూచించిన శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యలను మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలని సమయం ఆసన్నమైందన్నారు. తెలుగుభాష గొప్పదనాన్ని తెలుగుమహాసభల ద్వారా సమాజానికి చాటిచెప్పాలని ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిరణ్‌కుమార్,వెంకటేశ్వర్లు, రాజు,నజీం, రాఘవచారి, రమణాచారి, కుమారస్వామి, కృష్ణ, శ్యామ్, కవిత, విష్ణుప్రియ,శ్రీవిద్య, రూప, అనిత, మంజుల, హేమలత, మానస, కరిష్మతో పాటు విద్యార్ధులు పాల్గొన్నారు.

మండలానికి ఒక ఆదర్శ గ్రామం

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 13: జిల్లాలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు చూపిన ఉత్సాహాన్ని అలాగే కొనసాగిస్తూ, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తగు ప్రతిపాదనలతో ముందుకు రావాలని అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సూచనలు చేశారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎంపిడిఓలతోపాటు ఉపాధి హామీ పథకం ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులకు అవసరమైన సూచికలు తయారుచేసి ఇస్తున్నామని, వాటికి అనుగుణంగా డంపింగ్ యార్డుల నిర్మాణం, మూడు చక్రాల సైకిళ్లద్వారా చెత్త తొలగింపు, స్మశాన వాటికల నిర్మాణాల వాటితోపాటు మరికొన్ని సూచనలు ఉంటాయని తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో, తపనతో ఉన్న ఉత్సాహవంతులైన గ్రామ సర్పంచ్‌లతో అధికారులు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. హరితహారంలో నాటిన మొక్కల పరిస్థితులపై ఎప్పటి కప్పుడు దృష్టిసారించి, వాటికి కావలసిన నీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నాటిన మొక్కలలో భీందేవరపల్లి 98.77శాతం, ధర్మసాగర్ మండలం 99.77 శాతంతో ముందున్నాయని అభినందించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రాము మాట్లాడుతూ ఇక నుండి ఉపాధి హామీ పథకంపై దృష్టిసారించి పని దినాలను పెంచేందుకు అవసరమైన పనులు చేపడుతామని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు పనిదినాల కల్పనలో 45 శాతం మాత్రమే లక్ష్యం సాధించామని అన్నారు. ఇజిఎస్ తమ విధుల నిర్వహణలో క్రమశిక్షణ కలిగి ఉండి ఎంపిడి ఓల నియంత్రణలో పనిచేయాలని సూచించారు. నిర్మల్ భారత్ అభియాన్ ప్రాజెక్టుకింద ఆరు మండలాలలో 9938 పనులు మంజూరు కాగా, 9446 పనులు పూర్తి అయ్యాయని, ధర్మసాగర్, హసన్‌పర్తి మండలాలలో ఎక్కువ పనులు పురోగతిలో ఉన్నాయని, వాటిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ, ఉపాధి పథకం అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

