గుంటూరు

సామాజిక విప్లవకారుడు జాషువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 24: సమాజంలో పేరుకుపోయిన అసమానతలు, అణచివేతను తన కవిత్వంతో వ్యతిరేకించి, ఉద్యమాలు నిర్వహించిన పోరాటయోధుడు గుర్రం జాషువా అని గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు నివాళులర్పించారు. జాషువా 46వ వర్ధంతి సందర్భంగా నగరంలో ఆయన విగ్రహానికి మంత్రి ఆనందబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంఘిక అసమానతలను స్వయంగా తన జీవితంలో ఎదుర్కొన్న జాషువా కలమే ఆయుధంగా కవిత్వాన్ని ఝుళిపించారని ఆనందబాబు గుర్తుచేశారు. తన జీవితాన్ని పీడిత ప్రజలకు అంకితం చేసిన చిరస్మరణీయుడు జాషువా అని కొనియాడారు. జాషువా కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటితరం యువతపై ఉందన్నారు. అసమానతలను ఎదుర్కోవడంలో పీడిత ప్రజలను జాగృతం చేసిన జాషువా ఆశయ సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దావులూరి శామ్యూల్‌జాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దళిత బహుజనుల ఆశాజ్యోతి జాషువా:డొక్కా
దళిత బహుజనులకు కవికోకిల గుర్రం జాషువా ఆశాజ్యోతిగా నిలిచారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. జాషువా వర్ధంతి సందర్భంగా నగరంపాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుభాష ఔన్నత్యాన్ని, విశిష్ఠతను తన కలం ద్వారా చాటిచెప్పిన జాషువా భాష ఉన్నంతవరకు చిరంజీవిగా ఉంటారన్నారు. అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల వీరాస్వామి, న్యాయవాది నూతక్కి దశరధ, పేరేచర్ల మస్తాన్, ప్రసాద్ పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడి
గుంటూరు (కొత్తపేట), జూలై 24: సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని రక్షించి, రైతులను లాభాల బాట పట్టించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, ఎఐకెఎస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతాంగాన్ని ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని నివారించే ప్రయత్నం చేయగా వాగ్వివాదం, తోపులాటకు దారితీసింది. చివరకు ధర్నానిర్వహిస్తున్న వారిని అరెస్ట్‌చేసి ప్రైవేటు వాహనంలో నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అధికారంలోకి వచ్చి రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని డివిజన్లలో 25, 26 తేదీల్లో జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ముసునూరి రమేష్, కోట మాల్యాద్రి, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, పులి సాంబశివరావు, గని, బైరాపట్నం రామకృష్ణ, జి సురేష్‌బాబు, నూతలపాటి చిన్న, రావుల అంజి, పచ్చవ సాంబశివరావు, షేక్ మొహిద్దిన్, మరియమ్మ, భాగ్యలక్ష్మి, విజయకుమార్ తదితరులున్నారు.
కాపు జెఎసి నేతల ఇళ్ల వద్ద పోలీసు పికెట్
గుంటూరు, జూలై 24: కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో జిల్లాలోని జెఎసి నేతల ఇళ్ల వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేశారు. కాగా నేతల ఇళ్ల వద్ద కార్యకర్తలను రానివ్వకుండా నిఘా తీవ్రతరం చేశారు. సోమవారం నగరంలోని పలువురు కాపు నేతలను ఏకంగా ఇళ్లల్లోనే పోలీసులు మకాం వేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. తెలగ, బలిజ, కాపు జెఎసి రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము ఇంటి వద్ద మూడు షిఫ్ట్‌లుగా ముగ్గురు చొప్పున కానిస్టేబుళ్లను నియమించారు. ఇతర నాయకుల ఇళ్ల వద్ద కూడా ఇదే తరహాలో పోలీసులను నియమించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దాసరి రాము మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశంగా పోలీసులను దింపి సమస్యను జఠిలం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తుంటే శాంతిభద్రతల సమస్యగా సాకు చూపి ఉద్యమాన్ని విచ్చిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. జెఎసి నేతలు, కార్యకర్తలపై అక్రమంగా బనాయించిన కేసులతో పాటు పోలీసు బలగాలను వెనక్కు తరలించక పోతే ప్రభుత్వం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పలువురు నేతలు హెచ్చరించారు.

