రాష్ట్రీయం

ఐఐటిల స్థాయికి యూనివర్శిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఐఐటిల స్థాయి విద్యా ప్రమాణాలు వర్శిటీల నుంచీ అందాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. వర్శిటీలు కొత్త ఆవిష్కరణలకు నాందిపలకాలని, సాంకేతికతలో పురోగతి సాధించి పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకోగలుగుతామని ఉద్భోదించారు. ‘ఐఐటిల్లో చదువుకున్న వారంతా ఉన్నతస్థాయిలో అవకాశాలు పొందుతున్నారు. కేవలం వాటినిచూసి సరిపెట్టుకుంటామా? లేక మిగిలిన ఉన్నత విద్యా సంస్థలనూ అదేరీతిన తీర్చిదిద్దుకుంటామా?’ అని ప్రణబ్ ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా మొదలయ్యా యి. ఒకపక్క రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులు, మరోపక్క తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు మధ్య వర్శిటీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జ్యోతి వెలిగించి శతాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఉత్సవాలు ఏడాదిపాటు జరుగుతాయి. ప్రారంభ కార్యక్రమాలు మూడు రోజులు నిర్వహించనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అధ్యక్షత వహించగా, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపి కె కేశవరావు, మేయర్ బొంతు రమేష్ వేదికపై ఆశీనులయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ మాట్లాడుతూ ఉన్నత విద్యకు సంబంధించిన దేవాలయాలుగా వర్శిటీలను తీర్చిదిద్దాలన్నారు. వర్శిటీలు జ్ఞానాన్ని బోధించే నిలయాలుగా ఉండాలని, అక్కడ ఆలోచనల స్వేచ్ఛాయుత మార్పిడి చోటుచేసుకోవాలని, అలాగే అటు గురువులు, ఇటు విద్యార్థులు వారివారి ఆలోచనలను పరస్పరం వ్యక్తం చేసుకోవాలని సూచించారు. ఒక శ్రేష్టతా నిలయాన్ని ఆవిష్కరించాలనే స్వప్నంతో ఉస్మానియా వర్శిటీని వందేళ్ల క్రితం ఏడొవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించారన్నారు. ప్రాచీనకాలంలో ఉన్నత విద్యారంగంలో భారతదేశం ప్రముఖమైన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. తక్షశిల, నలందా, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు అధ్యాపకులు, విద్యార్థుల రూపంలో శక్తిశాలి మేథస్సులను తమవైపునకు ఆకర్షించుకున్నాయని అన్నారు. ఇవాళ ఉన్నత విద్యారంగంలో విద్యాసంబంధ వౌలిక సదుపాయాల వికాసం పెద్దఎత్తున చోటు చేసుకుంటుందని అనడంలో సందేహానికి తావులేదన్నారు. అయినా కొన్ని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని గుర్తు చేశారు. భారతదేశంలోని ఈ సంస్థలు అంతర్జాతీయ ర్యాంకింగ్ ప్రక్రియలో తమదైన సముచితమైన స్థానాన్ని కైవసం చేసుకోవాలని, వందకుపైగా ఉన్నత విద్యా సంస్థలను సందర్శించిన వ్యక్తిగా తాను పదేపదే స్పష్టం చేస్తూ వస్తున్నానని అన్నారు. ఈ విషయాన్ని పరిశీలించడంతో పాటు వౌలిక పరిశోధనా విద్యా బోధనలపైనా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థలకు పరిశ్రమలకు మధ్య ప్రభావవంతమైన చర్చ, అనుసంథానం నెలకొనాల్సి ఉందన్నారు. విశ్వవిద్యాలయాలు ఒంటరిగా మనుగడ సాగించలేవని అంటూ పరిశోధనలోనూ, నవకల్పనలోనూ పెట్టుబడులు పెద్దఎత్తున పెట్టాల్సి ఉందన్నారు. అది జరిగినపుడే అంతర్జాతీయ సముదాయంలో మనదైన సముచిత స్థానాన్ని దక్కించుకోగలవారం అవుతామన్నారు. ఈ ఆలోచనలకు ఆచరణాత్మక రూపాన్ని ఇవ్వాలని ప్రణబ్ సూచించారు.
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా క్రీడా సముదాయానికి, వసతి గృహాలకు, శతాబ్ది భవనానికి రాష్టప్రతి శంకుస్థాపన చేశారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. వేదికపై ఏర్పాటు చేసిన బటన్‌ను నొక్కి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు.
మూడు గ్రంథాల ఆవిష్కరణ
హిస్టరీ ఆఫ్ ఉస్మానియా అనే ఆంగ్ల గ్రంథం, సుగాత్ పేరిట ఉర్దూలో ముద్రించిన గ్రంథాన్ని, వందేళ్ల ఉస్మానియా పేరుతో తెలుగులో ఒయు ముద్రించిన గ్రంథాలను రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆవిష్కరించి తొలి ప్రతులను రాష్టప్రతికి అందించారు. గొంతు నొప్పితో బాధపడుతున్నానని చెప్పిన రాష్టప్రతి తన ప్రసంగంలో అనేకమార్లు ఇబ్బందిపడ్డారు. గొంతుపట్టేయడంతో మధ్యలో మంచినీళ్లు తాగినా, పలుమార్లు బొంగురుపోవడంతో మరికొంత ఉపన్యాసాన్ని తగ్గించుకున్నట్టు అనిపించింది.

చిత్రం... రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి జ్ఞాపికను అందిస్తున్న వైస్ చాన్స్‌లర్ రామచంద్రం