భలే చౌక బియ్యం

కేసముద్రం, డిసెంబర్ 13: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఇటీవల పోలీసులు గట్టి నిఘా వేయడంతో.. ఇళ్లలో ఆ బియ్యం నిలువలు రోజురోజుకు పెరిగి పోతుండటంతో వాటిని ఏం చేయాలో తెలియని సమయంలో భిక్షాటనకు వచ్చేవారికి లాభసాటిగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని వివిధ గ్రామాల్లో కొందరు పొట్టకూటి కోసం సర్కస్ చేస్తూ దానం కింద తమకు పైసలకు బదులు బియ్యం ఇచ్చినా పరవాలేదనడంతో ఇళ్లలో ముక్కిపోతున్న బియ్యాన్ని వారికి ఉదారంగా దానం చేస్తున్నారు. ఫలితంగా భిక్షాటన
చేసేవారికి ‘్భలే మంచి చౌక బియ్యం’ వరంగా మారుతున్నాయి. ఇలా ఇప్పటికే పలు గ్రామాల్లో వారికి దానంగా ఇచ్చిన బియ్యం క్వింటాళ్లకొద్దీ సమకూరడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ ప్రాంతానికి చెందిన కొందరు రెండు జట్లుగా ఏర్పడి మండలంలోని వివిధ గ్రామాల్లో మూడు రోజుల పాటు ఆట..పాటలతో పాటు సర్కస్ ఫీట్లతో అలరింపజేసి చివరిరోజు తమ భుక్తి కోసం ఎంతో కొంత దానం చేయాలని కోరుతున్నారు. డబ్బుల్లేనివారు కనీసం బియ్యం ఇచ్చినా స్వీకరిస్తామని చెప్పడం.. ఇలా అంతొ కొంత బియ్యం ఇచ్చినవారి పేర్లను మైకు ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో అది విన్న అనేక మంది ఇంట్లో ముక్కి.. పురుగులు పడుతున్న బియ్యాన్ని వదిలించుకోవడానికి వీరికి కిలోల కొద్దీ దానం చేయడానికి పోటీ పడుతున్నారు. దొడ్డు బియ్యం తినలేని వారు.. అటు బ్లాక్ మార్కెట్లో అమ్మేదారి లేక ఇంట్లో వృథాగా పడి ఉన్న బియ్యాన్ని వారికి దానం చేస్తే.. అటు పుణ్యానికి పుణ్యం.. గ్రామంలో తమ పేరు మైకులో వినిపిస్తుండటంతో ఇంట్లో బియ్యాన్ని వదిలించుకోవడానికి ఇదో సదావకాశంగా భావిస్తున్నారు. దీంతో మండలంలోని కలువల, కేసముద్రం (వి), ఉప్పరపల్లి, పెనుగొండ గ్రామాల్లో ఇప్పటికే వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం కాస్తా భిక్షాటన చేసేవారి పరమయ్యాయి. ఇలా ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరుతున్న బియ్యాన్ని వారు శుభ్రపర్చి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకానికి పెడుతున్నట్లు సమాచారం. అయితే భిక్షాటన చేసే వారు ఇలా క్వింటాళ్ల కొద్ది బియ్యాన్ని రవాణా చేస్తున్న సమయంలో ఎవరైనా పట్టుకుంటే తమకు దానంగా ఇచ్చినవని చెబుతుండటంతో అధికారులు ‘పోనీలే’ అంటూ వదిలేస్తున్నారు. దీంతో చౌక బియ్యం పథకం కాస్తా బిక్షాటన చేసేవారికి ‘వరంగా’ మారిందంటున్నారు.

తెలుగు సంస్కృతిని మనమే కాపాడుకోవాలి
అందుకు ప్రపంచ మహాసభలు వేదిక కావాలి *యూనివర్సిటీకీ పోతన పేరు నామకరణం చేయాలి * విద్యావేత్త చుక్కా రామయ్య

జనగామ, డిసెంబర్ 13: దినదినం వెనుకబడి పోతున్న తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు మనమందరమే కృషి చేయాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. తెలుగు ప్రపంచ మహాసభలను పురస్కరించుకొని భాషా, సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో బుధవారం జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావు అధ్యక్షత వహించారు. పలువురు కవులను, కళాకారులను ఘనంగా సన్మానించారు. అనంతరం చుక్కా రామయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం మొదటిసారిగా తెలుగు ప్రపంచ మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ సభలు సమ్మేళనం వరకు పరిమితం కాకుండా తెలుగు భాషతో పాటు తెలుగు సంస్కృతి పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే స్వార్థకత చేకూరుతుందన్నారు. విద్యార్థులకు చిన్నప్పటినుండే పోతన పద్యాలు కంఠస్థం చేపించాలని కోరారు. అందుకు ప్రభుత్వం నుండి కృషి ఉండాలని అన్నారు. రాష్ట్రంలో ఏదో ఓ యూనివర్సిటీకి పోతన పేరును నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ బమ్మెర పోతన, పాల్కూరి సోమన నడయాడిన ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల తోడ్పాటునందిస్తున్నాడని అన్నారు. కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ తాను ఈ మహానీయులు జన్మించిన ఈ ప్రాంతానికి కలెక్టర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శన.. అలరించిన కళారూపాలు
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బమ్మెరలో కళాకారులు, విద్యార్థులు నిర్వహించిన భారీ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కళాకారులు తెలుగు సంస్కృతిని ఉట్టిపడే విధంగా ప్రదర్శించిన కళారూపాలకు ముగ్దులయ్యారు. ఎమ్మెల్యే దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యలు బోనం ఎత్తుకొని, కలెక్టర్ శ్రీదేవసేన, జేసీ వనజాదేవిలు బతుకమ్మలు నెత్తిన ఎత్తుకొని ప్రదర్శనలు పాల్గొని ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. పూలతో అలంకరించిన పోతన సమాధి వద్దకు వెళ్లివారు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎంపీపీ దల్జీత్‌కౌర్, సర్పంచ్ ఎల్లమ్మ, జనగామ మున్సిపాల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కవులు నాగళ్ల రామశాస్ర్తీ, అంపశయ్య, నవీన్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

