కరీంనగర్

వంద శాతం పన్నులు వసూలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్
కరీంనగర్, మార్చి 10: జిల్లాలోని అన్ని పంచాయతీలు, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు ఈ నెల 31లోగా వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుండి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసి పన్నులను వసూలు చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కరెంటు బిల్లులను ట్రాన్స్‌కో అధికారులతో చర్చించి చెల్లింపులు జరపాలని పంచాయతీలను ఆదేశించారు. తాగునీటి పథకాలకు నిర్వహణ చార్జీలను 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి పంచాయతీలు చెల్లించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, మున్సిపాలిటీలలో, పంచాయతీ కార్యాలయాలలో ప్రీపెయిడ్ ఎలక్ట్రిక్ మీటర్లను ఈ నెల 31 లోగా అమర్చుకోవాలని తెలిపారు. దీంతో కరెంటు చార్జీల వినియోగం ఖచ్చితంగా తెలుస్తుందన్నారు. పంచాయతీ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 21 అర్బన్ లోకల్ బడులలో ఏప్రిల్ చివరినాటికి వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్ధేశించినట్లు ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, హుజూరాబాద్, హుస్నాబాద్ పట్టణాలు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలుగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాలో అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన 25 నగర పంచాయతీలకు 2,32,217, అలాగే గృహాలకు 4,44,434 ఎల్‌ఇడి బల్బులను సరఫరా చేయనున్నట్లు దీంతో 30 శాతం కరెంట్ ఆదా అవుతుందన్నారు. ప్రతి బల్బులుకు పది రూపాయల చొప్పున తీసుకుంటారని, అసలు ఖరీదు రూ.74.64 అని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ నీతూప్రసాద్‌తో పాటు డిపిఓ సురేష్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.

రైతాంగాన్ని మభ్యపెట్టేందుకే మహా ‘ఒప్పందం’
* కుటుంబ జేబులు నింపేందుకే రీ డిజైనింగ్‌లు
* టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట
కరీంనగర్ టౌన్, మార్చి 10: తనకు అధికారమిస్తే బీడు భూముల్లో సిరులు కురుపిస్తానని చెప్పిన సిఎం కెసిఆర్‌పై రాష్ట్ర రైతాంగం తిరగబడే స్థితి నెలకొనటంతో, వారిని మభ్యపెట్టేందుకే మహా ‘ఒప్పందం’ చేసుకున్నాడని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు విమర్శించారు. గురువారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఒప్పందంతో రెండువిధాలా లాభం చేకూరేలా ఆలోచించి, మహారాష్టత్రో అవగాహన కుదుర్చుకున్నారని మండిపడ్డారు. ఓవైపు రైతులను మచ్చికచేసుకోవటంతో పాటు మరోవైపుతన కుటుంబం జేబులు నింపుకునేందు కోసం రీ డిజైనింగ్‌లు చేపట్టారని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పనులు చివరిదశలో ఉన్న ప్రాజెక్టులకు కూడా నిధులు విడుదల చేయకుండా నిరుపయోగంగా మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాయమాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేయటమే తనపనిగా ఎంచుకున్నారని, మహారాష్టత్రో చేసుకున్న ఒప్పందంతో యావత్ తెలంగాణకు మేలుచేకూరితే కార్యకర్తలు కాదు..రైతులే పాలాభిషేకం చేసేవారన్నారు. రాష్ట్రంలోని కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెబుతున్న సిఎం, ఒక్కో టిఎంసి ద్వారా ఎన్ని ఎకరాలకు నీరందిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతునొక్కి తమపనులు చేసుకుంటుందని దుయ్యబట్టారు. ఒప్పందంలోని అంశాలు ఎందుకు బహిర్గతం చేయకుండా గోప్యతను ప్రదర్శించటంలో ఆంతర్యమేంటో స్పష్టం చేయాలన్నారు. నాడు ప్రతిపాదించిన 152 మీటర్ల ఎత్తును 148మీ.కు తగ్గించటం సిగ్గుచేటన్నారు. డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం మాదిరిగానే ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు ప్రకటిస్తూ, రాష్ట్భ్రావృద్ధికి బాటలు వేయాలని హితువు పలికారు. ఈసమావేశంలో టిడిపి నాయకులు రాయమల్లు, పుట్టనరేందర్, కె. ఆగయ్య, బాలాగౌడ్, చెల్లోజి రాజు, రమేశ్, దూలం రాధిక, దూసెట్టి వాణి, రొడ్డ శ్రీనివాస్, తదితరులున్నారు.

