రాష్ట్రీయం

‘కాపు’కాసే నాయకుడెవరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 14: కాపుల ఐక్య గర్జన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలను టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. తూర్పు సెంటిమెంట్‌ను బాగా విశ్వసించే చంద్రబాబు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్‌లో తెలుగుదేశానికి లాభిస్తుందో ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాపు సామాజికవర్గానికి బలమైన జిల్లాగా, ఇతర జిల్లాల్లో కాపులను సైతం ప్రభావితం చేయగలిగిన జిల్లాగా తూర్పు గోదావరికి పేరుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశానికి తిరుగులేని ఆధిక్యత లభించింది. ఇందుకు కాపు సామాజికవర్గమే కారణమన్న నమ్మకాన్ని చంద్రబాబు చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఇటీవల విజయవంతమైన కాపుల ఐక్య గర్జన అనంతర పరిణామాలను చంద్రబాబు సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఐక్య గర్జన అనంతరం జిల్లాలోని టిడిపికి చెందిన కాపు నేతల్లో రాజకీయ సెగ రాజుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. చినరాజప్ప ముద్రగడపై చేసిన విమర్శలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కాపుల ఐక్య గర్జన ప్రకటన వెలువడిన నాటి నుండి ముద్రగడను చినరాజప్ప టార్గెట్ చేశారన్న ప్రచారం ఒక వర్గంలో వినిపిస్తూ వచ్చింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేసి కనీసం 9వేల ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయిన ముద్రగడ ఉద్యమాన్ని చేపడతారా? అంటూ చినరాజప్ప విమర్శించారు. రాజకీయ నిరుద్యోగిగా ఇంట్లో కూర్చున్న ముద్రగడ అనవసరంగా కాపులను రెచ్చగొడుతున్నారంటూ చేసిన విమర్శలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తొలి నుండి ముద్రగడకు వ్యతిరేకంగా చినరాజప్ప మాట్లాడుతూ వస్తుండగా, ఇదే జిల్లాకు చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యూహాత్మకంగా ముందుకు సాగడం టిడిపి వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.
ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించింది మొదలు త్రిమూర్తులు తనదైన శైలిలో చక్రం తిప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో కూడా పడ్డారు. ముద్రగడతో ప్రభుత్వ బృందం చర్చలు జరిపిన సమయంలో తోట కీలకపాత్ర పోషించారు. దీక్ష విరమించే సమయంలోనూ ముద్రగడతోనే ఉన్నారు. మంత్రి పదవి కోసం ఇటీవలి కాలంలో విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్న తోటకు కాపు గర్జన వ్యవహారం అనుకూలంగా మారింది. ఈ నేపథ్యంలోనే చిన రాజప్పపై ముద్రగడ సహా కాపు సామాజికవర్గం వ్యతిరేకంగా ఉన్నదన్న సంకేతాలను అధినేతకు పంపడంలో త్రిమూర్తులు వర్గం విజయం సాధించింది. ముఖ్యంగా తనకు జిల్లా నుండి మంత్రివర్గంలో అవకాశం కల్పించిన పక్షంలో కాపులను తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవడంతో పాటు ముద్రగడను సైతం పార్టీకి దగ్గర చేయగలనన్న సందేశాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళడంలో తోట విజయం సాధించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే కనుక జరిగితే చినరాజప్ప చేతిలో ఉన్న హోంశాఖను తోట త్రిమూర్తులకు అప్పగించే అవకాశాలున్నట్టు కూడా సదరు వర్గం నేతల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ కావడం విశేషం.