సబ్ ఫీచర్

సరికొత్త స్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడంతస్థుల మేడకయినా పునాది నేలమీదే ఉండాలి. అదే భవంతికి బలం! అంతెత్తున పెద్దగా ఎదిగి ఎంత బలాన్నిచ్చే ఆహారాన్ని మనిషి తింటున్నా అడ్డాలనాడు అమ్మదగ్గర తాగిన పాలు ఇచ్చే బలం, రోగ నిరోధక శక్తి సాటిలేనివి. వీటన్నిటిలాగే మన సంప్రదాయం కూడా..! శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం ఎంత అభవృద్ధిని, ప్రగతిని సాధించినా. తరతరాలుగా వస్తూ మన నరనరాల్లో జీర్ణించుకొనిపోయిన సంప్రదాయం మనమీద ప్రభావం చూపిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. వేదభూమి, కర్మభూమి అని పిలవబడే మన భారతదేశానికి ఒక ప్రత్యేకమయిన సంస్కృతీ సంప్రదాయాలు.. ఆచార వ్యవహారాలూ ఉన్నాయి.. అవి ఖండాంతర ఖ్యాతిని పొంది వున్నాయి. అందుకే ఈ అల్ట్రామోడ్రన్ కాలంలోనూ మన దేశ వాసులంతా ఒక పక్క ఆధునికంగా ఉంటూనే.. మరోపక్క సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.
భారతీయ మహిళకు తన దేశపు కట్టూ బొట్టూ, ఇల్లాలితనం, అమ్మతనం అంటే ఎనలేని మక్కువ. ఇక్కడ ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. ఏ దేశమేగినా ఎందు కాలిడినా భారత స్ర్తి తన ముద్రను వేయకుండా ఉండదు. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు కంఫర్ట్‌బుల్‌గా ఉండటం కోసమో.. చేస్తున్న పనిని బట్టో మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నా.. ఇంటికి రాగానే నూలు చీరలోకి మారిపోతుంది. పండగలు పబ్బాలు, నోములు.. వ్రతాలు.. పెళ్లీ పేరంటాలకు పట్టెడంత జరీ ఉన్న పట్టుచీర కట్టాల్సిందే.. కుంకుమబొట్టు పెట్టాల్సిందే.. తలలో పూలు తురమాల్సిందే! కలర్‌ఫుల్‌గా కళకళలాడుతూ. నిండుదనంతో హుందాగా ఉండటం అంటే ఈ దేశపు గడ్డమీద పుట్టిన ఆడవాళ్ళకు ఎంత ఇష్టమో వాళ్ళ వంక ఒక్కసారి ఆపాదమస్తకం చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
ఆధునిక యువతికి సైతం సంప్రదాయబద్ధమైన అలంకరణ అంటే చాలా ఇష్టమని చెప్పటానికి తార్కాణంగా ఇప్పుడు మార్కెట్‌లో లేటెస్టుగా ట్రెండ్‌గా, ఫ్యాషన్‌గా మారిన చేనేత పట్టుచీరలు, యాంటిక్ మరియు టెంపుల్ జ్యువలరీ.. ఇవి చాలు.. ఇప్పుడు! స్ర్తిలు వాటిని విరివిగా కొంటున్నారు. ప్రత్యేక దినాలలో వాటిని ధరించి ముస్తాబవుతున్నారు. అంతేకాదు, గృహోపకరణాలను కూడా యాంటిక్ సామాన్లతో, ఫర్నీచర్‌తో నింపి గ్రామీణ వాతావరణాన్ని మళ్లీ కళ్ళమందు నిలుపుతున్నారు. వర్కింగ్ డేస్‌లో టైమ్ లేక మిక్సీలో పచ్చడి తిప్పినా.. హాలీడే రోజు రోట్లో పచ్చడి నూరి రుచిగా వండి, వడ్డించడానికి ఇష్టపడుతున్నారు. మార్కెటంతా సర్వే చేసి వెతికి వెతికి సేంద్రియ ఎరువులు వాడి పండించిన బియ్యం, పప్పులను, కూరగాయలను నెలకూ, వారానికీ సరిపడా తెచ్చి ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేటి మహిళ చదువుకున్నదీ.. తెలివైనదీ.. చురుకైనదీ కావటం వల్ల డైలీ పేపర్లు చదివి ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవటం.. నెట్‌లోకి వెళ్లి ఎక్కడ ఏం దొరుకుతాయో సర్వే చేయగలగటం ఆమెకు సాధ్యమవుతోంది. ఎదిగిన ఆమె మనసు సహజసిద్ధతలోని స్వచ్ఛతను.. సంప్రదాయ పద్ధతులలోని ఆరోగ్య సూత్రాలను ఇట్టే గ్రహించగలుగుతోంది. తిరోగమనంలోనే పురోగమనం వుందని తెలుసుకుని రైతుబజార్లకు, జనరిక్ మెడికల్ షాపులకు, యోగా సెంటర్లకు వడివడిగా అడుగులు వేస్తున్నది. అందుకే అన్నారు- ‘ఇల్లాలు చదువుకున్నదయితే.. ఇల్లంతా ఆ విజ్ఞాన కాంతులతో వెలిగిపోతుందని..!’
ఇల్లాలుగా, తల్లిగా, కోడలిగా, ఉద్యోగినిగా బహుముఖ పాత్రలను సమర్థవంతంగా నిర్వహించుకుంటూపోయే ఆధునిక మహిళ అహంకారి కాదు.. బాధ్యతలనుంచి తప్పించుకోవాలనే స్వార్థపూరిత మనస్తత్వం కలది అస్సలు కాదు. ఇంట్లో వున్నప్పుడు చీపురు పట్టుకుని ఇల్లూడుస్తుంది. బయటికి వెళ్లినపుడు స్టీరింగ్ తిప్పుతూ కారు డ్రైవ్ చేస్తుంది. వంటింట్లో గరిట తిప్పుతూ అన్నం వండిన చేత్తోనే ఆఫీసులో కంప్యూటర్ కీబోర్డుమీద వేళ్లు కదిలించి వర్క్ చేస్తుంది. భర్తకు కూర్చున్న చోటుకు అన్నీ అందించి సేవ చేసిన ఆ మనిషే ఆఫీసులో తన కింది ఉద్యోగుల చేత బండచాకిరీ చేయిస్తుంది. ఆ ద్విపాత్రల పోషణ ఆడదై పుట్టినప్పటినుంచే జన్మతః ఆమెకు అబ్బిన విద్య.. అంతేకాదు ఓపికను, ఓర్మిని, పని నైపుణ్యాన్ని, త్యాగగుణాన్నీ కష్టపడే తత్వాన్ని వీటన్నింటిని కూడా ఆమె పుడుతూనే వెంట తెచ్చుకుంది. కాలం తెచ్చిన కొత్త మార్పువల్ల విద్యావతి అయినా.. ఉద్యోగస్థురాలైనా.. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆరితేరినా ఆమెలోని స్ర్తిత్వం మాత్రం చెక్కుచెదరలేదు. అందుకే ఆమె పాత కొత్తల మేలు కలయికతో ఓ సరికొత్త ఆధునిక మహిళగా రాణించగలుగుతోంది.

