ప్రకాశం

దళితుల భూముల్లో కుంట తవ్వటాన్ని నిరసిస్తూ రాస్తారాకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 21 : దేవరపల్లి దళితుల భూముల్లో పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు చెరువు తవ్వటాన్ని నిరసిస్తూ వామపక్షాలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఆర్‌టిసి బస్టాండు గేటు వద్ద రాస్తారాకో నిర్వహించారు. 40 నిమిషాల పాటు ఒంగోలు ఆర్‌టిసి గేటువద్ద నాయకులు, కార్యకర్తల బైఠాయింపుతో బస్టాండు నుండి బయటకు వచ్చే ఆర్‌టిసి బస్సులు నిలిచిపోయాయి. రాస్తారాకోకు పిలుపునిచ్చిన నేపధ్యంలో పోలీసులు భారీగా సాగర్ హోటల్ సెంటరు వద్ద మోహరించారు. పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి, ప్రభుత్వ వైఖరిని, పోలీసుల నియంతృత్వ చర్యలను నిరసిస్తూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రాస్తారాకోతో పోలీసులు కర్నూలురోడ్డుపై ట్రాఫిక్‌సిగ్నల్స్‌ను నిలిపివేసి ట్రాఫిక్‌ను కంట్రోలు చేశారు. 40నిమిషాల తరువాత రాస్తారాకోను విరమించకపోవటంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేశారు. అరెస్టుల్లో పోలీసులకు అఖిలపక్ష పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నాయకులు, కార్యకర్తలను తీసుకెళ్లి పోలీసువ్యానులో ఎక్కించారు. 30మందిని అరెస్టుచేసి ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుస్టేషన్‌కు తరలించినవారిలో సిపిఎం జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సిపిఐ జిల్లాకార్యదర్శి కె అరుణ, సిపిఐఎంఎల్ జిల్లానాయకురాలు లలితకుమారి, సిపిఐఎంఎల్ న్యూమోక్రసీ జిల్లాకార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌పార్టీ జిల్లాఅధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు కఠారి శంకర్, ఒపిడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ సుధాకర్, సిపిఎం జిల్లానేతలు జివి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, పివి శేషయ్య, పి కొండయ్య, అనిల్, బాలకోటయ్య, రఘురాం, సుధాకర్, జి రమేష్, దామా శ్రీనివాసులు, టి శ్రీనివాసులు, ఏ శ్రీనివాసరావు, కె రమాదేవి, సిహెచ్ రమాదేవి, హుస్సేన్, శ్రీరాం శ్రీనివాస్‌రావు, సిపిఐ జిల్లానాయకులు యు ప్రకాశరావు, పివిఆర్ చౌదరి, ఎస్‌డి సర్దార్, హనుమారెడ్డి, కె సుబ్బారావు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పద్మ, రాజశేఖర్, అరుణోదయ అంజయ్య, కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, నాయకులు యాదాల రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ దేవరపల్లి దళితుల భూముల్లో తవ్విన కుంటను పూడ్చి దళితులకు అప్పగించేవరకు ఈపోరాటం ఆగదని అవసరమైతే తామే కుంటపూడ్చి తామే అప్పగిస్తామన్నారు. దళితుల భూములను అక్రమంగా, దౌర్జన్యంగా, నిర్బంధాలతో కుంట తవ్వటం అమానూషచర్య అన్నారు. ప్రభుత్వం దళితుల భూములను లాక్కుంటూ తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు. పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు దళితుల భూములనే టార్గెట్‌చేసి నీరు-చెట్టుపేరుతో కుంటతవ్వుతున్నారని విమర్శించారు.దళితుల భూముల్లో మట్టిని అమ్ముకోవటం సిగ్గు చేటన్నారు.దళితులను చెదరగొట్టి భూములను స్వాధీనం చేసుకోవాలనుకోవటం సిగ్గుచేటాన్నారు. సుమారు 70సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కోని కుంట తవ్వటం వారికి ఉపాధిలేకుండా చేయటం అన్యామన్నారు. ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూముల్లో కుంటను తవ్వటం దుర్మార్గమన్నారు. 1970లో ఆనాటి ప్రభుత్వం దళితులకు ఈ భూమి ఇచ్చిందన్నారు. అప్పటినుండి దళితులు ఈ భూముల్లో సాగుచేసుకుంటున్నారన్నారు. 2000సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈభూములను లాక్కొనునేందుకు ప్రయత్నం చేశారన్నారు. తిరిగి ప్రస్తుతం ఆ భూములను లాక్కొని కుంట తవ్వుతున్నారన్నారు. ఇప్పటికైనా దళితుల భూములను దళితులకే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో దళితులకు అండగా ఉండి ఆభూములు వారికి చెందేవిధంగా పోరాటాలు చేస్తామన్నారు.

