ప్రకాశం

జిల్లాలో కురుస్తూనే ఉన్న వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: రుతుపవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా గత మూడు,నాలుగురోజులనుండి ఒకమోస్తరునుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్నివర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కొన్నిప్రాంతాల్లోని వాగులు, వంకల్లోకి నీరుచేరటంతో భూగర్భజలాలు పెరుగుతున్నాయి. జిల్లాలో సాగులో ఉన్న పంటలకు సైతం ఈ వర్షాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. గుండ్లకమ్మ నదిలోకి సై తం వర్షపునీరు వచ్చి చేరింది. వాతావరణం కూడా చల్లబడటంతో విద్యుత్ వినియోగం తగ్గినట్లైంది. జిల్లాలోని మండలాల వారీగా వర్షపాతం వివరాలు ఈవిధంగా మిల్లీమీటర్లల్లో ఉన్నాయి. ఇంకొల్లులో 34.2 మిల్లీమీటర్లు, చినగంజాంలో 32.6,యర్రగొండపాలెంలో 29.6,కొత్తపట్నంలో 24.8,జెపంగులూరులో 23.4,వేటపాలెంలో 17,పొదిలిలో16.8,పుల్లలచెరువులో 16.2 ముండ్లమూరులో 15.6, చీరాలలో14.2, సంతమాగులూరులో 13.2,కారంచేడులో 11,పర్చూరు, కొనకనమిట్లలో 10.2,చీమకుర్తిలో పది, గిద్దలూరులో 9.8,అద్దంకి, కొరిశపాడులో 9.2,బల్లికురవ 8.4,మార్టూరులో 8.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా తాళ్ళూరు,ఒంగోలులో 6.8, రాచర్లల్లో 6.4,కొండెపిలో 6.4, టంగుటూరులో ఆరు, మర్రిపూడి, దర్శిల్లో 5.4, మార్కాపురంలో 5.2,పెద్దారవీడులో ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా నెలసరి వర్షపాతం 107మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సిఉండగా ఇప్పటివరకు 60.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంమీద చెదురుమదురువర్షాలనుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు తమపొలాల్లో దుక్కులు దునే్నందుకు ఉత్సాహం చూపుతున్నారు.

వైభవంగా మంత్రి శిద్దా జన్మదిన వేడుకలు
ఒంగోలు : రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి శిద్దా రాఘవరావు 61వ జన్మదిన కార్యక్రమాన్ని అభిమానులు, ప్రజా ప్రతినిధుల మధ్య గురువారం ఘనంగా నిర్వహించారు. గురువారం చీమకుర్తిలోని హరహర క్షేత్రంలో మంత్రి శిద్దా రాఘవరావు జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసి అభిమానులు, కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరిహర క్షేత్రంలో మృత్యుంజయ హోం , మృత్యుంజయ స్థాపన , హారతులు, అభిషేకాలు, నవ గ్రహాలు, వేద పఠనం, దానాలు, పూర్ణాహుతి , అవభృత స్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ శారద పీఠాధిపతి , అన్నవరం దేవస్థానం , విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం, మోపిదేవి దేవస్థానం శ్రీశైలం, తిరుమల తిరుపతి దేవస్థానాల వేద పండితులు మంత్రి దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా చీమకుర్తి హరిహర క్షేత్రంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ కేక్ ను మంత్రి శిద్దా రాఘవరావు కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి 61వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి పితాని సత్యనారాయణ, శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, అనంతపురం పార్లమెంట్ సభ్యులు జెసి దివాకర్‌రెడ్డి, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్, బాపట్ల శాసన సభ్యులు కోనా రఘుపతి, పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర, సంతనూతలపాడు నియోజక వర్గ ఇన్‌చార్జి బియన్ విజయ్‌కుమార్, ఆంధ్ర ప్రదేశ్ బయో డైవర్సీ చైర్మన్ ఎస్‌బియల్ మిశ్రా, రాష్ట్ర వన్య మృగ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సారంగ్, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనంతరాములు, అటవీ శాఖాధికారులు మహబూబ్ బాషా, రామచంద్రారెడ్డి, ఖాదర్ బాషా, స్టెప్ సి ఈవో రవి, ఒంగోలు డైయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, ఒంగోలు డియస్‌పి శ్రీనివాసరావు, దర్శి డిఎస్‌పి వి శ్రీరాంబాబు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖా మంత్రి తనయుడు శిద్దా సుధీర్‌కుమార్, కోడలు శృతి, కుమార్తె సునీత, అల్లుడు ఫణికుమార్, మనవళ్ళు ఆరాధ్య, త్రిష్, అక్షయ్, మోహన్, శిద్దా వెంకటేశ్వరరావు, శిద్దా పాండు రంగారావు, శిద్దా నాగేశ్వరరావు, చలువాది బద్రీ నారాయణ, మన్నం ప్రసాద్, మన్నం శ్రీ్ధర్, కాట్రగడ్డ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం విద్యాసంస్ధల బంద్ విజయవంతం
ఒంగోలు అర్బన్:విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, ఎఐఎస్‌ఎఫ్ విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన జిల్లా వ్యాప్త విద్యా సంస్ధల బంద్ విజయవంతమైంది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్ధలు స్వచ్చంధంగా బంద్ ప్రకటించారు. బంద్ అనంతరం విద్యార్థులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి సిహెచ్ సుధాకర్, పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లాకన్వీనర్ పి కుమారి మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా విద్యారంగ సమస్య పరిష్కారం కాలేదన్నారు. జిల్లాకు ప్రకటించిన యూనివర్శిటి, ట్రిపుల్ ఐటి నేటికి నిర్మాణం జరగలేదన్నారు. 2011లో పెంచిన మెస్‌చార్జీలను నేటికీ అమలు చేస్తున్నారని, రోజుకు 25రూపాయలతో విద్యార్ధులు ఏవిధంగా భోజనం చేస్తారని ప్రశ్నించారు. జిల్లాలో పశ్చిమప్రాంతంలో హాస్టల్ విద్యార్థులు ఫ్లోరిన్ నీరు తాగి రోగాల బారినపడుతుంటే అధికారులకు ఏ మాత్రం పట్టడటం లేదని విమర్శించారు. మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడ్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఆయాసంఘాలతోపాటు ఎఐవైఎఫ్‌నాయకులు కె చిన్నపరెడ్డి,మోహన్, అశోక్,్ధన్‌రాజ్, ఫృద్వీరాజ్, శింగరకొండ, సురేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఈనెల 15వతేదీన పోలీసుపెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె జిల్లారెవెన్యూ అధికారి, జిల్లా అధికారులతో పోలీసుపెరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాటు ఈనెల 14వతేదీనాటికి పూర్తిచేసేలా చూడాలన్నారు. వర్షం పడితే ప్రత్యామ్నాయంగా వేడుకలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాన్నారు. అందుకోసం పక్కనే ఉన్న పోలీసు కళ్యాణ మండపాన్ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యఅతిధులు, జిల్లా అధికారులు, ప్రజలు,విద్యార్ధులకు సీటింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రభుత్వ సంక్షేమపథకాల అమలుపై ఏర్పాటుచేసే శకటాలుప్రజలను ఆకర్షించేవిధంగా ఉండేలా చూడాలని ఆమె సూచించారు. ఒంగోలు నగరంతోపాటు పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో శానిటేషన్‌ను చేపట్టాలని నగరపాలక సంస్ధ మునిసిపల్ ఇంజనీరును ఆదేశించారు. శకటాలను ప్రజలు చూసే విధంగా పట్టణంలోని ప్రధాన కూడళ్ళల్లో తిరుగుతాయని వాటికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు సామాన్య ప్రజానీకానికి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండాచూడాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో చేపట్టే సాంస్కృతిక కార్యక్రమాలు, అసెట్స్ పంపిణి, స్టాల్స్ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా అధికారులకు ఆమె సూచనలు చేశారు. ఆమె జిల్లారెవెన్యూ అధికారి ఎన్ ప్రభాకర్‌రెడ్డి, డిఇఒ విజయభాస్కర్, డిఆర్‌డిఎ,డ్వామా, మెప్మాపిడిలు ఎంఎస్ మురళీ, పోలప్ప, అన్నపూర్ణ, అదనపు ఎస్‌పి ఉదయరాణి, సోషల్ వెల్పేర్ డిడి లక్ష్మిసుధ తదితరులు పాల్గొన్నారు.

