రాష్ట్రీయం

వైద్య వేదికగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/గుంటూరు: రాష్ట్రాన్ని మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజధాని పరిధిలోని ఎర్రబాలెంలో బ్రిటన్‌కు చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కింగ్స్ కళాశాల ఆసుపత్రికి బుధవారం సిఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ యూరప్‌లో కింగ్స్ ఆసుపత్రికి చాలా పేరుప్రఖ్యాతలు ఉన్నాయన్నారు. ఇటీవల బ్రిటన్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్‌లో కింగ్స్ ఆసుపత్రులను, వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. తొలుత 10 చోట్ల ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినప్పటికీ, అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు. కింగ్స్ కాలేజీ ప్రతినిధులు తన వద్దకు వచ్చినప్పుడు, దేశంలోని ఆ సంస్థకు చెందిన కళాశాలలకు అమరావతి ప్రధాన కార్యాలయంగా ఉండాలని, అందుకు సమ్మతిస్తే, వెంటనే 150 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధమని తెలిపానని గుర్తు చేసుకున్నారు. ఇందుకు కింగ్స్ ప్రతినిధులు సమ్మతించారని, దేశంలో 17 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు, అమరావతిలో 1600 కోట్ల రూపాయలు పెట్టనున్నారన్నారు. అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి, కేన్సర్ చికిత్స, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, వివిధ పరికరాల తయారీ యూనిట్లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయన్నారు. 4 వేల రికార్డులను భద్రపరిచేందుకు కూడా ఏర్పాటు ఉంటుందన్నారు. కొన్ని పీజీ కోర్సులను కూడా నిర్వహిస్తారన్నారు. భవిష్యత్తులో అమరావతి మెడికల్ టూరిజం హబ్‌గా తయారవుతుందన్నారు. యూరోప్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి చికిత్స కోసం వచ్చే వారు ఉండేందుకు వీలుగా 3,5 స్టార్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ఇతర దేశాల కన్నా, తక్కువ ఖర్చుతో వైద్యం లభిస్తుందని, దీంతో యూరప్ అంతా అమరావతికి వస్తుందన్నారు. ప్రపంచంలోని అత్యున్నత విజ్ఞానాన్ని అమరావతికి తీసుకువస్తున్నానన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 13 వైద్య కళాశాలలు ఉన్నాయని, వీటి సంఖ్య 20కు చేరే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, అందరికీ ఆరోగ్యం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టామని వివరించారు.బ్రిటన్‌తో చాలా కాలంగా రాష్ట్రానికి సంబంధాలు ఉన్నాయన్నారు. ధవళేశ్వరం ఆనకట్ట, ప్రకాశం బ్యారేజీ, సంగం ఆనకట్ట వంటివి బ్రిటీష్‌వారే నిర్మించారని గుర్తు చేశారు. అమెరికాలోని ప్రతి నలుగురు డాక్టర్లలో ఒకరు భారతీయుడు కాగా, భారతీయుల్లో నలుగురిలో ఒకరు రాష్ట్రానికి చెందిన వారన్నారు. భవిష్యత్తులో గ్లోబల్ కంపెనీల సిఇఒల్లో 30 శాతం మంది తెలుగువారు ఉంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ‘మీ దగ్గర నాలెడ్జి ఉంటే, మా దగ్గర మార్కెట్ ఉందని, దీనిని ఉపయోగించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రారంభించే తేదీ తెలియచేయాలని కింగ్స్ కళాశాల ప్రతినిధులను కోరగా, వచ్చే ఏడాది అక్టోబర్ 2 నాటికి ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. భూముల కేటాయింపుల్లో తొందరపడటం లేదని, అమరావతి రాజధానికి ఏది వచ్చినా అది ప్రపంచ శ్రేణిదే కావాలని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రెండవ ఇల్లుగా చేసుకోవాలని కింగ్స్ ప్రతినిధులను కోరారు.
వైద్య సేవలకు ప్రాధాన్యత: అనుప్రియా
దేశంలో వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తూ ఒక ప్రణాళిక సిద్ధం చేశామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. దీనిని అమలు చేసేందుకు ఒక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేశామన్నారు. ఒక రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి అమలు చేయనున్నామన్నారు. అందరికీ ఆరోగ్యం అన్న అంశాన్ని కేంద్రకంగా తీసుకుని దీనిని రూపకల్పన చేశామన్నారు. వైద్య రంగంలో మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కింగ్స్ కళాశాల ఆసుపత్రి చైర్మన్ లార్డ్ రాబర్ట్ కెర్స్‌లేక్, ఇండో యుకె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెడిసిటీ ప్రాజెక్ట్సు ఎంపి అజయ్ రాజన్ గుప్తా, దక్షిణ భారతదేశంలో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ భరత్ జోషి, బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు ఆండ్రూ మిచెల్, బ్రిటన్ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ హెడెన్ స్పైసర్, రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, కామినేని శ్రీనివాస్, ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిత్రం.. లండన్ కింగ్స్ కాలేజీ హాస్పటల్ శంకుస్థాపన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం చంద్రబాబు