విజయనగరం

విదేశీ ఉద్యోగ ప్రకటనలతో మహిళలు మోసపోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: విదేశాలలో ఉద్యోగాలు కల్పిస్తామని సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలు చూసి మహిళలు మోసపోవద్దని జిల్లా ఎస్పీ జి.పాలరాజు అన్నారు. ఇటీవల కువైట్, ఇతర దేశాల్లో నర్సులుగా పనిచేసేందుకు మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కొన్ని సంస్థలు చేస్తున్న తప్పుడు ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోరాదన్నారు. ఫేస్‌బక్‌లు, వాట్సాప్‌లు, కొన్ని ప్రైవేటు వెబ్‌సైట్లలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మహిళలను కువైట్ ఆయిల్ కంపెనీల్లో నర్సులుగా నియమించనున్నట్టు తప్పుడు ఉద్యోగ ప్రకటనలు వెలువడినట్టుగా కేంద్ర హోంశాఖ గుర్తించిందన్నారు. ఈ ఉద్యోగ ప్రకటనలకు ఎటువంటి ఆధారాలుగానీ, శాస్ర్తియత లేదని, ఇవి పూర్తి అసంబద్ధమైనవని ఆయన పేర్కోన్నారు. ఇటువంటి ప్రకటనల్ని కూడా ప్రభుత్వం నడపుపుతున్న సంస్థల అనుమతి లేకుండా మహిళలను దుబాయ్ లేదా బాహ్‌రాన్ మీదుగా కువైట్‌కు మహిళలను అక్రమ రవాణా చేయడానికి వినియోగిస్తున్నారన్నారు. ఈ ఉద్యోగ ప్రకటనలన్ని కూడా మహిళలను ఆర్థికంగా మోసం చేసేందుకు, మహిళలను అక్రమంగా తరిలించేందుకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఎటువంటి ప్రకటనలైన ఇమ్మిగ్రేషన్ చట్టం 1983 సెక్షన్ 10, 24 ప్రకారం ముందస్తుగా అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతలు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘన కింద పరిగణించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

పంద్రాగస్టుకు సన్నాహాలు!
విజయనగరం: జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక పోలీసు మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుజెండాను ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే 13 శకటాలు, 24 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన 230 మంది అధికారులకు, ఉద్యోగులకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు. వివిధ శాఖల ద్వారా 1418 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.56.71 కోట్ల విలువై న ఆస్తులను పంపిదణఈ చేయనున్నా. ఇందులో డిఆర్‌డిఎ ద్వారా 1175 మంది లబ్ధిదారులకు రూ.54.24 కోట్లు, ఎస్పీ కార్పొరేషన్ ద్వారా 56 మంది లబ్ధిదారులకు రూ.1.16కోట్లు, బిసి కార్పొమరేషన్ ద్వారా 78 మంది లబ్దిదారులకు రూ.51 లక్షలు, విబిన్న ప్రతిభావంతుల శాఖలో 2 ద్వారా 23 మంది లబ్దిదారులకు రూ.5.61 లక్షలు, మత్స్సశాఖ ద్వారా 56 మంది లబ్దిదారులకు రూ.74.87 వేలు విలువగల ఆస్తులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. జిల్లాలో 13 శాఖల ప్రగతిని తెలియజేసే శకటాలను ప్రదర్శించనున్నారు. మరోపక్క పోలీసు మైదానంలో 24 స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను జెసి నాగేశ్వరరావు, డిఆర్వో సాల్మన్‌రాజ్‌కుమార్, తహశీల్దార్ గోవింద్‌లు పర్యవేక్షిస్తున్నారు.

