కరీంనగర్

రేకుర్తిలో హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 18: మండలంలోని రేకుర్తి గ్రామంలో ఆదివారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం గ్రామశాఖ ఆధ్వర్యంలోపలుచోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి జాడి బాల్‌రెడ్డి మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న కాంక్రీట్ జంగిల్ అవసరాలకోసం చెట్లను బాహాటంగానే నరికివేస్తుండగా, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని కాలుష్యపు కోరల్లో ప్రజలు చిక్కుకుంటున్నారని అన్నారు. దీంతో మానవ మనుగడపై పెనుప్రభావం చూపుతుండగా, రాబోయే రోజుల్లో పరిశుభ్రమైన గాలి కూడా లభించని దుస్థితి నెలకొనే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టేందుకు మొక్కలు నాటడమే మార్గమని, దీనిపై గ్రామస్థులను చైతన్యపరుస్తూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలోగత నాలుగురోజులుగా గ్రామవీధుల్లో మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ఎంతోప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం కాగితాలకే పరిమితమైతుందని, నామమాత్రంగా మొక్కలు నాటి చేతులు దులుపుకుంటున్న అధికారులు గ్రామాల్లోని యువజన సంఘాలకు హరితహారంలో మొక్కలు నాటడం, చెట్లు పెంచటం అప్పగిస్తే, వాటి సంరక్షణ బాధ్యతలు చేపడుతారన్నారు. ఈకార్యక్రమంలోమండల ప్రాదేశిక సభ్యురాలు జక్కుల నాగరాణిమల్లేశం,అంబేద్కర్ యువజన సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు దుర్గం లింగమూర్తి, కార్యదర్శి హస్తాపురం మారుతి, కృషి యూత్ అధ్యక్షుడు బండారి చంద్రయ్య, సభ్యులు గొల్లె కిష్టయ్య, దీకొండ అంజయ్య, దుర్గం అంజనేయులు, హస్తపురం అంజయ్య, తిరుపతి, ఏదుళ్ళ లింగయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.
టిఎన్జీవో నేత కోలుకోవాలని పూజలు
కరీంనగర్ టౌన్, జూన్ 18: రోడ్డుప్రమాదానికి గురైన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మారం జగదీష్ త్వరగా కోలుకోవాలంటూ తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు.
నగరంలోని ముకరంపురలో గల సంతోషిమాత ఆలయంలోఅంగన్‌వాడీ టీచర్లు సామూహిక అభిషేకాలు, 116 కొబ్బరికాయలతోప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘ పనుల నిమిత్తం టీఎన్జీవోల కేంద్రకార్యాలయానికి వెళ్తుండగా, రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగి, జగదీష్‌కు తీవ్రగాయాలైన విషయం విదితమే. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన త్వరగా కోలుకోవాలని టీఎన్జీవోల అనుబంధ సంఘం అంగన్‌వాడీ టీచర్స్ యూనియన్ ప్రతినిధులు,సభ్యులు పూజలు చేశారు. ఈకార్యక్రమంలోసంఘం జిల్లా అధ్యక్షురాలు ఏరువ లలితారెడ్డి, కార్యదర్శి స్వరూప, ప్రతినిధులు లక్ష్మి, వనజ, మమత, సునిత, పద్మ, ఊర్మిళ, అంజలి, నర్సమ్మ, సంతోషి,శంకరమ్మలతో పాటు 50మంది పాల్గొన్నారు.

వృద్ధుల సమస్యల పరిష్కారానికే హెల్ప్ లైన్
* మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్
చందుర్తి, జూన్ 18: గ్రామాల్లోని నిరాధారణకు గురవుతున్న వృద్ధులను, నిరుపేద వృద్ధులను ఆదుకునేందుకే చారువాక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్, చారువాక ట్రస్ట్ చైర్మన్ దప్పుల అశోక్ అన్నారు. ఆదివారం చందుర్తి మండలం మల్యాల గ్రామంలో వృద్ధుల హెల్ప్‌లైన్ అనే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ అశోక్ మాట్లాడుతూ గ్రామాల్లోని కుమారుల ఆదరణ లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులను ఆదుకునేందుకే చారువాక హెల్ప్‌లైన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతీ ఆదివారం ఈ హెల్ప్‌లైన్ ద్వారా వృద్ధుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇప్పటివరకు మండలంలో 35 మంది వృద్ధుల సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. వృద్ధులు ఐకమత్యంగా ఉంటూ తమ సమస్యలను హెల్ప్‌లైన్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల సంఘం జిల్లా అధ్యక్షులు ఉచ్చిడి రాజిరెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, చెప్యాల గణేష్, దయ్యల కమలాకర్, గౌరయ్య, రాములుతో పాటు పెద్దఎత్తున వృద్ధులు పాల్గొన్నారు.

