శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం : విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక విఆర్‌సి కూడలి నుంచి విద్యార్థులు పెద్దసంఖ్యలో ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ముందుగానే అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులు కార్యాలయంలోకి ప్రవేశించకుండా గేట్లు వేశారు. దాంతో విద్యార్థులు గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దగా నినాదాలు చేశారు. అనంతరం ఏబివిపి రాష్ట్ర కార్యదర్శి మన్నూరు మల్లికార్జున మాట్లాడుతూ నేడు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై ఉన్న మక్కువ విద్యపై లేదన్నారు. జిల్లాలో కోట్లు విలువ చేసే విఆర్ విద్యా సంస్థలను ఆనం సోదరుల నుంచి ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు. కావలి జవహర్‌భారతి విద్యాసంస్థలు దోపిడీదారుల చేతుల్లో చిక్కుకుని ఉందని, దాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా పలు పాఠశాలల్లో, కళాశాలల్లో వౌలిక వసతులు పూర్తిగా లేవని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం ఉన్న పాఠశాలలను తొలగించకూడదని కోరారు. ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు ఉన్నవాటికి ప్రహారీ గోడలు నిర్మించాలన్నారు. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులను నియంత్రించి కామన్ ఫీజు విధానాన్ని తీసుకురావాలన్నారు. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై సిబిఐచే సమగ్ర విచారణ జరిపించాలన్నారు. మరోపక్క విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.
పోలీసులతో వాగ్వాదం
విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యాలయంలోకి పంపించేందుకు పోలీసులు ఒప్పుకోకపోవడంతో విద్యార్థులంతా రోడ్డుపై బైఠాయించి పోలీసులు జులుం నశించాలంటూ పెద్దగా కేకలు, నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. దాంతో పోలీసులు విద్యార్థులను వెళ్లిపోవాలని సూచించినా ఫలితం లేకపోయంది.
విద్యార్థులపై లాఠీచార్జ్, అరెస్ట్
పోలీసులు ఎంత చెప్పినా విద్యార్థులు వినకుండా గేటుకు ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తుండటంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీచార్జ్‌కు దిగారు. విద్యార్థులు వెనుకడుగు వేయకుండా కూర్చో డంతో జిల్లా కన్వీనర్ కౌషిక్‌తోపాటు పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. లాఠీచార్జ్ చేసినా విద్యార్థులు మొండిపట్టు పట్టడంతో చేసేది లేక విద్యార్థి నాయకులు ఏడుగురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దాంతో మిగిలిన విద్యార్థులు డిఆర్‌వో వెంకటసుబ్బయ్యను కలిసి వినతిపత్రం అందించారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజేష్, విభాగ సంఘటనా కార్యదర్శి జగదీష్, జిల్లా సంఘటనా కార్యదర్శి రాజేష్, శ్రీకాంత్, కిషోర్, దారా వెంకటేష్, రాజశేఖర్, బాబు, మస్తాన్, నరేష్, మనోజ్, సాంబ, వైష్ణవి, రాజేశ్వరిలతోపాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో శ్రావణ మాస పూజలు
* భక్తులతో కిటలాడిన ఆలయాలు
నెల్లూరు కల్చరల్ : జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ మాసం నాల్గవ శుక్రవారం కావడంతో భక్తులు ఉదయానే్న స్థానాలు ఆచరించి నియమ నిష్టలతో వ్రతాలు ఆచరించారు. వేకువఝాము నుంచే నగరంలోని మూలాపేట శివాలయం, రాజరాజేశ్వరీ అమ్మవారి దేవస్థానం, ఇరుకల పరమేశ్వరీ అమ్మవారి దేవస్థానం తదితర దేవాలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆయా దేవాలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయాల్లో ఉదయం నుంచే అభిషేకాలతో పూజలను ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చకుల బృందం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. జిల్లాలోని భక్తులు వారివారి మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి దైవ దర్శనం పొందారు. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మహిళా భక్తులు వ్రతాలతో పూజలు ప్రారంభించారు. మాసమంతా వ్రతాలు ఆచరిస్తే తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. తర తరాల నుంచి తమ పూర్వీకులు శ్రావణ మాసం వ్రతాలు ఆచరిస్తున్నారని, వారి బాటలోనే తాము పూజలు, వ్రతాలు నిర్వహిస్తున్నామని భక్తులు చెప్తున్నారు.