ముద్రగడ పాదయాత్రకు కౌంట్‌డౌన్
గుంటూరు, జూలై 24: రిజర్వేషన్ల సాధనలో భాగంగా కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 24 గంటల్లో కిర్లంపూడి - అమరావతికి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. పోలీసుల అనుమతి లేకుండా పాదయాత్ర జరిపితీరుతామని ముద్రగడ స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 100 మందికి పైగా కారకర్తలను పోలీసులు బైండోవర్ చేశారు. అమరావతి ప్రాంతంలో 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున పాదయాత్రకు అనుమతి లేదని, కార్యకర్తలు రావద్దని పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. పాదయాత్ర, ఉద్రిక్తతల నేపథ్యంలో వెలుపల నుంచి అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశముందన్న అనుమానంతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి సచివాలయం వరకు అన్ని రహదారుల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తునిలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని సంఘ వ్యతిరేక శక్తులు అల్లర్లకు పాల్పడకుండా ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అర్బన్ జిల్లా ఎస్‌పి సిహెచ్ విజయారావు తెలిపారు. సోమవారం బాంబింగ్ స్క్వాడ్, పోలీసు జాగిలాలు, రోప్ పార్టీ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అనువణువు నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌పి సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. ఈనెల 26న కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం యాత్రను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అర్బన్ ఎస్‌పి తెలిపారు. అర్బన్ పరిధిలోని పోలీసుశాఖ కట్టుదిట్టమైన చర్యను తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థులు, యువత చట్టానికి లోబడి ఉత్తమ పౌరులుగా నిలవాలని అర్బన్ ఎస్‌పి హితవుపలికారు. అసత్య ప్రచారాలకు ప్రభావితం కారాదని, చట్ట వ్యతిరేక యాత్రలో పాల్గొనరాదని కోరారు. తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఉద్ఘాటించారు. అర్బన్ పరిధిలో 30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని, చట్టాన్ని అతిక్రమించి ఇబ్బంది పడవద్దన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. అసాంఘిక శక్తుల పట్ల నిఘాను తీవ్రతరం చేశామని తెలిపారు.

పుస్తక పఠనం విజ్ఞానదాయకం
గుంటూరు (కల్చరల్), జూలై 24: మానవ మేథోమథనానికి, సంపూర్ణ వికాసానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని, శాస్త్ర సాంకేతికంగా వస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకుంటూ పుస్తక విజ్ఞానాన్ని సామాన్యులదరికి చేర్చాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి నగరంలోని బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై గ్రంథాలయ పితామహ పద్మశ్రీ అయ్యంకి వేంకట రమణయ్య, డాక్టర్ వెలగా వెంకటప్పయ్యల పేరిట ఏర్పాటుచేసిన స్మారక పురస్కార ప్రదానోత్సవ సభలో రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సభకు బృందావన వెంకన్న దేవాలయ అధ్యక్షుడు చిట్టిపోతు మస్తానయ్య అధ్యక్షత వహించారు. అయ్యంకి, వెలగా పురస్కార కమిటీ కన్వీనర్ పావులూరి శ్రీనివాసరావు సభను నిర్వహించారు. రాజేంద్రప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పుస్తకాల్లో ఉన్న ఉత్తమోత్తమమైన సాహిత్యాన్ని, పెద్దలు చెప్పిన మాటలను, వీటన్నింటికీతోడుగా మంచి విషయాలను అందరికీ తెలియజేయాలని ఆయన సూచించారు. అప్పుడైనా, ఇప్పుడైనా, కాలగతిలో ఎన్నిమార్పులు వచ్చినా పుస్తకాలు మానవుడిని మంచిబాటలో నడిపించడానికి దిక్సూచిగా ఉపకరిస్తాయన్నారు. వేరొక కార్యక్రమంలో పాల్గొని సభ ముగింపు సమయంలో విచ్చేసిన శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ నిత్యం పుస్తకాలను అధ్యయనం చేస్తూనే ఉంటానన్నారు. ప్రగతిపధ రథచక్రాల్లాంటివి పుస్తకాలేనని అభివర్ణించారు. ఆచార్య రాజేంద్రప్రసాద్, మాణిక్యవరప్రసాద్, అధ్యక్షత వహించిన మస్తానయ్య తదితరులు ప్రసంగించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన అయ్యంకి మనవడు డాక్టర్ అయ్యంకి మురళీకృష్ణ, విద్యావేత్త ప్రొఫెసర్ కృష్ణకుమారిలు (యుఎస్‌ఎ) తమ ప్రసంగంలో మంచి ముత్యాల్లాంటి మాటలు మనకు లభించేది పుస్తకాల్లోనేనన్నారు. ఈ సందర్భంగా సాహితీవేత్త డాక్టర్ పులిచెర్ల సాంబశివరావుకు అయ్యంకి, వెలగా పేరిట ఏర్పాటుచేసిన పురస్కారాన్ని, పది వేల రూపాయల నగదు పారితోషికం, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అతిథులు అందజేశారు. సభలో సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెజి శంకర్, అన్నమయ్య గ్రంథాలయ నిర్వాహకులు లంకా సూర్యనారాయణ, బృందావన వెంకన్న ఆలయ కార్యదర్శి గుమ్మడి రాధాకృష్ణమూర్తి గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు.

