గుంటూరు

రోజుకో గ్రామకంఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 22: గ్రామకంఠాలపై తమకు సమాచారం లేదంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్ తుళ్లూరు రైతుల ఎదుట వ్యాఖ్యానించటంతో వారంతా మండిపడ్డారు. తుళ్లూరు సిఆర్‌డిఎ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సిఆర్‌డిఎ అసిస్టెంట్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ రైతు కమిటీతో సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రులకు, శాసనసభ్యులకు అవగాహన లేకపోతే మిమ్మల్ని నమ్మి భూములిచ్చిన మా సంగతి ఏమిటంటూ సిఆర్‌డిఎ కార్యాలయంలో బల్లలు చరుస్తూ రైతులు ఆందోళన చేశారు. భూసమీకరణకు సహకరించాలంటూ గ్రామాల్లో ప్రదక్షిణలు చేసిన మంత్రులు ప్రస్తుతం కనిపించక పోవటంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబా బు రైతులరుణం తీర్చుకోలేనని వ్యా ఖ్యానిస్తుంటే, అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా ముందుకు వెళ్లటాన్ని ఇప్పటికైనా మం త్రులు, ప్రజాప్రతినిధులు సిఎం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. గ్రామకంఠాల విషయంలో రైతులకు సమన్యాయం జరగకుండా అనుకూలురు, వ్యతిరేకులు అంటూ విడదీయాలని చూస్తే మాత్రం భూములిచ్చేది లేదని స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను మార్పుచేసి రహదారులు వేరే ప్రాంతంలో నిర్మించుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణాలకు భూములిచ్చిన రైతులకు గ్రామాల్లో ఇళ్లు కూడా లేకుండా చేస్తారాంటూ పలువురు ప్రశ్నించారు. మంత్రి, శాసనసభ్యుడు, అధికారుల ఎదుట అనేక సందేహాలను ఉంచిన రైతులు తమ అభిప్రాయాలకు స్పష్టమైన హామీలు కావాలని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు జొన్నలగడ్డ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామకంఠాల పేరుతో రోజుకొక జాబితాను అధికారులు విడుదల చేస్తూ రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి భూములిచ్చామని, స్థానిక నాయకులపై నమ్మకంతో పొలాలు ఇవ్వలేదని పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు బండ్ల పట్ట్భారామయ్య చెప్పారు. మాజీ ఉపసర్పంచ్ జొన్నలగడ్డ సాంబయ్య మాట్లాడుతూ భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన తరువాత కవరేజీ ఏరియా పేరుతో 30 శాతం స్థలాన్ని వదులుకోవాలనే నిబంధనను ఎంతమాత్రం ఒప్పుకునేది లేదన్నారు. జొన్నలగడ్డ రవి మాట్లాడుతూ భూసమీకరణ సమయంలో గ్రామాల్లో పర్యటించిన మీరు ప్రస్తుతం ఎందుకు రావటం లేదంటూ మంత్రి ప్రత్తిపాటినుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పొలాలు కొల్పోయామని, గృహాలు కూడా వదులుకుని ఎక్కడికి పోవాలంటూ ఇందుర్తి నరసింహరావు ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామకంఠాలు, మాస్టర్‌ప్లాన్‌పై శాసనసభ్యుడికే సమాచారం లేకపోతే ఎవరిని నమ్మి భూములివ్వాలంటూ జమ్ముల అనిల్ కుమార్ ప్రశ్నించారు.
మంత్రి ప్రత్తిపాటి, ఎమ్మెల్యే తెనాలి వివరణ
రైతులకు కేటాయించిన స్థలాలు సంపూర్ణంగా వినియోగించే విధంగా మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను మార్పు చేసేందుకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇక నుంచి వారంలో ఒక రోజు నేనుగానీ మంత్రి నారాయణ గానీ ఇక్కడ ఉండి రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామకంఠాల సమస్యలపై అధికారులు సరైన వివరాలు వెల్లడించకుండా ముందుకు వెళుతున్నారని, దాని వలన ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారులు ఇప్పటికైనా తమ దృష్టికి సమస్యలను తీసుకురావాలని కోరారు.

