శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తాగునీటి సమస్య పరిష్కరించిన పార్టీకే ఓట్లు వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓజిలి, సెప్టెంబర్ 22: మండలంలోని మనవాలి, కరబల్లవోలు, నెమళ్లపూడి, సగుటూరు, గ్రద్దగుంట గ్రామాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి పరసా వెంకటరత్నం ఆధ్వర్యంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా నెమళ్లపూడి దళితవాడ కాలనీవాసులు మాట్లాడుతూ గత రెండేళ్లుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వాపోయారు. ప్రస్తుతం తమ కాలనీలో దాహార్తి తీర్చే పార్టీకే ఓట్లు వేస్తామన్నారు. దీనికి స్పందించిన నాయకులు ఉన్నతాధికారులతో చర్చించి వీలైనంత త్వరగా తాగునీటి సమస్య పరిష్కరిస్తామని కాలనీ వాసులకు భరోసా కల్పించారు. ఈ విధంగా పలుమార్లు దాహార్తి తీరుస్తామని పలు పార్టీల నాయకులు చెప్పారని, తమ కాలనీల్లో ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. నేటికీ రెండు కిలోమీటర్ల దూరంలోని స్వర్ణముఖి నదికి వెళ్లి అక్కడ బోర్ల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంమీద దాహార్తి తీర్చే పార్టీకి ఓట్లు వేస్తామని చెప్పడంతో కార్యక్రమానికి వచ్చిన టిడిపి నాయకులు అవాక్కయ్యారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం, వల్లూరు సూర్యప్రకాశరావు, గోపాలరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కమలాకరరావు, కె వరప్రసాద్, కరబల్లవోలు గ్రామస్థులు తమ పంట పొల్లోకి వెళ్లేందుకు దారి లేదని, దారి కల్పించాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు ఉన్నారు.
పెట్రోల్, డీజల్ ధరల్లో వ్యత్యాసం
వినియోగదారుల్లో అయోమయం
* దండుకుంటున్న పెట్రోల్ బంకులు * పట్టించుకోని అధికారులు

నెల్లూరు, సెప్టెంబర్ 22: రోజురోజుకి పెట్రోల్, డీజల్ ధరల్లో వస్తున్న వ్యత్యాసాన్ని కొన్ని ఆయిల్ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకుల యజమానులు తమ మాయాజాలాన్ని రంగరిస్తూ అందినకాడికి వినియోగదారుడ్ని మోసం చేస్తున్నారు. ఓ వైపు కొలతలతో మోసం చేస్తూనే, తాజాగా రోజువారీ మార్పులకు గురవుతున్న ధరల వ్యత్యాసాన్ని కూడా లాభసాటిగా మార్చుకుంటున్నారు. వీటన్నింటికి తోడు అదనపు సౌకర్యాల పేరుతో మరికొంత దోపిడీ అదనం. జిల్లాలో మూడు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సుమారు 200 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటికి తోడు రిలయన్స్ కంపెనీకి చెందిన మరో ఆరు బంకులు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో రోజుకు 5 లక్షల లీటర్ల పెట్రోలు, 11 లక్షల లీటర్ల వరకూ డీజల్ అమ్మకాలు సాగుతున్నాయి. అయితే ఒకే కంపెనీకి చెందిన బంకుల్లో ఒక్కో చోట ఒక్కో ధర ఉంటోంది. ఉదాహరణకు నెల్లూరు నగరంలో ఓ పెట్రోల్ బంకులో లీటరు పెట్రోలు రూ.73 ఉండగా అదే కంపెనీకి చెందిన నెల్లూరు శివార్లలో ఉన్న బంకులో పెట్రోలు రూ.72.45గా ఉంటుండడం గమనార్హం. ఇలా అన్ని కంపెనీలకు చెందిన బంకుల్లోనూ ధరల్లో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. దీనికి కారణాలు వెతికితే బంకుల యాజమాన్యం చెప్పే సమాధానాలు వింతగా ఉంటున్నాయి. తాము ఉచితంగా గాలి నింపుతున్నామని, చల్లటి నీటిని వినియోగదారులకు ఇస్తున్నామంటూ పలు గారడీ మాటలు చెప్తున్నారు. ఈ సౌకర్యాలకు అదనంగా వసూలు చేస్తున్నట్లు చెప్తుండటం గమనార్హం. ఈ చిన్న చిన్న చిల్లర రూపేణా జిల్లాలో నెలకు వినియోగదారులు రూ.3 కోట్ల వరకూ నష్టపోతున్నారనేది సుస్పష్టం. ఈ విషయం ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు తెలియనిది కాదు. వారు పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు సైతం ఈ పెట్రోల్ బంకుల వైపు కనె్నత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో జిల్లాలో పెట్రోల్ బంకుల్లో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసిన సంఘటనలు బహుస్వల్పం. ఇవన్నీ నాణేనికి ఒకవైపే.. మరోవైపు కల్తీ తన పని తాను చేసుకుపోతోంది. జాతీయ రహదారితో పాటు ప్రధాన రహదారుల్లో ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజల్ యదేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. పెట్రోల్ బంకుల్ని తనిఖీ చేసి కల్తీని నిరోధించేలా చూడాల్సిన ఆయా కంపెనీల ప్రతినిధులు ఎక్కడా కనిపించడం లేదు. ఆయా శాఖల అధికారులు తమకెందుకులే అనుకుంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, మరికొందరు అధికారులు మామూళ్లకు బానిసలు కావడంతో జిల్లాలో పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొలతల గురించి కానీ, కల్తీ గురించి కానీ ఫిర్యాదు చేసినా అధికారుల స్పందన అంతంతమాత్రంగానే ఉందనేది ప్రజల వాదన. ఇకనైనా జాయింట్ కలెక్టర్ ఈ పెట్రోల్ బంకులు వినియోగదారుల్ని మోసం చేస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

పరిశ్రమలు స్థాపించే యువతకు ప్రోత్సాహం
* జెసి ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం
నెల్లూరు, సెప్టెంబర్ 22: జిల్లాలోని యువత నూతన పరిశ్రమలు స్థాపించి ఆర్థికంగా బలపడాలని, అందుకు తగిన ప్రోత్సాహం జిల్లా అధికార యంత్రాంగం తరపున అందిస్తామని జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. శుక్రవారం డిఆర్‌డిఏ సమావేశ మందిరంలో ఎంటర్‌పెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఇడిపి) అండర్ గ్రూప్ ఎంఎస్‌ఎంఇ ప్రోగ్రాం కింద జరిగిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన విద్యావంతులైన నిరుద్యోగ యువతీ, యువకులు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి జిఎ గ్రూపు, ఎంఎస్‌ఎంఇ పథకం అమలు చేస్తోందన్నారు. ఈ పథకం కింద ఎంపికైన గ్రూపు సభ్యులకు మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ పరిశ్రమలు స్థాపించే వారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ సబ్సిడీలు దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు. పరిశ్రమల స్థాపనలో ఎదురైన సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరారు. శిక్షణ జరిగిన తీరు, అభ్యర్థుల స్పందన చూస్తే శిక్షణ ఎలా జరిగిందో అర్థమవుతుందన్నారు. అనంతరం శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్ట్ఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 వెంకటసుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వెంకటస్వామి, జిల్లా పరిశ్రమల కేంద్రం ఎడి సురేష్‌కుమార్, నాబార్డు ప్రతినిధులు శ్రీనివాసరావు, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

రామాయపట్నం పోర్టు సాధ్యాసాధ్యాల పరిశీలన
* ఎంపి మేకపాటి లేఖకు మంత్రి గడ్కరీ సమాధానం

నెల్లూరు, సెప్టెంబర్ 22: ఎన్నో ఏళ్లుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు ఉమ్మడిగా కోరుకుంటున్న రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు కేంద్ర నౌకనిర్మాణ, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ పోర్టు ఆవశ్యకతపై నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత శాఖల మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు లేఖలు రాశారు. ఎట్టకేలకు ఎంపి మేకపాటి రాసిన లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోర్టు ఏర్పాటుపై కేంద్రానికి