కాటారం, డిసెంబర్ 13: కాటారం మండలం గారెపల్లి శివారులో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కాటారం మండల కేంద్రానికి సమీపంలో మద్దులపల్లి వద్ద బుధవారం సాయంత్రం బైక్ ఓనీకారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. మండలంలోని కొత్తపల్లికి చెందిన కందుల గిరిబాబు(25), కాల్నేని సంతోష్(24) ఇద్దరు బైక్‌పై గారెపల్లికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా ఎదురుగా వస్తున్న ఓనీవ్యాన్‌ను బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైనవారిని మహాదేవపూర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కాటారం పోలీసులు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ది కుటుంబ పాలన

నర్సంపేట, డిసెంబర్ 13: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నలుగురు మాత్రమే ఆఫలాలను అనుభవిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. దుగ్గొండి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సెంటిమెంట్‌తో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ప్రజా ధనాన్ని యధేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బాధ్యతాయుతంగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడకుండా సొంతంగా కాంట్రాక్టులు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని ధ్వజమెత్తారు. టెండర్‌లో పనులు దక్కించుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆ పనులను కూడా తూ తూ మంత్రంగా చేస్తూ ప్రజాధనాన్ని వెనుకేసుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్దిపై అధికార పార్టీ నాయకులకు సైతం చిత్తశుద్ది లేదన్నారు. టీడీపీ హయాంలో నర్సంపేట నియోజకవర్గం అభివృద్ది చెందిందన్నారు. గత పదేళ్ల నుండి నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని స్పష్టం చేశారు. ఈసమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్, నాయకులు నల్లబెల్లి సుదర్శన్, వడ్డెపల్లి క్రిష్ణ, పెంచాల సతీష్, హింగే రామారావు, రాజయ్య, గోగుల ప్రకాశ్‌రెడ్డి, పాష తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను పరిష్కరించ లేని
అసమర్థ ప్రభుత్వం
నక్కలగుట్ట, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేష్, నాగార్జునఆరోపించారు. బుధవారం హన్మకొండ కాళోజీ కూడలిలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐ ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాలు, బోధనా రుసుంలను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థంగా మార్చి వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంవత్సం ముగింపు దశకు చేరుకున్నా ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన బోధనారుసుం, ఉపకారవేతనాలను పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆంధోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో విద్యార్థుల బకాయిలను విడుదల చేస్తామని, అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం చేసి మాట తప్పిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని విద్యాశాఖ మంత్రి పదవీ స్వీకారం చేసినప్పటి నుండి చెపుతున్నా, ఇప్పటికి అమలు కాకపోవడం శోచనీయమని అన్నారు. ఇకనైన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పట్ల చిత్తశుధ్దితో పరిష్కార దిశగా అడుగులు వేయాలని, లేని పక్షంలో విద్యార్థి లోకాన్ని ఐక్యం చేసి రాష్టస్థ్రాయిలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హరీష్, వీరన్న, గణేష్, సల్మాన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు భాష అమృతం వంటిది

