Others

పాటకంకి మురిసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క సినిమా హిట్టయితేనే వందసార్లు డబ్బా కొట్టుకునే రోజులివి. సంగీతపరంగా సినిమాకు పేరొస్తే -ఇక మ్యూజిట్ డైరెక్టర్‌ని అస్సలు పట్టుకోలేం. అలాంటిది రికార్డల మీద రికార్డుల సృష్టించి తన ‘ట్రాక్’కు తిరుగులేదనిపించుకున్న చక్రవర్తిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
చక్రవర్తి ట్రాక్ రికార్డు చెప్పడం మొదలెడితే -సినిమా డైలాగులు సరిపోవు. మొత్తం సినిమాలు 959/ ఒక్క ఏడాదిలో సినిమాలు 69/ పాటిచ్చిన ప్రతి సినిమా హిట్టు/ నటుడు, దర్శకుడు, రచయిత, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్టు.. ఇలా చెప్పుకుంటూ పోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే -అప్పారావు పేరుతో మొదలైన జీవితం చక్రవర్తి స్థాయికి ఎదిగిపోయింది.
శారదా నను చేరగా../ శ్రీమతిగారికి తీరని వేళ../ వ్రేపల్లెను వేచెను/ వేణువు వేచెను../ కుశలమా నీవు కుశలమేనా../ సిరిమల్లె పువ్వా సిరిమల్లి పువ్వా../ పంట చేలో పాలకంకి నవ్వింది../ కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా../ వందనం అభివందనం../ రగులుతోంది మొగలి పొదా../ ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో.../ చిలక కొట్టుడు కొడితే చిన్నదానా../ రాధా అందించు నీ లేత పెదవి..
ఒక్కో లైను చదువుతుంటే -పాట.. దాని బాణీ.. సినిమా.. అందులోని సన్నివేశం అంతా రీళ్లురీళ్లుగా గుర్తుకొచ్చేస్తోంది కదూ! అదీ సంగీత చక్రవర్తి అంటే.
తెలుగులో సంగీత దర్శకుడిగా ‘మూగప్రేమ’తో కెరీర్ ప్రారంభించిన చక్రవర్తి -1997లో ‘పెళ్లామా మజాకా’ వరకూ సుస్వరాలు అందిస్తూనే ఉన్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల సినిమాలన్నీ కలుపుకుంటే -959 చిత్రాలు. ఇదీ ఆయన ‘ట్రాక్’ రికార్డు. ఇంకాస్త గొప్పగా చెప్పకోవాలంటే - కన్నడ (60), తమిళం (4), మలయాళం (1) -ఒకే ఏడాదిలో 69 చిత్రాలకు సంగీతాన్ని అందించిన పాటకు చక్రవర్తి అతను. కుమారుడు శ్రీతో కలసి అమ్మోరు చిత్రానికి సంగీతం సమకూర్చారు. సినీరంగంలో వివిధ విభాగాల అనుభవం ఆయనది. చిత్ర దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా ఆఫర్ వచ్చినపుడు -ఏ దారి ఎంచుకోవాలో అర్థంకాక తికపడ్డాడట. చివరకు సంగీత దర్శకత్వంవైపు మొగ్గు చూపాడు. గుత్తా రామినీడు దర్శకత్వంలో శోభన్‌బాబు, వాణిశ్రీ నటించిన ‘మూగప్రేమ’తో సంగీత దర్శకుడయ్యాడు. అయితే, శారద చిత్రంతో పేరొచ్చింది. అవకాశాలు వెల్లువెత్తాయి. మెలోడీతో ఎత్తుకు ఎదిగిపోయాడు. ముందు గాయకుడిగా కెరీర్ ప్రారంభించాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ 500 చిత్రాలకు గాత్రం అందించాడు. నటుడిగా తేనెటీగ, రాజా తదితర చిత్రాల్లో కనిపించాడు. డైలీ సీరియల్స్‌లోనూ ఉదాత్తమైన పాత్రలు పోషించాడు. కొన్ని చిత్రాలకు పాటలూ రాశాడు. అలా చక్రవర్తి అయిపోయాడు.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొనె్నకల్లు ఆయన స్వగ్రామం. సెప్టెంబర్‌లో పుట్టిన చక్రవర్తి అసలుపేరు కొమ్మినేని అప్పారావు. 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగంలో మకుటంలేని మహారాజుగా వెలిగారు. ప్రాథమిక విద్య పొనె్నకల్లులో, గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ చదివాడు. చక్రవర్తి తమ్ముడే దర్శకుడిగా రాణించిన కొమ్మినేని శేషగిరిరావు. ఆయన మేనమామ కుమార్తె అయిన రోహిణిదేవిని వివాహం చేసుకొని 1958లో కుటుంబంతో మద్రాసు చేరాడు. తల్లిదండ్రులు సంగీత జ్ఞానం కలవారు. ఆ కారణంగా ఆయనకి సంగీతంపై ఆసక్తి కలిగింది. అతని ఉత్సాహం చూసి తండ్రి గుంటూరులోని మహావాది వెంకటప్పయ్య శాస్ర్తీ దగ్గర సంగీతం నేర్పించారు. ఆ దశలోనే ఉత్సాహం పట్టలేక వినోద్ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేసి పాటలు, పద్యాలతో ప్రదర్శనలిచ్చాడు. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో 1954-58ల మధ్య కె అప్పారావు కంఠంతో పాట ప్రతిధ్వనించేది. నాటి శ్రోతలకు అతని కంఠం సుపరిచయం. 1958లో బిఏలో డిగ్రీ తీసుకున్నా, హిందీ పరీక్షలో విశారదుడైనా సంగీతానే్న ఎన్నుకున్నాడు, నమ్ముకున్నాడు. అందుకే ఉద్యోగ ప్రయత్నం చేయలేదు.