బిజెపి యువమోర్చ ఆధ్వర్యంలో తిరంగయాత్ర
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం: పట్టణంలోని బిజెపి యువమోర్చ విభాగం ఆధ్వర్యంలో సోమవారం తిరంగయాత్రను నిర్వహించారు. ప్రజల్లో దేశభక్తి భావం, జాతీయతా భావం పెంపొందించేందకు ప్రధాని మోదీ సూచనల మేరకు ఈ యాత్రను చేపట్టారు. ఈ యాత్ర పట్టణంలోని రింగ్‌రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై కోట జంక్షన్, మూడు లాంతర్లు, గంటస్తంబం, ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచి, రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు పాకలపాటి హర్ష మాట్లాడుతూ 71 ఏళ్ల భారత్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఈ తిరంగ యాత్ర చేపట్టామన్నారు. ప్రధాన కార్యదర్శి మజ్జి రమేష్‌బాబు, పట్టణ అధ్యక్షుడు శంభాన కార్తీక్, ప్రధాన కార్యదర్శి జి.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.

ఆనందపురంలో బంజరు భూమిని స్వాధీనం చేసుకోవాలి
చీపురుపల్లి: గ్రామ దేవత బండిమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ బంజరుభూమిని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని మాజీ శాసనసభ్యుడు గద్దె బాబూరావు డిమాండ్ చేశారు. స్థానిక నటరాజ్‌రెసిడెన్సీలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని గుర్ల మండలం ఆనందపురం రెవిన్యూ పరిధిలో అమ్మవారి ఆలయానికి చెందిన సర్వేనెంబరు 2-2లో సుమారు 1.60 ఎకరాలు రూ.కోటిపైగా విలువచేస్తుందని, ఇప్పటికే ఇది వివాదస్పదంగా మారిందని, ఇప్పటికైనా రెవిన్యూ అధికారులు దృష్టిసారించి స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. స్థల వివాదంలో కబ్జాదారుడికి, రెవిన్యూ అధికారుల మధ్య వివాదం జరుగుతుండగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గుర్ల మండలం కోటగండ్రేడులో భూములు ఉన్నాయని, వాటిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టులను కూడా ఆశ్రయించారని వెల్లడించారు. తన అధీనంలో ఉన్న భూమి అంతా రెవిన్యూ అధికారులు 2016లో నిర్ధారించిన మీదటే తాను సదరు భూములను అనుభవిస్తున్నట్టు వెల్లడించారు. బంజరు భూమి విషయంలో పెరుగుతున్న వివాదాలను కప్పిపుచ్చేందుకు తనను భూ వివాదంలోకి లాగుతున్నట్టు పేర్కొన్నారు.

ఎల్.కోటను కరవు మండలంగా ప్రకటించాలి

లక్కవరపుకోట: లక్కవరపుకోటను కరవు మండలంగా ప్రకటించాలని ఎస్.కోట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాంప్రసాద్ అన్నారు. సోమవారం ఎల్.కోటలో టిడిపి మండల పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి బలోపేతానికి శక్తివంచన లేకుండా అందరు కృషి చేయాలని, బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను బలోపేతంచేసి సిద్ధంగా ఉంచాలని, ఎట్టిపరిస్థితులలోను పార్టీ ముందుంజలో ఉంచేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఈ సందర్భంగా సభ్యులు కొన్ని తీర్మానాలు చేశారు. ఎల్.కోట మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని, లబ్దిదారులు ఈ మండలంలో ఎక్కువగా ఉండడం వలన మండలానికి ఇళ్లు ఎక్కువగా మంజూరు చేయాలని, పింఛన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మండలానికి ఎక్కువగా కేటాయించాలని తీర్మానించారు. అలాగే చంద్రబాబును విమర్శిస్తూ జగన్ చేసే వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సి.హెచ్.మల్లునాయుడు, జడ్పీటిసి కరెడ్ల ఈశ్వరరావు, ఎంపిపి కొల్లు రమణమూర్తి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బి.సత్యం, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి: బాబ్జీ

