బిజినెస్

తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: నిరాటంకంగా కొనసాగుతున్న రూపాయి విలువ పతనం, ముడి చమురు ధరల పెరుగుదల.. దేశ క్యాపిటల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రెండు అంశాల కారణంగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 9,300 కోట్ల (1.3 బిలియన్ డాలర్ల)కు పైగా విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) గత నెలలో క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 21,000 కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు జూలై, ఆగస్టు నెలల్లో ఎఫ్‌పీఐలు మన క్యాపిటల్ మార్కెట్లలో నికరంగా రూ. 7,400 కోట్ల పెట్టుబడులు పెట్టారు. తాజా డిపాజిటరి గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐలు అక్టోబర్ 1-5 మధ్య కాలంలో కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలో కలిపి ఈక్విటీల నుంచి నికరంగా రూ. 7,094 కోట్లు, డెబిట్ మార్కెట్ల నుంచి రూ. 2,261 కోట్లు ఉపసంహరించుకున్నారు. అంటే మొత్తం రూ. 9,355 కోట్ల (1.3 బిలియన్ డాలర్ల) నిధులను వారు ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేవలం రెండు నెలలు మినహా మిగతా అన్ని నెలల్లోనూ నికర విక్రయదారులుగానే ఉన్నారు. అయితే, అక్టోబర్ నెలలో ఎఫ్‌పీఐలు వేగంగా తమ నిధులను ఉపసంహరించుకోవడం మార్కెట్‌ను కుదిపివేసిందని నిపుణులు పేర్కొన్నారు. ‘ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికాలో పెట్టుబడులపై రాబడులు పెరగడం, డాలర్ల లభ్యత తగ్గడం వంటివి ఎఫ్‌పీఐలు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి తమ నిధులను ఉపసంహరించుకోవడానికి ప్రధాన కారణాలని బజాజ్ క్యాపిటల్ ఇనె్వస్ట్‌మెంట్ అనలిటిక్స్ విభాగం అధిపతి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ అగర్వాల్ పేర్కొన్నారు. అయితే, ఈ సమస్య ఒక్క భారత్‌కే పరిమితం కాలేదని, అభివృద్ధి చెందుతున్న అన్ని మార్కెట్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని వివరించారు. అయితే భారత్ తాను వినియోగిస్తున్న మొత్తం చమురులో ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటున్నందున మన దేశంపై ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ రుణ ఎగవేతదారుగా మారడం, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ద్రవ్యలభ్యత సమస్యను ఎదుర్కోవడం మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడాన్ని మరింత తీవ్రం చేసిందని వివరించారు.