మహబూబాబాద్,డిసెంబర్ 12: తెలుగుభాష అమృతం వంటిదని తెలుగులో ఉన్న మాధుర్యం మరేభాషలోనూ ఉండదని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా గ్రంథాలయంలో జరిగిన తెలుగుభాష ఉత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలుగుభాష సంస్కారవంతమైన భాష అని భావాలను వినసొంపుగా సౌలభ్యంగా వ్యక్తం చేయవచ్చన్నారు. 200 సంవత్సరాల క్రితం 1817అగస్టులో ఇంగ్లాండ్ నుండి ఓడ ప్రయాణం చేసి భారత్‌లో అడుగుపెట్టిన చార్లెస్ ప్లిరిబ్రౌన్ ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుభాష పరిఢవిల్లిందని, ఎంతోమంది సాహిత్య ఉద్ధండులు తెలుగు భాష వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, తెలుగు భాషాభిమానులందరు ఈ మహాసభలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాస్కర్‌రావు, డిపిఆర్‌వో అయూబ్‌అలీ, తహశీల్దారు విజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకమండలి సభ్యులు పెద్ది సైదులు, నిమ్మల శ్రీనివాస్, లైబ్రెరియన్ సిహెచ్ రవి, ఎండి గౌస్, విజయ్, రుద్రారపు వీరేందర్, భూలక్ష్మి, దాసరి ప్రసాద్, భాస్కర్, నరేందర్, వెంకటమల్లు మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా బహుమతులను అందజేశారు.
కాగా, జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో విజేతలగా నిలిచిన వారి వివరాలు ఇలా ఉన్నాయి... జానపద కళలో సీనియర్ విభాగంలో సమైక్య కళాశాలకు చెందిన చంద్రప్రకాశ్ ప్రథమ, సాయిరాం జూనియర్ కళాశాలకు చెందిన అశ్విని ద్వితీయ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన సంతోష్ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. జూనియర్ విభాగంలో కేసముద్రం వివేకవర్ధని స్కూల్ విద్యార్థిని దివ్యభారతి ప్రథమ, నెల్లికుదురు ఆదర్శపాఠశాల విద్యార్థిని కావేరి ద్వితీయ, అనంతారం మోడల్ స్కూల్ విద్యార్థిని లేఖన తృతీయ బహుమతులు గెల్చుకున్నారు. జానపద నృత్య విభాగంలో కురవి జడ్పీఎస్‌ఎస్ ప్రథమ, నెల్లికుదురు ఆదర్శ పాఠశాల ద్వితీయ, గూడూరు బాలుర పాఠశాల తృతీయ బహుమతులు గెల్చుకున్నారు. ఊట్ల మట్వాడ ఆశ్రమ పాఠశాల, అనంతారం మోడల్‌స్కూల్ విద్యార్థులు ప్రత్యేక బహుమతులు గెల్చుకున్నారు.
మన భాషను మనమే గౌరవించుకోవాలి..
రఘునాథపల్లి: మన తెలుగు భాషను మనమే గౌరవించుకోవాలని జిల్లా కలెక్టర్ అల్లమరాజు శ్రీదేవసేన, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని ఖిలాషాపురం గ్రామంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ‘‘సాహితీ సమాలోచనం’’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పానుగంటి రాంమూర్తి అధ్యక్షత వహించగా వారు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. జిల్లా ఉద్యమంలో జనగామ రచయితల సంఘం కీలక పాత్ర పోషించిందన్నారు. కవులు, కళాకారులు, యువకులు ఉద్యమ పోరాటాల వల్ల ఏర్పాటైన జనగామ జిల్లా అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన భాషను గౌరవించుకోవాల్సిన సదుద్ధేశంతోనే ప్రపంచ తెలుగుమహాసభలను మన రాష్ట్రంలో నిర్వహించుకుంటున్నామన్నారు. జాతీయ ఉద్యమం నుంచి స్వరాష్ట్ర సాధన ఉద్యమం వరకు కవుల పాత్రకు తిరుగులేదన్నారు. ఫాల్కురి సోమన్న, బమ్మెరపోతనలు ఈ జిల్లా బిడ్డలు కావటం పూర్వజన్మ సుకృతమన్నారు. గ్రామానికి చెందిన కవులు రంగరాజు కేశవరాజు, జగన్నాథంల రచనలను లింగంపల్లి రామచంద్రం, పెద్ది వెంకటయ్యలు వివరించారు. అనంతరం పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, ఆర్‌డీవో వెంకట్‌రెడ్డి, తహశీల్దార్ ఎల్. రవిచంద్రారెడ్డి, ఎంపీపీ దాసరి అనిత, ఎంపీటీసీ భూషెట్టి కుమార్, కో ఆప్షన్ మెంబర్ మహ్మద్, నక్క సురేష్, పేర్వాల శంకర్‌రావు, మండల చీఫ్ మారుజోడు రాంబాబు, ఏఎంసీ వైస్‌చైర్మన్ నామాల బుచ్చయ్య, సర్పంచ్‌లు అంజిరెడ్డి, మల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శివకుమార్, నాయకులు యాకయ్య, కుర్ర కమలాకర్, బుగ్గయ్యతో పాటు కవులు పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయం ఎదుట గుడిసెవాసుల ధర్నా

