తెలంగాణ

విద్యార్థులే పోలీసులైతే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: బాలబాలికల్లో సామాజిక మాధ్యమాలు, ఆధునిక పోకడల వల్ల పెచ్చుమీరుతున్న అసహనం, హింస, నేరప్రవృత్తిని అరికట్టేందుకు, ప్రజాస్వామ్యం, చట్టాలంటే విధేయత పెంచేందుకు స్టూడెంట్ పోలీసు కేడెట్ (ఎస్‌పిసి) వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. క్రమశిక్షణ, సేవ భావాన్ని బాలల్లో పెంచే లక్ష్యంతో ఎస్‌పిసిని కేరళ రాష్ట్రంలో గతంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కర్నాటక రాష్ట్రంలో ఎస్‌పిసిని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాలు కేరళ బాటలో నడిచేందుకు ఎస్‌పిసి విధానాన్ని అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఈ విధానంపై ఆసక్తికనపరచడమే కాకుండా, ఎస్‌పిసి విధానాన్ని అధ్యయనం చేసింది. దీనికి ఉన్నత స్ధాయి పోలీసు అధికారులు, విద్యావేత్తలు మొగ్గుచూపడమే కాకుండా రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పోలీసు శాఖ స్పష్టమైన నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
31 జిల్లాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో స్టూడెంట్ పోలీసు కేడెట్ (ఎస్‌పిసి) వ్యవస్ధను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది నుంచి అమలు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆ తర్వాత దశలవారీగా అన్ని పాఠశాలలకు విస్తరిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లోనే ఎస్‌పిసి విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. 8, 9 తరగతుల బాలబాలికలను ఎస్‌పిసిలో చేర్చుకుంటారు. ప్రతి పాఠశాలకో ఎస్‌పిసి గ్రూపు ఉంటుంది. ఇందులో 22 మంది బాలలు, 22 మంది బాలికలు ఉంటారు. రెండేళ్లపాటు శిక్షణ వ్యాయామంతో పాటు సమాజం, జవాబుదారీతనం, నైతిక విద్య, నేరప్రవృత్తికి దూరంగా ఉండడం తదితర అంశాలను బోధిస్తారు. వీరికి క్షేత్ర స్ధాయి పర్యటనలు కూడ ఆంటాయి. జాతీయ సమగ్రత, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుండి నడిపించిన మహనీయుల జీవితంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి బోధిస్తారు.
కేరళ తరహాలో ఏర్పాటు చేసే ఎస్‌పిసికి రాష్ట్ర, జిల్లా స్ధాయిలో సలహామండళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేరళలో ఎస్‌పిసి రాష్ట్ర స్థాయి సలహా కమిటీకి డిజిపి చైర్మన్‌గా, విద్యా శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా, ఇతర శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. పోలీసు ఐజి హోదాలో ఒక అధికారి ఈ కమిటీకి కార్యదర్శిగా ఉంటారు. రాష్ట్రంలో ఎస్‌పిసిల పనితీరును అధ్యయనం చేసేందుకు నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తారు. నోడల్ ఆఫీసర్‌కూడా పోలీసు శాఖ నుంచే ఉంటారు. జిల్లా స్థాయి కమిటీలకు చైర్మన్‌గా జిల్లా ఎస్పీ ఉంటారు. జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఎస్‌పిసి వింగ్‌కు ఒక చిహ్నం, జెండా, యూనిఫాం ఉంటుంది.
ప్రస్తుతం విద్యార్ధులు ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, టీవీలు ఇతర సాధనాల వల్ల దేశ భక్తి, సామాజిక స్పృహను కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం కావడంతో కేరళ ప్రభుత్వం అన్ని రకాలుగా అధ్యయనం చేసి స్టూడెంట్ పోలీసు కేడెట్‌ను ఏర్పాటు చేసిందని ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుతం డ్రగ్ మాఫియా, పబ్‌లు, హుక్కాసెంటర్ల మాయలోపడి చట్టాలంటే భయం లేకుండా వ్యవహరిస్తున్న టీనేజర్లలో సామాజిక అవగాహన కల్పించే సదుద్దేశ్యంతో స్టూడెంట్ పోలీసు కేడెట్ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన షి టీమ్స్ ప్రయోగం సక్సెస్ కావడంతో అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర పోలీసు శాఖను సంప్రదిస్తున్న సంగతి విదితమే.

కేరళలో స్టూడెంట్ పోలీస్ కేడెట్ విభాగం సభ్యులు (ఫైల్‌ఫొటో)