ఆసక్తి ఉందనే అభిప్రాయంతో సమాధానమిస్తూ ప్రత్యుత్తరం రాశారు. ఈ పోర్టు ఏర్పాటుపై కేంద్రం వైఖరిని వెల్లడించాలని పలు సందర్భాల్లో ఎంపి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు జరిగితే రెండు జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లవుతుందని లేఖలో మేకపాటి పేర్కొన్నారు. అలాగే జాతీయ రహదారికి, విజయవాడ-చెన్నై రైలు మార్గానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో రామాయపట్నం ఉన్నందున రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలు కూడా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక్కడ పోర్టు నిర్మాణం చేపట్టాలని ఎప్పటినుంచో స్థానికులు కోరుతున్నారని, తమ భూములు ఇచ్చేందుకు కూడా రైతులు ముందుకు వస్తుండటం ఎంతో ముదావహంగా ఎంపి మేకపాటి మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపి లేఖపై స్పందించిన మంత్రి ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే పలు ప్రతిపాదనలు పంపించామని, పోర్టు నిర్మాణానికి ఆసక్తితో ఉన్నామని, సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు ఎంపి మేకపాటికి రాసిన లేఖలో స్పష్టం చేయడం విశేషం. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కృష్ణపట్నం పోర్టు ఏర్పాటుతో నెల్లూరు తూర్పు తీరాన జరిగిన అభివృద్ధి రామాయపట్నం పరిసరాల్లోనూ చూసే వీలు కలుగుతుంది. మొత్తంమీద కేంద్రప్రభుత్వ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వ స్పందనపైనే రామాయపట్నం పోర్టు భవిత నిలిచింది.

బద్ధశత్రువు వద్దకైనా వెళ్దాం
* ఇంటింటా టిడిపి కార్యక్రమంపై మాజీ మంత్రి ఆనం
ఆత్మకూరు, సెప్టెంబర్ 22: బద్ధశత్రువు నివాసాలకైనా వెళ్లి ఇంటింటా టిడిపి కార్యక్రమ వివరాలను వెల్లడిద్దామని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ ఫలాలు అధికార పక్షానికే దక్కుతున్నాయనే అపవాదును తొలగించుకుందామన్నారు. అందులో భాగంగా సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌బాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుల ఆధ్వర్యంలో ఇంటింటా టిడిపి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా వచ్చిన నంద్యాల, కాకినాడల్లో ఇంటింటికీ పార్టీ శ్రేణులు వెళ్లడం వల్ల అక్కడ జరిగిన ఎన్నికల్లో ఊహాతీత ఆధిక్యతతో విజయం సాధించినట్లు తెలిపారు. శుక్రవారం టిడిపి ఆత్మకూరు నియోజకవర్గ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సైతం వైరి వర్గానికి చెందిన ఇళ్లకైనా వెళ్లి వారి అవసరాలను గుర్తించాలన్నారు. వారిలో ఉండే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందాల్సిన సంక్షేమాల గురించి ఆరా తీయడంతో సహా ఇకపై వర్తించేలా చూద్దామన్నారు. కార్యక్రమంలో భాగంగా నియమించిన డాటా ఆపరేటర్లయిన వారిళ్లకు వెళ్లడం ద్వారా వివరాలను నమోదు చేయించాలన్నారు. డాటా ఆపరేటర్లు నమోదు చేసిన వివరాలను తమ ద్వారా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుతాయన్నారు. విపక్ష పార్టీలకు చెందిన వారు బలవంతంగా నిరాకరిస్తుంటే వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఇదిలాఉంటే ఇటీవల విజయవాడలో సీఎంను కలసిన సందర్భంలో ఆత్మకూరు నియోజకవర్గానికి కావాల్సిన వివిధ సమస్యలపై చర్చించి నిధులు మంజూరయ్యేలా ఆమోదం పొందినట్లు తెలిపారు. అందులో భాగంగా నియోజకవర్గానికి రెండున్నర వేల సామాజిక పింఛన్లు నూతనంగా మంజూరవుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా 3,500 ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు, అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేసేలా సమ్మతించారన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద వాటర్ ప్లాంట్లను నెలకొల్పే ప్రక్రియ విస్తృతంగా జరగనుందన్నారు. అదేవిధంగా గతంలో ఆత్మకూరు పట్టణ పరిసరాల్లో నెలకొల్పిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఇంటిగ్రేటెడ్ హాస్టల్, బాలికల గురుకులాలకు అవసరమైన లెవలింగ్ ప్రక్రియతో సహా ప్రహరీగోడలను నిర్మించేందుకు నిధులు మంజూరు కానున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కెనాల్ తొలి దశ పనులు జరుగుతున్నాయన్నారు. రెండో సర్వేకు సంబంధించిన డిపిఆర్, అంచనాల తయారీపై సిఎం ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ద్వారా ఇఎన్‌సికి ఆదేశాలు చేశారన్నారు. ఇదిలాఉంటే వచ్చే నెల 2వ తేదీ నుంచి గాంధీ జయంతిని పురస్కరించుకుని డయాలసిస్ ప్రక్రియ విధిగా నిర్వహించుకునే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలసరి రూ.2,500 పింఛన్ అందించడం జరుగుతుందన్నారు. అదేరోజున రాష్టవ్య్రాప్తంగా లక్ష నూతన పక్కా గృహ ప్రవేశాలు చేసేలా చూస్తున్నారన్నారు. వైకాపా నేతలు దురుద్దేశపూర్వకంగానే విమర్శలు చేస్తున్నారే తప్ప వారి వ్యాఖ్యలు పసలేనివిగానే ఉంటాయన్నారు. సమావేశంలో టిడిపి ఆత్మకూరు పట్టణ కమిటీ అధ్యక్షులు చిల్లూరు ఆదిశేషయ్య, మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ రాగి వనమ్మ, వైస్ చైర్మన్ తుమ్మల చంద్రారెడ్డి, రూరల్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకర పెంచలచౌదరి, కేతా విజయభాస్కరరెడ్డి, ఏఎస్‌పేట మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరు మాల్యాద్రినాయుడు, చేజర్ల మండల పార్టీ అధ్యక్షుడు నవకృష్ణ చౌదరి, సంగం, అనంతసాగరం, మర్రిపాడు మండల పార్టీప్రధాన కార్యదర్శులు ఆనం ప్రసాదరెడ్డి, సుబ్బారావు, కృష్ణారెడ్డి, టిడిపి మహిళా విభాగపుఅధ్యక్షురాలు పులిమి శైలజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నాబార్డు పథకాల కాలపరిమితి పెంపు
* జెసి 2 వెంకటసుబ్బారెడ్డి వెల్లడి
నెల్లూరు, సెప్టెంబర్ 22: నాబార్డు ద్వారా వివిధ శాఖల పరిధిలో జిల్లాలో అమలవుతున్న పథకాలకు సంబంధించి కాలపరిమితి పొడిగించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్-2 వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన పశుసంవర్ధక, పిఆర్ తదితర శాఖల అధికారులతో నాబార్డు ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 ఏడాదికి గాను 2017 సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు, 2017కు సంబంధించి 2018 మార్చి 31వరకు కాలపరిమితిని పొడిగించడం జరిగిందన్నారు. జూన్ 2018 వరకు 2017 ఏడాది క్లైయిమ్‌లను క్లైమ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ ఏజిఎం రమేష్, ఐసిడియస్ పిడి ప్రశాంతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘ప్రజా సంక్షేమం కోసం నవరత్నాలు’
వెంకటగిరి, సెప్టెంబర్ 22: ప్రజా సంక్షేమం కోసం వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలు విడుదల చేసినట్లు వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నన్నపేట, కలపాడు గ్రామాల్లో శుక్రవారం వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాలు వెంటనే అమలు చేస్తామని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు, మహిళలు, రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. మూడేళ్ల టిడిపి పాలనలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు, రాజారెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మహిళకు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ
* ఆందోళనలో కాగితాలపూరు వాసులు