లక్కవరపుకోట: కంపెనీల పరిసర ప్రాంతాలలో ఉన్న వారికి ఉద్యోగాలు, పనికల్పనలకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. సోమవారం ఏడు మండలాలకు సంబంధించిన శ్రీ ఆంజనేయ లారీ అసోసియేషన్ నాయకులతో కలసి ఎల్.కోట మండలంలోని మహామాయ, స్టీల్ ఎక్సేంజ్ ఇండియా లిమిటెడ్ మేనేజరుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు మండలాలకు సంబంధించి 150 వరకు బాడీ లారీలు లోకల్‌లో ఉన్నాయని, లోడింగ్, అన్‌లోడింగ్‌కు ఇతర ప్రాంతాల నుంచి లారీలను తీసుకువస్తే ఇక్కడ లోకల్‌లో లారీలకు పనిలేక ఇబ్బంది పడుతున్నారని, ఇకనుంచైనా లోకల్ లారీలకు పనికల్పించాలని మేనేజ్‌మెంటుకు విజ్ఞప్తి చేశామని అన్నారు. మొదటిగా మహామాయకు వెళ్లి డిప్యూటీ మేనేజరు హర్షకు, తరువాత హెచ్ ఆర్ మేనేజరు బాలకృష్ణకు వినతి పత్రాలు అందజేశారు. వారు మేనేజ్‌మెంటుకు తెలియజేసి వారి నిర్ణయాన్ని నాయకులకు తెలియజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా లారీల అసోయిసేషన్ ప్రెసిండెంట్ లెంక సంజీవరావు మాట్లాడుతూ కంపెనీలు వస్తే ఉపాధి దొరుకుతుందని వీరికి భూములు, ఇతర అన్ని ఏర్పాట్లు స్థానిక పంచాయితీ నాయకులు కల్పిస్తే ఇపుడు లోకల్ వాళ్లను కాదని వేరే వాళ్లను తీసుకువచ్చి పనిచేయించుకోవడం ఎంత వరకు న్యాయమని అన్నారు. అడిగేవారు లేరని మా నోటికాడకూటిని ఇంకొకరికి దోచిపెడుతున్నారని, దీనిపై ఇప్పటికైనా స్థానిక నాయకులు స్పందించి నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, లారీ అసోసియేషన్ సెక్రటరీ పి.రాము, దొడ్డి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

దత్తత పాఠశాలకు ఎస్సై వరప్రసాద్ మెరుగులు

గజపతినగరం: గజపతినగరంలో ఎస్సీ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను నెల రోజుల కింద ఎస్సై వరప్రసాద్ దత్తత తీసుకున్నారు. దీంతో పాఠశాలను వదిలివేయకుండా ఎన్నో ఏళ్ల నుండి సున్నాలు, పెయింగ్‌లు లేకుండా నిరాధారణకు గురైన పాఠశాల భవనం, ప్రహరీ గోడలకు రంగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పనులు పూర్తిచేశారు. పాఠశాలకు బయట, లోపల సొంత ఖర్చులతో సున్నాలు, పెయింటింగ్‌లు వేయించారు. అలాగే ప్రహరీ గోడకు అక్కడక్కడ మరమ్మతులు చేపట్టి గేటును ఏర్పాటు చేయించారు. పాఠశాల ఆవరణ చుట్టూ ఉన్న చెత్తాచెదారం, డొంకలు, తుప్పలను తొలగించి పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇక విద్యార్థులు విద్యాప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు మంచిక్రమశిక్షణ కలిగేలా అవసరమైన అన్ని చర్యలతోపాటు అవసరమైన పుస్తకాలు, ఇంకా మేమీ అవసరమో గుర్తించి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఎస్సై తెలిపారు. పాఠశాలను దత్తత తీసుకోవడంతోనే పని అయిపోయిందని చేతులు దులుపుకునే వారిలా ఎస్సై వరప్రసాద్ వదిలేయకుండా పాఠశాలకు సున్నాలు, రంగులు, విద్యార్థులకు అవసరమైన పెయింటింగ్‌లు వేయించి అహ్లాదకరమైన వాతావరణం కలిగించడంపట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి

గజపతినగరం: సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని స్థానిక ఎంపిపి గంట్యాడ శ్రీదేవి అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడానికి పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు. కష్టాలలో ఉన్నవారిని గుర్తించి వారి వివరాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావిశ్రీధర్, వైస్ ఎంపిపి కనకల పోలినాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు, కార్యదర్శి కోరాడ జానకీరాము తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ జాతీయ భావం పెంపొందించుకోవాలి

గజపతినగరం: ప్రతి భారతీయుడు జాతీయ భావం పెంపొందించుకోవడం ద్వారా దేశాన్ని కాపాడుకోవచ్చని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.వి.వి.గోపాలరాజు అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఫిరంగ యాత్ర పేరుతో జాతీయ జెండాలు చేతబట్టి మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ పట్టణంలోని పురవీధులలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పుడు భారత్‌పై పక్కనే గల పాకిస్థాన్, చైనా దేశాలు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయని అన్నారు. దేశంలో భిన్న సంస్కృతులు, జాతులు, మతాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలంతా ఒకేమాట, ఒకేవాదానికి కట్టుబడి ఉండటం వలనే శత్రు దేశాలు దండెత్తడానికి భయపడుతున్నాయని అన్నారు. ప్రతి భారతీయుడు దేశ స్వాతంత్య్రం కోసం ఏ విధంగా అయితే ఆనాడు పోరాటంలో పాల్గొన్నారో అదే స్ఫూర్తిని తీసుకుని దేశాన్ని కాపాడుకోవడంలో అతే పఠిమను కనబరచాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రెడ్డి పావని, బూడి మన్మధరావు, గేదెల అప్పలనాయుడు, నాగమళ్లి సుబ్రహ్మణ్యం, కె. ఎన్. శర్మ, పొట్టా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆ ఏడు దస్త్రాలు తప్పక ఉండాల్సిందే

బొండపల్లి: ప్రతి గ్రామ పంచాయితీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏడు దస్త్రాలు తప్పక ఉండాల్సిందేనని ఎంపిడి ఓ ఎం.ప్రకాశరావు అన్నారు. సోమవారం మండల ఉపాధి హామీ కార్యాయంలో ఈ మేరకు ఎపిఓ, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనుల పారదర్శకతకోసం పంచాయితీలలో ఏడు దస్త్రాలు ఉంచాలని స్పష్టం చేశారు. జాబ్‌కార్డు, రిజిస్ట్రారు, ఫిర్యాదుల దస్త్రం, పనుల కేటాయింపు తెలిపే వివరాలు రిజిస్ట్రారు పంచాయితీ పరిధిలో గుర్తించిన ఆస్థుల రిజిస్ట్రర్, పనుల కల్పన రిజిస్ట్రరు, ఉపాధి హామీ వివరాలు తెలిపే దస్త్రంతోపాటు గ్రామ సభ నిర్వహణ రిజిస్ట్రరు ఉండాలని ఎంపిడిఓ ప్రకాశరావు గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆయన పిఎ, ఎల్‌ఎలకు ఏడు దస్త్రాల కేటాయింపుపై దిశనిర్ధేశ్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఇఓపిఆర్‌డి రవికుమార్, ఎపిఒ రవిబాబు తదితరులు పాల్తొన్నారు.

నంద్యాల ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే గీత

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి స్థానిక ఎమ్మెల్యే మీసాల గీత పయనమయ్యారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆమె మంగళవారం నుంచి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇప్పటి వరకు ఇతర పార్టీ నాయకులు అక్కడ విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ టిడిపి శ్రేణులు ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఎవరు నంద్యాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఎన్నికలు మరో 10 రోజులు ఉండటంతో ఆమెను కూడా ప్రచారంలో పాల్గొనాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో ఆమె స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