నర్సంపేట, డిసెంబర్ 13: పెండింగ్ ఉన్న నివాస స్థలాల గుడిసెవాసులకు పట్టాలిచ్చి, డబుల్ బెడ్‌రూంలు కట్టించి ప్రభుత్వ హామీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు నర్సంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట గుడిసెవాసులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ పెండింగ్ నివాస స్థలాల పట్టాలివ్వాల్సింది పోయి అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పోరాటాల్లో ఉన్నవారి మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి దుర్భర జీవనం గడుపుతున్న పేదలకు ఇప్పటికైనా ఇళ్ల స్థలాల పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణం దినం దినం అభివృద్ధి చెందుతుందని, అదే విధంగా పేదల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉందని చెప్పారు.
మరికొంత మంది పేదలు ఇళ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ నానా యాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఇప్పటికే ప్రభుత్వం భూమి కబ్జాలకు గురైందని అన్నారు. ఈతరుణంలో మరో భూపోరాటానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని ఆర్డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ చక్రపాణికి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు వంగాల రాగసుధ, మోటం సురేష్, చోప్పరి సదానందం, గోనెల రమాకర్, కుక్కల యాకయ్య, బండారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు కాంగ్రెస్ అండ

కాటారం, డిసెంబర్ 13: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు పార్టీ పూర్తి స్థాయిలో అండగా నిలస్తుందని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్ధిళ్ళ శ్రీ్ధర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని వారి స్వగ్రామమైన ధన్‌వాడలో తాటి లచ్చక్క అనే మహిళ చనిపోయిన నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని శ్రీ్ధర్‌బాబు పరామర్శించారు.
పార్టీ పరంగా పూర్తి తోడ్పాటు అందించడానికి రానున్న రోజుల్లో మరింతగా శ్రద్ధ వహిస్తామని పేర్కొన్నారు. కార్యకర్తలకు మనోధైర్యం కల్పించి తీరుతామని పేర్కొన్నారు.
ఆయన వెంట వర్తక సంఘం ప్రతినిధి తాటి బాపుగౌడ్, పీసీసీ మెంబర్ మంత్రి మల్లయ్య, కాటారం, రేగులగూడెం ఎంపీటీసీలు పంతకాని సమ్మయ్య, బండి స్వరూపరమేష్, మాజీ ఎంపిపి బొడ్డు మల్లయ్య, సర్పంచ్ కారెంగల తిరుపతి గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు చీమల సందీప్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన ముందస్తు క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు.
సర్వేంద్రియానం నయనం ప్రధానం

కాటారం, డిసెంబర్ 13: ప్రతి జీవిలోని సర్వ ఇంద్రియాలలో కన్ను (నయనం) ప్రధానమని కాటారం డీఎస్పీ కేఆర్‌కే ప్రసాదరావు అన్నారు. కాటారం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో బుధవారం ఐదు మండలాల ప్రజలకు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి ఏఎస్పీ రాజమహేంద్ర నాయక్ శిబిరాన్ని సందర్శించారు. రోగులను పరామర్శించారు. వైద్య ఆరోగ్య సేవలపై వివరాలు అడిగి తెలసుకున్నారు. ఈ శిబిరానికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు సహా భాగస్వామ్యం అందించారు. కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాలకు చెందిన ప్రజలు అనేక మంది ఉచిత కంటి పరీక్ష శిభిరానికి తరలివచ్చారు. మారుమూల అటవీ మండలాలకు చెందిన ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అంతంతమాత్రంగా అందుతున్న నేపథ్యంలో కాటారం సబ్ డివిజన్ పోలీసులు ఏర్పాటుచేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. సుమారు ఐదు వేల మంది ప్రజలు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ అవయవాలను భధ్రంగా కాపాడుకోవాలని డీఎస్పీ సూచించారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే మనిషి మనుగడ ముందుకు కొనసాగుతుందని లేకుంటే అంగవైకల్యంతో బాధ పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. అంగవైకల్యం బాధితులను మానవతా దృక్పథంతో చూడాలని సూచించారు. ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటువల్ల ప్రజలతో పోలీసుల సంబంధాలు మరింత బలపడ్డాయని పేర్కొన్నారు. అసాంఘిక వ్యక్తులతో ప్రజలు చేతులు కలుపవద్దని అన్నారు. అజ్ఞాతంలోని వ్యక్తులు జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.
కాటారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చింతల శంకర్ రెడ్డి మాట్లాడుతూ చట్టాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చట్టాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకొని చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంథని మిత్ర అధ్యక్షుడు మేడగోని వేంకటేష్, కార్యదర్శి బి మనోజ్, కోశాధికారి పి సంజీవ్, బెల్లంపల్లికి చెందిన లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు పి సత్యనారాయణ పాల్గొన్నారు.