నేపథ్యగాయకునిగా
మద్రాసు చేరుకున్న అప్పారావు, హెచ్‌ఎంవికి గ్రామఫోను పాటలు పాడేవాడు. అలా సంగీత దర్శకులు రాజన్- నాగేంద్రలు పరిచయమై అవకాశం ఇప్పించారు. విఠలాచార్య కన్నడ చిత్రం ‘మంగల్యయోగం’లో పాడే అవకాశం లభించింది. తర్వాత అదే దర్శకుడు కాంతారావు హీరోగా నిర్మించిన ‘జయ విజయ’ (1959)లో ‘ఆడాలి పెళ్లాడాలి’ పాట పాడాడు. సినిమాలో హాస్యనటుడు బాలకృష్ణ పాట అది. ఇదే సినిమాలకు అప్పారావు పాడిన మొదటి పాట. తరువాత డబ్బింగ్ చిత్రాలకు పాడుతూ పాటలకు క్రమంగా స్వస్తిచెప్పి, మెల్లగా డబ్బింగ్ ఆర్టిస్టు అయిపోయాడు. నాటకాల అనుభవంతో సంభాషణలను అద్భుతంగా చెప్పడమే ఆయన కెరీర్‌కు మలుపైంది. పాటలు, మాటల డబ్బింగ్‌తో ఆరితేరి,
క్రమంగా హీరో పాత్రలకు గాత్రం అందించే స్థాయికి ఎదిగాడు. ఆయన ఎంజి రామచంద్రన్, జయశంకర్, జెమినీ గణేశన్‌లకు గాత్రం అందించారు. హాస్యనటులైన నగేష్, కులదైవం రాజగోపాల్‌లకు గాత్రదానం చేశారు. ముఖ్యంగా నాగేష్‌కు బాగా డబ్బింగ్ చెప్పేవాడు. డబ్బింగ్ రంగంలో కొనసాగుతూనే గుత్తా రామినీడు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. తర్వాత యు విశే్వశ్వరరావు నెలకొల్పిన విశ్వశాంతి నిర్మాణ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి సిఎస్ రావు వద్ద కంచుకోట, పెత్తందార్లు, నిలువుదోపిడీ, దేశోద్ధారకులు చిత్రాలకు పనిచేశారు. కంచుకోట, నిలువుదోపిడీ, మళ్లీ పెళ్లి చిత్రాల్లో పాటలు రాశారు. కెవి మహదేవన్ వద్ద కొన్ని చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేశారు. అప్పారావు సినిమాల్లో 200లకు పైగా పాటలు పాడారు. పరమానందయ్య శిష్యుల కథ (1968)లో ఘంటసాలతో ‘పరమ గురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాదురా’ అనే పాటను పాడారు. బంగారు సంకెళ్ళు (1968)లో రాజబాబుకి ‘తొలగండెహే’ అనే తాగుడు పాటని పాడారు. నిలువుదోపిడి (1968)లో ఎన్టీఆర్‌కి ఒక పద్యం చదివినపుడు అందరూ మెచ్చుకున్నారు.
మెలోడీ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చక్రవర్తికి ‘యమగోల’ టర్నింగ్ పాయింట్. మాస్ గీతాల సంగీత దర్శకుడిగా పేరొచ్చేసింది. తరువాత అన్ని రకాల గీతాలకూ ప్రాధాన్యతనిస్తూ చక్రవర్తి సంగీతం సమకూరిస్తే పాటలు హిట్, తద్వారా సినిమా హిట్ అనే స్థాయికి ఎదిగిపోయాడు.
మల్లెపూవు, వేటగాడు, త్రిశూలం, కొండవీటి సింహం, కొండవీటి రాజా, అడవిదొంగ, విజేత, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, సంఘర్షణ, దేవత, స్వయంవరం, జస్టిస్ చౌదరి, ఊరికి మొనగాడు, పున్నమినాగు, శ్రీవారిముచ్చట్లు, జ్యోతి, ముందడుగు, స్వాతి, దేవాలయం, బొబ్బిలి బ్రహ్మన్న, అడవిసింహాలు, యువరాజు, జీవన తరంగాలు, ఆమె కథ, వందేమాతరం, పూజకు పనికిరాని పువ్వు, ఎర్రమందారం, పెళ్లాం చెబితే వినాలి -వంటి చిత్రాలు చక్రవర్తి కీర్తిని అందనంత ఎత్తుకు తీసుకెళ్లిన వాటిలో కొన్ని. వీటిలో అగ్రహీరోలు నటించిన భారీ చిత్రాలతోపాటు కుటుంబ కథా చిత్రాలు, చిన్న చిత్రాలు, సంగీత ప్రాధాన్యమున్న చిత్రాలు ఉండటం గమనార్హం. చిరంజీవి 41 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు చక్రవర్తి. సొంత బాణీ కోసం ప్రయత్నిస్తూ ఒక్కో మెట్టు ఎక్కారు. మెలోడీ పాటలు, ఊపు పాటలు, స్పీడ్ పాటలతో మాస్‌కు దగ్గరయ్యారు. బిజీగా ఉన్న సమయంలోనే 1989 తర్వాత సినిమాలకు, సినీ సంగీతానికి దూరమయ్యాడు చక్రవర్తి.

-కె శ్రీనివాసరావు, -బి కాంతారావు