ఫీజు రీయింబర్సుమెంటు కోరుతూ ధర్నా
* గోబ్యాక్ నినాదాలతో హోరెత్తించిన విద్యార్థినులు
తుళ్లూరు, జనవరి 22: రాజధాని ప్రాంత రైతు కుటుంబాలకు ఫీజు రీయింబర్సుమెంటు కల్పిస్తామని మంత్రులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విద్యార్థినులు గళమెత్తారు. తుళ్లూరు సిఆర్‌డిఎ ప్రాంతీయ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం ధర్నా నిర్వహించారు. రాజధాని ప్రాంత విద్యార్థి సంఘ నాయకులు దూపం లెనిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెలబెట్టుకోవడంలోనూ ఉపాధి కల్పనలోనూ విద్యార్థులను మోసగిస్తున్నారంటూ విమర్శించారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాల విద్యార్థులకు సత్వరమే ఫీజు రీయింబర్సుమెంటు అమలుపర్చాలని డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు మంత్రులు, అధికారులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌లకు వినతిపత్రాలను అందజేశారు. పుల్లారావు స్పందిస్తూ ఫీజు రీయింబర్సుమెంటుపై పక్షం రోజుల్లో పాలసీ వెలువడనుందని, వెలువడిన తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

మినీ బస్సు బోల్తా.. ఒకరి మృతి
* మరొకరికి గాయాలు
నకరికల్లు, జనవరి 22: శబరిమలై యాత్రకు వెళ్ళివస్తూ మినీబస్సు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన చల్లగుండ్ల సున్నబట్టివద్ద శుక్రవారం అదుపుతప్పి బోల్తాపడి ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కోదాడకు చెందిన అయ్యప్ప భక్తులు ఈనెల 15న మినీబస్సులో శబరిమలై యాత్రకు బయలు దేరారు. స్వామిని దర్శించుకుని 18న శబరిమలై నుండి తిరుగ ప్రయాణమయ్యారు. చల్లగుండ్ల సున్నబట్టి సమీపంలో బస్సు కల్వాట్టుకు తగిలి అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో కొండా ఉపేంద్ర(55) సృహతప్పి పడిపోయాడు. నాగేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరిని 108 వాహనంలో నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతు ఉపేంద్ర మృతిచెందినట్లు తోటి ప్రయాణీకులు తెలిపారు.

జిల్లా బ్యాంకులకు వెయ్య కోట్ల నాబార్డ్ ఫైనాన్స్
మంగళగిరి, జనవరి 22: జిల్లాలోని 740 సహకార, గ్రామీణ, వాణిజ్య బ్యాంకులకు ఈ ఏడాది వేయికోట్ల రూపాయలు నాబార్డ్ ద్వారా ఫైనాన్స్ చేయడం జరిగిందని నాబార్డ్ ఎజిఎం, డిస్ట్రిక్ డెవలప్‌మెంట్ మేనేజర్ డాక్టర్ ఎవి భవానీ శంకర్ వెల్లడించారు. శుక్రవారం మండల పరిధిలోని ఆత్మకూరులోగల నీలగిరి ఫౌండేషన్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ నాబార్డ్‌కు సంబంధించి గుంటూరుజిల్లా రాష్ట్రంలోనే కీలకమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇతర జిల్లాలతో పోలిస్తే గుంటూరుజిల్లాలో 95 శాతం లక్ష్యం మేరకు కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ఇందుకు కారణం వ్యవసాయరంగం పటిష్టంగా ఉండటమేనని, పసుపు, మిర్చి, మొక్కజొన్న, పొగాకు, వరి మొదలైన వాణిజ్యపంటలు పండుతుండటమే ప్రధాన కారణమని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, తాగునీరులాంటి 31 రకాల వౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డ్ సహకారం అందిస్తోందని, ఈ ఏడాది 60 కోట్లు జిల్లాకు మంజూరు చేశామని, గతేడాది 150 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. పశు సంవర్ధక శాఖలో శిక్షణ కేంద్రాలకు, గోపాల్‌మిత్ర కేంద్రాలకు, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో వౌలిక వసతుల కల్పనకు, గ్రామీణ ప్రాంతాల్ల ఆస్పత్రుల అభివృద్ధికి కూడా నాబార్డ్ ద్వారా సహకారం అందిస్తున్నట్లు డాక్టర్ భవానీశంకర్ తెలిపారు. వౌలిక సదుపాయల కల్పనకోసం ఫిషరీస్‌కు జిల్లాలో 20 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. గిరిజన కుటుంబాలు పండ్లతోటలు పెంచుకునేందుకు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం వ్యాపారంగా చేసేందుకు గాను ఉత్పత్తిదారుల సంఘాలను నాబార్డ్ ప్రోత్సహిస్తోందని, జిల్లా, మండలాల వారీగా గొర్రెలు, పండ్ల తోటల పెంపకానికి నాబార్డ్ రుణ ప్రణాళిక తయారు చేస్తోందని డాక్టర్ భవానీ శంకర్ పేర్కొన్నారు.

