తెలంగాణ

నరేష్‌ది హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కువీడిన అదృశ్యం కేసు
స్వాతి కుటుంబీకులే హంతకులు
కులాంతర ప్రేమ కథ విషాదాంతం
రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్

హైదరాబాద్, మే 27: అదృశ్యమైన నరేష్ హత్యకు గురయ్యాడు. నరేష్‌ను తలపై రాడ్‌తో కొట్టి చంపారని పోలీసులు గుర్తించారు. స్వాతి కుటుంబీకులే నరేష్‌ను హత్య చేసి తగులబెట్టారని, అస్తికలను మూసీలో కలిపారని రాచకొండ కమిషనర్ మహేశ్ ఎం భగత్ శనివారం మీడియాకు వెల్లడించారు. తన భార్య కోసం వచ్చిన నరేష్ మామ చేతిలో హతమయ్యాడని, స్వాతి ఆత్మహత్యకు పాల్పడటంతో వారి ప్రేమకథ విషాదాంతమైందని వివరించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం రింగరాజుపల్లికి చెందిన తుమ్మల స్వాతి, పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్ (24) మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ముంబయిలో కాపురం పెట్టారు. కులాంతర వివాహం స్వాతి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. చివరకు పెళ్లిని అంగీకరిస్తున్నట్టు చెప్పి స్వాతి, నరేష్‌లను ఈనెల మొదటివారంలో రప్పించారు. స్వాతి పుట్టింటికి చేరగా, నరేష్ అదృశ్యమయ్యాడు. భర్త ఆచూకీ తెలియకపోవడంతో స్వాతి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స అనంతరం ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికి తీవ్ర మనస్థాపంతో ఈనెల 16న ఆత్మహత్య చేసుకుంది. దీంతో వరకట్నం వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందంటూ స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదిలావుంటే తన కొడుకు కనిపించడం లేదని, నరేష్ అదృశ్యం వెనుక స్వాతి కుటుంబీకుల ప్రమేయం ఉందని నరేష్ కుటుంబీకులూ ఫిర్యాదు చేశారు. కాగా ఈనెల 18న కోర్టులో శ్రీనివాసరెడ్డిని హాజరుపరచగా కేసు దర్యాప్తు వివరాల నివేదిక సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈమేరకు ఎల్‌బి నగర్ డిసిపి వెంకటేశ్వరరావును దర్యాప్తు అధికారిగా నియమించామని కమిషనర్ భగవత్ తెలిపారు. జాయింట్ సిపి తరుణ్‌జోషి నేతృత్వంలో వేర్వేరు బృందాలను రంగంలోకి దించారు. ముంబయి, షోలాపూర్‌లతోపాటు నరేష్ సొంతూరు పల్లెర్ల, శ్రీనివాస్‌రెడ్డి స్వస్థలం లింగరాజుపల్లి తదితర ప్రాంతాల్లో విచారణ జరిపారు. చివరికి స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డిపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా నిజం బయటపడింది. ఈనెల 2న శ్రీనివాస్‌రెడ్డి, స్వాతి పిన్ని కొడుకు సత్తిరెడ్డి కలిసి వ్యాగన్ కారులో స్వాతిని లింగరాజుపల్లికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి 10.30కు శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డి ఓ పని నిమిత్తం బైక్‌పై ఇంటినుంచి వెళ్తూ, దారిలో నరేష్ కనిపించడంతో అతణ్ని తమ పొలానికి తీసుకెళ్లారు. అక్కడ నరేష్‌తో సత్తిరెడ్డి మాట్లాడుతుండగా శ్రీనివాస్ వెనుక నుంచి రాడ్‌తో తలవెనుక భాగంలో కొట్టాడని, దాంతో నరేష్ అక్కడిక్కడే మృతి చెందాడని కమిషనర్ దర్యాప్తు వివరాలు వెల్లడించారు. కాగా అక్కడే నరేష్ మృతదేహాన్ని తగలబెట్టడానికి యత్నించగా, అది పూర్తిగా కాలలేదు. దాంతో ఆత్మకూరుకు వెళ్లి ఐదు లీటర్ల పెట్రోలు, కొన్ని పాత టైర్లు వ్యానులో తీసుకొచ్చి మృతదేహాన్ని తగులబెట్టారు. తరువాత నరేష్ సెల్‌ఫోన్ తీసుకున్న సత్తిరెడ్డి హైదరాబాద్ బోడుప్పల్ బాలాజీ హిల్స్ ప్రాంతంలో ఉన్న తన ఇంటికి వచ్చాడు. మర్నాడు ఉదయం శ్రీనివాస్‌రెడ్డి నరేష్ అస్తికలను గోనె సంచిలో తీసుకొచ్చి మూసీలో కలిపేశారని కమిషనర్ వివరించారు. కాగా ఈనెల 2, 3 తేదీల్లో జరిగిన హత్యోదంతానికి సంబంధించిన ఆధారాలను మాయం చేశారని, స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డిలను వేర్వేరుగా విచారించడంతో నిజాన్ని అంగీకరించారని కమిషనర్ మహేశ్ ఎం భగవత్ తెలిపారు.
స్వాతి ఎదుటే నరేష్ హత్య..?
నరేష్ అదృశ్యం కేసులో మరో కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. భార్య స్వాతి ఎదుటే భర్త నరేష్‌ను దారుణంగా కొట్టి చంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథకం ప్రకారమే ఈనెల 2న స్వాతితో నరేష్‌కు ఫోన్ చేయించి పొలం వద్దకు పిలిపించారు. ఈలోగా అక్కడకు చేరుకున్న స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి, అతని బంధువులు దారుణంగా నరేష్‌ను హత్య చేశారు. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించాడు. కాగా నరేష్‌ను హత్య చేసిన అనంతరం స్వాతిని బెదిరించి ఆమెతో బలవంతంగా సెల్ఫీ వీడియోను చూపించారు. అయితే మూడు వారాలుగా నరేష్ కనిపించకుండా పోవడంతో అతని బంధువులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశం మేరకు పోలీసులు కేసును వేగిరం చేశారు. ఎట్టకేలకు కేసును ఛేదించారు. ఇదిలావుండగా నరేష్ హత్య సమయంలో తీసిన సెల్ఫీ వీడియో చూసిన స్వాతి కోర్టులో చెబుతుందేమోనన్న అనుమానంతో స్వాతిని కూడా శ్రీనివాసరెడ్డి హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రం... మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ
కమిషనర్ మహేశ్ ఎం భగవత్