మెయిన్ ఫీచర్

భూమాతకు ఎంత కష్టం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవాళి మనుగడకు పునాది నేలతల్లి. అలాంటి నేలతల్లికి నేడు కష్టమొచ్చింది. సహజ వనరులైన చెట్లు, జంతువులు, పక్షులను రక్షించుకోలేకపోతున్నాం. దీనికి కారణం మనిషి ప్రకృతికి దూరమవడమే. అందుకే ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించి వారిని పర్యావరణ ప్రేమికులుగా మార్చి ప్రకృతితో మమేకం అయ్యేటట్టు చెయ్యాలనే మంచి ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా జూన్ 5ను ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’గా ప్రకటించింది. దీనిని అన్ని దేశాలు పాటిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఒక మంచి లక్ష్యాన్ని నినాదంగా ప్రకటించి కార్యక్రమాలు చేపడుతున్నాయ. మనకు అందిస్తుంది. ఈ సంవత్సరం నినాదం ‘ప్రకృతిలో మమేకం’. దీని ప్రకారంగా ప్రకృతిలో ఉన్న చెట్టు, గాలి, నీరు, నేల కలుషితం కాకుండా కాపాడుకోవాలి. పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది.

మనిషి మహా స్వార్థపరుడు. ఏది ఏమైనా ఫర్వాలేదు, తాను, తన కుటుంబం బాగుంటే చాలు, నాలుగు తరాలకు సరిపడా సంపాదించుకోవచ్చు అనే దుర్మార్గపు ఆలోచనతోనే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. ఫలితంగా గుండె నిండా గాలి పీల్చుకున్న ప్రతిసారీ మనం చిటికెడు కాలుష్యాన్ని ఊపిరితిత్తుల్లో నింపుకుంటున్నాం. మనవల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతో అకాల వర్షాలు పంటలను మింగేస్తున్నాయి. మండే ఎండలకు భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగేందుకు గుక్కెడు మంచినీళ్ళు దొరకడం గగనమయిపోతోంది. ఋతుపవనాలు గతి తప్పడంతో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి ప్రాణాలను తీస్తున్నాయి. అడవులు హరించి, జంతువులను మట్టుపెట్టి పచ్చదనాన్ని పొట్టన పెట్టుకుంటే జీవకళ కనుమరుగవుతుంది. ఇది మానవ జాతికే గొడ్డలి పెట్టు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ప్రకృతి లేనిదే మానవ మనుగడ లేదని గ్రహించి, ప్రకృతిని యధేచ్చగా దోపిడీ చేయడం ఆపాలి. ప్రకృతి మనుషుల అవసరాలు తీర్చగలదు గాని అత్యాశలను తీర్చలేదు. అభివృద్ధి పేరుతో సమూలంగా సంపదను దోచేస్తున్నారు. మాయమైన అడవులు, పరిసరాలు కోల్పోతున్న పచ్చదనం, ఎండిపోయి జీవకళ లేని నదులు ఈ దోపిడీకి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇలా నిరంతర దోపిడీని ప్రకృతి తట్టుకోలేదు. ఏదో ఒక రోజు ఎదురు తిరగక మానదు. ప్రకృతి ఎదురుదాడి చేస్తే విపత్తులు భూలోకానే్న ముంచేయగలవు. ఇప్పటికే ఎండ లు మండుతున్నాయి. కాలుష్యం బాధిస్తోంది. అకాల వర్షాలు, కార్చిచ్చులు చుట్టుముడుతున్నాయ.. ఇవన్నీ చూస్తుంటే, మనిషి మీద ప్రకృతి ప్రతిదాడి చేస్తోందనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా మన పాలకులకు చీమ కుట్టినట్లయినా లేదు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మనిషి ప్రకృతితో యుద్ధం చేయకూడదు. కొండలు, నదులు, చెట్లను నాశనం చేయకుండా వాటిని సంరక్షించుకోవాలి. మనసున్న ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి బాధ్యతగా ముందుకు రావాలి.

కాలుష్యం చెప్పే కఠిన వాస్తవాలు
మనం కాలుష్య యుగంలో జీవిస్తున్నాం. ఈ కాలుష్యం చెప్పే కొన్ని కఠిన వాస్తవాలు ఇలా ఉన్నాయ.
కాలుష్యం ఏటా సుమారు పది కోట్లమందిని ప్రాణాంతకమైన రోగాల బారిన పడేస్తున్నది.
179 దేశాలలో గతంలో జరిపిన పరిశోధనల ప్రకారం పర్యావరణ పరంగా సురక్షితం కాని దేశాల వరుసలో భారత్‌ది ఏడో స్థానం. ప్రపంచంలో బొగ్గును ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్‌ది మూడో స్థానం. బొగ్గు కాలుష్యంవల్ల భారత్‌లో ఏటా మూడు లక్షలమందికిపైగా మరణిస్తున్నారని ఒక అంచనా.
కాలుష్య రకాల్లో ఎక్కువ శాతం నిర్లక్ష్యం చేస్తున్నది శబ్దకాలుష్యానే్న. ప్లాస్టిక్ బ్యాగ్‌ల వాడకం పర్యావరణానికి చేటే.
సంవత్సరానికి ఏటా 40 లక్షల చెట్లను కేవలం ఇళ్ల తయారీకే నరికేస్తున్నారు.
నీటి కాలుష్యం కారణంగా ఏటా అనేకమంది ఐదేళ్ల చిన్నారులు డయేరియా బారినపడి మరణిస్తున్నారు.