దేవరపల్లిలో దళితులకు అండగా ఉంటాం
పర్చూరు, జూలై 21: దేవరపల్లిలోని దళితులకు వారి భూములు దక్కే వరకు పోరాటం చేస్తామని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపితో పాటు వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసురెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ వైకాపా అధ్యక్షుడు ఎన్ నాగార్జున, నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త గొట్టిపాటి భరత్ దేవరపల్లిలో భూములు కోల్పోయిన దళిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ దళిత భూములలో కుంటలు తవ్వి టిడిపి ప్రభుత్వం వారి జీవనోపాధిపై దెబ్బతీసిందని విమర్శించారు. దళితులకు అండగా ఉంటామన్నారు. భూములను కాపాడతామని చెప్పారు. న్యాయపోరాటం చేస్తామన్నారు. దళిత రైతుల తరపున హైకోర్టులో పిటీషిన్ దాఖలు చేస్తామని చెప్పారు. దళితుల సమస్యను జాతీయ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కఠారియా దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ సందర్భంగా కఠారియా కలెక్టర్‌ను పిలిపించి, దళిత భూములపై విచారణ చేయిస్తానని చెప్పారని తెలిపారు. అవసరమైతే ఢిల్లీ నుండి తమ టీంను పంపించి, విచారణ చేపడతామని చెప్పినట్లు తెలిపారు. అదేవిధంగా మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా ముఖ్యంగా మాలలు, మాదిగలపై టిడిపి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తూ.. ఒంటెద్దు పోగడలు పోతుందని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో దళితులు చాలా కష్టాలు అనుభవిస్తుందని చెప్పారు. తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసురెడ్డి మాట్లాడుతూ దేవరపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు తమ భూములు తవ్వుతున్నారని, తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తాము దేవరపల్లి రావటానికి ప్రయత్నిస్తే పోలీసులు తనను గృహనిర్భంధం చేసారన్నారు. ప్రభుత్వం చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయని విమర్శించారు. తమ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి దళితుల భూ సమస్యను వివరించామన్నారు. తమ అధ్యక్షులు దేవరపల్లి గ్రామం వెళ్లి పరిస్థితులు తెలుసుకోవాలని చెప్పారని తెలిపారు. తమ పార్టీ తరపున దళితులకు భూములు అప్పచెప్పే వరకు పోరాటం చేస్తామని అవసరమైతే తమ అధ్యక్షులు దేవరపల్లికి కూడా వస్తారని చెప్పారు. బాధిత రైతులు అధైర్యపడకుండా భరోసా కల్పించి, తమకు అండగా ఉండాలని తమ నాయకుడు చెప్పారన్నారు. రాబోయే కాలంలో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూములు మీకు అప్పగిస్తామని తెలిపారు.
వైకాపా నాయకుల వద్ద గోడు వెళ్లగక్కిన దళితులు
దేవరపల్లిలో దళిత భూములను పరిశీలించటానికి వారిని పరామర్శించటానికిశుక్రవారం వచ్చిన వైకాపా నాయకుల వద్ద ఆ గ్రామానికి చెందిన బాధిత రైతులు తమ గోడును వెల్లబుచ్చారు. గత నెల రోజుల నుండి తమ గ్రామంలో పోలీసులు పహారా కాస్తున్నారని చెప్పారు. 144సెక్షన్ , 30 యాక్ట్ చట్టం అమలులో ఉందంటూ పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. గ్రామంలో రెండు చెరువులు తాగునీటి అవసరాలకు ఉన్నప్పటికీ మరో చెరువు తవ్వాలని, తమ భూములను బలవంతంగా లాక్కొని జీవనోపాధి దెబ్బతీసారని చెప్పారు. ఎమ్మెల్యే ఏలూరికి కుల వివక్షత ఉందని అన్నారు. మాల, మాదిగలకే 144సెక్షన్, 30యాక్ట్ చట్టం అని ప్రశ్నించారు. భూములు తవ్వి మట్టిని తోలు తుంటే ఒక్క పోలీసు కూడా వారిని అరెస్టు చేయలేదని చెప్పారు. గ్రామంలో ఇంత పోలీసు ప్రొటెక్షన్ అవసరమా అని అన్నారు. గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు మీతో 2నిమిషాలు కూడా మాట్లాడటం అనవసర మని అన్నారు. చెరువులు తవ్వాల్సిందేనని చెప్పినట్లు తెలిపారు. ఎలెక్షన్ లో రాత్రనక, పగలకు అధికార పార్టీకి పనిచేసినా.... చివరికి తమ భూములనే లాక్కునారని వాపోయారు. రూ. 50వేలు కూడా ఖర్చుచేయలేని మీరు.... మీ భూములు మీకెందుకులే వదిలివేయమని అగ్రవర్ణాల వారు హేళన చేశారన్నారు. రాష్ట్ర వైకాపా ఎస్సీ సెల్ ఛైర్మన్ ఎన్ నాగార్జున మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే దళితులపై దాడులు జరుగుతాయన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌తోనే దళితులకు మంచి రోజులు వస్తాయన్నారు.
