సబ్ ఫీచర్

చీరలు కొనడానికి వెళ్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగ వస్తుందంటే చాలు గుండె గుభిల్లుమంటుంది. పండుగ లేకపోయినా చీరలు కొనమని ఆషాఢం ఆహ్వానిస్తుంది. వెన్నంటే వస్తుంది శ్రావణం. ధరల తగ్గింపుల ప్రకటనలు ఊరిస్తాయి. కొనమని మనసు పోరు పెడుతుంది. అందరిదీ ఇదే ధోరణి కాకపోయినా ఎందరో మహిళలు చీర షాపింగ్ అనగానే సంబరపడిపోతారు. అపార్ట్‌మెంట్‌లో వార్త, చానెళ్లకన్నా వేగవంతం. అపార్ట్‌మెంట్ స్నేహితురాళ్ల ఫోనందుకుని చీరల షాపు పేరు, అక్కడ (కారుచౌకగా) దొరికే రకరకాల చీరల గురించి సెల్‌ఫోన్‌లో అరగంట మాట్లాడి విషయాలను సేకరించి షాపుల వేటలో పడతారు. ఈ కోవకే చెందింది మా ప్రభ. ఉదయమే ఫోను చేసింది షాపింగ్‌కు వెళ్లాలి, తయారుగా ఉండు అని. అనుకున్న సమయానికి అరగంట ముందే ప్రత్యక్షం. పండుగ లేకపోయినా గుండె గుభిల్లుమంది. ప్రభ చేతిలో బిగ్ షాప్ బ్యాగ్, దాని నిండా జాకెట్ ముక్కలు! టైలరు దగ్గరికా? అని అనుమానంగా అడిగా. కాదు మ్యాచింగ్‌కు అంది. పెట్టీకోట్స్‌కు అనుకున్నా. కాదు మ్యాచింగ్ చీరలు కావాలి. జాకెట్ ముక్కలు వృధాగా పడున్నాయి. మళ్లీ జాకెట్ ముక్కకు డబ్బు దండగ కదా. తానెంత పొదుపరో అన్నట్టు చెప్పింది.
ఇలా వీటిని వెంట వేసుకుని తిరగడం అవసరమా అన్నాను. అదేవిటీ అలా అంటావు. ఎన్ని పెళ్లిళ్ళు, ఎన్ని ఫంక్షన్లున్నాయి, తెలియనట్టు అడుగుతావేం? అని కొంచెం విసుగ్గానే అంది. పుస్తకాలు కొనడంలో ఉండే శ్రద్ధ చీరలు కొనడంలో లేదని, చీరల ధరలు గుర్తుపెట్టుకోనని, మార్కెట్‌ను ముంచెత్తుతున్న రకరకాల చీరల పేర్లను పట్టించుకోనని నాపై అందరికీ ఫిర్యాదుల వెల్లువ. నవ్వి ఊరుకోవడమే నా పని.
