బిజినెస్

మిగతా వాటికీ రేటేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: చారిత్రాత్మక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు సర్వం సిద్ధమైంది. శనివారం ఇక్కడ 15వసారి సమావేశమైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జిఎస్‌టి కౌన్సిల్.. మిగతా వస్తువులకూ పన్ను శ్లాబులను నిర్ణయించింది. ఇప్పటికే 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు జిఎస్‌టి రేట్లను ప్రకటించిన జిఎస్‌టి కౌన్సిల్.. శనివారం మిగతా వాటికీ రేట్లను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే నూలు దుస్తులు, నూలు, పాదరక్షలు, ముడి వజ్రాలు, వ్యవసాయ మెషినరీ, బీడిలు, బిస్కట్లు, బంగారం, సోలార్ ప్యానెల్స్‌పై జిఎస్‌టి శ్లాబుల్లోని వివిధ రేట్లను నిర్ణయించారు. కాగా, నిరుపేద, సామాన్యులపై భారం పడకుండా పాదరక్షలు, నూలు దుస్తులకు అతి తక్కువ రేటును కేటాయించారు. 500 రూపాయల ధరకు దిగువన ఉన్న పాదరక్షలపై కనిష్టంగా 5 శాతం పన్నును విధిస్తున్నట్లు తెలిపిన కౌన్సిల్.. ఆపై ధరకు ఎగువన ఉన్న పాదరక్షలపై మాత్రం 18 శాతం పన్నును విధించింది. ప్రస్తుతం 500 నుంచి 1,000 రూపాయల మధ్య ధర కలిగిన పాదరక్షలపై 6 శాతం పన్ను అమల్లో ఉంది. అదికాకుండా రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అదనంగా వేస్తున్నారు. ఇకపోతే నూలు దుస్తులు, నూలు దారంపై 5 శాతం పన్నును వేయగా, రెడిమేడ్ దుస్తులపై మాత్రం 12 శాతం పన్ను వేశారు. సోలార్ ప్యానెళ్లపై 5 శాతం పన్ను వేయగా, బిస్కట్లపై 18 శాతం పన్ను పడింది. బీడిల తయారీకి వినియోగించే ఆకులపై 18 శాతం పన్ను, బీడీలపై గరిష్ఠంగా 28 శాతం పన్నును వేశారు. ఇంతకుమించి బీడీలపై ఎలాంటి సెస్సు ఉండబోదని జైట్లీ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ప్రత్యేకంగా బంగారంపై 3 శాతం, ముడి వజ్రాలపై 0.25 శాతం పన్నును జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయించింది. ఒకే దేశం.. ఒకే పన్ను లక్ష్యంతో జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే జిఎస్‌టిలో నాలుగు రకాల పన్ను శ్లాబులున్నాయి. కనిష్టంగా 5 శాతమైతే, గరిష్ఠంగా 28 శాతం. ఇవిగాక మధ్యలో 12, 18 శాతం శ్లాబులూ ఉన్నాయి. ఎక్సైజ్, సేవా పన్ను, వ్యాట్‌తోపాటు 16 రకాల ఇతరత్రా అన్ని ప్రధాన పన్నులు జిఎస్‌టి రాకతో కనుమరుగైపోనున్నాయి. ఈ పరోక్ష పన్నుల విధానానికి రాష్ట్రాలన్నీ అంగీకారం తెలపగా, ఈ నెల 11న మరోసారి కౌన్సిల్ సమావేశం అవుతుందని జైట్లీ తెలిపారు. ఇదిలావుంటే జూలై 1 నుంచే జిఎస్‌టిని అమల్లోకి తెస్తే చాలా తీవ్ర సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని తాను జైట్లీకి చెప్పినట్లు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా అన్నారు. తమకు మరిన్ని ఇబ్బందులుంటాయన్న ఆందోళనను వెలిబుచ్చారు. అందుకే జిఎస్‌టి అమలును నెల రోజులు వాయిదా వేయాలని కోరినట్లు చెప్పారు.
స్వాగతించిన వస్త్ర పరిశ్రమ
నూలు, ఫ్యాబ్రిక్స్‌పై జిఎస్‌టిలో అతి తక్కువగా 5 శాతం పన్నును వేయడాన్ని వస్త్ర పరిశ్రమ, కాటన్ టెక్స్‌టైల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టెక్స్‌ప్రోసిల్) స్వాగతించాయి. ఇది ఈ రంగం బలోపేతానికి దోహదపడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి.
ఈ మేరకు భారతీయ వస్త్ర పరిశ్రమ సమాఖ్య చైర్మన్ జె తులసిదరన్ పిటిఐకి తెలిపారు. మరోవైపు టెక్స్‌ప్రోసిల్ చైర్మన్ ఉజ్వల్ లహోటి కూడా శనివారం ఇక్కడ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సహకరించిన కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆభరణాల పరిశ్రమ హర్షం
ఇకపోతే రత్నాలు, ఆభరణాల పరిశ్రమ సైతం హర్షం వ్యక్తం చేసింది. జిఎస్‌టిలో భాగంగా బంగారంపై 3 శాతం పన్నును విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కేరళ మినహా దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ బంగారం అమ్మకాలపై 2-2.5 శాతం మేర పన్నును వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో దీనికి దాదాపు సమానంగా 3 శాతం పన్నును జిఎస్‌టి కౌన్సిల్ విధించడాన్ని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జిజెఎఫ్) ఆహ్వానించాయి. నిజానికి జిఎస్‌టిలో కనిష్ట పన్ను రేటు 5 శాతమే. అయితే బంగారానికి అంతకంటే తక్కువగా ప్రత్యేకంగా 3 శాతం విధించడం గమనార్హం. పాలిష్డ్ డైమండ్లపైనా 3 శాతం పన్నునే విధించిన జిఎస్‌టి కౌన్సిల్.. ముడి వజ్రాలపై అతి స్వల్పంగా 0.25 శాతంగా నిర్ణయించడం విశేషం.