శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

2022 నాటికి దేశంలో ఏపిని ఎడ్యుకేషన్ క్యాపిటల్‌గా చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 21 : దేశంలో 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ని ఎడ్యుకేషన్ క్యాపిటల్‌గా చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక విఆర్‌సి కళాశాలలోని జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కలలను నిజం చేయడమే తన లక్ష్యమన్నారు. ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. టీచర్లు కూడా ఇబ్బంది పడకుండా వారికి ఇంగ్లీష్ మీడియం టీచింగ్‌పై ఓరియంటేషన్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ కాంపిటీషన్‌కు నిలబడాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అన్నారు. తెలుగు వచ్చినా ఇబ్బంది లేదని సబ్జెక్ట్ ఉంటుందన్నారు. మొదటి ఆరునెలలు 75 శాతం తెలుగు, 20 శాతం ఇంగ్లీష్ చెప్పండి అని ఉపాధ్యాయులకు తెలిపినట్లు ఆయన వివరించారు. చివరి మూడు నెలలు 25 శాతం తెలుగు, 75 శాతం ఇంగ్లీష్ చెప్పమని టీచర్లకు ఇబ్బంది లేకుండా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ నాయకులకు, టీచర్లకు, యూనియన్ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని, మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పి డిబెట్ చేయమని ఆయన తెలిపారు. వారి పిల్లలను ఎందుకు తెలుగు మీడియంలో చేర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. గత సంవత్సరం ఎంసెట్‌లో టాప్ ఐదువేల ర్యాంకుల్లో ఇంజనీరింగ్, మెడిసన్‌లో ఒక్కరే ప్రభుత్వ కాలేజిలో తెలుగు మీడియం విద్యార్థి ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లో మన విద్యార్థి నిలబడాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. తెలుగుభాషకు ఎలాంటి ఇబ్బంది లేదని, తెలుగు సబ్జెక్ట్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియం మీద కొందరు గోలచేసినా వారికి విజ్ఞప్తి చేస్తున్నామని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మున్సిపల్ స్కూళ్లలో, అంగన్‌వాడీల్లో 15 నుంచి 20శాతం విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. దేశానికి ఏపి మున్సిపల్ స్కూళ్లు, జూనియర్ కాలేజి ఆదర్శంగా నిలిచేలా చేస్తామన్నారు. 2019కి విద్యార్థుల ద్వారా ర్యాంకులు తీసుకువస్తామన్నారు. ఈ విద్యార్థులే 2018లో అద్భుత ఫలితాలు సాధించబోతున్నారని ఆయన తెలిపారు. ఆర్థికపరమైన సహకారం మున్సిపల్ కార్పొరేషన్ అందిస్తుందని, ఇందుకు మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విఆర్ కాలేజి ఉచితంగా భవనాలు ఇచ్చిందని, నారాయణ విద్యాసంస్థలు మెటీరియల్, వారాంతపు పరీక్షలు, టీచర్ల ట్రైనింగ్ వంటి వాటిలో సహకారం అందిస్తుందన్నారు. వారందరికీ తాను అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మున్సిపల్ జూనియర్ కాలేజిలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, మున్సిపల్ కమిషనర్ డిల్లీరావు, వైద్యకళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

బిటెక్ విద్యార్థి దారుణ హత్య
