రాష్ట్రీయం

పంచాయతీలకు పండగే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.విజయ శైలేంద్ర
హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ గ్రామ సీమల్లో పండగ వాతావరణం నెలకొంది. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు నేపథ్యంలో కొత్త తరం రాజకీయాల్లోకి రానుంది. దీనికి తోడు ఫిబ్రవరి నెలలోనే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీల్లో కోలాహలం ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 8684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 3800 పంచాయతీలను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చేసింది. అన్నీ అనుకున్నట్లు ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగితే, రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా ఏర్పాటయ్యే 3800 గ్రామ పంచాయతీలతో సహా మొత్తం 14000 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లతో రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మారబోతోంది.
రాజకీయాల్లోకి కొత్త రక్తం
కాని సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వదిలేశారు. కాగా కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రకియ చురుకుగా సాగుతోంది. ఈ నెల 25వ తేదీన తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే పంచాయితీల పేర్లను, భౌగోళిక సరిహద్దులను ఖరారు చేయనుంది. ఈనెల 22వ తేదీ సోమవారంలోగా 30 జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదిత కొత్త గ్రామ పంచాయతీల వివరాలను ప్రభుత్వానికి పంపించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. 2011 జనాభా ప్రాతిపదికన కొత్త పంచాయతీల ఏర్పాటులో అధికార యంత్రగం నిమగ్నమైంది. పంచాయతీల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చింది. అనంతరం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాలకు లోబడి పంచాయతీరాజ్ శాఖ, జిల్లా కలెక్టర్లు కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు.
కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి పంచాయితీరాజ్ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. అధికారులు తండాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుని కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటును నిర్ధారించాలని ప్రభుత్వం ఆదేశించింది. కనీసం 500 జనాభా అంత కంటే మించి ఉన్న ప్రతి తండాను గ్రామ పంచాయతీగా మార్చనున్నారు. రెండు గ్రామ పంచాయతీల మధ్య 1.5 కి.మీ దూరం ఉండాలి. వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీరాజ్ చట్టంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో కొత్త చట్టం ఆమోదం పొందిన వెంటనే గవర్నర్‌కు పంపిస్తారు. గవర్నర్ నుంచి ఆమోదం పొంది వచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్రప్రభుత్వ ఆర్థిక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసి, ఈకమిషన్‌కు రూ.2వేల కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఎన్నికల విధి విధానాలను కొత్త చట్టంలో పొందుపరచనున్నారు. గ్రామ పంచాయతీలు వంద శాతం పన్నులు వసూలు
చేసేందుకు వీలుగా ప్రోత్సాహకాల పథకాన్ని కూడా ముసాయిదా బిల్లులో చేర్చారు. ఐదు వందల వరకు జనాభా ఉన్న పంచాయతీకి రూ. 5 లక్షలు, ఆ తర్వాత స్థాయి, జనాభా బట్టి ఐదు నుంచి 25 లక్షల రూపాయల వరకు నిధులను ప్రభుత్వం సమకూర్చుస్తుంది. గ్రామ సీమల అభివృద్ధికి, ఎమ్మెల్యేలు, ఎంపీ నిధులు కూడా కేటాయించే విధంగా చట్టంలో పొందుపరచనున్నారు. న్యాయ స్థానాల లిటిగేషన్‌కు ఆస్కారం ఇవ్వకుండా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లకు ఒకప్పుడు పంచాయతీలపైన అధికారాలు ఉండేవి. ప్రస్తుత పరిస్థితుల్లో నియంత్రణ లేదు. ఈ లోపాన్ని కూడా గుర్తించి కొత్త చట్టంలో మార్పులు చేయనున్నారు.