బంగారు నెక్లస్‌లు చోరీ
వేదాయపాళెం: బ్యాగులో ఉంచిన బంగారు నెక్లస్ కనిపించడం లేదంటూ బాధితులు శుక్రవారం ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు, నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్‌కు చెందిన భాస్కర్‌రావు 17వ తేదీన కుటుంబ సమేతంగా చెన్నై వెళ్లాడు. శుక్రవారం తిరిగి ఇంటికి వచ్చారు. భాస్కర్‌రావు భార్య తన చేతి బ్యాగును కుర్చీలో ఉంచి ఇంట్లోకి వెళ్లింది. కాసేపటి తరువాత హ్యాండ్ బ్యాగులో ఉంచిన 10 సవర్ల బంగారు నెక్లెస్‌లు కనిపించకపోవడంతో కంగారు పడి బాధితులు ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పనిచేస్తున్న పనిమినిషి తీసి ఉంటుందని బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదోనగర సిఐ మంగారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
* నలుగురికి తీవ్ర గాయాలు
మర్రిపాడు: మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి గ్రామ సమీపంలో ఓ కారు వేగంగా వెళ్తూ రోడ్డుమార్జిన్‌లోని చెట్టును ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇరువురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుచ్చిమండలం కాగులపాడుకు చెందిన వి వేణుగోపాల్‌రెడ్డి (37), దాసరి బాబీ (40)లు అక్కడికక్కడే మృతిచెందారు. కొండా వంశీ, కొండానిఖేలేష్‌రెడ్డి, బత్తిన మస్తాన్, బత్తిన నారాయణలకు తీవ్రగాయాలయ్యాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలం కాగులపాడు నుంచి కడప జిల్లా బద్వేల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన బాధితులను ఆత్మకూరు పట్టణంలోని అభిరామ్ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. మర్రిపాడు ఎస్సై షేక్ అబ్ధుల్ రజాక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
రిమాండ్ ఖైదీ పరార్...పట్టివేత
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు : కట్టుకున్న భార్యపై హత్యాయత్నం చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసులు అనే అతను ఆరోగ్యం బాగు లేదన్న సాకుతో హాస్పిటల్ నుంచి పరారై, మళ్లీ పోలీసులకు చిక్కాడు. వివరాలిలా వున్నాయ. ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ చివరకు హత్యాయత్నానికి ప్రయత్నించాడన్న అభియోగంపై అతనికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే రెండు రోజుల క్రితం కడుపులో నొప్పి అని చెప్పడంతో పోలీసులు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం డాక్టర్ వద్దకు పంపిన పోలీసులు బందోబస్తు నిమిత్తం బయట ఉన్నారు. అయితే ఖైదీ శ్రీనివాసులు పోలీసుల కళ్లుగప్పి హాస్పిటల్ నుంచి పరారయ్యాడు. ఇతను శుక్రవారం ముత్తుకూరు మండలంలో సంచరిస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముత్తుకూరు ఎస్‌ఐ సాంబశివరావు సిబ్బందితో దాడి చేసి చాకచక్యంగా పట్టుకొని ఖైదీని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నగర ఐదో నగర పట్టణ పోలీసు స్టేషన్‌కు రిమాండ్ ఖైదీని అప్పగించారు.
సర్వశిక్షా అభియాన్ పివోగా విశ్వనాథ్
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్‌గా ఇ.విశ్వనాథ్ నియమితులయ్యారు. ఈయన విడవలూరు డిగ్రీ కళాశాలలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేయుచున్నారు. కలెక్టర్ అనుమతితో శుక్రవారం పివోగా విధుల్లో చేరారు. ప్రస్తుతం ఇన్‌చార్జి పివోగా పనిచేయుచున్న ఎంవి రమణను తిరిగి తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్‌గా నియమించారు.

