రాష్ట్రీయం

బీమాతో మరింత ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 6: అల్పసంఖ్యాక వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న చంద్రన్న బీమా పథకంలో సహజ మరణానికి చెల్లించే పరిహారాన్ని రూ.30 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచనున్నట్టు సిఎం చంద్రబాబు వెల్లడించారు. విశాఖ జిల్లా కశింకోట మండలంలో నిర్వహించిన జలసిరికి హారతిలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రన్న బీమా పథకం ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్త్తూ మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.5 లక్షలు, పాక్షిక వైకల్య కలిగితే రూ.3 లక్షలు బీమా చెల్లిస్తున్నామన్నారు. 50 ఏళ్లలోపు వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించే యోచన ఉందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆటంకం లేకుండా చూస్తున్నామన్నారు. మైనార్టీ, ఎస్టీ, ఎస్టీలకు ప్రభుత్వం రూ. 50వేలను పెళ్లికానుగా ఇస్తోందని, బీసీలకూ పెళ్లికానున పథకాన్ని వర్తింపచేస్తూ, కొత్తగా పెళ్లైన జంటలకు రూ.25వేలు కానుకగా ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మరో రెండేళ్లలో 18 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో 13 లక్షలు, పట్టణ ప్రాంతంలో 5.25 లక్షల ఇళ్లను నిర్మించనున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.200 ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.1000కి పెంచామని, వికలాంగుల పింఛన్‌ను రూ.1,500కు పెంచామన్నారు. డ్వాక్రా సంఘాలకు, రైతులకు మూడో విడత రుణమాఫీకి త్వరలోనే నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వపరంగా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కొంతమంది అధికారుల ఉదాసీనత, అవినీతి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా సుపరిపాలన అందించేందుకు సాంకేతికత జోడించి సేవలందిస్తున్నామన్నారు. దీనికోసం పరిష్కార వేదిక ఏర్పాటు చేశామన్నారు. ఎవరికి ఏ సమస్యవున్నా 1100 నెంబర్‌కు ఫోన్ చేస్తే తానే స్వయంగా పరిశీలించి, సమస్య పరిష్కరించి తిరిగి మీకు ఫోన్ చేస్తామన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుతోనే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోందనడానికి నిదర్శనం నంద్యాల, కాకినాడ ఎన్నికలేనన్నారు. నంద్యాలలో గత ఎన్నికల్లో 1.6 శాతం ఓట్ల మెజారిటీ లభిస్తే, తాజా ఎన్నికల్లో 16 శాతానికి పెరిగిందని, ప్రజలు నన్ను నమ్మారు కాబట్టే గెలిపించారన్నారు. భవిష్యత్‌లో 80 శాతం ప్రజానీకం సంతృప్తి చెందేలా పని చేస్తామని భరోసానిచ్చారు. కులం, మతం, పార్టీల పేరిట అసంతృప్తితో ఉంటే తాను చేసేదేమీ లేదన్నారు. ప్రజలు మనవెంట ఉన్నారని, మనం కూడా వారి సంక్షేమం కోసం పనిచేయాలని ఎమ్మెల్యేలకు హితవు పలికారు. కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వర రావు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపిలు హరిబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
చిత్రం.. కశింకోట మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సిఎం చంద్రబాబు