124 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
* 6ఎ కేసు నమోదు 2వాహనాల సీజ్
జగిత్యాల, మార్చి 10: జగిత్యాల పట్టణ శివారులోని హన్‌మాన్ సాయి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 124 క్వింటాళ్ల రేషన్ బియ్యం విజిలెన్స్ సిఐ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో గురువారం దాడి చేసి పట్టుకొని 6ఎ కేసు నమోదు చేయడంతోపాటు 2టాటా యేస్ వాహనాలను సీజ్ చేశారు. అర్హులైన పేదలకు రూపాయికే కిలో బియ్యం అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలా విడుదల చేస్తున్న రేషన్ బియ్యాన్ని అర్హులైన పేదలకు సక్రమంగా అందించకుండా అక్రమ మార్గంలో పాలిష్ చేసి అధిక ధరలకు విక్రయించేందుకు నల్లబజారుకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందని విజిలెన్స్ సిఐ తెలిపారు. పట్టణ శివారులోని రైస్ మిల్లులో 124 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వలు ఉంచినట్లు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకే దాడి చేసి పట్టుకున్నట్లు విజిలెన్స్ సిఐ రాంచందర్‌రావు వెల్లడించారు. ఈ దాడుల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ క్రిష్ణ, శ్రీనివాస్, డిటిఎస్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి పథకాల నిర్వహణ చార్జీలు చెల్లించాలి
* కలెక్టర్ నీతూప్రసాద్
కరీంనగర్, మార్చి 10: గ్రామపంచాయతీలు 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి తాగునీటి పథకాల నిర్వహణ చార్జీలు చెల్లించాలని కలెక్టర్ నీతూప్రసాద్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్పంచ్‌లు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ అధికారులతో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్‌ల నిర్వహణ, విద్యుత్ చార్జీల బిల్లులు, ఆస్తిపన్ను వసూళ్లపై సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా సిపిడబ్ల్యూఎస్ స్కీమ్‌ల నిర్వహణ చార్జీలను పంచాయతీ నుండి చెల్లించాలని నిధుల లభ్యత మేరకు ఎంతవరకు చెల్లిస్తారో అంతవరకు చెల్లించాలని తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, సిపిడబ్ల్యూఎస్ స్కీముల నిర్వహణ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి అన్ని పంచాయతీలు చెల్లించాల్సిన బకాయిల జాబితాను అందజేస్తారని చెప్పారు. అలాగే విద్యుత్ చార్జీలు కూడా చెల్లించాలని సూచించారు. సర్పంచ్‌లు గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు బావులను, బోర్లను అద్దెకు తీసుకొని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. రవాణాకయ్యే బిల్లులు ప్రతినెల చెల్లించబడుతాయని, గతంలో పనిచేసిన బోర్లు మరమ్మతులు చేసే మెకానిక్‌లను మండల అభివృద్ధి అధికారులు సమన్వయపరుస్తూ బోర్ల మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. గ్రామాల్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయుటకు సర్పంచ్‌లు సహకరించాలని కోరారు. నీటి ఎద్దడి గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద ప్రైవేటు భూముల్లో, తాగునీటి బావులు తవ్వించేందుకు అనుమతి ఉందన్నారు. అలాగే పశువుల తాగునీటి తొట్టెల నిర్మాణం ఉపాధి హామీలో చేయొచ్చని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ భూములను ఉపాధిహామీలో చదును చేయించాలని, మిషన్ కాకతీయ చెరువుల కట్టల పక్కన ఈత, తాటి చెట్లను నాటించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఇ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సిఇఓ, ఇన్‌చార్జి డిపిఓ సూరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బొగ్గు గనులపై కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు
గోదవరిఖని, మార్చి 10: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 29న తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. గురువారం సింగరేణి ఆర్జీ-1 ఏరియాలో హెచ్‌ఎంఎస్, సి ఐటియు, ఐఎఫ్‌టియు, ఐఎన్‌టియుసి ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జిలు ధరించి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా జిడికె 2వ గని వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గుగనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కొత్తగనులను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని, 10వ వేజి బోర్డును అమలు చేయాలని ఈ నెల 29న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాజారెడ్డి మాట్లాడుతూ రిటైడ్ కార్మికులకు 40శాతం పెన్షన్ చెల్లించాలని, జులై 1నుండి 10వ వేజ్ బోర్డు వేతనాన్ని అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ వేతనాలను అందజేయాలని, సకలజనుల సమ్మె వేతనాన్ని సింగరేణి కార్మికులకు అందించాలని అన్నారు. వీటితో పాటు ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలుపుతూ పెరుగుతున్న నిత్యవసర ధరలను నియంత్రించాలని, కాంట్రాక్టు కార్మికులకు 1వ క్యాటగిరి వేతనం చెల్లించాలని తదితర డిమాండ్లతో ఈనెల 29న తలపెట్టిన సమ్మెలో సింగేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ నాయకులు కోడి రామస్వామి, గంగారాం, నర్సయ్య, కోటయ్య, సురేష్‌లు, అదేవిధంగా ఐ ఎఫ్‌టియు నాయకులు విశ్వనాథ్, రాజయ్యతో పాటు సి ఐటియు నాయకులు నరహరి రావు, మెండ శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