వర్షాభావంతో రైతులు ఆందోళన

దత్తిరాజేరు: మండలంలో గత 15రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురవకపోవడం, కొద్దిపాటిగా వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజుల క్రితం వేసిన వరినాట్లు ఏపుగా పెరిగి వరినార్లు ఏపుగా పెరిగి నాట్లువేసే సమయానికి తాగునీటి చెరువుల్లో చుక్కనీరు లేకపోవడంతో ఏడొంపుల గెడ్డ, పోతుల గెడ్డ సాగునీరు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి వర్షాలు సమృద్దిగా కురిసి సాగునీటి చెరువుల్లో పోతుల గెడ్డ, ఏడొంపులగెడ్డ ఉధృతంగా ప్రవహించి వ్యవసాయ భూముల్లో సమృద్ధిగా నీరు చేరడంతో వరినాట్లు వేశారు. అయితే ఈ ఏడాది వరినార్లు వేసిన దగ్గర నుంచి సమృద్దిగా వర్షాలు కురవకపోవడంతో అప్పుడప్పుడు కురిసిన చిన్నపాటి వర్షాలకు వరినారు ఏపుగా పెరిగినా వరినాట్లు వేసేందుకు తగిన వర్షం కురవలేదు. గత రెండు రోజులుగా అల్పపీడన ప్రభావంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినా కొద్దిపాటి వర్షం తప్పితే భారీగా వర్షం కురవలేదు. సాగునీటి చెరువులతోపాటు, నిమ్మానికట్టు ఛానల్, కారికట్టు ఛానల్ ద్వారా చుక్కనీరు రాకపోవడంతో వీటి కింద ఉన్న వ్యవసాయ భూములలో నీరు చేరలేదు. దీంతో పలు గ్రామాలకు చెందిన రైతులు వరినారు పెరిగి ముదురుపోతున్న సమయానికి సమృద్ధిగా వర్షాలు పడకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి మరో నాలుగు, ఐదు రోజులు ఉన్న ఎడల వరి నారు ముదిరిపోయి వరినాట్లుకు పనికిరాకుండా పోతుందని, దీని ద్వారా రైతులు అధికంగా నష్టపోతారని పలు గ్రామాల రైతులు అంటున్నారు. వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

వయోజనుల్లో ఒంటరి తనాన్ని పోగొట్టాలి

విజయనగరం(పూల్‌బాగ్): వయోజనులలో ఒంటరితనాన్ని పోగొట్టడం ద్వారా వారు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉందని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు కె.వి. ఎన్. తమ్మన్నశెట్టి అన్నారు. సోమవారం జరిగిన ఎస్‌విఎస్ వృద్ధాశ్రమ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాశ్రమాల సంస్కృతి మంచిదికాదని అన్నారు. వృద్ధాప్యంలో పిల్లలు తమతల్లిదండ్రులను చూడకుండా వృద్ధాశ్రమాలలో విడిచిపెట్టడం ఎంతమాత్రం మంచిదికాదని అన్నారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు కట్టమూరి ఆంజనేయులు మాట్లాడుతూ తమ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు ఏ విధమైన సపర్యలు చేస్తున్నామో వివరించారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధి నూకరాజురెడ్డి, వృద్ధాశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో గోపూజ

విజయనగరం(పూల్‌బాగ్): తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో సోమవారం మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది కేంద్రాలలో ఆలయ శుద్ధి, నగర సంకీర్తన కార్యక్రమాలతోపాటు గోపూజ, ఉట్టి సంబరం కార్యక్రమాలను జరిపారు. ఈ సందర్భంగా టిటిడి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటీవ్ శ్యామసుందరం మాట్లాడుతూ టిటిడి ఆదేశాల మేరకు మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేంకటేశ్వర ఆలయ అర్చకుడు నర్సింహాచార్యులు, అధికార్ల రామచంద్రరావు భక్తులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమిపూజలు

విజయనగరం(పూల్‌బాగ్): పట్టణంలోని కె. ఎల్.పురంలో ఉన్న రాధాకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి పూజలను సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కృష్ణాష్టమి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు రాధాకృష్ణులను దర్శించుకుని గోత్రనామాలతో పూజలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు నవనీతాన్ని ప్రసాదంగా అందజేశారు. ఆలయ ధర్మకర్త మాతా వరలక్ష్మి పూజలలో పాల్గొన్నారు.

