తెలంగాణ

రైతు సర్వే గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: పంటల సాగు పెట్టుబడి కోసం వచ్చే ఏడాది నుంచి రబీ, ఖరీఫ్ రెండు సీజన్లకు కలిపి ఒక్కో ఎకరాకు రూ. 8 వేల చొప్పున నగదు చెల్లించడం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు సమగ్ర సర్వే గందరగోళంగా మారింది. ఒక్కో సీజన్‌కు నాలుగు వేల చొప్పున ప్రభుత్వం ఉచితంగా చెల్లించనుండటంతో ఇబ్బడి ముబ్బడిగా రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. రైతుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని, గడువులోగా ఈనెల 18 నాటికే 80 శాతం రైతులు దరఖాస్తు చేసుకున్నట్టు వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. మిగిలిన 20 శాతం మంది రైతులకూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష చొప్పున పంట రుణాలను మాఫీ చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో పెట్టుబడి డబ్బులు కూడా కచ్చితంగా వస్తాయన్న నమ్మకంతో సమగ్ర రైతు సర్వేకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. సమగ్ర రైతు సర్వేను సులభతరంగా ఉండటం కోసం ఒక పేజీ దరఖాస్తు ఫారాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిని స్వచ్ఛందంగా రైతులే తమకు ఎంత భూమి ఉందో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇందులో సర్వే నంబర్లతో సహా ఎంతెంత భూమి ఉందో వివరాలను పొందు పరుచడంతో పాటు, వాటికి సాగునీటి వసతి వర్షాధారితమా? చెరువు కాలువల ఆధారితమా? గొట్టపు బావి కానీ ప్రాజెక్టుల ఆధారితమా? అనే వివరాలను కూడా రైతులు పొందు పరుచాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల్లో రైతులు తమ ఆధార్ నంబర్‌ను కూడా పేర్కొనాల్సి ఉంది. ఇంత వరకు బాగానే ఉంది కానీ రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారని రెవిన్యూ రికార్డులు, సమగ్ర సర్వే ద్వారా తేలింది. అలాగే పంట రుణాల మాఫీ పొందిన 35 లక్షల మంది రైతులకు చెందిన ఆధార్ కార్డు నంబర్లను కూడా అనుసంధానం చేయడం వల్ల ఆ వివరాలు కూడా ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి. పంట రుణ మాఫీ పొందిన రైతులు కాకుండా రుణ మాఫీ పొందని రైతులు కూడా రాష్ట్రంలో మరో 20 లక్షల మంది ఉన్నారు. వీరు కొత్తగా ప్రభుత్వం ఉచితంగా అందజేయబోయే పెట్టుబడి కోసం దరఖాస్తు చేసుకునే పక్షంలో వీరి ఆధార్ నంబర్లు కూడా ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయి. కేవలం ఆధార్ నంబర్ల అనుసంధానం ఆధారంగా రైతులకు ఉచితంగా పెట్టుబడి చెల్లించడం వల్ల అనేక అవకతవకలు జరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహణలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు అభిప్రాయపడుతున్నారు. పంట పొలాలపై వ్యవసాయశాఖ వద్ద కచ్చితమైన రికార్డులు లేవు. భూ రికార్డులు రెవిన్యూ శాఖ వద్ద, వాటి క్రయ విక్రయ వివరాలు రిజిస్ట్రేషన్స్ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయి. సమగ్ర రైతు సర్వే దరఖాస్తులలో రైతులు స్వచ్ఛందంగా వెల్లడించిన సమాచారాన్ని రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ శాఖల వద్ద ఉన్న సమాచారంతో సరిచూసుకుంటే తప్ప వీటిని ధ్రువీకరించుకోలేని పరిస్థితి.
రైతులు తమ భూములు ఇతరులకు విక్రయించిన సమాచారాన్ని చాలా మటుకు రెవిన్యూ కార్యాలయాలలో అబ్‌డైట్ చేసుకోలేదు. అప్‌డెట్ చేసుకోకపోవడానికి కూడా మరో కారణం ఉంది. పంట రుణ మాఫీ కోసం గత మూడు సంవత్సరాలుగా రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకులలోనే ఉండిపోయాయి. ఈ కారణంగా ఈ మధ్యకాలంలో జరిగిన భూ క్రయ విక్రయాల వివరాలు పట్టాదారు పాసు పుస్తకాలలో నమోదు కాలేదు. దీని వల్ల సమగ్ర రైతు సర్వే కోసం రైతులు సమర్పించిన దరఖాస్తులలో పాత పత్రాలే ఉన్నాయి. భూములు కొనుగోలు చేసిన వారు తమ వద్ద ఉన్న సమాచారంతో, వాటిని అమ్మిన వారు తమ వద్ద పత్రాల ఆధారంగా దరఖాస్తులు చేసుకోవడం వల్ల ఒకే భూమికి రెండేసి దరఖాస్తులు అందడంతో వ్యవసాయశాఖ గందరగోళంలో పడింది. వీటిని సరి చూసుకునే వ్యవస్థ వ్యవసాయశాఖ వద్ద లేకపోవడం వల్ల సమగ్ర రైతు సకల తప్పుల తడక సర్వేగా మారే అవకాశాలు లేకపోలేదని క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్న వ్యవసాయశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.