మనుబోలు, సెప్టెంబర్ 22 : మండల పరిధిలోని కాగితాలపూరు గ్రామంలో ఓ మహిళకు డెంగ్యూ పాజిటివ్ ఉన్నట్లు గురువారం నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకోంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాగితాలపూరు గ్రామానికి చెందిన లలితమ్మకు గత వారం రోజులుగా జ్వరం ఉండటంతో గురువారం చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా, వైద్యులు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ పాజిటివ్‌గా గుర్తించారు. అయితే వ్యాధిగ్రస్తురాలు వైద్యం చేయించుకోకుండా, ఆసుపత్రి అధికారులకు ఎలాంటి సమాచారం తెలియజేయకుండా గ్రామానికి చేరుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్తున్నారు. ఈ విషయంపై గ్రామంలో తెలియడంతో లలితమ్మను నెల్లూరులోని రామచంద్రారెడ్డి ఆసుపత్రికి శుక్రవారం తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన గిద్దలూరు సుజాతమ్మ జ్వరం వచ్చి నెల్లూరులో చికిత్స పొందుతూ ప్లేట్‌లెట్స్ తగ్గి మృతిచెందింది. ఇప్పటికీ గ్రామంలో విపరీతంగా జ్వరాలు ఉండటం, మరో కేసు నమోదు కావడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 12వ తేదీ నుంచి పిహెచ్‌సి వైద్యుడు ఏడుకొండలు తమ పిహెచ్‌సి సిబ్బందితో కలిసి వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మరో డెంగ్యూ కేసు నమోదు కావడంతో గ్రామంలో సర్పంచ్ శైలజ సహకారంతో పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపించారు. గ్రామంలోని మురుగుకాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి, ఇళ్లలో పైరిత్రిన్, కాలువల్లో ఆబీట్‌ను పిచ్‌కారి చేయించారు. జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి
* ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని
కలిగిరి, సెప్టెంబర్ 22 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందాలని ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరమారావు తెలిపారు. శుక్రవారం కలిగిరి మండలంలోని తూర్పు గుడ్లదొన, పడమర గుడ్లదొన, ఎరుకలరెడ్డిపాళెం పంచాయతీలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారిని గుర్తించి ప్రభుత్వ ప్రతినిధులగా వచ్చిన సభ్యుల చేత వివరాలను నమోదు చేయించారు. తూర్పు గుడ్లదొనలో 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారిని పార్టీ కండువాలతో సత్కరించి పార్టీలోకి చేర్చుకున్నారు. పాత, కొత్త కలయికలతో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయవంతానికి కృషి చేయాలన్నారు. అనంతరం ఎరుకలరెడ్డిపాళెంలో ఇటీవల నిర్మించిన చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపిపి మద్దసాని వెంకటేశ్వరరావు, వేళ్ల నరేంద్ర, సుబ్బారావు, బిజ్జం కృష్ణారెడ్డి, చీమల తాతయ్య, వెంకటసుబ్బానాయుడు, రామానాయుడు, రాధయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతు క్లబ్‌లపై అవగాహన
వాకాడు, సెప్టెంబర్ 22: గ్రామాల్లో రైతు క్లబ్‌ల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాల గురించి చైతన్య జ్యోతి సంస్థ నిర్వాహకుడు శ్రీనివాసరావు రైతులకు అవగాహన కల్పించారు. శుక్రవారం మధ్యాహ్నం దుగరాజపట్నం గ్రామంలో దుగరాజపట్నం, మూలపడవ గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించారు. గ్రూపులుగా ఏర్పడితే నాబార్డు ద్వారా వ్యవసాయానికి ఆర్థిక సాయం అందుతుందని, వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందించడంతో పాటు అధునాతన టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న వ్యవసాధికారి విజయభారతి రైతుల క్లబ్‌ల ఆవశ్యకత గురించి వివరించారు.