ఏడాదిలో నగరవనాన్ని అభివృద్ధి చేస్తాం
చీరాల: రానున్న ఏడాదిలో నగరవనాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అటవీశాఖ రాష్ట్ర ప్రధాన వన సంరక్షణ అధికారి పికె సారంగి తెలిపారు. చీరాలలోని ఓడరేవు రోడ్డులో ఏర్పాటుచేస్తున్న నగరవనాన్ని గురువారం ఆయన పరిశీలించారు. నగరవనం శిలాఫలకాన్ని పరిశీలించిన ఆయన ప్రారంభోత్స వం జరిగి మూడు సంవత్సరాలు గడిచినా ఎటువంటి అభివృద్ధికి నోచుకోవటం పట్ల ఆశ్చర్యం వక్తం చేశారు. నగరవన ఆవరణలో ఏర్పాటుచేయనున్న వాకింగ్ ట్రాక్, బోట్ ప్రయాణం కోసం అభివృద్ధి చేయనున్న కాలువను పరిశీలించారు. 50హెక్టారుల విస్తీర్ణంలో ఉన్న నగరవనం చుట్టూ విద్యుత్ కంచ ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. నగరవనంలో సుమారు కిలోమీటరు పొడవున ఉన్న ప్రస్తుతం ఉన్న కాలువను మరింత వెడల్పు చేసి బోటు ప్రయాణానికి అనువుగా ఉండేలా అభివృద్ధి చేయాలన్నారు. దాంతో పాటు సుమారు 15చదరపు మీటర్ల విస్తీర్ణంలో చెరువును తవ్వి అందులో చేపలు పేంచేలా చూడాలన్నారు. దాంతో పాటు సందర్శకులు సేద తీరేందుకు నాలుగు కాటేజ్‌లు నిర్మించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నగరవనం అభివృద్ధికి రూ 99లక్షలు మంజూరు కాగ ఇప్పటికే రూ 33లక్షలు నిధులు విడుదల అయ్యినట్లు తెలిపారు. అడవుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేపటంతో పాటు అడవులలో ఉండే ప్రకృతి రమణీయతను ప్రతిబింబించే విధంగా నగరవనం రూపొందించటమే ప్రధాన ఉద్ధేశ్యమన్నారు. ఏడాదిలోపు పైన తెలిపిన విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు వనసంరక్షణాధికారి సూర్యనారాయణ, సబ్ డిఎఫ్‌ఓ నాగభూషణం , రేంజ్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ బాలాజినాయక్, బీట్ అధికారి కె రమేష్, వనసంరక్షణ సమితి అధ్యక్షుడు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

నీరు - ప్రగతి పనులు వచ్చే నెలాఖరుకల్లా పూర్తి చేయాలి :కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి వచ్చే నెల జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ పేర్కొన్నారు. గురువారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖాధికారులతో నీరు - ప్రగతి కార్యక్రమంపై సమావేశం నిర్వహించి పనుల పురోగతి పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీరు - ప్రగతి పనులు వేగవంతం చేసి వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ 2017-18 సంవత్సరానికి నీరు - ప్రగతి క్రింద 207 కోట్ల రూపాయల వ్యయంతో 2754 పనులు మంజూరు చేశామన్నారు. ఇందులో ఇప్పటి వరకు 589 పనులు పూర్తి కాగా 797 పనులు పురోగతిలో ఉన్నాయని, మిగిలినవి ఇంకా మొదలు కాలేదన్నారు. ఇప్పటి వరకు 91 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయన్నారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి మిగిలి పోయిన పనులు 1297 గానూ 817 పనులు పూర్తి అయ్యాయని, మరో 192 పనులు పురోగతిలో ఉన్నాయని, 288 పనులు ఇంకా మొదలు కాలేదన్నారు. పురోగతిలో పనులు ఈ నెలాఖరుకు పూర్తి కావాలని, ఇంకా మొదలు కానివి వెంటనే ప్రారంభించి పురోగతిలోకి రావాలన్నారు. ఈ నెలాఖరు తరువాత ఇంకా మొదలు కాని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని స్పష్టం చేశారు. మం జూ రు అయిన పనులు ఇం కా పెండింగ్‌లో ఉం చడం సరైంది కాద ంటూ మంజూరు కావాల్సిన పనుల ప్రతిపాదనలు ఈ నెల 25వ తేది లోగా అందజేసి ఉత్తర్వులు పొందాలన్నారు. వచ్చే సెప్టెంబర్ నెలకు అన్నీ పనులు పూర్తి కావాలన్నారు. ముఖ్యంగా పంట కుంటలపై ప్రత్యేక దృష్టి సారించి 60 శాతం పనులు పూర్తి చేయాలన్నారు. ఇంకా కొన్ని చెక్ డ్యామ్‌ల నిర్మాణం , చెరువుల్లో పూడిక తీత, ముళ్ళ పొదల తొలగింపు పనులు మొదలు కాలేదని, వాటిని త్వరితగతిన చేపట్టాలన్నారు. అవసరమైతే చెరువుల స్థితి గతులపై సంయుక్త కలెక్టర్, ఆర్డీవోలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి చెరువుల వారీగా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. మొదటి దశ పనులకు కావాల్సిన బడ్జెట్ 26 కోట్ల రూపాయల కోసం ఉన్నతాధికారులకు లేఖ సిద్ధ చేయాలన్నారు. ఒకే ప్రాంతంలో నాలుగు రోజులు ఉండి అక్కడ డి ఈ, ఎ ఈలతో పనుల పురోగతి సమీక్షించి సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ ఎస్ ఈ వెంకట రమణ, డ్వామా పిడి పోలప్ప తదితరులు పాల్గొన్నారు.
సురేష్ మహల్ దగ్ధం
చీరాల పట్టణంలోని సురేష్ మహాల్ థియేటర్ గురువారం ఉదయం విధ్ముధాఘాతం సంభవించింది. థియేటర్‌ను గత కొద్ది నెలలుగా మరమ్మతులు చేస్తున్నారు. దగ్గుబాటి రాణా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో శుక్రవారం నుంచి థియేటర్ పునః ప్రారంభం కానుంది . ప్రారంభోత్సవానికి నటుడు రాణా స్వయంగా హాజరవుతారని ప్రచారం సాగింది. అయితే ఉదయం ఆధునికరించిన థియేటర్‌లో ఎయిర్‌కండీషన్ వ్యవస్థ ను పరిశీలించే క్రమంలో ఒక్కసారిగా విధ్యుథాఘాతానికి గురవటంతో థియేటర్‌లో మంటలు చెలరేగాయి. కొద్ది సేపటికే మంటలు తీవ్ర రూపం దాల్చి ఉవెత్తేన ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో థియేటర్‌లోని కుర్చీలతో పాటు థియేటర్ మొత్తం పూర్తిగా దగ్థమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి బి వెంకటేశ్వర్లు, బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడుకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.ఈ ఘటనలో ప్రాధమిక అంచనా ప్రకారం సుమారు రూ కోటి యాభై లక్షల వరకు ఆస్థినష్టం వాటిల్లి నట్లు వారు తెలిపారు. అదే విధంగా డి ఎస్పీ డాక్టర్ ప్రేమకాజల్, ఒకటవ పట్టణ సి ఐ సూర్యనారాయణతో పాటు ఎస్సైలు అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన పరిస్థితులను పరిశీలించారు.