బుచ్చిరెడ్డిపాళెం, జూలై 21 : ప్రశాంతంగా ఉండే బుచ్చిరెడ్డిపాళెంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు బిటెక్ చదివే విద్యార్థి వైభవ్‌రెడ్డి (21)ను దారుణంగా హత్య చేశారు. శుక్రవారం తెల్లవారుఝామున ఈ దుర్ఘటన వెలుగు చూడగా, ప్రజలు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. పోలీసులు, మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ శివారు ప్రాంతమైన గోపాల్‌రెడ్డినగర్‌లోని ఎంఎస్‌ఆర్ బృందావనంలో పేరం సంపూర్ణమ్మ కుటుంబం నివాసముంటోంది. ఆమె భర్త పేరం శ్రీనివాసులురెడ్డి గత ఏడాది ఒంగోలు జిల్లా అద్దంకి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుమార్తె స్వప్నప్రియ, కుమారుడు వైభవ్‌రెడ్డిలతో ఉంటుంది. స్వప్నప్రియ చైనె్న సిటిఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వైభవ్‌రెడ్డి రాజుపాళెంలోని శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇప్పుడు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో గత తొమ్మిది నెలల క్రితమే ప్లాట్ కొన్నప్పటికీ, మే నెలలో సొంత ప్లాట్‌లోకి మారారు. అప్పటి నుంచి సంపూర్ణమ్మతో కుమారుడు వైభవ్‌రెడ్డి ప్లాట్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో సౌమ్యుడుగా పేరున్న వైభవ్‌రెడ్డి అపార్ట్‌మెంట్ గేటు ముందే మృతి చెంది పడి ఉండటం స్థానికులను కలవరానికి గురిచేసింది. ఈ క్రమంలో ఏఎస్‌పేట దర్గా వద్ద మొక్కు తీర్చుకోడానికి శుక్రవారం వెళ్లేందుకు మృతుడి మేనత్త వర్ధనమ్మ కుటుంబం సిద్ధమైంది. అక్కడికి రమ్మని కోరడంతో బైక్ ఇంట్లో పెట్టి వస్తానని రాత్రి 11 గంటల ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు వైభవ్. ప్లాట్ నెం 401 నుంచి సుమారు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కిందికి వచ్చిన వైభవ్ ఏఎస్‌పేటకు వెళ్లాలని, గేటు తీయమని కోరినట్లు వాచ్‌మెన్ సెల్వం ద్వారా తెలుస్తోంది. వైభవ్ వెళ్లాక గేటు మూసుకుని నిద్రపోయినట్లు సెల్వం తెలిపాడు. శుక్రవారం తెల్లవారుఝామున యధావిధిగా గేటు తెరిచిన వాచ్‌మెన్‌కు అపార్ట్‌మెంట్ మొదటి గేటు పక్కన బోర్లా పడి ఉన్న వ్యక్తిని తిప్పి చూసి వైభవ్‌గా గుర్తించినట్లు వాచ్‌మెన్ చెప్తున్నాడు. వాచ్‌మెన్ అరుపులతో కిందికి వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులకు, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సిఐ సుబ్బారావు, ఎస్సై నాగశివారెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసు జాగిలం అపార్ట్‌మెంట్ పరిసరాల్లో ఆధారాల కోసం శోధించింది. గోపాల్‌రెడ్డినగర్ వీధి నుంచి మెయిన్ రోడ్డులోని లైలా ఫంక్షన్ హాల్ వరకు జాగిలం సంచరించింది. చివరకు వైభవ్‌రెడ్డి మృతదేహం వద్దకు వచ్చి ఆగింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, పోలీసుల దర్యాప్తుకు ఉపయోగపడే ఎలాంటి ఆధారాలు లభించలేదు. వాచ్‌మెన్ సెల్వంను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతుడి అలవాట్లు, కాలేజీ స్నేహతుల గురించి ఆరా తీస్తున్నారు.

ప్రశాంత్‌కిషోర్ పర్యవేక్షణలో సమాచార సేకరణలో ప్రతిపక్షం బిజీ
