వినదగు!

ఆత్మది ఆశ్చర్యార్థక అస్తిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనమే గుర్తించని రీతిన మనం తప్పిపోతున్నాం.. మనకు మనంగా మిగలలేక పోతున్నాం. కారణం మనది ఇంద్రియభోగం.. ప్రాపంచిక లాలసత... వస్తు సంపదతో విర్రవీగుతూ ‘ఆత్మ’ సంపన్నతను పట్టించుకోవటం లేదు. భౌతిక సుఖాలు, భౌతిక ఆర్భాటాలు, భౌతిక ఆచ్ఛాదనలు, భౌతిక పలవరింతలు, భౌతిక తాపత్రయాలు - ఇంతేనా భోగ జీవితం.. ఇంతేనా సుఖ సంసారం.
కళ్లతో చూసిందే వాస్తవం అనుకుంటున్నాం.. అదే జీవితం అనుకుంటున్నాం. మనకు కనిపించనిది అవాస్తవం కాదు కదా! అంటే మనం సంకుచితత్వంతోనే నిలబడుతున్నాం. వ్యాపించాలన్నా కనిపించని వ్యాకులత. ఎన్నడూ ఆశించనిది, తలపోయనిది కళ్ల ముందరకొచ్చేటప్పటికి కలవరపాటుతో కుప్పకూలుతుంటాం. కురుక్షేత్రంలో అర్జునుడి పరిస్థితి ఇదే.
కృష్ణుడంతటి వాడు తనకు సారధి అయినప్పటికీ అర్జునుడు తన ‘స్థితి’ని మరచాడు... తన ప్రాపంచికత తన ఆత్మను నిలదీసినట్లైంది. ఈ నిలదీతతో తాను మారాడే తప్ప ప్రాపంచికతలో మార్పు లేదు. తన ఆలోచనలలో మార్పే తను ముందడుగు వేయటానికి ప్రతిబంధకమవుతోంది. నిజానికి ఈనాటి అర్జునుడి స్థితికి కారణం అంతరంగం నుండి తన్నుకొచ్చిన ఆరాటమే!
విషాదంలో మునిగిన అర్జునుడి ఆలోచనలలో సఖ్యత అంటే పొంతన లేదు. అన్నట్టు సఖ్యతాపరంగా వివేకం లోపించటమే సాంఖ్యం. జీవన వివేకం లేకపోవటం లోపమే! అందుకే అద్వితీయం కావలసిన అర్జునుడి వ్యక్తిమత్వం ద్వితీయానికి పడిపోయింది. అంటే నిర్ణయ పటిమలేని వ్యక్తిత్వమైంది.
నిజానికి, మన జీవితాలన్నీ ప్రేమ, ద్వేషాల మధ్యనే కదలాడుతుంటాయి. మనల్ని మనం బాలెన్స్ చేసుకుని ప్రేమవైపు మొగ్గితేనే మన జీవన యోగం సాంఖ్యయోగం అవుతుంది. మొత్తానికి అర్జునుడు ద్వేష ప్రవృత్తి నుండి బయటపడ్డాడు. ప్రేమించటంలోని పరమానందాన్ని అర్థం చేసుకోగలిగాడు.
సాంఖ్యం అంటే జీవన విలువల్ని సమర్థవంతంగా గణించటం, గుణించటం. ప్రాపంచిక విలువలను, జీవన విలువలను సమాదరించటమే. అయితే సాంఖ్య జీవనంలో అంతరంగ చైతన్యం, విశ్వచైతన్యం సంలీనం కావాలి. దృశ్యాలనే కాక అదృశ్యాలను చూడగలగాలి.. మానవ ప్రవృత్తి విశ్వప్రకృతిని అందుకోగలగాలి. ఆ అనే్వషణ ఆత్మపరంగా సాగాలి. ఇదే ఆత్మచైతన్యం.