ఇచ్చిన నిధులు ఖర్చుచేసి అభివృద్ధి చేయకపోతే ఎలా
గిద్దలూరు: గిద్దలూరు నగర పంచాయతీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 38వేల మంది ఉందని, అందుకు అనుగుణంగా భారీఎత్తున నిధులు మంజూరు చేశామని, అయినప్పటికీ ఆ నిధులను ఇప్పటికీ ఖర్చు చేయకపోవడం ఏమిటని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమూర్తిని ప్రశ్నించారు. గురువారం ఆయన గిద్దలూరు నగర పంచాయతీ సమావేశం హాల్లో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీకి రూ.20.33 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఇందులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉండగా ఇప్పటికీ టెండర్లు కూడా నిర్వహించకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆగస్టు చివరినాటికి ఈ నిధులను వినియోగించి అభివృద్ధి పనులు చేయకపోతే తిరిగి నిధులు రావడం కష్టమని, ఉన్న నిధులు కూడా వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.1.50 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.8.5 కోట్లు, నీటి ఎద్దడి నివారణకు రూ.5.30 కోట్లు కేటాయించామని, ఈ నిధులతో ఏ కార్యక్రమం చేపట్టకపోవడం విచారకరమని అన్నారు. నగర పంచాయతీలో రోడ్ల మధ్య డివైడర్లను 1.5 కిలోమీటర్లు వేయాలని పేర్కొన్నారు. నీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత నగర పంచాయతీపై ఉందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పనులు సాధించేవిధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఇంజనీర్ అధికారులు, సిబ్బంది లేరని అభివృద్ధి కుంటుపడటం సరైంది కాదన్నారు. ఉన్న సిబ్బందినే వాడుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధిని చూపించాలని అన్నారు. గిద్దలూరుకు స్పీపింగ్ మిషన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. చెత్తను వేరు చేసే యంత్రాన్ని కూడా మంజూరు చేస్తామని అన్నారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే ఎం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నిధులను నిర్దేశించిన సమయంలో ఖర్చుచేసి అభివృద్ధిని చూపించి తిరిగి నిధులు అడుగుతామని మంత్రికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బండారు వెంకటసుబ్బమ్మ, ఎంపిపి కె వంశీధరరెడ్డి, మాజీసర్పంచ్ డి విజయభాస్కర్‌రెడ్డి, డాక్టర్ రంగారావు, డి కాశిరెడ్డి, సయ్యద్ మహబూబ్‌బాషా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

‘చిన్నారులకు ఎంఆర్ టీకాలు వేయించాలి’
కందుకూరు : 9 నెలల నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా ఎంఆర్ టీకాను వేయించాలని వైద్య ఆరోగ్య సిబ్బంది సూచించారు. గురువారం పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వైద్య సిబ్బంది విద్యార్థులకు టీకాలు వేశారు. పట్టణంలోని సిద్ధార్ధ పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ జి రామారావు సమక్షంలో విద్యార్థులకు సిబ్బంది టీకాలను వేశారు. పాఠశాలలో 560 మంది విద్యార్థులకు టీకాలు వేసినట్లు సిబ్బంది తెలిపారు. అదేవిధంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు టీకాలు వేశారు.
‘జీఓ నెంబర్ 40ను రద్దు చేయాల్సిందే’
కందుకూరు: రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి చింతలదీవి కామధేనువు పశుక్షేత్రానికి నీటిని తరలిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 40ను వెంటనే రద్దు చేయాలని రాళ్లపాడు పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం గుడ్లూరు మండలంలోని చెంచిరెడ్డిపాలెం, బసివిరెడ్డిపాలెం తదితర గ్రామాల్లో కమిటీ పర్యటించింది. ఈ సందర్భంగా రాళ్లపాడు నీటిని అక్రమంగా తరలిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 40ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 18వ తేదీన ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి ఆయకట్టు రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్, ఏపి రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కె వీరారెడ్డి, ఏపి వ్య.కా.సం నాయకులు జి వెంకటేశ్వర్లు, రాళ్లపాడు పరిరక్షణ కమిటీ సభ్యులు, ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.