పంచాయితీ కార్యాలయాల్లో జెండా ఎగురవేద్దాం

విజయనగరం(టౌన్): గ్రామ పంచాయితీ కార్యాలయాలలోనే సర్పంచ్‌లు జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎపి పంచాయితీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. సోమవారం ఛాంబర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి సర్పంచ్‌లు గ్రామ పంచాయితీలోని ప్రభుత్వ పాఠశాలల్లో జెండాను ఎగురవేసేవారని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం ఆ గౌరవాన్ని తీసివేసిందని ఆరోపించారు. ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో అధికారాలను కుదించిన ప్రభుత్వం కనీసం జెండా ఎగురవేసే గౌరవం కూడా లేకుండా చేసిందని, ఇది అప్రజాస్వామికమని విమర్శించారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ప్రభుత్వ జెండా పండగ కార్యక్రమాన్ని బహిష్కరించి గ్రామీణ ప్రజలతో పంచాయితీ కార్యాలయాలలో జెండా ఎగురవేయాలని కోరారు. ప్రభుత్వం సర్పంచ్‌లకు తగిన ప్రాధాన్యత ఇచ్చే వరకు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఛాంబర్ సభ్యులు అయినాడ సర్పంచ్ రామేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి షటిల్‌బ్యాడ్మింటన్ పోటీలకు ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు

శృంగవరపుకోట: ఎస్.కోట ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి షటిల్‌బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారని అకాడమీ చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అకాడమికి చెందిన టి. సతీష్‌కుమార్, ఎం.కార్తీక్, అండర్-013 విభాగంలో పి. సతీష్‌కుమార్, ఎం.చలపతి, కె.పవన్‌కుమార్, అండర్-15 విభాగంలోను ఎంపికయ్యారని చెప్పారు. వీరు ఈ నెల 16 నుంచి 19 వరకు రాజమండ్రిలో జరిగే రాష్టస్థ్రాయి పోటీలలో సింగల్స్, డబుల్స్ విభాగాలలో తలపడతారని అన్నారు. ఈ నెల 6నుంచి 9వ తేదీ వరకు విజయనగరంలోని డిఎస్‌ఎ ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనబరచి విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. రాష్టస్థ్రాయి పోటీలకు వెళుతున్న క్రీడాకారులను అకాడమి అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు, ఫ్రెండ్స్ డిక్రీయేషన్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎస్.వి.సత్యశేఖర్, రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు బుగత వెంకటేశ్వరరావు, స్నేహ స్వచ్చంద సంస్థ అధ్యక్షులు అట్లూరి వెంకటరావు, కార్యదర్శి ఎం.సుబ్బారావు, జాతీయ స్థాయి వెటరన్ క్రీడాకారుడు అంబటి స్వామినాయుడులతోపాటు ఎంపిపి రెడ్డి వెంకన్నలు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో అద్భుతంగా రాణించి జిల్లాకు చక్కని పేరు తేవాలని ఆకాంక్షించారు.

