మెయిన్ ఫీచర్

రక్షకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో విజయం సాధించాలంటే చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలని మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్ మాటలు నిజం చేస్తున్నారు ఈనాటి మహిళా పోలీసు అధికారిణులు. ఖాకీ దుస్తులు వేసుకున్న ఈ మహిళల్లో కరకుదనం ఉండదు. సామాన్యుడిని కాపాడే రక్షణదుర్గమే పోలీసు వ్యవస్థ అని నిరూపిస్తూ అన్యాయాలకు ఎదురొడ్డుతున్నారు. ఇంటిని, విధి నిర్వహణను బ్యాలెన్స్ చేసుకుంటూ తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతూ తమ సత్తా చాటుకుంటున్నారు.

నిబద్ధత ముఖ్యం
పనిలో చిత్తశుద్ధి, నిజాయితీ, నిర్మోహమాటం.. ఈ మూడు లక్షణాలు ఉండటం ఎంతో అవసరం అంటారు లా అండ్ ఆర్డర్ ఐజీ కల్పనానాయక్. ప్రముఖ ఐపీఎస్ అధికారి డాక్టర్ డి.టి.నాయక్ కుమార్తె అయిన కల్పనా నాయక్ విధి నిర్వహణలో తన తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థలో ఉన్నందున ప్రజలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తన తండ్రి చెప్పిన మాటలే తనకు ఆదర్శం అని అంటారు. పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఏ రాష్ట్రంలో పనిచేసినా ‘నేను భారతీయ సర్వీసు అధికారిణి’ అనే భావంతో పనిచేయటం ఎంతో అవసరం అని కూడా నొక్కి వక్కాణిస్తారు. ఈ పోలీసు వ్యవస్థలో పురుషాధిక్యం అధికం గా ఉంటుంది. ఇలాంటి వ్యవస్థలో ఓ మహిళా అధికారిణిగా రాణించాలంటే నిబద్ధత, నిజాయితీ వల్లనే సాధ్యమవుతుందని అంటారు. మహిళలు సున్నితంగా ఉంటారు. కాబట్టి ఈ రంగంలో రాణించలేరన్న అపోహ ఉంది. కాని పోలీ సు వ్యవస్థలో మహిళలు ఉంటే ఎక్కువ మంది వచ్చి తమ బాధలను చెప్పుకుంటారని ఆమె అంటారు. హైదరాబాద్ నగరంలో మతపరమైన ఉత్సవాల నిర్వహణ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే నేడు సైబర్ నేరాలు పెరిగిపోయాయి. వీటికి అమ్మాయిలు ఎక్కువగా బలవుతున్నారని చెబుతున్నారు.

పిల్లలతో గడుపుతాను..
మానసిక ఒత్తిడి అధికంగా ఉండే ఈ వృత్తిలో రిలాక్స్ అవ్వాలంటే మన పిల్లలతో గడపటమే సరైన మార్గమని ఆమె అంటారు. అందుకే ఖాళీ సమయంలో పిల్లలతో గడపటం వల్ల రిలాక్స్ అవుతారు. ‘పిల్లలు కథలు చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వింటారు. సన్నిహితంగా ఉండే స్నేహితురాళ్లతో ఎపుడు టచ్‌లో ఉంటారు. మ్యూజిక్ వినటం, చీరల కోసం షాపింగ్ చేయటం అంటే కూడా ఇష్టం’ అని చెబుతారామె. పోలీసు వ్యవస్థలో ఓ అధికారిగా రాణించాలంటే.. మనం వ్యక్తం చేసే అభిప్రాయాల పట్ల సమగ్ర దృష్టి, అవగాహనతో పాటు నిర్భయంగా వ్యక్తం చేయగలగాలి. ఎదుటివారు చెప్పేది సానుభూతితో వినటం, అలాగే మన దృష్టికోణంలో సమతుల్యత లోపించకుండా చూసుకోవడం అవసరం’ అని ఆమె అంటారు. విధి నిర్వహణను, ఇంటి పనిని ఎలా బాలెన్స్ చేసుకుంటారని ప్రశ్నిస్తే.. పోలీసు అధికారిణిగానూ, బిడ్డలకు తల్లిగా బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్లటం చక్కటి అవగాహన, ప్రణాళికతో సాధ్యమేనని అంటారు. ఆమె భర్త డాక్టర్ మహేందర్ రాథోడ్ కూడా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు. భర్త ఇదే రంగంలో ఉండటం వల్ల ఓ మహిళా అధికారిణిగా తనకు తలెత్తే సమస్యలు తెలుసుకాబట్టి భర్త సహకారంతో వాటన్నింటిని పరిష్కరించుకుంటూ రాణిస్తున్నానని అంటారు. పని ఒత్తిడి వల్ల పిల్లలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటం, అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోవటం, సెలవుల్లో ఎక్కడకైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవటం వాటిని వాయిదా వేసుకోవటం సర్వసాధారణమై పోయిందని అంటారు. పంజాబ్, మోహలి, ఫిరోజ్‌పూర్‌లలో ఎస్పీగా ఆమె పనిచేశారు. తమిళనాడులో ఉమెన్ బెటాలియన్‌కు తొలి కమాండెంట్‌గా విధులు నిర్వహించారు. సిఐడి విభాగంలో ఎస్పీగా తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లోనూ, సైబర్ క్రైమ్ విభాగంలోను కల్పన రాణించారు. కర్నూలులో పుట్టిన కల్పనానాయక్ పాఠశాల విద్యాభ్యాసం తిరుపతి, విజయవాడ, కాకినాడలలో పూర్తిచేశారు. ఐఐటి మద్రాసులో ఎం.టెక్ పూర్తిచేశారు.