ప్రత్యేక తనిఖీలతో తగ్గిన రోడ్డు ప్రమాదాలు
* జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు స్పష్టం
వేదాయపాళెం : పోలీసు, రవాణాశాఖ, ఆర్టీసీ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల కారణంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గాయని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అన్నారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా రవాణాశాఖ ఉప కమిషనర్ ఎన్ శివరామ్‌ప్రసాద్ నేషనల్ హైవే 16కి సంబంధించి నెల్లూరు జిల్లాలో తడ నుంచి కావలి వరకు 37 ప్రమాదకర జంక్షన్లను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల సరైన వెలుతురు లేకపోవడం, సర్వీసు లైన్లు సరిగా ఉండకపోవడం వంటివి గుర్తించామని తెలిపారు. గుర్తించిన ప్రమాదకర జంక్షన్లను పవర్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుర్తించిన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న సమయాల్లో వీడియోగ్రఫీ తీయించాలన్నారు. కొద్దిపాటి ఖర్చుతో ఏర్పాటు చేసే స్పీడు బ్రేకర్లు, రేడియం స్టిక్కర్లు, సైన్‌బోర్డులు, నేషనల్ హైవే జంక్షన్లలో ఏర్పాటు చేయాలన్నారు. నేషనల్ హైవే నుంచి అప్రోచ్‌రోడ్లు, సర్వీసు రోడ్లు విషయంపై కూడా త్వరతిగతిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆర్‌అండ్‌బి రోడ్లు, పంచాయతీ రోడ్లు విషయంలో ఏ ఏ ప్రాంతాల్లో ప్రమాదకరమైన స్పాట్లు ఉన్నాయో గుర్తించి సరిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆటోలలో మహిళల రక్షణకై తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ మాట్లాడుతూ నేషనల్ హైవేలలో ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించడం వల్ల చాలా వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. డ్రంకన్ డ్రైవ్, లైసెన్స్ లేకుండా ఉండటంపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నేషనల్ హైవేలో ఐదు జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్‌లో టీమ్‌లు ఏర్పాటు చేసి 24 గంటలు కూడా ట్రాఫిక్ నియంత్రణ చేయనున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లందరికి ఒక వారంరోజులు సమయం ఇచ్చామని, వారికి నిబంధనలు తెలియజేసినట్లు తెలిపారు. వారం రోజులు పూర్తయ్యాయని, రేపటి నుంచి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ విజయకుమార్, ఆర్టీసీ డిప్యూటి చీఫ్ కంట్రోలర్ సత్యనారాయణ, నేషనల్ హైవే ఇంజనీర్ విజయభాస్కర్, డిఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ వరసుందరం, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సీతారామిరెడ్డి, విజయప్రకాష్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
రెండోరోజు కొనసాగిన ఐటి దాడులు
నెల్లూరు రూరల్: మండల పరిధిలోని పొట్టెపాళెం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డిపై రెండోరోజు కూడా ఐటి దాడులు నిర్వహించారు. ఇతను ఓ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతకు అనుచరుడు. ఐటి దాడుల్లో ఇంటి స్థలాలు, పొలాలు, బంగారు, నగదు, లెక్కకు మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. గతంలో వివిధ ఇసుక రీచ్‌లలో ఇతను భాగస్వామ్యంగా వ్యవహరించాడు. అయితే పెద్ద నోట్లు రద్దు సమయంలో కొందరికి బినామీగా వ్యవహరించి నగదు మార్పిడి చేసినట్లు, బ్యాంకుల లావాదేవీలు బయటపడటంతో అతనిపై ఐటి దాడులు నిర్వహించారు. ఓ నాయకుడికి బినామీగా వ్యవహరిస్తున్నాడని గతంలో అనేక విమర్శలు వచ్చాయి. బ్యాంకుల్లో కూడా నగదు, బంగారు నిల్వలు ఉన్నట్లు, వాటి లాకర్లను తెరవాల్సి ఉందని తెలిసింది. శుక్రవారం సాయంత్రం వరకు శ్రీకాంత్‌రెడ్డి ఇంట్లో ఐటి అధికారులు దాడులు నిర్వహించి అక్రమ ఆస్తుల వివరాలు తీసుకెళ్లినట్లు సమాచారం.