రాష్ట్రీయం

భారీ వర్షం.. అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. నైరుతీ రుతుపవనాలు తెలంగాణలో సోమవారం అనుకోకుండా బలంగా మారడంతో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మెదక్, వరంగల్ తదితర జిల్లాల్లో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను ద్రోణి కారణంగా నైరుతీ రుతుపవనాలు బలంగా మారి భారీ వర్షం కురిసిందని ఐఎండి వర్గాలు వెల్లడించాయి. సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం, విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు హెలికాప్టర్ భారీ వర్షం కారణంగా సోమవారం సాయంత్రం బేగంపేటలో దిగలేకపోయింది.
హైదరాబాద్‌లో సోమవారం ఉదయం వాతావరణం పొడిగానే ఉంది. మధ్యాహ్నం ఎండ బాగా కాచింది. సాయంత్రం మూడు గంటల తర్వాత దట్టమైన మేఘాలు కమ్ముకోవడం మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో నాలుగు గంటలకే వర్షం మొదలు కాగా, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు గంటలకు మొదలైంది. సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన కురిసింది.
భారీ వర్షం కారణంగా రాజధానిలోని చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. సాయంత్రం నాలుగు గంటల నుండి క్యుములో నింబస్ మేఘాలు దట్టంగా అలుముకోవడంతో సాయంత్రం ఐదు గంటల తర్వాత చీకట్లు అలుముకున్నాయి. సాధారణంగా రాత్రి ఎనిమిదిగంటల సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో, అలాంటి వాతావరణమే ఐదున్నరకు ఏర్పడ్డది.రాజధానిలోని దాదాపు 40 ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాగోల్, ఎల్‌బినగర్, దిల్‌సుఖ్‌నగర్, బహదూర్‌పురా, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, కోఠి, బేగంపేట, బంజారాహిల్స్, రాజ్‌భవన్‌రోడ్డు, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్- కూకట్‌పల్లి రోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు సాగలేక ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు మూడు గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. వాహనాల రాకపోకలను పోలీసులు కూడా నియంత్రించలేకపోయారు.
బహద్దూర్‌పురాలో అత్యధికం
హైదరాబాద్‌లోని బహద్దూర్‌పురాలో 121 మిల్లీమీటర్లు, రాజేంద్రనగర్‌లో 111 మిల్లీమీటర్లు, అంబర్‌పేటలో 94 మిల్లీమీటర్లు, గోల్గొండలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో 30 నుండి 60 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా 30 మిల్లీమీటర్ల నుండి 90 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైందని తెలిసింది.
సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం అబ్బెంద గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ముఖ్యమంత్రి సమీక్ష
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భారీ వర్షాలపై సమీక్షించారు. రాజధానితో పాటు ఇతర జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రాజధానిలో లోతట్టు ప్రాంతాల ప్రజలంతా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సిబ్బంది రాత్రి వేళ మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులతో సిఎం మాట్లాడారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సిఎం కోరారు.
గాల్లో చక్కర్లు కొట్టిన మంత్రి హెలికాప్టర్
మంత్రి హరీశ్‌రావు పయనిస్తున్న హెలికాప్టర్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో దిగేందుకు వీలుకాలేదు. ఖమ్మం జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక హెలికాప్టర్‌లో సోమవారం ఉదయం ఖమ్మం వెళ్లారు. వివిధ నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించి సాయంత్రం ఖమ్మం జిల్లా నుండి తిరుగు పయనమయ్యారు. హెలికాప్టర్ హైదరాబాద్‌కు చేరిన సమయానికి బేగంపేట విమానాశ్రయం ప్రాంతంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని, భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. దాంతో హెలికాప్టర్ బేగంపేట విమానాశ్రయంలో దిగేందుకు సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వలేదు. దాంతో కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టించిన పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి, హకీంపేటలోని వైమానిక దళ విమానాశ్రయంలో హెలికాప్టర్‌ను దించేందుకు నిర్ణయించారు. తొలుత హకీంపేటకు చెందిన వైమానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. బేగంపేటలో హెలికాప్టర్ దిగే అవకాశం లేదని, అందువల్ల హకీంపేట విమానాశ్రంలో దిగేందుకు అనుమతివ్వాలని కోరారు. దాంతో వైమానిక అధికారులు పరిస్థితిని పరిశీలించి హరీశ్‌రావు పయనిస్తున్న హెలికాప్టర్‌ను తమ విమానాశ్రయంలో దిగేందుకు అనుమతించారు. దాంతో కొద్దిసేపు ఆందోళనకు గురైన హరీశ్‌రావుతో పాటు రాష్ట్ర అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రాలు..హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రంనుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఏరులై పారుతున్న రోడ్లపై ఇక్కట్లు పడుతున్న వాహనదారులు.