పోలీసు వృత్తి
అపూర్వం
పోలీసు అధికారిణి వృత్తిలో రాణించటం నాకెంతో సంతోషాన్ని ఇస్తుందంటారు హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు అపూర్వరావు. ఈ వృత్తిలో మహిళలకు, పురుషులకు ఎదురయ్యే సవాళ్లు వేర్వేరుగా ఉంటాయంటారు. మనకు ఎదురైన సవాళ్ల పట్ల సరైన దృక్పథం ఉంటే ఎలాంటివాటినైనా ఎదుర్కోవచ్చని అంటారు. 2014 బ్యాచ్ అధికారిణి అయిన అపూర్వరావు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నపుడే పోలీసు అధికారిణి అవ్వాలని కలలు కన్నట్లు వెల్లడించారు. టిసిఎస్‌లో ఉద్యోగం చేస్తూనే ఐపీఎస్‌కు ప్రిపేర్ అయ్యారు. మొదటిసారి రాకపోయినా రెండవసారి ఆమె ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఈ రంగం నిజంగానే పురుషుల ఆధిపత్యం అధికంగా ఉంటుందంటూనే శిక్షణా కాలంలో వేర్వేరుగా శిక్షణ ఇస్తారని, కాని శిక్షణ పూర్తయిన తరువాత అలాంటి భావం రాదని ఆమె అంటారు.

తెలంగాణ తొలి పోలీసు అధికారిణి..
తెలంగాణ తొలి మహిళా పోలీసు అధికారిణిగా తన పేరును నమోదు చేసుకున్న అపూర్వరావు అసమానత్వం, తక్కువ సామర్థ్య కలిగి ఉన్నామనే భావన మహిళల్లో ఉండకూడదని ఆమె నిశ్చితాభిప్రాయం. మన లక్ష్యాన్ని సాధించాలంటే వాస్తవిక దృక్పథం ఎంతో అవసరమని అంటారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఎన్నో అనుభవ పాఠాలను నేర్చుకోవచ్చని అంటారు. విధి నిర్వహణలో ప్రతిరోజూ ఏదోఒకటి మనం నేర్చుకుంటునే రాణించగలుగుతాం, వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు. జీవితంలో వృత్తి అనేది ఎంతో ముఖ్యం. అదే సందర్భంలో అదే జీవితం అని భావించకూడదంటారు. తల్లిగా, భార్యగా, కుమార్తెగా విభిన్న సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటూ వెళ్లాలని, పదవీ విరమణ తరువాత ఈ బాంధవ్యాలే బాసటగా నిలుస్తాయని చెబుతారు.
పోలీసు శిక్షణా కాలంలో కుటుంబ సభ్యుల తోడ్పాటు మరువలేనిదంటారు. పోలీసు రంగంలోకి మహిళలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రంగంలో మహిళలు రాణించగల లక్షణాలు వారిలో ఉన్నాయంటారు. సానుకూల దృక్పథం, సివిల్ సర్వెంట్‌గా భావించుకుని ఈ రంగంలోకి అడుగుపెడితే ఎలాంటి పరిస్థితులనైనా మహిళలు ఎదుర్కోగలరని అపూర్వరావు నిశ్చితాభిప్రాయం.