పర్చూరులో రాస్తారోకో
దేవరపల్లిలోని దళితులు సాగుచేసుకు టున్న భూములలో కుంటలు తవ్వటాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం స్థానిక బొమ్మల సెంటర్‌లో సిపిఎం, సిఐటియు, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి, దళితుల భూములను దళితులకు అప్పచెప్పాలని నినాదాలు చేశారు. బలవంతంగా భూములను లాక్కోవటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనమన్నారు. దళితులకు న్యాయం చేయాలని కోరారు. సుమారు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కె రామకోటేశ్వరరావు, ప్రభుదాసు, పి రవి, భాస్కర్‌రావు, దళిత రైతులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ విద్యను కార్పొరేట్ విద్యతో సమానం చేస్తాం
గిద్దలూరు, జూలై 21: రాష్ట్రంలో అంగన్‌వాడీ విద్యను కార్పొరేట్ విద్యతో సమానంగా పునాది స్థాయి నుంచే మంచి ఫౌండేషన్ వేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందుకోసం అధిక నిధులు మంజూరు చేస్తున్నారని మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం గిద్దలూరులోని వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోగల ప్రీ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీలు ఉన్నాయని, అందులో 7500 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో 3500 ప్రీ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. ప్రీ అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ, యుకెజి, ఎల్‌కెజిలు ఉంటాయని, నాలుగు పాఠ్యపుస్తకాలు ఉంటాయని పేర్కొన్నారు. గతంలో ఈ అంగన్‌వాడీ కేంద్రాలు ఒకే టీచర్, ఒకే గదిలో ఉండేవని, ఆ విధానాన్ని మార్చి ఆడియో, వీడియో ద్వారా పిల్లలకు ఇంగ్లీష్‌లో రేయమ్స్ నేర్పబడతాయని తెలిపారు. ప్రప్రథమంగా నెల్లూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఈ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ ఈ కేంద్రాలకు మంచి స్పందన వచ్చిందని, దాంతో ఈకేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పూర్తిస్థాయిలో ఈ అంగన్‌వాడీ కేంద్రాలను నారాయణ విద్యాసంస్థలతో సమానంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. నర్సరీ నుంచి యుకెజి, ఎల్‌కెజిలకు ఒక్కొక్క ఉపాధ్యాయురాలు ఉంటారని, అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను దశలవారీగా ప్రీ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీకి ఇప్పటికే 11.50 కోట్ల రూపాయల నిధులను మంత్రి మంజూరు చేశారని, దాంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపాలిటీలో చేపట్టినట్లు తెలిపారు. ఆగస్టు నాటికి మున్సిపాలిటీలోని ప్రధాన వీధులను ఆధునీకరిస్తామని, కాశీనాయన కుంటను కూడా ఆధునీకరించి సుందరమైన పార్కును తీర్చిదిద్దేందుకు మంత్రి దృష్టికి తీసుకువెళ్ళామని, అందుకు 50లక్షల రూపాయలు ఆయన మంజూరు చేసేందుకు సానుకూలంగా స్పందించారన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి కె వంశీధరరెడ్డి, కమిషనర్ కృష్ణమూర్తి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు అన్నపూర్ణ, జన్నమ్మ ఉన్నారు.