రిజర్వు జోన్ పేరుతో
భూములు లాక్కుంటే సహించేదిలేదు
* రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతల హెచ్చరిక
తాడేపల్లి, జనవరి 22: రిజర్వుజోన్ పేరుతో తాడేపల్లి, కొలనుకొండ రైతుల భూములను బలవంతంగా లాక్కోవటానికి ప్రయత్నిస్తే సహించేదిలేదని రాజకీయపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. శుక్రవారం స్థానిక మేకా అమరారెడ్డ్భివన్‌లో రాజధాని భూముల వ్యవహారంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రభుత్వ తీరుపై పలు రాజకీయపక్షాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో 50 సంవత్సరాల తరువాత పూర్తికానున్న నిర్మాణాల కోసం రైతుల భూములను రిజర్వు చేసుకునే హక్కు ఎవరిచ్చారని నాయకులు ప్రశ్నించారు. తాడేపల్లి మైసూర్ కంపెనీ నుండి కొలనుకొండ రాయల్‌ఫామ్ వరకూ ఇళ్ళజోన్‌గా ఉన్న భూములను రిజర్వు చేస్తే రైతులతో ఐక్య ఉద్యమాలు చేపడతామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 13 లక్షల ఎకరాల భూసేకరణ చేపట్టి రియల్టర్లకు అప్పగించటాన్ని రైతులు చూస్తూ ఊరుకోరన్నారు. మాష్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలు తెలియపరచటానికి మార్చి 30 వరకూ గడువు పొడిగించాలన్నారు. పేద రైతుల భూములు లాక్కొని వాటితో వ్యాపారం చేసే ప్రక్రియ మానుకోవపోతే రైతులతో కలిసి నిరవధికపోరాటం చేస్తామని రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపియం, వైసిపి, సిపిఐ, కాంగ్రెస్‌పార్టీల నాయకులు జొన్న శివశంకర్, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, బూరగ వెంకటేశ్వర్లు, వేముల దుర్గారావు, బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, ఈదులమూడి డేవిడ్‌రాజు, కేళి వెంకటేశ్వరరావు, ఓలేటి రాము, కంచర్ల కాశయ్య, వెంకటయ్య, గుండిమెడ జేమ్స్, తదితరులు పాల్గొన్నారు.

అబ్బూరును సందర్శించిన సింగపూర్ బృందం
సత్తెనపల్లి, జనవరి 22: మండల పరిధిలోని అబ్బురు గ్రామం బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ఎంపికైనందున సింగపూర్ జాజీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల బృందం శుక్రవారం ఆ గ్రామాన్ని సందర్శించింది. నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలు సహకరించిన తీరుపై గ్రామ సర్పంచ్ కట్టా రమేష్‌ను అడిగి తెలుసు కున్నారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమయ్యారు. మరుగుదొడ్లు నిర్మించుకోక ముందు ఏవిధంగా ఉంది, నిర్మించుకున్న తరువాత ఎలావుందో అడిగి తెలుసుకున్నారు. మురుగుదొడ్లు నిర్మించుకోక ముందు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లాల్సి వచ్చేదని, విషకీటకాల వల్ల ప్రమాదాలకు గురయ్యోవారమని వివరించారు. ఈ సందర్భంగా బృంద సభ్యులకు నుదిటిన తిలకం దిద్ది గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సెప్ సిఇఒ కృష్ణకపర్థి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో నూతన క్రీడావిధానం
* ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
గుంటూరు (స్పోర్ట్స్), జనవరి 21: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి నూతన క్రీడావిధానాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. బృందావన గార్డెన్స్‌లోని ఎన్‌టిఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన రాష్టస్థ్రాయి బాక్సింగ్ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి బాలబాలికలకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేవిధంగా కృషి జరుగుతుందన్నారు. నేటి విద్యావిధానంలో కార్పొరేట్ పాఠశాల కళాశాలల క్రీడలను నిర్లక్ష్యం చేస్తున్నాయని, దీనికి సంబంధించి వారికి మార్గదర్శకాలను అందజేశామన్నారు. గ్రామస్థాయిలో క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రతి మండలానికి ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభకనబర్చిన క్రీడాకారులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తమ ప్రభుత్వం కలగజేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధానిలో క్రీడలకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని, క్రీడాకారులు తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే విధంగా క్రీడల్లో రాణించాలన్నారు. బాల బాలికల్లో క్రీడల పట్ల ఆసక్తి కల్గించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జివి ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు ఎఎస్ రామకృష్ణ, అన్నం సతీష్‌ప్రభాకర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి రామకృష్ణ, టిడిపి నాయకులు మన్నవ సుబ్బారావు, లాల్‌వజీర్, దామచర్ల శ్రీనివాసరావు, టివిరావు, బాక్సింగ్ శిక్షకుడు విశ్వనాథ్, జిల్లా బాక్సింగ్ సంఘ కార్యదర్శి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని, బెలూన్లను గాలిలోకి ఎగుర వేసిన అతిథులు పోటీలను ఆనంద భరిత వాతావరణంలో ప్రారంభించారు.