కోల్‌బెల్ట్‌లో నిరసన సెగలు...
* సింగరేణిలో 4వ రోజు సమ్మె విజయవంతం
* టిబిజికెఎస్ నేతలు కార్మిక ద్రోహులు: సంఘాల విమర్శ
గోదావరిఖని, జూన్ 18: సింగరేణి బొగ్గు పరిశ్రమలో వారసత్వ ఉద్యోగాలు సాధించుకునేందుకు తలపెట్టిన పోరు రోజు రోజుకు ఉధృతమవుతుంది. కోల్‌బెల్ట్ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు విరివిగా వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. వారసత్వాన్ని సాధించుకునే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ ఐ ఎన్‌టియుసి, హెచ్ ఎం ఎస్, ఎ ఐటియుసి, బి ఎం ఎస్, సి ఐటియుతోపాటు వివిధ కార్మిక సంఘాలు తమదైన శైలిలో కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం 4వ రోజు నిరవధిక సమ్మె సింగరేణిలో విజయవంతం అయ్యింది. దాదాపుగా మెజార్టీ కార్మికులు సమ్మెలో భాగస్వామ్యులయ్యారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మినహా సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు వారసత్వం హక్కును సాధించే దిశగా జరుపుతున్న పోరులో కలిసి వస్తున్నారు. రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూర్, ఇల్లందు ప్రాంతాల్లో సమ్మె మొదటి రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్విరామంగా చేపడుతుండగా సింగరేణి వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల నేతల అరెస్ట్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. మరో పక్క సింగరేణి యాజమాన్యం సమ్మె ప్రభావం లేదని, ఉత్పత్తి గతం కంటే అధికంగానే జరుగుతుందని పదే పదే ప్రకటిస్తూ వస్తుంది.
టిబిజికెఎస్ నేతలు కార్మిక ద్రోహులు: జాతీయ సంఘాల విమర్శ
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల హక్కును సాధించుకునేందుకు అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తుంటే... ఆ పోరులో కలిసి రావాల్సింది పోయి... సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కార్మిక ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని జాతీయ సంఘాల నాయకులు రియాజ్ అహ్మద్, జనక్ ప్రసాద్, వై.గట్టయ్య, రాజారెడ్డి విమర్శించారు. ఆదివారం హెచ్‌ఎంఎస్ కేంద్ర కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టిబిజికె ఎస్ యూనియన్ నాయకులను రానున్న రోజుల్లో గనులపై కార్మికులు తిరగనివ్వరని, ఇప్పటికైనా కుట్రలు చేయడం మాని సమ్మెలో పాల్గొనాలని సూచించారు. సింగరేణి జనరల్ మెనేజర్‌ల్లారా... ఖబర్దార్... కార్మికులను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. వారసత్వ ఉద్యోగాలను వెంటనే అమలు పరచాలని, లేకుంటే ఈ సమ్మెను ఇలానే కొనసాగస్తామని అన్నారు.