‘చెట్టే దేశ ప్రగతికి మెట్టు’
ప్రకృతి సమతుల్యతను కాపాడుటలో చెట్ల పాత్ర ఎనలేనిది. చెట్లవల్ల వచ్చే గాలి ఎంతో ఉపయుక్తమైనది. గాలి అనేక వాయువుల సమాహారం. అందు 21 శాతం ప్రాణవాయువు వుంటుంది. చెట్లు నేల క్షయాన్ని పోగొడుతుంది. అంతేగాక వేడిని తగ్గిస్తుంది. అందుకే ‘చెట్టే దేశ ప్రగతికి మెట్ట’ని అంటారు. ఒక చెట్టు ప్రాణికోటికి దాదాపు 20 లక్షల రకాలుగా ఉపయోగపడగలదని పర్యావరణవేత్తలు అంటున్నారు. నలుగురు నివశిస్తున్న కుటుంబానికి బతకడానికి కావాల్సిన ప్రాణవాయువును ఒక చెట్టునిస్తుంది. ఒక చెట్టు నిజానికి దాదాపు 380 లీటర్ల నీటిని వాతావరణంలోకి పంపుతుంది. జీవరాశులు ప్రకృతిని తట్టుకొని జీవించడానే్న పర్యావరణం అని నిర్వచిస్తారు. కానీ నేటి కాలంలో అనవసరంగా చెట్లను నరికేస్తున్నాం. దీంతో పర్యావరణం, కాలుష్యం పెద్ద సమస్యలుగా ఏర్పడ్డాయి.

జల నిధితో జన సిరి
ప్రపంచ జనాభాలో 17 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియాలో జలవనరుల లభ్యత కేవలం నాలుగు శాతం మాత్రమే. ఉన్న జలవనరులు కాలుష్య కాసారాలుగా మారి, భూగర్భ జలమట్టం రోజురోజుకూ అడుగంటిపోతున్నది. తెలంగాణ పల్లెలో 71 శాతంమందికి అరకొరగా నీరు లభిస్తుండగా, 6 శాతంమందికి కలుషిత నీరే దిక్కంటుంది. కృత్రిమంగా నీటిని సృష్టించే అవకాశం లేదు. కానీ జన సంరక్షణ కోసం జల సంరక్షణ యుద్ధ ప్రాతిపదికన సాగాలి. 2050 నాటికి ప్రపంచ జనభా 960 కోట్లకు చేరుకుంటుందనీ, ఇప్పటిమాదిరిగానే వ్యవహరిస్తే రాబోవు తరాలు మనల్ని నిందించుకుంటాయి. ఆహార ఉత్పత్తికి నీరు అత్యావశ్యకం. భూగర్భ జలాలు తగ్గిపోవడం, ఉన్న కొంత నీరు కలుషితం కావడం మానవాళిపై ప్రభావం చూపక తప్పదు. కావున పర్యావరణాన్ని రక్షించుకుందాం- ప్రకృతిని కాపాడుకొందాం.

వాయు కాలుష్యంతో రోగాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1600 నగరాల్లో అధ్యయనం చేసి వెలువరించిన నివేదిక పర్యావరణవేత్తలను దిగ్భ్రాంతిపరిచాయి. అందులో మన దేశ రాజధాని నగరం అత్యంత కాలుష్యవంతమైన నగరంగా ప్రథమ స్థానంలో నిలవడం దురదృష్టకరం. వాయు కాలుష్యంవల్ల మనిషి ఆయుఃప్రమాణం 3.2 ఏళ్ళు తగ్గిపోతున్నదనేది నిపుణుల బృందం నివేదిక తెలిపింది. ప్రతి తొమ్మిది మరణాల్లో ఒకటి కాలుష్యంవల్లేనని తేలింది. 2040 నాటికి 90 శాతం మరణాలకు కారణం కాలుష్యమే అవుతుందట. నగరాల్లో 90 శాతం మంది కలుషిత గాలినే పీలుస్తున్నారట. కలుషితమేనా వాయువుల్లో నైట్రేట్, సల్ఫేట్, కార్బన్, సోడియం క్లోరైడ్, కాడ్మియం, పాదరసం అణువులు శరీరంలోని మూల మూలలకుపోయి మనల్ని నాశనం చేస్తాయి. ఆస్తమా, క్షయ వంటి వ్యాధులతోపాటు కాన్సర్ మహమ్మారిన పడవేస్తున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి వాయు కాలుష్యమే కారణమని అంతర్జాతీయ క్యాన్సర్ సంస్థ తెలియజేసింది. ప్రాణాన్ని హరించడంలో వాయు కాలుష్యం అయిదో స్థానాన్ని గుండెపోటు నాల్గవ స్థానాన్ని పొందింది. ప్రపంచ వ్యాప్తంగా 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. మొత్తం విడుదలైన కాలుష్య పరిణామం లెక్కిస్తే చైనా, అమెరికా తర్వాత మూడవ స్థానంలో మన దేశమే ఉన్నది. అందుకే స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి ప్రజలు అధికంగా చెట్లను నాటేటట్లు ఈ రోజునుంచి ప్రారంభించాలి. ఉన్న చెట్లను నరికివేయకుండా కాపాడుకోవాలని ప్రజల్లో చైతన్యం తెప్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం.

- కె.రామ్మోహన్‌రావు, కె. నాగేంద్ర