నెల్లూరు, జూలై 21 : ప్రతిపక్ష వైకాపా నేతలు గత నాలుగు రోజులుగా అధిష్టానం నుంచి వచ్చిన సర్వే ప్రశ్నలకు సమాధానాల కోసం సమాచార సేకరణలో బిజీబిజీగా కనిపిస్తున్నారు. పార్టీ సలహాదారుగా ఉండేందుకు వచ్చిన ప్రశాంత్‌కిషోరే ఈ ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం విశేషం. గత రెండు, మూడురోజులుగా జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లోనూ, జిల్లా పార్టీ కార్యాలయంలోనూ వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఈ సమాధాన పత్రాలను పూరించడంలో తలమునకలై ఉన్నారు. అధినాయకత్వం కోరిన సమాచార సేకరించడం తమ బాధ్యతగా భావిస్తున్న వైకాపా కార్యకర్తలు, క్షేత్రస్థాయి నేతలు స్పష్టమైన, సమగ్ర సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు. మండలాల పరిధిలో ఉన్న గ్రామాలు, మజరాల మొదలు గ్రామాల పరిధిలో ఉన్న వివిధ వర్గాలకు చెందిన కాలనీలు, ఏ ఏ వర్గానికి ఎంతమంది ఓటర్లు, జనాభా ఉన్నారు? రాజకీయ పార్టీలు కాకుండా మరెవరైనా కులసంఘాల, వర్గ సంఘాల నేతలు ఆయా ప్రాంతాల ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారా? చేస్తుంటే..వారి వివరాలు, వారి అవసరాలు తదితర ప్రశ్నలతో కూడిన చాంతాడు జాబితాను పూరించాల్సి ఉంది. వైకాపా నేతలు క్షేత్రస్థాయిలో ఉన్న తమ అనుచరులకు వివరాల సేకరణ పనులు పురమాయించడం, వారి ద్వారా సమాచారం అందుకోవడంలో బిజీగా మునిగిపోయారు. పూర్తి సమాచారం కోసం మరికొందరు మండలస్థాయి నేతలు రెండు, మూడు రోజుల సమయం కోరుతున్నారు. ఇదేదో కేవలం మండల, గ్రామస్థాయి నేతలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కూడా తమ పరిధిలో ఇదే తరహా సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలనే ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రశాంత్‌కిషోర్ కార్యాచరణలో దిగినప్పటి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహంతో పాటు సమాచార సేకరణ చొరవ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సర్వే పార్టీ ద్వారా జరుగుతుంటే మరోవైపు కొందరు వ్యక్తులు గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ సాధారణ ప్రజలతో పాటు వైద్యులు, న్యాయవాదులు, పాత్రికేయులు, వ్యాపారుల వంటి ప్రొఫెషనల్స్ నుంచి తమకు అవసరమైన సమాచారం సేకరిస్తుండడం గమనార్హం. ప్రభుత్వం పనితీరుతో పాటు వ్యతిరేకత గురించి ప్రశ్నలు సంధిస్తూ, ఒకవేళ ప్రతిపక్షం తరపున నియోజకవర్గంలో ఎవరు మంచి అభ్యర్థిగా భావిస్తున్నారంటూ సమాచారం తీసుకుంటున్నారు. ఈ సర్వేలు ఎటువంటి ఫలితాలను తీసుకొస్తాయో తెలియదు కానీ ప్రస్తుతం ప్రతిపక్ష నేతలు ఈ ప్రశ్నాపత్రాలను సమగ్రంగా పూరించడం ద్వారా పాస్ మార్కులు పొందే ప్రయత్నాలు మాత్రం చురుగ్గా చేస్తుండడం గమనార్హం.

ఎస్వీవి పాలెంలో బ్రిటీష్ వీరుడి స్మృతి చిహ్నం
బిట్రగుంట, జూలై 21 : బోగోలు మండలంలో సిద్ధివరపువెంకటేశ్వర పాలెం పంచాయతీలో సాగు చేసుకునేందుకు పొలంలో చెట్లు తొలగిస్తుండగా బ్రిటీష్ వీర సైనికుడి స్మృతి చిహ్నం బయటపడింది. ఈ విషయం స్థానికులు సమాచారం అందించడంతో సర్పంచ్ కట్టేపల్లి భవాని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. వారి వివరాలు మేరకు, 1843 చెన్నై పోలవరం నుంచి మచిలీపట్నంకు బ్రిటీష్ వారి పదాధిదళం అల్లూరు మీదుగా వెళ్తుండగా పిన్న వయస్సులోనే సైన్యంలో గుర్తింపు పొందిన వీరుడు, స్కాట్‌లాండ్ వాసి హెన్రీయరే మృతి చెందగా ఆయనకు పదాధిదళం అధికారి స్మారక చిహ్నం నిర్మించినట్లు స్థానికులు భావిస్తున్నారు. రైతు ఇష్టాటి కోటేశ్వరరావు పొలం సాగు చేసుకునేందుకు చెట్లు, పొదలను తొలగిస్తుండగా సుమారు నాలుగు అడుగుల కింద పెద్ద బండలాగా కట్టుబడి కనిపించింది. దాన్ని తొలగించగా వీరుడి గుర్తింపు చిహ్నం బయటపడింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలుపుతున్నట్లు సర్పంచ్ తెలియచేశారు.