మహిళా కోర్టును ప్రారంభించిన జిల్లా జడ్జి
కరీంనగర్, మార్చి 10: జిల్లాకు మంజూరైన ప్రత్యేక మహిళా కోర్టును గురువారం ఉదయం జిల్లా జడ్జి నాగమారుతి శర్మ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అనేక నేరాలపై నమోదయ్యే కేసులను సత్వరం పరిష్కరించేందుకు వీలుగా జిల్లాకు ప్రత్యేక మహిళా కోర్టు మంజూరైంది. ఈ మేరకు జిల్లా జడ్జి మహిళా కోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నీతూప్రసాద్, ఎస్పీ డి.జోయల్ డేవిస్, మున్సిపల్ కమీషనర్ కృష్ణ్భాస్కర్, ట్రైనీ ఐపిఎస్ అధికారిణి సింధూ శర్మ, న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కోహెడ, మార్చి 10: మండలంలోని తీగలకుంటపల్లికి చెందిన కోతి శివ (17) అనే ఇంటర్ విద్యార్థి గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

రాఘవపూర్ - మందమర్రి ట్రిప్లింగ్ పనులు
పర్యవేక్షించిన రైల్వే సేఫ్టీ చీఫ్
రామగుండం, మార్చి 10: రాఘవపూర్ నుండి ఆదిలాబాద్ జిల్లా మందమర్రి వరకు 150 కోట్లతో నిర్మాణం చేసిన మూడో ట్రాక్‌లైన్ (ట్రిప్లింగ్) నిర్మాణపు పనులను గురువారం దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ చీఫ్ దినేష్‌కుమార్ సింగ్ పర్యవేక్షించారు. రాఘవపూర్, రామగుండం రైల్వేస్టేషన్ల మధ్య పూర్తి చేసుకున్న ట్రిప్లింగ్ పనులను ఉన్నత అధికారుల బృందంతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. క్రాసింగ్, సిగ్నలింగ్, ప్యానల్ బోర్డు పనులకు సంబంధించిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా మూడో లైన్‌పై ప్రత్యేక రైలుతో ట్రయల్ రన్ నిర్వహించి పరిక్షించారు. రాఘవపూర్ నుండి మందమర్రి వరకు బొగ్గులోడు రవాణాకు సంబంధించిన గూడ్స్ వ్యాగన్ల రాకపోకలు జాప్యం కాకుండా చూసుకునేందుకు, వివిధ ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు ఆలస్యాన్ని అరికట్టేందుకు నిర్మాణం తలపెట్టిన ట్రిప్లింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఈకార్యక్రమంలో డిఆర్‌ఎం అసిస్ అగర్వాల్‌తో పాటు రైల్వే ఉన్నతాధికారులు మల్లిఖార్జున్‌రావు, వరప్రసాద్, భోపాల్ నాయక్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఎపి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
చందుర్తి, మార్చి 10: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ గురువారం చందుర్తి మండల కేంద్రంలో అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ నాయకులు దగ్ధం చేశారు. ఎ,బి,సి,డి వర్గీకరణకోసం మందకృష్ణ మాదిగ పాదయాత్ర నిర్వహిస్తుండగా అక్రమంగా అరెస్టు చేయాడాన్ని వారు ఖండించారు. ప్రభుత్వం వెంటనే మందకృష్ణ మాదిగను విడుదల చేసి ఎబిసిడి వర్గీకరణ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గుండా థామస్, నాయకులు నర్సయ్య, అర్జున్, గసికంటి రాజు, మల్యాల లింగయ్య, గసికంటి దేవరాజు, రాములు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.