విజయనగరం

ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 11: రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు అరకొర నిధులు కేటాయించటంతో ఆయా ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన కొనసాగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులను వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తిచేసి కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేసినా, నిధుల కేటాయింపు మాత్రం అవసరాల మేరకు జరగకపోవటంతో నిర్ణీత గడవులో ప్రాజెక్టుల పూర్తి సాధ్యం కాదని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం రైతుల ప్రయోజనాలను కాపాడే తోటపల్లి ప్రాజెక్టు పనులు 80శాతం వరకు పూర్తికావటంతో గత ఏడాది ద్వితీయార్థంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. మిగతా పనులు వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తిచేసి పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పనులు పూర్తిచేయటానికి 110కోట్ల రూపాయలు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించగా బడ్జెట్‌లో 52.54కోట్లు మాత్రమే కేటాయించారు. ఫలితంగా ఈ నిధులతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం సకాలంలో సాధ్యం కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే జిల్లాలో ముఖ్యమైన తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ప్రస్తుతానికి 300కోట్ల రూపాయలు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు చెబుతుండగా బడ్జెట్‌లో కేవలం ఎనిమిదికోట్లు మాత్రమే కేటాయించారు. దాంతో ఈ పనులు పూర్తవటానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందోనని ఇటు అధికారులు, అటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు బ్యారేజీ పనులు 80శాతం, కాలువల నిర్మాణం 40శాతం, కుమిలి రిజర్వాయర్ పనులు 40శాతం మాత్రమే పూర్తియినట్లు అధికారుల నివేదికలు తెలుపుతున్నాయి. అంతర్‌రాష్ట్ర వివాదంలో ఉన్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం కోసం 32కోట్ల రూపాయలు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించగా బడ్జెట్‌లో కేవలం మూడుకోట్లు మాత్రమే కేటాయించారు. ఒడిషాతో ప్రాజెక్టు నిర్మాణంలో వివాదం ఏర్పడిన కారణంగా డిజైన్ మార్చటంతోపాటు ఆయకట్టును తగ్గించి కేవలం 25వేల ఎకరాలకు మాత్రమే పరిమితం చేసిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించటంతలో ప్రభుత్వం ఉదాసనీతతో వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పెద్దగడ్డ ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తిచేసి నాలుగు వేల ఎకరాలకు నీరిందించటానికి 32కోట్ల రూపాయలు అవసరమవగా బడ్జెట్‌లో కేవలం తొమ్మిది లక్షలు మాత్రమే విదిలించారు. వట్టిగడ్డ ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు నాలుగుకోట్ల రూపాయలు అవసరమవగా విదేశీ సంస్థల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రూ.18లక్షలు మాత్రమే కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేసి జిల్లాను వ్యవసాయరంగంలో అభివృద్ధి చేస్తామని పాలకులు ఇచ్చిన ప్రకటనలు, హామీలు కేటాయించిన నిధులతో పోలిస్తే మరికొన్ని సంవత్సరాల వరకు ప్రాజెక్టుల పరిస్థితి ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని రాజకీయ పక్షాలు, ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.

ఉపాధి హామీ పథకంలో మనమే ఫస్ట్
విజయనగరం,మార్చి 11: రాష్ట్రంలో చేపడుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో విజయనగరం జిల్లా ప్రథమ స్థానం సాధించింది. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌పి ఠక్కర్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ జిల్లా యంత్రాగాన్ని అభినందించారు. అదేవిధంగా వాడవాడలా చంద్రన్నబాట పథకం కింద గ్రామాలలో నిర్మిస్తున్న అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా జిల్లాలో వేగవంతంగా జరుగుతున్నదని ఆయన కితాబు ఇచ్చారు. జాతీయ రహదార్ల అభివృద్ధికి కేంద్రం 65వేల కోట్ల రూపాయలు కేటాయించి నందున ఆయా జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కార్యక్రమాన్ని మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసారు గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవిలో క్రాష్ ప్రోగ్రామ్ అమలుచేస్తూ నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు.పట్టణ గృహనిర్మాణ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించాలని, లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాయక్ మాట్లాడుతూ పట్టణ గృహనిర్మాణ కార్యక్రమంకోసం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 200ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలిపారు. అంతర్గత సిసి రోడ్లనిర్మాణం లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లానుంచి జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, సిపిఓ విజయలక్ష్మి, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