ఉపవాస ప్రార్థనలతో మసీదులు కిటకిట
*్భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న రంజాన్ ఉపవాస ప్రార్థనలు
*యువతను ఆకర్షిస్త్తున్న రంజాన్ తీపి రుచులు
*వ్యాపార కేంద్రాలకు రంజాన్ షాపింగ్ సందడి
జగిత్యాల, జూన్ 18:ముస్లీంల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు అచరించే ఉపవాస దీక్షలను చేపడుతూ నిర్వహించే ప్రార్థనలను జిల్లాలోని ముస్లీంలు అత్యంత భక్తిశ్రద్దలతో కొనసాగిస్తున్నారు. ఈ మాసంలో ఉపవాస దీక్షలను అచరించే ముస్లీంలు మసీదుల్లో చేస్తున్న ప్రత్యేక ప్రార్థనలతో పట్టణంలోని ప్రధాన మసీదులు కిక్కిరిసిపోతున్నాయి. రంజాన్ మాసం గడువు సమీపిస్తుండగా ఉపవాస దీక్షలను అచరిస్తున్న అల్లా భక్తులు నిరాడంబరంగా పవిత్ర ప్రార్థనలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో మసీదుల వద్ద సందడిగా ఉంటుంది.
జిల్లా కేంద్రంలో హరీస్
గుమ గుమలు..!
ముస్లీంల పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వంటల కేంద్రాలు జిల్లా ప్రజలను ఎంతగానో ఆకర్శిస్తున్నాయి. ముఖ్యంగా ముస్లీంలు ఉపవాస ప్రార్థనల అనంతరం హరిస్ కేంద్రాల వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంటుంది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివిధ రంజాన్ వంటలతో ముస్లీంలతో పాటు చాల మంది యువకులు ఈ కేంద్రాలకు చేరుకుని రంజాన్ మాసం ప్రత్యేక వంటల రుచులను అస్వాదీస్తున్నారు. దీంతో అర్థరాత్రి వరకు రంగు రంగుల విద్యుత్తు దీపాలతో ఆలంకరించిన హరిస్ కేంద్రాలు భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ముస్లీం యువకులు అయితే గంటల కొద్ది హరిస్ కేంద్రాల వద్దే ఉంటూ ప్రత్యేక వంటల రుచును ఆరగిస్తున్నారు. రంజాన్ మాసం గడువు దగ్గర పడుతున్న కొద్ది కేవలం రంజాన్ మాసంలో మాత్రమే లభించే ఈ ప్రత్యేక వంటల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. దింతో ఎక్కడ లేని హడివిడిగా కొత్త బస్టాండ్ ప్రాంతంలో కన్పిస్తుంది.
వ్యాపార, వాణిజ్య కేంద్రాల వద్ద కొనుగోళ్ల తాకిడి ..
చాల మంది ముస్లీం కుటుంబాలు ఉద్యోగ, ఉపాది నిమిత్తం అరబ్ దేశాలకు వెల్లిన వారు కూడా జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. అయితే వారంత ప్రతి సంవత్సరం అత్యంత వేడుకగా నిర్వహించుకునే రంజాన్ పర్వదిన వేడుకలకు ఇళ్లకు చేరడం సంప్రదాయంగా వస్తుంది. దీంతో వారి కుటుంబాలు చేస్తున్న షాపింగ్‌తో ప్రముఖ వ్యాపార, వాణిజ్య కేంద్రమైన టవర్ సర్కిల్ వద్ద నగల దుకాణాల నుండి గాజులు ఇతర ఆలంకరణ వస్తు దుకాణాలు రంజాన్ పర్యదిన కొనుగోళ్లతో హడవిడగా కన్పిస్తున్నాయి. ఉదయం నుండే రంజాన్ షాపింగ్‌తో టవర్ సర్కిల్ వద్ద ముస్లీం కొనుగోళ్లతో కిక్కిరిసిపోతుంది. అలాగే కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లోనూ వ్యాపార, వాణిజ్య కేంద్రాల వద్ద సందడిగా ఉంటుంది.

అన్నదాన సత్రం తనిఖీ

వేములవాడ, జూన్ 18: రాజన్న ఆలయంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన సత్రాన్ని ఆదివారం ఇవో రాజేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. గోదాంలో సరుకుల లిస్టును,అన్నదానం జరిగే తీరును పరిశీలించారు. భక్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