ఆత్మచైతన్యం, పైకి వ్యక్తి చైతన్యంగానే కనిపిస్తుంటుంది. ఆత్మచైతన్యం పారదర్శక చైతన్యం అయినప్పటికీ దేహాన్ని ఆశ్రయించి ఉండటంవల్ల వ్యక్తి చైతన్యంగా భాసిస్తుంది. మొత్తానికి దేహధర్మం పోనీ మానవ ప్రవృత్తి కనిపించే ప్రతిదాన్నీ వస్తు చైతన్యంగానే చూస్తుండటం వల్ల దృశ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంలో ఎంతో కొంత తప్పుతుంటుంది. కురుక్షేత్రంలో అర్జునుడు ఇలా తప్పినవాడే!
అర్జునుడు వస్తు తత్వం అంటే ప్రాపంచిక తత్వం ఆనుపానులు బాగా ఎరిగినవాడే! పొరబడుతున్నదల్లా ఆత్మతత్వ విషయంలోనే! అందుకే ‘ఆత్మ’ను సంపూర్ణంగా ఆవిష్కరించే ప్రయత్నంలో పడ్డాడు కృష్ణుడు. ఆ ప్రయత్నాన్ని సాంఖ్యంతో మొదలుపెట్టాడు.
‘న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం
భూత్వా భవితం వా న భూయః
అజో నిత్యః శాశ్వతోయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే’
ఆత్మ - ‘నిత్యః’ అంటే నిత్యమైంది - ఎల్లప్పుడూ ఉండేది. ‘శాశ్వతో’ అంటే శాశ్వతమైంది - క్షీణత్వం లేనిది, ‘పురాణో’ అంటే పురాతనమైంది - సనాతనమైంది. పైగా ‘న హన్యతే హన్యమానే శరీరే’ అంటే దేహం నశించినా నశించనిది ఆత్మ. అన్నట్టు, ఈ ఆత్మకు పుట్టటమూ లేదు, మరణించటమూ లేదు. అంటే జన్మ తేదీ అంటూ లేనిది డెత్ డేట్ అంటూ లేనిది సోల్. అలాగే ఆత్మకు కొంతకాలం ఉండటం కొంతకాలం లేకుండా పోవటం అనేదీ లేదు. అంటే భూత భవిష్య వర్తమానాలకు లొంగనిది ఆత్మ.
జనన మరణాలన్నవి కూడా ఒక విధమైన వికారాలే... ప్రాపంచిక పరిధులే. వస్తు ప్రపంచంలోని నలుమూలలకు ప్రయాణ సౌకర్యాలున్నపుడు ప్రపంచ యాత్ర సంపూర్ణంగా చేయగలం. మహా అయితే ఒక విమానం నుండి మరొక విమానం, మరొక షిప్ నుండి ఇంకొక నౌక లేదా ఇతర ప్రయాణ సాధనాల ద్వారా, ప్రయాణ మార్గాల ద్వారా ప్రపంచ యాత్ర కొనసాగుతుంటుంది. ఈ విశ్వంలో ఆత్మయాత్ర కూడా ప్రపంచ యాత్రలాంటిదే.
ఆత్మ ఈ దేహంతో కొంతకాలం ప్రయాణం సాగించి, ఈ దేహాన్ని వదలి మరొక ప్రయాణ సాధనాన్ని, ప్రయాణ మార్గాన్ని ఎంచుకుంటుంది. అంతేకానీ ప్రతీసారీ ఈ మానవ దేహ రూపంలోనే ప్రయాణం సాగించాలని కాదు. నిజానికి పుట్టటం, మరణించటం అన్న పదాలు, భావనలు, వికారాలు మనం కూర్చుకున్నవి. ఆత్మ నిఘంటువులో ఈ రెండు పదాలు ఉండనే ఉండవు. అందుకే ఆత్మను అజం, నిత్యం అంటుంటాం. అంతెందుకు జనన మరణాలను వికారాలుగా పరిగణించటం ప్రారంభిస్తే - పుట్టటం అనే వికారం మొదటిదైతే చావటం అనే వికారం చివరిదైతే - జననం, మరణం అనే ఈ రెండు వికారాలూ అసత్యాలైనపుడు తక్కిన వికారాలకు ఉనికి లేదు. అందుకే మన దేహం వికారాలకు పుట్టిల్లే కానీ మానవాత్మ వికార రహితమే! క్షయం లేనిది కాబట్టి అక్షయమే!

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946