తెలంగాణ

రాజ్యాధికారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 20: సమాజంలో జనాభాను అనుసరించి సరైన ప్రాతినిధ్యం దక్కని బీసీలు తమ హక్కుల సాధనకు రాజ్యాధికారమే లక్ష్యంగా సంఘటిత పోరాటాలు ఉధృతం చేయాలని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ పాలన హయాంలోనే బీసీలు తమ హక్కుల సాధనకు ఒత్తిడి తేవాలన్నారు. లేనట్లయితే ఇకముందు కూడా ఇతర పార్టీల జెండాలు మోస్తూ అగ్రవర్ణాల నేతల పల్లకీలు మోయాల్సిందేననన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తే ప్రతిపక్షాలు రాజ్యసభలో వ్యతిరేకించాయని, ఈ పరిస్థితుల్లో జనాభా దామాషా మేరకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల బిల్లు సాధనకు తీవ్రమైన పోరాటాలు చేయాల్సివుందన్నారు.
బీసీల సంక్షేమానికి చట్టపరంగా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా సీఎం కేసీఆర్ సహకరిస్తామన్నారన్నారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 34 నుండి 50 శాతానికి పెంచాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని, తెలంగాణలోని కొత్త 20 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారినందున బీసీలది ఆకలిపోరు కాదు.. ఆత్మగౌరవ పోరాటమన్నారు. దేశంలో 2,600 బీసీ కులాలుంటే 2500 బీసీ కులాలు పార్లమెంటు గడప తొక్కలేదన్నారు. స్వామివివేకానంద, ఆదిశంకరాచార్యులు నడయాడిన నేలలో బడుగు, అణగారిన వర్గాలకు పాలనలో ప్రాతినిధ్యం కరువవడం శోచనీయమన్నారు. రాజ్యాంగాన్ని 103సార్లు సవరించినా ఒక్కసారైనా బీసీలకు సామాజిక, రాజకీయ న్యాయం కోసం ఎందుకు సవరించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, ఎస్టీలు తమ మధ్య విభేదాలు, ఘర్షణలు వీడి సంఘటితంగా ఉండాలని, రాజకీయ పార్టీలు ఆడే ఆటలో పావులు కాకుండా చైతన్యంగా వ్యవహరించి హక్కులను పరిరక్షించుకోవాలన్నారు.