కమనీయం... పద్మావతీ ఆండాళ్ వేంకటేశ్వరుని కల్యాణోత్సవం
అమరావతి, జనవరి 22: ఇక్కడికి సమీపంలోని మల్లాదిలో వేంచేసియున్న స్వయంభువు వటవృక్షాంతర్గత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం 39వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, కనుల పండువగా సాగాయి. శుక్రవారం ఉదయం 5 గంటలకు స్వామివారికి బిందెతీర్ధం, సుప్రభాత సేవ అనంతరం తులసీ దళాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో స్వామివారి మూలవిరాఠ్‌ను విశేషంగా అలంకరించారు. ఉదయం 10.30 గంటలకు పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. కల్యాణ వశిష్టులు పరుచూరి శ్రీనివాసాచార్యులు, పరాశరం రామకృష్ణమాచార్యులు, స్వామివారి కల్యాణాన్ని వేదమంత్రోచ్చారణతో నిర్వహించారు. సుమారు 40 మందికి పైగా దంపతులు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని తలంబ్రాలు పోశారు. జ్యోతిషవిశారద శనగవరపు రామ్మోహనశర్మ స్వామివారి కల్యాణాన్ని భక్తులకు అర్ధమయ్యే రీతిలో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. ఈ మహోత్సవంలో పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పెనుముచ్చు రామకృష్ణ, టిడిపి నాయకులు కె వసంతరావు, షేక్ మాబు సుభాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ్ధర్ ప్రారంభించారు. మధ్యాహ్నం శ్రీ వెంకటేశ్వర సేవాసంఘం, మల్లాది వారిచే నిర్వహించిన కోలాటం భక్తులకు విశేషంగా ఆకర్షించింది. సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన విద్యుత్ ప్రభపై గానగంధర్వ డాక్టర్ జూనియర్ డివి సుబ్బారావుచే సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. స్వామివారి కల్యాణోత్సవ ఏర్పాట్లను ఫౌండర్ ట్రస్టీ ఏలూరి మంగాయమ్మ, విశ్వ సీతారామయ్య, మేనేజర్ పులిపాటి అశోక్‌కుమార్ పర్యవేక్షించారు.

ఛీటింగ్ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
మంగళగిరి, జనవరి 22: ఛీటింగ్ కేసులో నిందితుడైన పినపాటి ప్రభాకర్‌కు మూడేళ్లు జైలుశిక్ష, వేయి రూపాయలు జరిమానా విధిస్తూ స్థానిక అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ద్వారంపూడి సోని శుక్రవారం తీర్పుచెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు ప్రభాకర్ సోదరి మరణించగా ఆమెకు చెందిన ఇంటి స్థలాన్ని కాజేసేందుకు వ్యూహంపన్ని సోదరి కుమార్తె వివాహం చేసుకుని ఉయ్యూరులో నివాసం ఉంటుండగా ఆమెకు కొడుకున్నాడని ఒక వ్యక్తిని చూపి మున్సిపల్ అధికారులను మోసగించి స్థలాన్ని తన పేరిట రిజిష్టర్ చేయించుకున్నాడు. ఉయ్యూరులో ఉంటున్న సోదరి ఏకైక కుమార్తె తులసి జరిగిన మోసాన్ని పసిగట్టి మేనమామ అయిన ప్రభాకర్‌పై ఫిర్యాదు చేసింది. కేసు విచారణ జరిపిన పట్టణ సిఐ కోటేశ్వరరావు సాక్ష్యం చెప్పడంతో నిందితుడి నేరం రుజువయింది. దీంతో జడ్జి పై విధంగా తీర్పుచెప్పారు.

ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రజ్ఞావికాస ప్రతిభ పరీక్ష

సత్తెనపల్లి, జనవరి 22: భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక శరభయ్య పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞావికాస ప్రతిభా పరీక్ష శుక్రవారం జరిగింది. పరీక్ష నిర్వహణలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ విద్యార్థులలో భయాందోళనని పోగొట్టేందుకే ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొనగా, నియోజక పరిధిలో రెండువేల మందికి పైగా పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. విజేతలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి కృష్ణ చైతన్య, బాలికల కన్వినర్ కాకుమాను సృజన, కోకన్వీనర్ షేక్ కరిష్మ, వనజ, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

రాజధాని మాస్టర్‌ప్లాన్ తెలుగులో ఇవ్వాలి
మంగళగిరి, జనవరి 22: రాష్ట్ర రాజధాని అమరావతి నగర మాస్టర్ ప్లాన్‌ను తెలుగులోకి నఅవదించి ఇవ్వాలని, మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల గడువును జనవరి 25 నుంచి మార్చి నెలాఖరువరకు పొడిగించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి వేదిక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పెన్షనర్స్ హోంలో రాజధాని బృహత్ ప్రణాళిక - విశే్లషణ అనే అంశంపై జరిగిన చర్చా గోష్టిలో లక్ష్మణరావు ప్రసంగించారు. వివి ప్రసాద్ అధ్యక్షత వహించారు. 8603 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న సిఆర్‌డిఎ పరిధిలో 64 శాతం వ్యవసాయ పరిరక్షణ జోన్‌గా ప్రకటించడం వలన ఆయా ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతుందని, రైతన్న తన భూమిపై ఉన్న హక్కులను కోల్పోతారని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంతంలో నిర్మించబోయే ఎక్స్‌ప్రెస్ హైవేల వలన ఏఏ గ్రామాలు ఎంతవరకు నష్టపోతాయో ప్రణాళికలో స్పష్టంగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. నాన్‌పొలిటికల్ జెఎసి అధ్యక్షుడు ఎ శ్రీహరినాయుడు రాజధాని ప్రాంత అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి బూరగ శ్రీనివాసరావు, చేనేత కార్మికసంఘం నేత పి బాలకృష్ణ, పిల్లి గోపాలరావు, సాంబిరెడ్డి, కేశవరెడ్డి, కొండయ్య, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

’కాంగ్రెస్ భుజస్కంధాలపై కాపు ఉద్యమం‘
అచ్చంపేట, జనవరి 22: కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్ భుజస్కంధాలపై కాపుల ఉద్యమాన్ని నడిపిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ మండల నాయకులతో కలిసి విలేఖర్లతో మాట్లాడుతూ కాపులను బిసి జాబితాలో చేర్పించాలని చేస్తున్న ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి వారితో కలిసి పోరాడుతుందన్నారు. కాపులను బిసిల్లో చేరుస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన టిడిపి ఆ విషయం మరిచిందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 25న గుంటూరులో కాపురాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తలపెట్టిన సదస్సుకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాపువర్గాలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కాపు సదస్సు కార్యాచరణ గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలకా చంద్రయ్య, ఎం వేదాద్రి, ఎస్ పెద్దశ్రీను, కె వీరబాబు, టి ఆంజనేయులు, ఎస్ సాంబశివరావు, ఎస్‌కె మస్తాన్‌వలి, టి ఇన్నారెడ్డి, ఎ నాగేశ్వరరావు, టి వెంకట్రావ్, చెంచయ్య, కె ఏడుకొండలు, చిలకా దానియేలు, పీరయ్య తదితరులు పాల్గొన్నారు.