అంగరంగవైభవంగా కృష్ణాష్టమి వేడుకలు...!
*రాధా, కృష్ణుల వేషంలో మురిపించిన చిన్నారులు...
పార్వతీపురం (రూరల్): పార్వతీపురం పట్టణంలో, మండలంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక గాయత్రి పాఠశాలలో విద్యార్థులంతా రాధా కృష్ణుల వేషధారణంలో ముచ్చగొలిపారు. దీనిలో భాగంగా ఉట్టిగొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా విద్యార్థులు ఉట్టిని గొట్టేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల కరస్పాండెంట్ పివికె మణికుమార్, డైరెక్టర్ పివికె సరిత తదితరులు మాట్లాడుతూ విద్యార్థులకు పురాణ, ఇతిహాస కథలను, అందులోని నీతి నిజాయితీల గూర్చి తెలియజేయాలన్నారు. అప్పుడే సొసైటీకి చక్కటి పౌరులు లభిస్తారన్నారు. అటువంటి పౌరులతో నిండిన సమాజం ఉత్తమంగా ఉంటుందన్నారు. దీంతోపాటు పట్టణంలోని పలు పాఠశాలలు, గీతామందిరంలో గోపాల కృష్ణ యాదవ సంఘ ఆద్వర్యంలో డా.మంచిపల్లి శ్రీరాములు, కౌన్సిలర్ మంచిపల్లి సత్యన్నారాయణ తదితరుల ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రతిపక్షం పరార్...!
*స్వపక్షంలోనే విపక్షం పోషిస్తున్న వైనం...!
*అయినా కదలిక రాని వైకాపా...!
*లోపాకారి ఒప్పందాలే కారణమనే ఆరోపణలు...!
**తేదేపాలో బలపడుతున్న వ్యతిరేకత...!
*టౌన్ టీడీపీ సమావేశానికి టీడీపీ కౌన్సిలర్లు డుమ్మా...!
పార్వతీపురం (రూరల్): గత కొన్ని రోజులుగా పార్వతీపురం మున్సిపాల్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం వైకాపా పరార్ అయ్యిందని పార్వతీపురం ప్రజలు చర్చించుకుంటున్నారు. పాలకులైన అధికార పక్షం చేసే తప్పులను, అవకతవకలను ఎత్తిచూపి ప్రజల పక్షాన పోరాడాల్సిన వైకాపా అడ్రస్ మున్సిపాల్టీలో కానరావడం లేదంటున్నారు. గత కొన్ని రోజులుగా అధికార పక్షానికి చెందిన కొంతమంది కౌన్సిలర్లే స్వపక్షంలో విపక్షం అవతారమెత్తి మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై విజిలెన్స్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రతిపక్షం వైకాపాలో కనీసం చీమకుట్టినట్లు కూడా లేదంటున్నారు. ప్రజలు నమ్మకంతో 30 వార్డుల్లో దాదాపు 10 వార్డుల ప్రజలు వైకాపాకు పట్టం కడితే ప్రజల పక్షాన కనీసం పోరాటం చేయకుండా, చోద్యం చూస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాల్టీలో చోటు చేసుకుంటున్న పలు అవినీతి, అవకతవకల ఆరోపణల పట్ల కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదంటున్నారు. దీనికి ప్రధాన కారణం లోపాకారి ఒప్పందాలేననే గుస గుసలు వినిపిస్తున్నాయి.
**అదేం లేదు...వైకాపా నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్...
ఈ విషయమై వైకాపా పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ వద్ద ప్రస్తావించగా, లోపాకారి ఒప్పందాలేమీ లేవని, అయితే తమ అధిష్టానం ఆదేశాల మేరకు పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే పలు సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం చేశామన్నారు.
**టీడీపీలో బలపడుతున్న వ్యతిరేకత...!
మున్సిపాల్టీ అధినేతపై వ్యతిరేక గళం వినిపిస్తున్న అధికారపార్టీ స్వపక్ష కౌన్సిలర్ల వ్యతిరేకత రోజు రోజుకు బలపడుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ప్రతీ నెల 14న పట్టణంలో జరిగే టౌన్ టీడీపీ సమావేశానికి ఆయా కౌన్సిలర్లు డేమ్మా కొట్టినట్లు సమాచారం. వారంతా సమావేశానికి డుమ్మా కొట్టి తోటపల్లి వెళ్లినట్లు తెలిసింది. అక్కడకు వెళ్లిన వ్యతిరేక వర్గం భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇందులో కొంతమంది వ్యతిరేక వర్గ కౌన్సిలర్లు ఆదివారం రాత్రి పట్టణంలో ఓ లాడ్జిలో సమావేశమై పలు అంశాలు చర్చించినట్లు సమాచారం. దీనిలో భాగంగా అవిశ్వాస నోటీసు ఇచ్చేందుకు మూడేళ్ల, లేక నాలుగేళ్ల అనేదానిపై చర్చించి, ఇకపై ఏ సమావేశానికి హాజరుకాకూడదని నిర్ణయించినట్లు సమాచారం. దీనిలో భాగంగానే సోమవారం టౌన్ మీటింగ్‌కు హాజరుకాలేదనే మాటలు వినిపిస్తున్నాయి.