ఆరవీడుకు ఎత్తిపోతల తీసుకొస్తా
ఆత్మకూరు, జూలై 21: ఆరవీడు గ్రామానికి సోమశిల జలాశయ ఉత్తరకాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని సమకూరుస్తామని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఈ విషయమై ఉత్తరకాలువపై ఆయన పర్యటన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆరవీడు గ్రామంలోని కాళహస్తి, కర్ణాల, పెద్దచెరువులకు 300 ఎకరాలతో సహా మెట్టలోని మరో 700 ఎకరాలతో సహా కరటంపాడు పంచాయతీ మజరా సాతానుపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోకి వచ్చే మరో ఇంకో 200 ఎకరాల వరకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని సమకూర్చేలా చూస్తామన్నారు. ఇందుకోసమై ఆరవీడు గ్రామస్థులు రాజకీయాలకు అతీతంగా కమిటీగా ఏర్పాటు కావాలని సూచించారు. తద్వారా భూముల వివరాలను తెలుసుకుని నీటి పారుదల అభివృద్ధి సంస్థకు చూపించడంలో రెవెన్యూశాఖ సహాయాన్ని కూడా తీసుకోవాలన్నారు. అనంతరం మేజర్ ఇరిగేషన్ పరిధిలోకి వచ్చే సోమశిల ప్రాజెక్ట్ సహాయాన్ని తీసుకుంటూ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసుకునేలా కృషి చేద్దామన్నారు. ఇవన్నీ సాఫీగా జరిగితే 2018 నుంచే ఆరవీడుకు సాగునీటిని సమకూర్చుకోవచ్చని చెప్పారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, కరటంపాడు ఎంపిటిసి సభ్యులు గార్లపాటి వేణుగోపాలనాయుడు, ఆత్మకూరు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చండ్రా వెంకటసుబ్బయ్య, సర్పంచ్‌లు కేతా విజయభాస్కరరెడ్డి, రామిరెడ్డి మోహనరెడ్డి, తలచీరు సుబ్బమ్మ, మాజీ ఎంపిటిసి సభ్యులు గోగిరెడ్డి పెంచలరెడ్డి, నరసయ్యనాయుడు, మాల్యాద్రి, బోయల చిరువెళ్ల, కరటంపాడు మాజీ సర్పంచ్‌లు రావూరు వెంకట రత్నాకరరెడ్డి, జ్యోతి గురవయ్య, పిడికిటి వెంకటేశ్వర్లునాయుడు, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

రెవెన్యూ రికార్డుల సవరణలకు కసరత్తు
ఉదయగిరి/సీతారామపురం, జూలై 21: రెవెన్యూలో అవినీతికి తావులేకుండా అడంగల్ సవరణలు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అధికార్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఉదయగిరి, సీతారామపురం తహశీల్దార్ కార్యాలయాల్లో ఆర్డీఓ బాపిరెడ్డి, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలోని 1201 రెవెన్యూ గ్రామాల్లో రెండు నెలల నుంచి ప్రతి చోటా వర్క్‌షాపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ రికార్డులన్నీ పరిశీలించి సవరణలు చేయాల్సిందిగా శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. వీటిలో 21 అంశాలపై నివేదిక ఉంటుందన్నారు. వీటిలో 17 అంశాలు తహశీల్దార్ పరిష్కరించేలా, నాలుగు అంశాలు జాయింట్ కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేలా, ఒక అంశాన్ని సర్వేయర్ పరిష్కరించేలా నమూనా తయారు చేశామన్నారు. ప్రతి మండలంలో రెండు రెవెన్యూ గ్రామాలను తీసుకుని ఆర్డీఓ, తహశీల్దార్ల నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అవినీతికి తావులేకుండా చట్టప్రకారం మార్పులు చేయాలన్నారు. ఈ సమస్యలు నివారించేందుకు స్టాండర్డ్ రికార్డును ఏర్పాటు చేసేలా ఒక వెబ్‌సైట్ ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బాపిరెడ్డి, తహశీల్దార్ వెంకట సునీల్, ఆర్‌ఐలు శివప్రసాద్, సురేంద్ర, విఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
పసుపు కుంభకోణంపై చర్యలు తీసుకోవాలి
మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రంలో చోటుచేసుకున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని, ఉదయగిరి పంచాయతీ కార్మికులకు ఏడాదికాలంగా రావాల్సిన వేతనాలను వెంటనే అందచేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి కాకు వెంకటయ్య మాట్లాడుతూ రైతుల సంక్షేమం దృష్ట్యా పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే, దీని ద్వారా అధికార, విపక్ష నాయకులు కొంతమంది రంగప్రవేశం చేసి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు చెప్పారు. అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉదయగిరి పంచాయతీలో 30ఏళ్లగా అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు ప్రతి నెలా చెల్లించాల్సిన జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లు చెప్పారు. వీరిని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుకు వినతిపత్రాన్ని అందచేసి సమస్యను విన్నవించారు. అనంతరం కలెక్టర్ స్పందిస్తూ నిజమైన పసుపు రైతులు నగదు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి సొమ్ము వారికే దక్కేలా చూస్తామన్నారు. పసుపు కొనుగోలులో చోటుచేసుకున్న అక్రమాలపై నివేదికను అందించిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.