కేవలం కట్టూ బొట్టూ.. పైపైఅలంకరణలోనే కాదు.. ఆధునిక మహిళ వ్యక్తిత్వం కూడా పాత కొత్తల మేలు కలయికే..! ఈ సమాజంలో చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేసే అడవాళ్ళమీద ఒక అపప్రథ ఉంది.. వాళ్ళకు అహంకారం ఉంటుందనీ.. ఇల్లు, వాకిలి, కుటుంబ సభ్యులను పట్టించుకోరనీ.. ఇలా! కానీ అది నిజం కాదని ఒక వర్కింగ్ ఉమెన్ దైనందిన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆర్థిక అవసరాలకోసమో.. తన చదువును, జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగించాలనో స్ర్తి బయటికి వెళ్లి.. ఆఫీసులో ఉద్యోగం చేసినా.. ఆమె మనసులో అస్తమానం ఇల్లు మెదులుతూనే ఉంటుంది. ఇంటికెళ్లి చేయాల్సిన పనులు గుర్తుకువస్తూనే ఉంటాయి. డేకేర్ సెంటర్‌లోనో, పనిపిల్ల దగ్గరో వదిలేసి వచ్చిన పాలు తాగే పసివాడు తలపునకు వచ్చీరాగానే అమ్మతనం నిండిపోయిన ఆ గుండె వాత్సల్యాన్ని వర్షిస్తుంది. ఇంకా వృద్ధాప్యంతో బాధపడుతూ అడుగు తీసి అడుగెయ్యలేక ఆధారం కోసం ఎదురుచూసే అమ్మా నాన్నలో, అత్తమామలో కళ్ళల్లో మెదిలి మనసు బాధతో, జాలితో నిండిపోతుంది.

- డా కోఠారి వాణీచలపతిరావు