ప్రీ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి
శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన ప్రీ అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి నారాయణ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రంలో నూతనంగా వేసిన బొమ్మలను పరిశీలించారు. సూపర్‌వైజర్లు జన్నమ్మ, అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్లను అంగన్‌వాడీ కేంద్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని వౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండరాదని, ఈసారికి ఆ సంఖ్యను పెంచాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
విదేశీపర్యటన ముగించుకుని జిల్లాకు విచ్చేసిన మాగుంటకు ఘన స్వాగతం
ఒంగోలు,జూలై 21:తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, జిల్లాశాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి తన విదేశీ పర్యటన ముగించుకుని జిల్లాకేంద్రమైన ఒంగోలుకు విచ్చేసిన సందర్భంగా ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి శుక్రవారం ఘన స్వాగతం పలికారు. స్థానిక రైల్వేస్టేషన్‌లో ఆయనకు తెలుగుదేశంపార్టీ నాయకులు తాతా ప్రసాదు, అయినాబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యంతోపాటు తదితరులు భారీగా తరలివచ్చి మాగుంటకు స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్‌లో మాగుంట జిందాబాద్ అంటూ మార్మోగిపోయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా సుదీర్ఘకాలంగా అమెరికాతోపాటు ఇతరదేశాల్లో మాగుంట పర్యటన చేశారు. ఈ నేపధ్యంలో ఆయన్ను కలుసుకునేందుకు అభిమానులు భారీగా కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా మాగుంట అభిమానులు భారీగా కేక్‌ను తీసుకువచ్చి ఆయన చేత కట్ చేయించారు. అదేవిధంగా మాగుంటకు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లాతెలుగుమహిళలు టి అరుణ, తమ్మినేని మాధవి, నాళం నారసమ్మ తదితరులు ఉన్నారు. చాలారోజుల తరువాత జిల్లాకేంద్రమైన ఒంగోలుకు మాగుంట రావటంతో జిల్లాలోని అన్నినియోజకవర్గాలనుండి మాగుంట అభిమానులు భారీగా తరలివచ్చి పలు సమస్యలను విన్నవించారు. వెంటనే ఆ సమస్యలను పరిష్కరించేవిధంగా మాగుంట చర్యలు చేపట్టారు. మాగుంట కార్యాలయం తెలుగుతమ్ముళ్లతో మాగుంట రాకతో కళకళలాడిందనే చెప్పవచ్చు

వనం-మనం కార్యక్రమం కింద 20 లక్షల మొక్కలు నాటాలి
ఒంగోలు, జూలై 21 : జిల్లాలో వనం - మనం కార్యక్రమాన్ని ఉద్యమస్ఫూర్తితో 20 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వనం మనం కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ వనం -మనం కార్యక్రమాన్ని ఈనెల 1వ తేది నుండి నవంబర్ 4వ తేది వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో అటవీ శాఖ ద్వారా 200 హెక్టార్లలో ఆరు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా పది లక్షల మొక్కలు నాటాలన్నారు. పంచాయితీ రాజ్, డిఆర్‌డిఏ, డ్వామాద్వారా మొక్కలు నాటాలని ఆదేశించారు. అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద, పరిశ్రమల వద్ద మొక్కలు నాటాలని సూచించారు. వనం -మనం కార్యక్రమంలో అన్నీ శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న 8 మున్సిపాలిటీల్లో మొక్కలు పెంచి వాటిని రక్షించే విధంగా కమిషన్లు బాధ్యత తీసుకోవాలన్నారు. మార్కెట్ యార్డుల్లో మొక్కలు పెంచాలని సూచించారు. ప్రతి శనివారం వనం-మనం కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్‌వోలు ఖాదర్‌బాషా, మహబూబ్ బాషా, వ్యవసాయ శాఖ జెడి మురళీ కృష్ణ తదితరులు ఉన్నారు.

బురదలో ఇరుక్కున్న 108
సంతనూతలపాడు, జూలై 21 : స్థానిక వైద్యశాల ముందు బురదలో 108 వాహనం ఇరుక్కుపోయింది. దీనికి వైద్యసిబ్బంది పట్టించుకోకపోవడంతో ఈ విషయమై ఓ విలేఖరి ఆసుపత్రి సిహెచ్‌వో వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. అత్యవసర వాహనం అయితే భుజానికి ఎత్తుకుని మొయ్యాలా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. గతంలో కూడా విలేఖర్లు డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా వంటి వ్యాధులకు సంబంధించి సమాచారం అడిగితే సమాచారం కావాలంటే సిఎంను కాని, పిఎంను కాని అడగండి అంటూ సమాధానం చెప్పారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని తీసుకుని హాస్పిటల్‌కు వస్తే 108 బురదలో ఇరుక్కుపోయింది. దీంతో 108 డ్రైవర్ వైద్య సిబ్బంది సహకారం కోరగా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో చుట్టుపక్కల వారు సహకరించిన మూడు గంటల తరువాత వాహనం బయట పడింది. బాధ్యత కలిగిన వైద్య సిబ్బంది 108 వాహనంపై వ్యవహరించిన తీరు పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.