రండమ్మా, చాలా రోజులకొచ్చారే అంటూ ప్రభనుసంతోషంగా పలకరిస్తూ మీకేం కావాలి అన్నట్లు చూసాడు. నాకు తోడుగా వచ్చార్లే, ఏం వచ్చాయి కొత్త వెరైటీలు అని అడగడం ఆలస్యం- ఉప్పాడ నుండి మంగళగిరిదాకా, కంజివరం నుండి ధర్మవరం దాకా సాగింది చీరల ప్రయాణం. ఇన్ని రకాలా అని తెల్లబోయి చూస్తున్న నన్ను, ఏమైనా కొంటావా? అంది. నువ్వు తీసుకో, నాకేం వద్దు అంటూ సేల్స్‌మాన్ వాక్చాతుర్యాన్ని అబ్బురంగా గమనించసాగాను. బాబూ, ఆ పైన మూడో వరసలో చివరిది.. తీసి ఇచ్చాడు. అబ్బే, ఆ రంగు సరిపోలేదు బ్యాగులోకి తొంగి చూస్తూ అంది. ఆ క్రింది వరుసలో పైనుండి నాలుగవది.. అదీ వచ్చింది. అయ్యో, పైట మరీ తేలిపోయింది కదూ. ఉలిక్కిపడి ఆ.. ఆ... ఊఊ అంటుంటే కాస్త నువ్వూ చూడు, తొందరగా తెమలవచ్చు అంది. అప్పటికే గంట దాటింది. ఎలాగైనా కనీసం మరో గంట చీరలను చూస్తూ ఆనందిస్తూ గడిపేస్తుంది. చీరలు లాగి లాగి షాపువాడి చేతులు లాగుతున్నాయేమో, ఇటువేపు రండమ్మా.. మీకు నచ్చినది ఎంచుకోండి అన్నాడు. సీను మారినా చీర సెలెక్టు కాలేదు. కొత్త స్టాక్ వచ్చాక వస్తాను, ఇవన్నీ పాత సరుకే అని పెదవి విరిచేసింది. అలాగేనండి, తప్పకరండి అంటూ ఏడవలేక ఓ నవ్వు నవ్వాడు. ఈ పరిస్థితి షాపు వాళ్లకు చర్వితచరణమే. అయితే అది వారి వృత్తిలో భాగమే. వ్యాపారాభివృద్ధికి కష్టపడక తప్పదని చెప్పాకే యాజమాన్యం పని అప్పజెప్తుంది. అయితే ఈ చీరల షాపింగ్‌ను ఇలా కొనసాగించే బదులు ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంభిస్తే కాలహరణాన్ని అరికట్టవచ్చు. చీరలు కావాలనుకున్నపుడు సందర్భం ముఖ్యం. వివిధ సందర్భాలలో భిన్న రీతిలో ధరించే వస్త్రాల గురించి చిన్నప్పటినుండే అవగాహన ఏర్పడుతుంది.
వీలునిబట్టి అంటే కొనే వీలునిబట్టి ధర మనసులో నిర్ణయమయిపోవాలి. ఆపైన రంగు నెంచుకోవాలి. తరువాత పట్టువస్త్రాలా, నూలు చీరలా లేక సింథటిక్ చీరలా అని నిర్ణయించుకున్నాక కాలాన్ని కేటాయించుకోవాలి. ఇతరుల సహాయం తీసుకోవడం మంచిదే కాని వారి కాలాన్ని మనం హరించకూడదన్నది గుర్తుంచుకోవాలి. షాపులోకి వెళ్లీ వెళ్లగానే కాఫీలు, శీతల పానీయాలను కోరడం, చీరలను చూస్తూనే వాటిని సేవిస్తూ షాపు వాళ్లను ఇబ్బందికి గురిచేయడం సాధారణ దృశ్యంగా కనబడుతుంది.
కాని ఇలాంటి చిన్న విషయాలలో హుందాతనాన్ని కోల్పోకూడదు. ఒక్క చీర కొనడానికి లేదా ఏ మ్యాచింగ్ నెపమో చెప్పి షాపింగ్ చేసి చీరలు కొనాలని లేకపోయినా పొద్దుగడపడానికి ఇదొక పద్ధతిగా ఎంచుకోవడం వాంఛితం కాదు.
మనల్ని మనం మరచిపోయి పసిపిల్లల్లా షాపింగ్ మాయాజాలంలో ఇరుక్కుపోయి ఇంటిని, ఇంటిలోని పిల్లలను, పెద్దలను మరచిపోయి షాపులన్నింటిని చుట్టబెడుతుంటే మీ వెంట వచ్చినవారికే కాక, మీకు కూడా విసుగు, నీరసం వచ్చేస్తుంది. చీరలను కొనడం బలహీనతగా కాక బలమైన కారణాన్ని కూడా చూపగలగాలి. పెళ్లి, పుట్టినరోజు, నోములు వంటివాటికి తగినంత ప్రణాళికతో శ్రీకారం చుట్టాలి. వెచ్చించాలనుకున్న డబ్బు, రంగు, వాటి మన్నిక వంటివి ముందుగానే ఆలోచించుకోవాలి. అప్పుడిక కాలమే కాదు డబ్బు కూడా మన మాట వింటుంది.

- సి.ఉమాదేవి