తెలంగాణ

యాసంగి నుంచి ఫ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: యాసంగి నుంచి వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ఉద్యమ కాలంలో తెలంగాణ ఏర్పడితే ఎలా ఉంటుందని తాను చెప్పానో ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. స్వరాష్ట్రంలో ఏయే స్వప్నాలు ఫలించాలని తపించామో, ఆ ఆశలు, ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చుకునే దిశగా తెలంగాణ ప్రగతి పథంలో పురోగమిస్తోందని అన్నారు. ‘సకల వనరులతో శోభించే సుసంపన్నమైన ప్రాంతం మన తెలంగాణ. కానీ తెలంగాణకున్న ఆర్థిక ప్రతిపత్తి సమైక్య రాష్ట్రంలో మరుగునపడింది. రాష్ట్రం అవతరిస్తే దేశంలోనే ధనిక రాష్ట్రంగా విరాజిల్లుతుందని ఉద్యమ సమయంలో పదే పదే ప్రకటించాను. ఆనాటి నా మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెల్లడించిన నివేదికలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ 17.82 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇది మనందరికీ గర్వకారణం. మన రాష్ట్భ్రావృద్ధికి శుభ సూచకం. ఇది గడిచిన మూడేళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన, ప్రణాళికాబద్ధమైన విధానాల వల్ల అందిన ఫలితమని సగర్వంగా ప్రకటిస్తున్నాను’ అన్నారు. 40వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రభుత్వ ఆదాయంలో సింహభాగాన్ని ప్రజా సంక్షేమానికే వెచ్చిస్తున్నామన్నారు. 40 లక్షల మంది అసహాయులకు ఆసరా పెన్షన్లు అందిస్తోందని, పేదింటి ఆడపిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్నామన్నారు.
కొత్తగా 512 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఎస్సీ మహిళలకు ప్రత్యేక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు నడుపుతున్నట్టే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా శాతానికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతి నిధి ఏర్పాటు చేసి ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో తక్కువ వేతనాలతో పని చేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి జీతాలు భారీగా పెంచామన్నారు. పేద మహిళలకు ఉపయోగపడే రెండు మానవీయ పథకాలు రాష్ట్రావతరణ సందర్భంగా ప్రారంభిస్తున్నట్టు చెబుతూ, ఒంటరి మహిళలకు పెన్షన్, కెసిఆర్ కిట్ పథకాలు ప్రకటించారు. సంక్షేమంతోపాటు అభివృద్ధిలోనూ అనతికాలంలోనే ప్రగతి సాధించినట్టు కెసిఆర్ వెల్లడించారు. రాష్ట్రావతరణ జరిగిన వెంటనే ప్రభుత్వం ముందున్న పెను సవాల్ తీవ్రమైన విద్యుత్ కొరత. దీన్ని ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందన్నారు. కోతల్లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించే స్థితికి చేరుకున్నామని, రాబోయే రోజుల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కొత్త విద్యుత్కేంద్రాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది యాసంగి నుంచే రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, ప్రభుత్వం కృషి ఫలించి రైతులు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలు తొలగిపోయేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. డిసెంబర్ నాటికి ఇంటింటికి మంచినీటిని మిషన్ భగీరథ ద్వారా అందించనున్నట్టు చెప్పారు. ఐటి రంగంలో పెట్టుబడులు, ఉత్పత్తులు గణనీయంగా పెరిగినట్టు తెలిపారు. 230 కోట్ల మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యమని, వచ్చేనెలలో హరిత హారం ప్రారంభమవుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి అవసరమైన ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. 17వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణమాఫీ చేశామని, వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించనున్నట్టు చెప్పారు. మిషన్ కాకతీయ వల్ల జలకళ ఉట్టిపడుతోందన్నారు.
లాభసాటి వ్యవసాయం కోసం ప్రణాళికలు
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. దీని కోసం రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చడం, ప్రాజెక్టులను శర వేగంగా పూర్తి చేయడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి అందించడం, పంటల కాలనీల విభజన, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం అనే ఆరు విషయాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునే దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తున్నా, ప్రాజెక్టుల కోసం ఏటా 25వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తూ, వీలైనంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేసి తొందరగా సాగునీరు అందించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. కులవృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా 75శాతం సబ్సిడీతో ఈనెల 20 నుంచి గొర్రెల పంపిణీ జరుగుతుందని చెప్పారు.
దాశరథి చెప్పినట్టు
‘అన్నార్తులు, అనాథలుండని నవయుగం ఎంత దూరం. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అని ఆర్థ్రంగా పలికిన మహాకవి దాశరథి కవితా వాఖ్యలు మదిలో నిరంతరం మెదులుతుంటాయి’ అన్నారు. కవి స్వప్నించిన శ్రేయోరాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దేంత వరకు త్రికరణ శుద్ధితో, అంకితభావంతో అవిశ్రాంత కృషి చేస్తానని తెలంగాం అవతరణ దినోత్సవ వేళ రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను’ అని కెసిఆర్ ప్రసంగం ముగించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులకు ముఖ్యమంత్రి అవార్డులు అందజేశారు.
చిత్రం: తెలంగాణ అవతరణ దినం వేడుకల్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్