రాష్ట్రీయం

మాతృభాషను మరిస్తే.. వాడు మనిషే కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ‘ఏ దేశమేగినా... ఎందుకాలిడినా... మరువకోయ్ నీ తల్లి తెలుగు భాష’ అని ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో ప్రధాన వక్తలు నొక్కివక్కానించారు. జన్నభూమిని, కన్నతల్లిని, మాతృభాషను మరిచినవాడు మనిషేకాదనీ, భాష, యాస, కట్టుబొట్టు, సంప్రదాయాలను కాపాడుకోవడమంటే మన ఆస్థితత్వాన్ని కాపాడుకోవడమని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దేశ, విదేశాల్లోని తెలుగువారంతా ఒకచోటచేరి ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజల్వనతో శుక్రవారం సాయంత్రం ఎల్‌బి స్టేడియంలో ప్రారంభించారు. కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ మనం ఎంత ఎత్తుకెదిగినా మాతృభాష, యాసను మరిచిపోతే కన్నతల్లిని మరిచినట్టేనన్నారు. జన్మనిచ్చిన తల్లిని, జన్నభూమిని, మాతృభాషను మరిచిన వాడు మనిషేకాదన్నారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా వరకు మాట్లాడేది ఒక్కటే భాష అయినా ఏ ప్రాంతానికి ఆ ప్రాంత యాసలు ఉన్నాయని, అవన్నీ భాషామతల్లి కంఠంలో మణిహారాలుగా ఉప రాష్టప్రతి అభివర్ణించారు. ఆదికవి నన్నయ్యకు ముందు నుంచే తెలుగు భాషకు మూలాలు ఉన్నాయని సాహిత్య చరిత్రకారులు గుర్తించారన్నారు. క్రీ.పూ మొదటి శకంలో హాలుడి గాథా సప్తశతి, గుణాఢ్యుడి బృహత్క్థ మంజరిలో తెలుగు పదాలు కనిపిస్తాయన్నారు. ఆంధ్రుల ప్రస్తావన మహాభారతంలోనూ బౌద్దుల కాలంలోనూ ఉందన్నారు. తెలుగునేల కరీంనగర్‌తో పాటు అనేక ప్రాంతాల్లో లోహయుగం, కొత్తరాతియుగం నాటి అవశేషాలు లభించడమే తెలుగు భాష ప్రాచీనతకు నిదర్శనమని వెంకయ్య నాయుడు గుర్తు చేసారు. ప్రతీ నాగరికతా తన గొప్పతనాన్ని భాష ద్వారానే వ్యక్తం అవుతుందన్నారు. ఆటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, వ్యాపార సంబంధాలు ఇవన్నీ భాషలేకుండా పెంపోందలేవన్నారు. భాష సమాజాన్ని సృష్టిస్తుంది, జాతిని బలపరుస్తుందన్నారు. సామాజిక పరిణామంలో భాష అనేది కీలకమైన ఇరుసు లాంటిదన్నారు. భాష ఒక సమాజ ప్రవాహం, ఒక సజీవ సమాజానికి దర్ప్‌ణమన్నారు. భాష మానవ సంబంధాలను అభివృద్ధి పరిచే సంస్కృతికి ప్రతిభింబంగా నిలుస్తుందన్నారు. తెలుగు భాషను
అర్థం చేసుకోవాలంటే తెలుగు సంస్కృతిని, తెలుగు సమాజాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మనిషి నుంచి ప్రాణం తీసి విశే్లషించడం ఎలా ఉంటుందో, సమాజం నుంచి భాషను విడదీసి చూడడం కూడా అలాంటిదేనని వెంకయ్య నాయుడు విశే్లషించారు. ఇక యాస అనేది ఆ ప్రాణంలో అంతర్లీనమైన మరో ప్రాణమన్నారు. బయటికి వెళ్లినప్పుడు ఏ భాషలో మాట్లాడినా ఇంటికి వచ్చినప్పుడు కుటుంబీకులతో, స్నేహితులతో మాట్లాడినప్పుడు సొంత నేలపై తిరుగాడినట్టు మనలో మరో ప్రాణం మేలుకోంటుందన్నారు. ఎంత ఎత్తుకెదిగినా మన భాష, మన యాస మరిచిపోతే కన్నతల్లిని మరిచినట్టేనని, వీటిని మరిచిపోయే వాడు తన దృష్టిలో మనిషేకాడన్నారు. గురువులకు సత్కరించడం సత్ప్రవర్తనకు, సదాచారానికి చిహ్నమన్నారు. జీవితంలో గురువుకున్న ప్రాధాన్యత ఎప్పటికీ తీరదని, గురువుకు గూగుల్ ప్రత్యామ్నాయం కాదన్నారు. ఢిల్లీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎక్కడైనా తెలుగు మాట వినిపిస్తే వెనక్కు తిరిగి వచ్చి పలకరించేవాడినని అన్నారు. ప్రాంతం, యాస ఏదైనా తెలుగులో మాట్లాడుతుంటే నా మనస్సు ఆనందంతో పులకరించి పోయేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 42 ఏళ్ల కిందట ఇదే నేలపై ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రపంచ తెలుగు మహాసభలను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహిస్తే మళ్లీ ఇక్కడే తెలంగాణ గడ్డపై ప్రపంచ తెలుగు మహాసభలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అంతకంటే పెద్దస్థాయిలో నిర్వహించడం అభినందనీయమన్నారు. మాతృభాషలో చదువుకునే వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించే దిశగా ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు యోచించాలన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను మాతృభాషలో రాసే అవకాశాన్ని కల్పించడానికి కృషి చేస్తానన్నారు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేది తెలుగు భాషేనని, తెలుగు మాట్లాడే ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి జరుగాలని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

చిత్రం..హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా శుక్రవారం ప్రపంచ తెలుగు మహా సభలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు. చిత్రంలో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, ఇతర ప్రముఖులు