ధర్మపురి క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ
ధర్మపురి, జూన్ 18: ధర్మపురి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్షేత్రంలోని వివిధ ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ధర్మపురి క్షేత్రంలో, విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది గోదావరీ స్నానము. అందు దక్షిణాభిముఖియై ప్రవహిస్తున్న గోదావరి పవిత్ర తీర్థములో సూర్యోదయాత్ పూర్వమే లేచి బ్రాహ్మీ ముహూర్తకాలంలో స్నాన, సంకల్ప, దానధర్మాది సత్కర్మను ఆచరించడం అనాదిగా వస్తున్న సదాచరణ. సెలవు దినమైన ఆదివారం, ధర్మపురి క్షేత్రం అశేష భక్తులతో నిండి పోయింది. ఉదయాత్పూర్వ స్నానాలు, దైవ దర్శనాలు, పూజాది కార్యక్రమాలను వేకువజామునే ఆచరించడం సనాతన సాంప్రదాయం కాగా, ప్రాచీన వంశపారంపర్య ఆచరణను అనుసరించి, సుదూర ప్రాంతాల నుండి వంశ పారంపర్య సనాతన ఆచార క్రమంలో, పిల్లాపాపలతో కూడి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలలో అరుదెంచి, సూర్యోదయం కాకముందే, అశేష భక్తులు పర్వదిన నదీస్నానం, దైవ దర్శనాలు చేసుకున్నారు. వేకువ జామునే ఆలయాల అర్చకులు వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో గోదావరినుండి పవిత్ర నదీ జలాలను తెచ్చి, స్థానిక దైవాలను గోదావరీ జలాలలతో అభిషేకించారు. ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల, యమ ధర్మరాజ, ప్రసన్నాంజనేయ, శ్రీరామలింగేశ్వరాలయాలలో ఉదయం పంచోపనిషత్‌యుక్త అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పూజలు, నిత్య కళ్యాణాది కార్యక్రమాలు, కళ్యాణ దాతల పేరున అర్చనలు, షోడశోపచార విధివిదాన పూజలు నిర్వహించగా, భక్తజనం ప్రత్యేక పూజాదికాలలో పాల్గొన్నారు. పవిత్ర గోదావరి నదీ జలాలలో మంగళ స్నానాలు ఆచరించిన అశేష భక్తులు నదీ పౌరోహితులచే సంకల్పాది, నదీ పూజలు చేయించుకుని, దానధర్మాల గావించారు. ముత్తయిదువలు మొంటెల వాయినాలను దానం చేసుకున్నారు. దేవస్థానం ఎసి,ఇఓ సుప్రియ, చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మకర్తల మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ సారథ్యంలో, అర్చక పౌరోహితులు సంతోష్ శర్మ, సంపత్ శర్మల సహకారంతో, సూపరింటెండెంట్ శ్రీనివాస్ నిర్వహణలో, ఆలయాల అర్చకులు పంచోపనిషత్ యుక్త వేదోక్త సాంప్రదాయ రీతిలో పూజలను నిర్వహించారు.

