రాష్ట్రీయం

ఇకనైనా నిస్తేజాన్ని వీడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణలో వర్శిటీల పనితీరుపై గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో జరిగిన వైస్ ఛాన్సలర్ల సదస్సులో గవర్నర్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగడానికి బాధ్యులు కృషి చేయాలని సూచించారు. కేవలం నిధుల కోసం చూస్తూ కూర్చుంటే సరిపోదని, నిధుల అవసరం లేకుండానే కొన్ని పనులు చేయవచ్చన్నారు. తెలంగాణ వర్శిటీలను, తెలంగాణ విద్యా సంస్థలను దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేయాలని గవర్నర్ హితవు పలికారు. వర్శిటీలు, కాలేజీలు, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలన్నీ సమన్వయంతో అకడమిక్ క్యాలండర్‌ను పక్కాగా అమలుచేయాలని సూచించారు. వైస్ ఛాన్సలర్ల
సదస్సు సమావేశ వివరాలను విద్యా శాఖా మంత్రి కడియం శ్రీహరి మీడియాకు వివరిస్తూ, తెలంగాణ వర్శిటీల్లో అన్ని సర్వీసులను రానున్న రోజుల్లో ఆన్‌లైన్ చేస్తామని చెప్పారు. త్వరలోనే 1061 పోస్టులను భర్తీ చేస్తామని, వచ్చే ఆరు నెలల్లో యాక్షన్ టేకెన్ రిపోర్టులతో మరో మారు గవర్నర్ అధ్యక్షతన విసిల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల కేంద్ర మానవ వనరుల శాఖ విద్యపై నిర్వహించిన వివిధ రాష్ట్రాల సర్వేలో తెలంగాణ జాతీయ సగటుకంటే పైస్థాయిలో ఉందని శ్రీహరి వెల్లడించారు. ముఖ్యంగా ఎస్సీల విద్యలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఎస్టీల విద్యలో దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. అదేవిధంగా న్యాక్ బృందం ఇటీవల ఓయు, కెయు, జెఎన్‌టియుల్లో పర్యటించి గుర్తింపునిచ్చిందని పేర్కొన్నారు. యూనివర్శిటీలు, కాలేజీల్లో ఆధార్ ఆధారితంగా అడ్మిషన్లు చేపడుతున్నామని, దీనిని కేంద్రం సైతం కొనియాడిందని పేర్కొన్నారు. గవర్నర్ సలహా మేరకు వచ్చే విద్యాసంవత్సరంలో ఖచ్చితంగా జూలైలోనే అకడమిక్ క్యాలండర్ ప్రారంభిస్తాని కడియం శ్రీహరి చెప్పారు. విసిలకు పదిసూత్రాల అజెండాతో దిశానిర్దేశనం చేసినట్టు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. యూనివర్శిటీలు, వాటి అనుబంధ కాలేజీలు అకడమిక్ క్యాలండర్‌ను పాటించడం, ప్రతి విద్యాసంస్థలో సిసి కెమరాలు, బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయడం, సిబ్బంది హాజరులో పారదర్శకత పాటించడం, రాష్ట్ర ప్రభుత్వం 2017-18లో విడుదల చేసిన 419 కోట్ల రూపాయిలను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడం, వర్శిటీల్లో 1061 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవడం, పిహెచ్‌డి పట్టాలకు సంబంధించి యూనివర్శిటీలు సీరియస్‌గా తీసుకోవాలని కడియం పేర్కొన్నారు. పరిశోధనలు సీరియస్‌గా చేసే వారికి అవకాశం కల్పించాలని, నిర్ణీత గడువులోగా పిహెచ్‌డి పూర్తి చేసేలా చూడాలి. కాలక్షేపం చేసి వారి పట్ల కఠినంగా ఉండాలని, పట్టాలకు సంబంధించి ముగ్గురు విసిలతో ఒక కమిటీని వేసి యూనిఫారం పాలసీ తీసుకురావాలని అన్నారు. అన్ని యూనివర్శిటీలు ఐసిటి వినియోగించుకోవాలని, స్కిల్స్‌ను పెంచాలని, నైపుణ్యాల మెరుగుకు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సంఖ్య సమీక్షించుకోవాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయాల విసిలు, రిజిస్ట్రార్‌లు పాల్గొన్నారు.

చిత్రం..అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో జరిగిన వైస్ ఛాన్సలర్ల సదస్సులో మాట్లాడుతున్న గవర్నర్ నరసింహన్. చిత్రంలో మంత్రి కడియం తదితరులు