తెలంగాణ

జెట్ స్పీడుతో ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరవేగంగా ప్రాజెక్టులు పూర్తి
సవాళ్లకు వ్యూహాత్మక పరిష్కారం
ఈసారీ ఇబ్బడిముబ్బడిగా వర్షాలు
వచ్చే ఖరీఫ్‌నాటికి మేడిగడ్డ జలాలు
చైనా ప్రాజెక్టుల అధ్యయనానికి ఇంజనీర్లు
అటవీ అనుమతులపై బెంగలేదు
అవసరమైతే కేంద్రాన్ని కలుస్తా: కెసిఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 7: నీటిపారుదల ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేయాలని, ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ప్రధానమైన ప్రాజెక్టుల పురోగతి, ప్రాజెక్టులకు ఎదురవుతున్న ఇబ్బందులను శుక్రవారం చర్చించారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రఅడ్డంకులు కల్పించడం, పర్యావరణ అనుమతి వంటి సమస్యలపై చర్చించారు. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం, శ్రీరామదాసు, పాలమూరు ప్రాజెక్టులకు ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించుకుని పనుల్లో వేగం పెంచాలని కెసిఆర్ సూచించారు. గత ఏడాదిలానే ఈసారీ మంచి వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెబుతోందని, ఎల్‌నినో ప్రభావం ఉండదని నిపుణులు చెప్పినట్టు కెసిఆర్ తెలిపారు. వచ్చే నాలుగేళ్లూ మంచి వర్షాలు పడే అవకాశముందని, ఇది శుభ పరిణామమన్నారు. ఈ నీళ్లను వీలైనంత ఎక్కువగా పంట పొలాలకు అందించాలి, అందుకోసం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు.
‘‘ప్రాజెక్టుల నిర్మాణం మన ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశం. తెలంగాణ రైతాంగానికి అత్యంత అవసరం. అందుకే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాం. ప్రతి నెలా నీటి పారుదల శాఖకు కచ్చితంగా చెల్లింపులు చేస్తాం. నిధుల కొరత లేకుండా చేస్తాం. కాబట్టి పనుల్లోవేగం పెంచాలి. గోదావరిలో 954 టిఎంసిల నీటిని కేటాయింపు ఉన్నప్పటికీ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల వాడలేక పోతున్నాం. మనకు కేటాయించిన నీళ్లను మనం వాడుకోవాలి. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ప్రధానమైనది. మేడిగడ్డ వద్ద బ్యారేజి పనులతో పాటు ఇతర పనులు సమాంతరంగా సాగాలి. బ్యారేజీ నిర్మాణానికి ముందే మేడిగడ్డ నుంచి నీటిని తోడుకోవడానికి కావలసిన నిర్మాణాలు పూర్తి చేయాలి. 2018 మార్చి నాటికి ఈ పనులు పూర్తి కావాలి. వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించాలి. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు, మిడ్ మానేరు నుచి మల్లన్న సాగర్ వరకు నీరు అందించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరద కాలువ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలోకి నీల్లు మళ్లించాలని, ఛానళ్లలో ఇసుక పేరుకు పోకుండా చూడాలని, దీని కోసం అంతర్జాతీయంగా అనేక కొత్త పద్ధతులు వచ్చినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. చైనాలో ఎత్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు బాగా కట్టి, గొప్పగా నిర్వహిస్తున్నారని, ఇంజనీర్ల బృందం చైనా పర్యటించి, అక్కడ అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సివిల్ ఎర్త్ పనులతో పాటు మోటార్లు, ఇతర ఎలక్ట్రో మెకానికల్ సామాగ్రిని సేకరించుకోవాలని, ముందుగానే ఆర్డర్లు ఇచ్చి సకాలంలో అవి అందుబాటులోకి వచ్చేట్టు చూడాలని చెప్పారు. లిఫ్టులు పని చేయడానికి వీలుగా అవసరమైన సబ్ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల నిర్మాణం జరిగేలా విద్యుత్ శాఖతో సమన్వయం ఏర్పరచుకోవాలని చెప్పారు. తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది, ఇది వర్కింగ్ ఏజెన్సీలకు గొప్ప అవకాశం దీన్ని వినియోగించుకుని పనితీరును నిరూపించుకోవాలని అన్నారు. అటవీ అనుమతులు సాధించేందుకు అవసరమైతే తానే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను అని కెసిఆర్ చెప్పారు.
‘‘గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది. ఆదిలాబాద్ నుచి ఖమ్మం దాకా గోదావరి వెంట ప్రాజెక్టులు కడుతున్నాం, కృష్ణా నదీ జలాలను వ్యూహాత్మకంగా, వాస్తవిక ధోరణిలో ఆలోచించి వాడకోవాలి. జూరాల పాయింట్ వద్ద ఇప్పటికే నీటి వాడకం ఎక్కువగా ఉన్నందున శ్రీశైలంతో పాటు ఇతర అవకాశాలను ఉపయోగించుకోవాలి. జూరాలపై వత్తిడిని తగ్గించాలి, కృష్ణాపై ఆధారపడిన నల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు గోదావరి ద్వారా నీరు అందించగలుగుతున్నాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాలో కూడా కొంత ప్రాంతానికి గోదావరి నీళ్లు అందుతున్నాయని కెసిఆర్ తెలిపారు.

చిత్రం... ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్