ప్రతి అర్జీకి సమాధానమివ్వాలి:ఆర్డీఓ
అచ్చంపేట, జూలై 24: గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే దరఖాస్తులన్నింటినీ నిర్ణీత సమయంలోగా పరిష్కరించి, అర్జీదారునికి తగు సమాచారం అందించాలని గుంటూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మండల కేంద్రమైన అచ్చంపేటలో గల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం గ్రీవెన్స్ సెల్‌కు ఆయన హాజరై అర్జీదారుల నుండి దరఖాస్తులను అందుకున్నారు. కొత్తపల్లిలో ముస్లింలకు శ్మశానవాటిక లేదని శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలంటూ గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావుతో కలిసి ముస్లింలు అర్జీని సమర్పించారు. అలాగే అదే గ్రామంలో 48 సర్వేనెంబర్‌కు ఫీల్డ్ మ్యాప్ ఉందిగానీ, ఆర్ ఎస్ ఆర్‌లో పొందుపర్చక పోవడం ద్వారా పాస్‌పుస్తకాలను పొందలేక పోతున్నామంటూ మరికొందరు రైతులు దరఖాస్తు చేశారు. చామర్రుకు డొంకరోడ్డు కోరుతూ 2 దరఖాస్తులు, ఓర్వకల్లులో ఆస్తివివాదాన్ని పరిష్కరించాలని ఒకటి, నిండుజర్ల గ్రామంలో శ్మశాన వాటికకు దారి చూపించాలని కోరుతూ ఆ ఊరు గ్రామస్థులు ఆర్డీవోను కలిసి విన్నవించారు. గింజుపల్లిలో ఎంజాయిమెంట్ సర్ట్ఫికెట్ కోరుతూ మరో దరఖాస్తును ఆయన అందుకున్నారు. దీంతోపాటుగా మరికొన్ని విభిన్న సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులను అర్జీదారులు సమర్పించారు. అందిన దరఖాస్తులన్నింటినీ రికార్డులను పరిశీలించి తగు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావుతో పాటు తహశీల్దార్ సాంబశివరావు, ఎండిఒ డిజి నాయక్, ఎంఇఒ రాజశేఖర్, విఆర్‌ఒలు సర్వేయర్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
గుంటూరు (పట్నంబజారు), జూలై 24: ప్రజల ఫిర్యాదులను నగరపాలక సంస్థ అధికారులు సకాలంలో పరిష్కరించాలని కమిషనర్ చల్లా అనూరాధ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై అందిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం కూడదన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 12, పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 8, ప్రజారోగ్య విభాగానికి సంబంధించి 4, రెవెన్యూ విభాగానికి సంబంధించి 7 ఫిర్యాదులు, అలాగే ఉపాసెల్‌కు సంబంధించి రెండు ఫిర్యాదులు ప్రజల నుండి వచ్చాయన్నారు. గత వారం పెండింగ్ ఫిర్యాదులను ఏ మేరకు పరిష్కరించి కంప్యూటరీకరించారో వివిధ శాఖల విభాగాధిపతులను అడిగి కమిషనర్ తెలుసుకున్నారు.
ఫోన్ కాల్ చేసుకుంటానని ఫోన్‌తో ఉడాయంచాడు...