సినారెకు ఘన నివాళి
వేములవాడ, జూన్ 18: సినీ గేయ రచయిత కీ.శే.సి.నారాయణరెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఘన నివాళి అర్పించింది. పట్టణంలోని మెయిన్ రోడ్డు సినారె చిత్రపటానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహితీ మకుటంలో కలికితురాయి,తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకొనేటటువంటి గొప్పవ్యక్తి సినారె అని కొనియాడారు.సినారె స్మాక మ్యూజియంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా ట్యాంక్‌బండ్ పై సినారె కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసి భావితరాలకు గుర్తుండే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నామాల పోశెట్టి, గంజి జైపాల్‌రెడ్డి, పులి రవి, తదితరులు పాల్గొన్నారు.
సమాజ వికాసమే దేశాభివృద్ధికి పునాది
* టిటిఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు తిరుపతి రావు
సుల్తానాబాద్, జూన్ 18: సమాజ వికాసమే దేశాభివృద్ధికి పునాది అని టిటిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తానిపర్తి తిరుపతి రావు అన్నారు. ఆదివారం ఓదెల మండలం కనగర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కోలాట బృందాలకు కోలాట కిట్లు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తిరుపతి రావు మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాలకంటే మన దేశంలో యువత సంఖ్య అధికంగా ఉందని, యువశక్తితో భారత్ ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలోని యువతను దేశాభివృద్ధివైపు పయనించేలా సుక్షితులుగా తీర్చిదిద్దడమే తమ ఫౌండేషన్ లక్ష్యమన్నారు. సమాజంలోని నిరుపేదలు తోటివారికి తమవంతుగా చేయూత, సహాయ సహకారాలు అందించేందుకు గాను ఈ సంస్థను స్థాపించినట్లు తిరుపతి రావు పేర్కొన్నారు. తమ ఆశయ సాధనలో యువత, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ బాధ్యులు గర్రెపల్లి సతీష్ కుమార్, రాజేశం, భాస్కర్, సల్వాజి తిరుమల్ రావు, హరీష్, అభినవ్, సాయి, పలువురు పాల్గొన్నారు.
ఇళ్ల స్థలాల హద్దులు నిర్లక్ష్యంపై ఆందోళన చేస్తాం
* సిపియం కోప్పుల శంకర్
జమ్మికుంట, జూన్ 18: జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామంలోని 234 సర్వేనంబర్‌లో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి ఎడ్లు గడుస్తున్న, స్థలాలు చూపించలేదని అబ్దిదారుల కోసం దశాల వారిగా అందోళలు చేస్తామని సిపియం మండల కార్యదర్శి కోప్పుల శంకర్ అన్నారు. అదివారం జమ్మికుంట పట్టణంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా పట్టాలు పంపిణి చేశారన్నారు. రెవెన్యూ అధికారలు నిర్లక్ష్యం వహిస్తు లబ్దిదారులకు అన్యాయం చేస్తున్నారని అరోపించారు. ప్రభుత్వ ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటయించకుండా, ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపించాక,కాలయపన చేస్తున్నారని అరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన హమీలు మరచి, ప్రజలను మభ్యపెట్టి ఒట్లు దండుకొని మళ్ళి అధికారంలోకి రావాలని ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. పేదల కోసం అందోళనలు పార్టి అధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాడెడ్ల కష్టం ...
పశువుల కొరతతో ఖరీఫ్‌కు కష్టాలు
* పశువుల క్రయవిక్రయాలపై నిషేధం
* ఆందోళనలో అన్నదాతలు
వేములవాడ/వేములవాడరూరల్, జూన్ 18: అన్నదాతకు కాడెడ్లరూపంలో కొత్త కష్టమోచ్చింది.సకాలంలో పశువులను కొద్దామనుకుంటే అందుకు ని‘బంధ’నాలు అడ్డొస్తున్నాయి.పశువధ నిషేధంలో భాగంగా పశువుల అమ్మకాలు,కొనుగోళ్లును నిషేధిస్తూ ఇటీవలే కేంద్రప్రభుత్వం విధించిన నిబంధనలు అన్నదాతలకు అనుకొని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ నిబంధనలు ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నాయి.పశువుల కొరతతో సాగు పనులు ఆలస్యమవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.వర్షాకాలానికి ముందు రైతులు తమ పొలాలలో దుక్కిలు ,విత్తనాలు నాటేందుకు రైతులు ఆరోగ్యకరమైన కాడెడ్లను కొంటుంటారు. ఇదీలా ఉంటే ఇటీవల ఎడ్లు, ఆవుల క్రయవిక్రయాలపై కేంద్రప్రభుత్వం కఠనతరమైన నిబంధలను రూపొందించి అమలు చేయడంతో అంగడిలో పశువులను కొందామని పొతే కొరవి...అమ్ముదామంటే అడవిలా తయ్యారయ్యింది రైతుల పరిస్థితి ..దుస్థుతి. దీంతో పొలం పనులు సాగక..మరోవైపుఅదును మించిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కాడెద్దుగా మారిన కన్న కొడుకు...
సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన దారం మల్లేశం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో కాడెడ్లను కొద్దామని సంతకు వెళ్లాడు కానీ...అక్కడ సాగులకు అవసరమైన ఎడ్లు దొరకలే..జంతువధ నిషేధ చట్టం మూలంగా ఎడ్ల అమ్మకాలు అంతలేకపోవడం..అమ్మకాలు పూర్తి నిలియిపోయాయి. దీంతో మల్లేశం తన కన్నకొడుకును కాడెద్దుగా మారాడు. సైకిల్ హ్యాండితో ప్రత్యేకంగా గుంటకను మల్లేశం కుమారుడు ముందుండి లాగుతుంటే ..తండ్రి మల్లేశం గుంటకను పట్టుకొని తనకున్న ఎకరం భూమిని సేద్యం చేస్తుండటం కనిపించింది.

వైభవంగా పెద్దమ్మతల్లి బోనాలు
ఇబ్రహీంపట్నం, జూన్ 18: మండలంలోని వర్షకొండ గ్రామంలో ఆదివారం పెద్దమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలు బోనాలతో ర్యాలీగా వెల్లి గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాలతో అమ్మవారి నైవేద్యం సమర్పించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ పునుకంటి వెంకట్, ఎంపిటిసి వరలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌లో భారీ వర్షం
సుల్తానాబాద్, జూన్ 18: సుల్తానాబాద్‌లో భారీ వర్షం పడింది. ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పట్టణంలోని కొన్నిచోట్ల రహదారులపైనుండి నీరు వెళ్లింది. అలాగే మండలంలోని పలు గ్రామాల్లోను ఈ భారీ వర్షం పడటంతో రైతులకు ఊరట కలిగించింది. వ్యవసాయ పనులకు గాను సిద్ధమవుతున్నారు.

రైతాంగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
* టిడిపి రాష్ట్ర కార్యదర్శి సత్యం
గంగాధర, జూన్ 18 రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం విమర్శించారు. గంగాధరలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు గాను 76,314 క్వింటాళ్ల విత్తన ధాన్యం అవసరముండగా రైతులకు నామమాత్రం ధాన్యం అందించడంతో దళారులను ఆశ్రయించి ఎక్కువ ధరలకు నాణ్యత లేని విత్తనాలను కొనడం ద్వారా పంట దిగుబడులలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొనే ప్రమాదం నెలకొందన్నారు. సకాలంలో సబ్సిడీ విత్తనాలు అందించే ఏర్పాట్లు చేయడంలో వ్యవసాయ శాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. ముఖ్యమంత్రికి, వ్యవసాయ మంత్రికి, క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన లేకపోవడంతోనే రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు ముందు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి రుణ ప్రణాళిక ఖరారు చేయాల్సి ఉండగా, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఏప్రిల్ 12న 204 జిఓ ద్వారా రుణమాఫీ చివరి విడత నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారే గానీ, అట్టి రుణమాఫీ అందకపోవడం ద్వారా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని తద్వారా రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయడం ద్వారా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. గతంలో చేపట్టిన సమగ్ర సర్వే ద్వారా రైతులకు ఇచ్చే ఎకరాకు నాలుగు వేలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుండే రైతులకు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల మీద ప్రేమతో కాక రానున్న ఎన్నికల దృష్టితోనే రైతులకు వరాలు కురిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించకుంటే తహశీల్ కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ విలేఖరుల సమావేశంలో టిడిపి బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు వైద భూపతి, రామడుగు, గంగాధర పార్టీ అధ్యక్షులు అమిరిశెట్టి సుధాకర్, మల్కాపురం రాజేశం గౌడ్, బిసి సెల్ అధ్యక్షుడు వేముల ప్రసాద్, శ్రీపతి రావు, దొంతుల వేణుగోపాల్, పొన్నం తిరుపతి గౌడ్, పానగంటి సత్యం, కట్ల మురళి తదితరులు పాల్గొన్నారు.

ఊపందుకున్న వ్యవసాయ పనులు
కమాన్‌పూర్, జూన్ 18: కమాన్‌పూర్ మండలంలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇటీవలే భారీ వర్షాలు కురవడంతో కమాన్‌పూర్ మండలంలోని రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం పైనే ఆధార పడి జీవనం కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా గుండారం రిజర్వాయర్‌లోని నీరు గత సంవత్సరం నుంచి తీయక పోవడంతో రిజర్వాయర్ నీటి మట్ట యథావిధిగా ఉండడంతో రైతన్నలు రిజర్వాయర్ కింది పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే వ్యవసాయ బావుల వద్ద వరి మొలకలు వేశారు. పత్తుల కొరకు దుక్కిలు దునే్న పనుల్లో రైతన్నలు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. కమాన్‌పూర్ మండలంలో ఎక్కువ శాతం రైతులు వరి పంటతోపాటు పత్తి పంటను వేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడింది. వరుణుడు కరునిస్తే ఈ సారి కూడా గత సంవత్సరం లాగానే పంటలు పండుతాయని రైతన్నలు ఆశిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
* సుల్తానాబాద్ మండల విద్యాధికారి నర్సింగం
సుల్తానాబాద్, జూన్ 18: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే పంపించాలని మండల విద్యాధికారి ఆర్.నర్సింగం అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో బడిబాట ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సౌకర్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజలి, అనంత రెడ్డి, ఎంపిటిసి సంపత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
గంగాధర, జూన్ 18: గంగాధర ఎంపిటిసి పెర్క మల్లారెడ్డి మృతి చెందగా ఆయన కుటుంబాన్ని జగిత్యాల ఎమ్మెల్యే, సిఎల్‌పి ఉపనేత టి.జీవన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. రాజకీయంగా గంగాధర మండలంలో ప్రజలకు సేవలందించిన మల్లారెడ్డి మృతి మండల ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జీవన్ రెడ్డి వెంట గంగాధర, కొడిమ్యాల కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు రామిడి రాజిరెడ్డి, హన్మాండ్ల రవి, గంగాధర మాజీ ఎంపిపి పడితపల్లి కిషన్, కురిక్యాల ఎంపిటిసి అలువోజు నందయ్య, కాంగ్రెస్ నాయకులు చిప్ప చక్రపాణి తదితరులు ఉన్నారు.