పన్ను వసూళ్లకు శాపం!
విజయనగరం, మార్చి 11: మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం లోపంతో పట్టణంలో ఆస్తి, నీటి పన్ను వసూళ్లకు గండి పడుతోంది. పన్నుల వసూళ్లపై సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. పన్నుల వసూళ్లలో ముందుచూపుకొరవడటంతో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయలేకపోతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపుమరో 19 రోజులు మాత్రమే ఉండటంతో పన్నుల వసూళ్ల కోసం అధికారులు నానా తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ పన్ను వసూళ్లు సక్రమంగా జరగడం లేదు. పట్టణంలో 49,411 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటి ద్వారా 24.65 కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూలు కావలసి ఉండగా, ఇంతవరకు 9.72 కోట్ల రూపాయల పన్ను వసూలు మాత్రమే జరిగింది. ఇంకా 14.93 కోట్ల రూపాయల పన్ను వసూలు జరగవలసి ఉంది. మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతీ ఏటా ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. మొండిబకాయిల వసూళ్లపై దృష్టి సారించకపోవడం వల్ల పన్ను వసూళ్లు మున్సిపాలిటీకి గుదిబండగా మారింది. ఏడాది చివరి వరకూ మున్సిపల్ రెవెన్యూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్లు కలెక్టర్లు పట్టించుకోకపోవడం వల్ల పన్ను బకాయిలు పెరుగుతున్నాయి. దీనికి చమరగీతం పాడవలసిన అధికారులు నిద్రమత్తులో ఉండటం వల్ల మున్సిపాలిటీ ఆదాయానికి పెత్తున గండి పడుతోంది. ముఖ్యంగా పన్ను వసూళ్లకు సంబంధించి జనవరి, ఫిబ్రవరి నెలలో (మిగతా 2వ పేజీలో)
పటిష్టమైన ప్రణాళిక రూపొందిస్తే బకాయిల వసూళ్ల పేరుకుపోయి ఉండేవి కావని ఉద్యోగులు అంటున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, ప్రజారోగ్యశాఖ తదితర విభాగాల అధికారుల సహకారం లోపం కూడా పన్ను వసూళ్లకు శాపంగా మారింది. గతంలో పన్నుల వసూళ్లకు సహకరించిన ఆయా విభాగాల అధికారులు ఇప్పుడు పట్టించుకోకపోడంతో మందకొడిగా పన్నుల వసూళ్లు మందకొడిగా జరుగుతోంది. మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లలో నిర్ధేశించిన లక్ష్యాలను నెరవేర్చడంలో వెనుకబడిన ఐదుగురు బిల్లుకలెక్టర్లకు మున్సిపల్ కమిషన్ జి.నాగరాజు ఛార్జిమెమో జారీ చేశారు.

