సబ్ ఫీచర్

అమ్మాయికి నేస్తం అమ్మే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ అనే పదం పలకటంలోనే ఎంతో ఆత్మీయత, దగ్గరితనం కనిపిస్తుంది. అమ్మ అంటే అమ్మాయిలకు కొండంత అండ. అమ్మ ప్రేమ, అనురాగం వెన్నంటి ఉన్నంతవరకు ఎదురులేదు. ఇంటిపనులు, వంటపనులు నేర్చుకోవటానికే కాదు ఏ చిన్న కష్టం వచ్చినా, ఎటువంటి సమస్యనైనా అమ్మకు చెబితే చిటికెలో పరిష్కారం దొరుకుతుందని భరోసాతో ఉంటారు. అమ్మ మాటలు అమ్మాయిలో మనోబలాన్ని, ధైర్యాన్ని పెంచుతాయి. కాని ఇదంతా నేటి ఉరుకుల పరుగుల కాలంలో, అమ్మలు కూడా ఉద్యోగాలు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న వేగవంతమైన జీవన విధానంలో ఇలాంటి ధైర్యం, ఓదార్పు నేటి ఆడపిల్లలకు తల్లులనుండి లభిస్తున్నాయా? అంటే సందేహమే.
అంతేగాకుండా ఈ రోజుల్లో ఉన్నతమైన చదువులు, ఎక్కువ ఆదాయం వుండే ఉద్యోగాలు పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛగా ప్రవర్తించటానికి అవకాశాన్నిస్తున్నాయి. స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ విశృంఖలత్వానికి కూడా కొందరు అలవాటుపడుతూ ఉన్నారు. పెద్దల సలహాలు, సంప్రదింపుల కోసం ఎదురుచూడటంలేదు. తల్లి ఏదైనా చెప్పబోయినా నీకేం తెలీదు అనటం సర్వసాధారణమైంది. ప్రతి చిన్నదానికి ఆవేశపడటం లేదా నిరాశపడటం అలవాటవుతున్నది. చదువులో ఒత్తిడి ఎక్కువైనా, చెడు స్నేహాల వల్ల సమస్యలు వచ్చినా అన్నిటికీ సులభమైన మార్గం ఆత్మహత్య ఒక్కటే అనుకుంటున్నారు. ఓర్పు, నేర్పు, సునిశితమైన ఆలోచన అనేవి కొరవడుతున్నాయి. అన్నీ మాకే తెలుసు, ఒకరి మాట వినవలసిన అవసరం లేదు అనుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారు.
యుక్తవయసు వచ్చిన తరువాత తల్లిదండ్రులు తమ పిల్లలను స్నేహితుల్లాగా చూడాలి అంటారు. అభిమానాన్ని చూపిస్తూ ఆప్యాయంగా పిల్లలతో మెలగటం వలన వాళ్ళు తమ మనసులోని భావాలను, తమకు ఎదురయ్యే ఒడిదుడుకులను గురించి మనసు విప్పి చెప్పుకోగలుగుతారు. అన్నింటికీ పిల్లలను దండించటమే కాకుండా వాళ్ళ మనసు తెలుసుకుని ప్రవర్తిస్తే ఇంటినుండి పారిపోవటం, ప్రాణత్యాగం లాంటివి ఉండవు. అలాగని అతిగా చనువు ఇచ్చిన పిల్లలు మాట వినకుండా తయారయ్యేలా చేయకూడదు. అవసరమైనపుడు మందలిస్తూ చక్కని మార్గదర్శకం చేయగలగాలి. అమ్మాయిల వేషధారణ, ఇతరులతో వ్యవహరించే విధానం, స్నేహితులు మొదలైనవన్నీ తల్లి గమనిస్తూ అవసరం ఉన్నపుడే కల్పించుకుని మంచి సలహాలను ఇవ్వగలగాలి. అమ్మాయిలందరూ అమ్మలను తమకు ఆప్తురాలిగా, ఆదర్శంగా భావిస్తారు. కనుక తల్లులు సహనంతో స్నేహభావంతో వాళ్ళను అర్థం చేసుకుని అండగా ఉంటే అమ్మాయిలకు అసలైన నేస్తం అమ్మ మాత్రమే అవుతుంది.

-అబ్బరాజు జయలక్ష్మి