తెలంగాణ

పేద రైతుల ఆశలు నెరవేర్చని భూ ప్రక్షాళన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ్మలి మురళీధర్
సంగారెడ్డి, జూన్ 3: తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ ప్రక్షాళన కార్యక్రమం అసైన్డ్ రైతులకు అందని ద్రాక్షగానే మారింది. భూమి విలువ అంతంత మాత్రంగా ఉన్న నాటి కాలంలో అసైన్డ్ చేసి పట్టా సర్ట్ఫికెట్లు జారీ చేసినా లబ్ధిదారులకు మాత్రం భూమి చూపించడంలో అతీగతీ లేకుండాపోయింది. పట్వారీ మొదలుకుని కలెక్టర్ వరకు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు దరఖాస్తులు పెట్టుకుని తమకు భూమిని చూపించాలని వేడుకున్నా ఎవరు కూడా ఆ అభాగ్యులపై దయచూపలేదు. పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేక కొత్త సంస్కరణలు తీసుకువస్తున్న నేపథ్యంలో భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. కనీసం ఈ కార్యక్రమం ద్వారానైనా తమకు భూమి లభిస్తుందని ఆశించిన ఆ బాధితులకు సరైన న్యాయం చేకూరలేదు. పట్టా సర్ట్ఫికెట్లు పొంది దాదాపు 59 సంవత్సరాలు పూర్తవుతున్నా సాగుభూమికి నోచుకోని ఎనిమిది మంది బాధితులు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో ఉన్నారు. అప్పట్లో పట్టా సర్ట్ఫికెట్లు పొందిన ఎనిమిది మందిలో ఏడుగురు లాభోక్తులు పరమపదించగా ఒక మహిళ మాత్రం జీవిస్తోంది. ఆంధ్రభూమి పరిశీలనలో వెలుగు చూసిన పచ్చి నిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నమిది. 1970 సంవత్సరం నుంచి ఆత్మకూర్ గ్రామానికి చెందిన చిప్పె (దర్జి) చెన్‌వీరప్ప, రాజపేట మల్లయ్య, చాపల చంద్రయ్య, మునిపల్లి బాగయ్య, గొల్లపల్లి నర్సమ్మ, కుమ్మరి అడివయ్య, సాలె పర్మయ్య, బేగరి రామయ్యల కుటుంబాలు సాగు భూమి కోసం ఎదురుచూస్తున్నాయి. 1970 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ చక్రవర్తి చేతులమీదుగా ఎనిమిది మంది రైతులకు ప్రభుత్వ భూమిని అసైన్ చేసారు. సర్వే నంబర్ 171/3లో చాపల చంద్రయ్యకు ఎకరం భూమి, 171/5లో రాజపేట మల్లయ్యకు ఎకరం భూమి, 171/6లో చిప్పె చెన్‌వీరప్పకు 2 ఎకరాలు, 208/1లో మునిపల్లి బాగయ్యకు 1.23 ఎకరాలు, 208/2లో గొల్లపల్లి నర్సమ్మకు 1.22 ఎకరాలు, 208/3లో కుమ్మరి అడివయ్యకు 1.22 ఎకరాలు, 208/4లో సాలె పర్మయ్యకు 1.22 ఎకరాలు, 208/5లో బేగరి రామయ్యకు 1.22 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు పక్కా పాసు పుస్తకాలను సర్ట్ఫికెట్లను అందజేసారు. తమకు భూమి పట్టాలు వచ్చాయన్న సంతోషానికే లాభోక్తులు పరిమితమయ్యారే కానీ సదరు భూమి ఎక్కడుందో చూపించాలని అధికారులను కోరినా ఎవరూ కనికరించలేదు. 12 సంవత్సరాలు ఎదురుచూసినా.. రెవెన్యూ అధికారులు కనికరించకపోవడంతో 1982లో మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి గెలుపొందిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి బాధితులు మొరపెట్టుకున్నారు.
ఇందిరాగాంధీకి రాసిన లేఖలో అధికారులు పెడుతున్న ఇబ్బందులను పూసగుచ్చినట్లు తెలుగులో లిఖితపూర్వకంగా రాసి రిజిస్టర్ పోస్టు ద్వారా తమ విన్నపాన్ని ఢిల్లీకి పంపించారు. అప్పట్లో పనిచేసిన ముఖ్యమంత్రులకు కూడా బాధితులు భూమిని చూపించాలని కోరినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. భూ ప్రక్షాళన కార్యక్రమం ద్వారానైనా తమకు న్యాయం చేకూరుతుందని బాధిత కుటుంబాల సభ్యులు ఆశించినా ఫలితం లేకుండాపోయింది. చూపిస్తున్న సర్వే నంబర్లు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని బాధిత కుటుంబానికి చెందిన చిప్పె (దర్జీ) సుధాకర్ వాపోతున్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేకూర్చాలని ఆయా కుటుంబాలకు చెందిన వ్యక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చిత్రం..సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో 1970 సంవత్సరంలో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలతో బాధితుడు చిప్పె సుధాకర్