ఈ-చలానా విధానం అమలు
విజయనగరం, మార్చి 11: రహదారి నిబంధనలను అతిక్రమించే వారికి ఆన్‌లైన్ ద్వారా అపరాధ రుసుము చెల్లించేందుకు పట్టణ పరిధిలో ఈ-చలానా విధానం అమలు చేస్తామని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాసాంతర నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ-చలానా విధానం ద్వారా పదేపదే నిబంధనలు అతిక్రమించినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పట్టణ పరిధిలో వివిధ కూడళ్లల్లో ఏర్పాటుచేసిన సిసి నిఘా కెమెరాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ప్రజాభద్రత చట్టం ప్రకారం రద్దీ ప్రాంతాలలో మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటుచేసి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని విజయనగరం పట్టణ పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని, ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని హితవు పలికారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే వాహనదారుడి లైసెన్సు సీజ్ చేయాలని ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రంకన్ డ్రైవ్ కేసులపై దృష్టి సారించాలని, ట్రాఫిక్ సమయాల్లో పోలీసింగ్ పక్కాగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు నివారించాలని ఆదేశించారు. గ్రామదేవతల పండగల నేపథ్యంలో కోడిపందాలు, పొట్టేళ్ల పందాలు, పేకాట శిబిరాలు, జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారి సమాచారం ముందుగా సేకరించి వాటిని నిరోధించాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో నేరాల నియంత్రణకు రాత్రి గస్తీ ముమ్మరం చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులు వాటి దర్యాప్తు పురోగతిని సమీక్షించిన ఎస్పీ పలు సూచనలు చేసారు. ఈ సమావేశంలో ఓఎస్‌డి వెంకటప్పలనాయుడు, డిఎస్పీలు త్రినాథ్, ప్రవీణ్‌కుమార్, రాజేశ్వరరావు, కృష్ణప్రసన్న, చక్రవర్తి, సిఐలు, ఎస్సైలు, పరిపాలనాధికారి త్రిమూర్తులు, న్యాయ సలహాదారు జానకిరామయ్య పాల్గొన్నారు.
కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ
ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన లైంగికదాడి కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న గజపతినగరం పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లు రాజ్‌కుమార్, ఆండ్ర పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, వి.శ్రీ నివాసరావు, రమణారావులను జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ ప్రశంసా పత్రాలను అందజేసారు.