సారిపల్లి పార్వతీపురం శ్రీమంతుడు...!
*ఎస్వీడి కళాశాల అభివృద్ధికి రూ.60లక్షలు సాయం చేసిన సారిపల్లి ఫౌండేషన్
*ఎమ్మెల్యే, ఎమ్మల్సీ, చైర్‌పర్సన్ తదితరులు...
పార్వతీపురం (రూరల్): సారిపల్లి దాలి మృత్యుంజయరావు పార్వతీపురం శ్రీమంతుడని పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మున్సిపల్ ద్వారపురెడ్డి శ్రీదేవి, వైస్ చైర్మన్ బెలగాం జయబాబు, ఎస్వీడీ కళాశాల ప్రిన్సిపాల్ డా.సిహెచ్ చలపతిరావు తదితరులన్నారు. సోమవారం స్థానిక ఎస్వీడీ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో సారిపల్లి సరస్వతి డి ఎం ఆర్ ఫౌండేషన్ చేసిన రూ.60లక్షల ఆర్థిక సాయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పుట్టినూరుకు ఎంతో కొంత చేయకపోతే లావైపోతారనే శ్రీమంతుడు సినిమా డైలాగ్...వినడానికి ఆసక్తికరంగా ఉన్నా, ఆచరణలో సాధ్యం కాదని, అయితే ఆచరణలో సాధ్యమని సారిపల్లి దాలి మృత్యుంజయరావు నిరూపించారన్నారు. పట్టణంలో పుట్టి, పెరిగి, ఇక్కడే చదువుకొని తన అపారమైన మేథో సంపత్తిచే ఉన్నత స్థాయికి ఎదిగిన సారిపల్లి సరస్వతి డి ఎం ఆర్ ఫౌండేషన్ అధినేత సారిపల్లి దాలి మృత్యుంజయరావుపుట్టిన ఊరికి ఏదో చేయాలనే తాపత్రయంతో తన నివాసాన్ని గ్రంథాయలయంగా మలిచారన్నారు. అంతే కాకుండా నిరుద్యోగ యువతకు అవసరమైన అనేక రకాల శిక్షణలిస్తూ వారికి ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారన్నారు. అంతే కాకుండా తాను చదువుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను రూ.40లక్షల వ్యయంతో అభివృద్ధి చేశారన్నారు. అక్కడతో ఆగకుండా స్థానిక మున్సిపల్ టి ఆర్ ఎం పాఠశాల తదితర వాటి అభివృద్ధికి కూడా లక్షలాధి రూపాయలు సాయం చేశారన్నారు. ఇప్పుడు ఎస్వీడీ ఎయిడెడ్ కళాశాల అభివృద్ధికి రూ.60లక్షలు సాయం చేసిన తన ఉదారతను చాటుకున్నారన్నారు. సారిపల్లిని పలువురు ఆదర్శంగా తీసుకుంటే ప్రతీ పెద్ద వ్యక్తి పుట్టినూరు అభివృద్ధితో తులతూగుతుందన్నారు. అనంతరం సారిపల్లి మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లి, ఊరుని మర్చిపోరాదని, అందుకే తనకు చేతనైంత సాయం చేస్తున్నానని, భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతానన్నారు. అనంతరం తన ఆర్థిక సాయంతో అభివృద్ధి చేపట్టిన కళాశాల గదులను ఆయన ప్రారంభించారు. దీనిలో భాగంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తప్పిటగుళ్లు ఆట, ఎన్.సి.సి.కెడెట్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పట్టణ పెద్దలు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.