ఆంధ్రప్రదేశ్‌

ఫీజుల భారాన్ని భరించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో సిండికేట్‌గా మారిన కార్పొరేట్ కళాశాలల పోటీని ఎదుర్కొంటూ సామాన్య, మధ్యతరగతి వర్గాలకు విద్యను అందుబాటులో ఉంచుతున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలను దెబ్బతీసే విధంగా వచ్చే విద్యా సంవత్సరానికి అనూహ్యరీతిలో అన్ని రకాల ఫీజులను ఒకేసారి మూడురెట్లు పైగా పెంచడం పట్ల శుక్రవారం నాడిక్కడ జరిగిన అనుబంధ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం విస్తృత సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఈ ఫీజులు ఉన్నందున ఎలాంటి పరిస్థితుల్లోనూ చెల్లించబోమని సంఘం స్పష్టం చేసింది. సమావేశం అనంతరం సంఘం అధ్యక్షుడు బైరపనేని సూర్యనారాయణ (ఒంగోలు), అసోసియేట్ అధ్యక్షులు అల్లంనేని అప్పారావు (నంద్యాల), ప్రధాన కార్యదర్శి రాజగోపాలరెడ్డి (కడప) తదితరులు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మిని కలిసి చర్చించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 2300 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. బోర్డు అనుబంధం కోసం ఒక్కో సెక్షన్‌కు ఏటా ఆరువేలు చెల్లిస్తూ ఉంటే ఒకేసారి దాన్ని రూ.18వేలకు పెంచడం దారుణమన్నారు.
కనీసం నాలుగు సెక్షన్లు ఉంటే ఒకేసారి రూ.72వేలు చెల్లించాల్సి వస్తుందన్నారు. బోర్డు పర్యవేక్షణ కోసం గతంలో రూ.11వేలు ఫీజులు చెల్లిస్తుండగా ఒకేసారి దాన్ని రూ.33వేలకు పెంచడం అత్యంత దారుణమన్నారు. వాస్తవానికి 1999 నుంచి ఈ ఫీజులను నిర్ణయించేటప్పుడు ప్రభుత్వం కచ్చితంగా తమ యాజమాన్య సంఘాన్ని సంప్రదించేదని, గత విద్యా సంవత్సరంలో కూడా తమ విజ్ఞప్తిని స్వీకరించి ఈ పెంపుదలను వాయిదా వేసిందన్నారు. అయితే ఆశ్చర్యకరంగా గత విద్యా సంవత్సర ముగింపు దశలో 300 శాతం పెంపుతో ఆదేశాలు రావటం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కార్పొరేట్ విద్యా వ్యాపారం తమ కళాశాలలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. సాధారణ ఫీజులతో విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌లతోనే తమ కళాశాలలు నడుస్తున్నాయని సూర్యనారాయణ అన్నారు. అయితే ఒక్కసారిగా తమపై ఆర్థిక భారం మోపడం వల్ల పదిమందికి ఉపాధినందించే తమ విద్యాసంస్థలు పూర్తిగా మూతబడే ప్రమాదం ఉందంటూ ఆయన హెచ్చరించారు. ఓవైపు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌ల చెల్లింపులు కూడా సకాలంలో సక్రమంగా జరుగటం లేదన్నారు.