తాగునీటి పథకం నీరు వృథా
నెల్లిమర్ల, మార్చి 11 : మండలంలోని జగ్గరాజుపేట వద్ద తాగునీటి పథకం పైపులైను లీక్ కావడంతో నీరు వృథాగాపోతోంది. రామతీర్థం మెగా మంచినీటి పథకం నుంచి జగ్గరాజుపేట, సీతారామునిపేట, రామతీర్థం గ్రామాలకు తాగునీరు అందుతోంది. ఈ గ్రామాలకు తాగునీటి సరఫరా చేయడానికి వేసిన పైపులైన్లు జగ్గరాజుపేట గ్రామంవద్ద లీక్ కావడంతో నీరు వృథాగా పోతోంది. పైపులైను లీకేజీ ద్వారా వస్తున్న నీటితో రెండు ఎకరాల్లో పంట పండిస్తున్నారంటే ఎంత నీరు వృథాగా పోతుందో అర్థమవుతోంది. అలాగే తాగునీటి పథకం నీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేదు. లీకైన నీటితో రెండు ఎకరాల్లో పంటలు పండిస్తున్నారంటే ప్రభుత్వ నిధులు కూడా వృథా అవుతున్నాయి. పైపు లైను లీకుతోగ్రామాలకు తాగునీరు కూడా చాలడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు పైపులీకులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సమ్మెతో స్తంభించిన బ్యాంకు లావాదేవీలు
గజపతినగరం, మార్చి 11:గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10,11తేదీల్లో నిర్వహించిన సమ్మె కారణంగా బ్యాంకుల్లో లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. గజపతినగరం వికాస్ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ కార్యాలయాన్ని రెండురోజులుగా మూసివేయడంతో సేవలు నిలిచిపోయాయి. బ్యాంకుకు ఉద్యోగులు ఎవరూ రాకుండా కార్యాలయాన్ని మూసివేసి తమ నిరసనను తెలియజేసారు. ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళను ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ బ్యాంకులో రెండురోజులుగా లావాదేవీలు నిలిచిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
లబ్ధిదారుల ఫోటోలు లేకుండానే
ఆరోగ్యశ్రీ కార్డులు!
దత్తిరాజేరు, మార్చి 11:ప్రభుత్వం జారీ చేసిన ఎన్టీ ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల్లో లబ్ధిదారుల ఫోటోలు లేకుండానే తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ పేరిట కొత్తవాటిని జారీ చేసింది. అయితే ఈ కార్డులను తప్పుడు తడకలతో కొత్తవాటిని జారీ చేసింది. మండలానికి చేరుకున్న కార్డుల్లో కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకుండా పేర్లు మాత్రమే ముద్రించారు. నిరక్షరాస్యులు కార్డులను ఎలా గుర్తుంచుకుంటారో అన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం. వీటిని ప్రజలకు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశాలు రావడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఫోటోలు లేనివాటిని పేర్లతో గుర్తించాలంటే సమయం ఎక్కువ అవుతుందని డీలర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తమను చిన్న చూపు చూస్తుందని, ఫోటోలు లేని కార్డులు పంపిణీ చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని డీలర్లు వాపోతున్నారు.
అక్షరం సీడీ ఆవిష్కరణ
గజపతినగరం, మార్చి 11:రాష్టప్రతి అవార్డు గ్రహీత, మానసిక శాస్తవ్రేత్త గంగచోళ్లపెంట హైస్కూల్‌కు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు బొంతలకోటి శంకరరావు రచన గానం స్వరకల్పనతో పొందుపరచిన 20వ అక్షరం సీడీను ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎ పి రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రమణమూర్తి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళారూపాలు, పాటలు, సంగీతంతో వినూత్న బోధనా పద్ధతులు ప్రవేశపెట్టి దేశంలో బొంతలకోటి సరికొత్త ఒరవడి సృష్టించారని అన్నారు. సమాజానికి అవసరమైన సీడీలను, పుస్తకాలను రూపొందించి అటు విద్యా రంగానికి ఇటు సామాజిక చైతన్యానికి కృషి చేయడం విద్యారంగానికే గర్వకారణమని కొనియాడారు. రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ బొంతలకోటిని ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈసందర్భంగా బొంతలకోటిని జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణారావు, ఉప విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి, ఎ. ఎం. ఓ అల్లు వెంకటరమణ, చైతన్యభారతి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి. ఎస్. ఆర్. మూర్తి తదితరులు అభినందించారు.
తాటిపూడి పర్యాటక కేంద్రానికి భూమి కేటాయింపు
గంట్యాడ, మార్చి 11 : తాటిపూడి పర్యాటక కేంద్రం అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న నిర్మాణాల కోసం 48 ఎకరాల భూమి కేటాయించినట్లు సంయుక్త కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ తెలిపారు. శుక్రవారం మదనాపురం, తాటిపూడి గ్రామాల్లో పర్యటించిన ఆయన పర్యాటక కేంద్రం కోసం కేటాయించిన భూములను పరిశీలించారు. తాటిపూడిలో 14.65 ఎకరాలు, మదనాపురంలో 33.35 ఎకరాల భూమిని పర్యాటక కేంద్రం కోసం కేటాయించినట్లు తెలిపారు. భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దార్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు కృషి
బొబ్బిలి, మార్చి 11: బొబ్బిలి పోలీసు సబ్ డివిజన్ పరిధిలో పూర్తి స్థాయిలో నేరాలను అదుపుచేసేందుకు కృషి చేస్తానని డీఎస్పీ సమ్యలత తెలిపారు. రాజమండ్రి ఈస్ట్ డిఎస్పీగా పనిచేసిన ఆమె బదిలీపై బొబ్బిలి వచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అలాగే నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుస్తామన్నారు.

కేంద్రం సహకరించలేదనడం సరికాదు

విజయనగరం(టౌన్), మార్చి 11: రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం సహకరించలేదని వస్తున్న విమర్శలు సరికాదని బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రా ష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల బడ్జెట్‌గా అభివర్ణించారు. ప్రజలపై ఎటువంటి భారంలేకుండా రూపొందించారని కితాబునిచ్చారు. అయితే రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం సహకరించటంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పూర్తిగా కేంద్రం భరిస్తుందని చెప్పారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం సేకరించి ఇచ్చిన వెంటనే అనుమతులు, నిధులు కేంద్రం మంజూరు చేస్తుందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం జిల్లాల అభివృద్ధికి కేంద్రం నియమించిన కమిటీ నివేదిక అందిన తరువాత వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిత్యంతో ఉందని స్పష్టంచేసారు. జిల్లాలోని తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ, వెంగళరాయ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కేంద్రం సహకరిస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి క్రమంలో కేంద్రం మంజూరు చేసిన వెయ్యి కోట్ల రూపాయలకు ఖర్చుచేసిన వివరాలు కేంద్రానికి అందజేయలేదని, వాటిని సమర్పిస్తే మరిన్ని నిధులు రాష్ట్రానికి ఇవ్వడానికి కేంద్రం సుముఖుంగా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు అశోక్, మధు, తదితరులు పాల్గొన్నారు.

రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళిక

విజయనగరం (్ఫర్టు), మార్చి 11: పట్టణంలో 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించామని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. పట్టణంలో గాజులరేగలో 40వ వార్డు గాజులరేగలో 60 లక్షల రూపాయలు, 30వ వార్డు గంజిపేటలో రోడ్లు, కాలువల నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే 15 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, కల్వర్టులు తదితర నిర్మాణపనులను ప్రారంభించామని తెలిపారు. పెరుగుతున్న పట్టణ విస్తీర్ణం, జనాభాను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గంటస్తంభం జంక్షన్ నుంచి పాతబస్టాండ్‌కు వెళ్లే రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులను ప్రారంభించామని, ఈ పనులు త్వరితగతిన పూర్తయితే మిగతా రోడ్ల నిర్మాణపనులను ప్రారంభిస్తామని తెలిపారు. పట్టణంలో అన్ని ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, డిప్యూటీ ఇంజనీర్ ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు ఆల్తి రాధ, గార సత్యనారాయణ, మైలిపిల్లి పైడిరాజు, కోండ్రు శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.

గ్రామసభతో ప్రణాళిక సిద్ధం చేయండి

విజయనగరం(టౌన్), మార్చి 11 : గ్రామపంచాయితీల అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ ద్వారా సిద్ధం చేయాలని జడ్పీ సిఇఓ రాజకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం డివిజన్ పరిధిలోని పది మండలాల అధికారులకు, ప్రజాప్రతినిధులకు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీ అనే అంశంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పంచాయితీరాజ్ వ్యవస్థలో ప్రణాళిక రూపొందించేందుకు గ్రామసభ కీలకమని అధికారులకు స్పష్టంచేసారు. అలాకాకుండా గ్రామసభ నిర్వహించకుండా అధికారులు నాలుగు గోడల మధ్య కూర్చుని అభివృద్ధి ప్రణాళిక సిద్ధంచేస్తే ప్రజల ఆకాంక్షలు, సామాజిక అవసరాలు ఎలా ప్రతిబింబిస్తాయని ఆమె అన్నారు. చర్చల ద్వారా గ్రామసభలో ప్రజల సమక్షంలో ప్రణాళికను సిద్ధంచేయాలని చెప్పారు. గ్రామస్థాయిలో లైన్ డిపార్టుమెంట్ అధికారంలో ఇందుకు అవసరమైన మార్పురావాలని, ప్రజల భాగస్వామ్యం దిశగా చైతన్యవంతం చేయాలని చెప్పారు. గిరిజన గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యం గ్రామసభల్లో ఉన్నంతగా మైదాన ప్రాంతాల్లో ఉండక పోవడాన్ని ఆమె ప్రస్తావిస్తూ అధికారులు ప్రజలతో మమేకమైనపుడే భాగస్వామ్యం పెరుగుతుందని వివరించారు. ప్రజల సామాజిక అవసరాలను, సమస్యలను ప్రణాళిక ద్వారా నివేదించి ఆన్‌లైన్ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డివిజినల్ పంచాయితీ అధికారి మోహనరావు, డెంకాడ, భోగాపురం, విజయనగరం, పూసపాటిరేగ, వేపాడ ఎంపిపిలు కంది చంద్రశేఖర్, కర్రోతు బంగార్రాజు, ధనలక్ష్మి,చిన్నంనాయుడు, ఎంపిడిఓలు, విస్తరణ అధికారులు, ఐసిడిఎస్, ఎంఇఓలు తదితరులు పాల్గొన్నారు.