తాడేపల్లి, జులై 24: మా వాడు ఒకడు కనబడుటలేదు, ఒక ఫోన్ చేసుకుంటాను ఇవ్వరా అంటూ అపరిచితుని వద్ద ఫోన్ తీసుకుని, ఆపై బైక్ మీద పారిపోయి 25వేల రూపాయల సెల్‌ఫోన్ చోరీ చేసిన ఘటన సోమవారం తాడేపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆచంట సురేష్‌బాబు అనే యువకుడు రాధాకృష్ణ పెట్రోల్‌బంక్ వద్ద ఉండగా సుజికీ యాక్సిస్ 125 బ్లూ కలర్ వాహనంపై ఒక వచ్చిన ఒక యువకుడు మా వాడు కనబడుట లేదు ఒక కాల్ చేసుకుంటాను ఫోన్ ఇవ్వమని కోరాడు. దీనితో సురేష్ తన చేతిలోని 25వేల రూపాయల విలువైన ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న సదరు యువకుడు వెంటనే తన వాహనంపై అక్కడి నుండి ఉడాయించాడు. దీనితో సురేష్‌బాబు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జూట్‌మిల్లు కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి
గుంటూరు (పట్నంబజారు), జూలై 24: భజరంగ్ జూట్‌మిల్లు ఆగస్టు 16వ తేదీ నుండి తిరిగి పునఃప్రారంభమువుతున్న సందర్భంగా కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి, జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 21 నుండి ఆగస్టు 5 వరకు మిల్లులో పనిచేసేందుకు ఆసక్తి గల కార్మికుల పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం అప్పిరెడ్డి జూట్‌మిల్లు వద్ద నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించి కార్మికులతో మాట్లాడారు. ఆగస్టు 16న పునఃప్రారంభమయ్యే మిల్లు సెప్టెంబర్ 5 వరకు సింగిల్ షిఫ్ట్‌లో కార్మికులు పనిచేస్తారన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 6 నుండి 19 వరకు డబుల్ షిఫ్ట్‌లో పనిచేస్తారన్నారు. కార్మికులు ఎక్కడ ఉన్నా ఆగస్టు 5వ తేదీలోగా మిల్లు వద్దకు వచ్చి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు ఎబ్బూరి పాండురంగ తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మేడికొండూరు, జూలై 24: మండలంలోని సిరిపురం గ్రామంలో గుర్తు తెలియని పురుషుని మృతదేహం సోమవారం లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి... సిరిపురం గ్రామంలో ఆకుపచ్చ టీ షర్టు, ఆకుపచ్చ ప్యాంట్ ధరించి సుమారు 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తికి చెందిన మృతదేహం లభ్యమైందని విఆర్‌ఒ వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించి హెడ్‌కానిస్టేబుల్ ఖాశిం కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలకు 08641-239233లో సంప్రదించాలన్నారు.
ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
అమరావతి, జూలై 24: మండల కేంద్రమైన అమరావతిలో జోరుగా పేకాటలు సాగుతున్నాయన్న సమాచారం రావడంతో అమరావతి ఎస్‌హెచ్‌ఒ తక్కెళ్లపాటి మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎస్‌ఐ బి నరసింహారావు తన సిబ్బందితో ఆకస్మిక దాడిచేసి పేకాట ఆడుతున్న ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 10,520 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
సిమెంటురోడ్లకు చైర్మన్ శంకుస్థాపన
మంగళగిరి, జూలై 24: పట్టణంలోని 9వ వార్డులో 19 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిమెంటురోడ్లు, డ్రైనేజీలకు సోమవారం మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా చైర్మన్ చిరంజీవి మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రెండు విడతలుగా ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, మొదటి విడతలో అవకాశం రానివారు నిరాశ చెందవద్దన్నారు. రోడ్లు, డ్రైనేజీలు త్వరిత గతిన నాణ్యతగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్ ఉడతా శ్రీను, డీఈఈ పంచుమర్తి ఏడుకొండలు, టిడిపి చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.
మహిళను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు
మాచవరం, జూలై 24: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు మాచవరం ఎస్సై జగదీష్ సోమవారం తెలిపారు. స్థానిక దళితవాడకు చెందిన తాడిగిరి రామాంజనేయులు అదే కాలనీకి చెందిన మహిళపై దుర్భాషలాడి, నోటికొచ్చినట్టు తూలనాడినట్టు ఫిర్యాదు అందింది. నీరు పట్టుకునే విషయంలో ఈ ఘర్షణ జరిగినట్టు తెలిసింది.

అభివృద్ధికి ఆమడదూరంలో ఎన్‌విపాలెం
అమరావతి, జూలై 24: మండల పరిధిలోని అత్తలూరు గ్రామశివారు నూతలపాటివారిపాలెం (ఎన్‌విపాలెం) అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏ కొద్దిపాటి వర్షంపడినా గ్రామంలో ఉన్న మట్టిరోడ్లన్నీ బురదమయంగా మారి నడవటానికి వీలులేకుండా పోతుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రధానం రోడ్లు, వీధి లైట్లు, పెచ్చులు సరిగాలేక నీరు కారుతున్న స్కూలు భవనం, అద్దె భవనంలో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రం గురించి పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన యువకులు సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో తహశీల్దార్ భాస్కరరావు, ఎండిఒ వై రాజగోపాల్‌లకు విడివిడిగా వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేకల శ్రీనివాసరావు, మేకల బ్రహ్మయ్య, ఎం కృష్ణ, ఎ బ్రహ్మయ్య, టి వెంకటేశ్వరరావు, ఎన్ అనిల్‌కుమార్, ఎ వీర వసంతరావు, జి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.