తెలంగాణ

అమలుకు నోచుకోని కేబినెట్ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది పదవీవిరమణ వయోఃపరిమితి పెరగలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, నియమావళి ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయోఃపరిమితి 58 సంవత్సరాలు. ఈ వయోపరిమితిని 65 సంవత్సరాలకు పెంచాలని కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం 2018 మే నెలలో నిర్ణయించింది. వివిధ శాఖల్లో పీజీ తర్వాత స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసే వరకే అభ్యర్థుల వయస్సు 35 నుండి 40 సంవత్సరాలు అవుతోంది. 58 ఏళ్లకు పదవీ విరమణ చేస్తే వీరు పనిచేసే కాలం 18 నుండి 22 ఏళ్ల వరకు అవుతోంది. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి 30 నుండి 36 ఏళ్ల వరకు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెడికల్ కాలేజీల్లో అనుభవం ఉన్న ఉన్న వైద్యులు, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల్లో సీనియర్ల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే పదవీ విరమణ వయస్సును పెంచాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే హోదా ఉన్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయోఃపరిమితి తొలుత 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు, ఆ తర్వాత 60 సంవత్సరాల నుండి 63 సంవత్సరాలకు పెంచారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు చెందిన కొంత మంది సీనియర్ వైద్యులు ఏపీ మెడికల్ కాలేజీలకు, వైద్య, ఆరోగ్య శాఖలకు అలాట్ అయ్యారు. వారి వయస్సుతో సమాన వయస్సు ఉన్నవారే తెలంగాణలో పదవీ విరమణ చేస్తుండగా, ఏపిలో పనిచేస్తున్న వారు ఇంకా సర్వీసులోనే ఉన్నారు. మరో రెండుమూడేళ్లపాటు వారు సర్వీసులోనే ఉంటారు. మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం ఇటీవల జరిగినప్పటికీ, ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. ఓక్కో మెడికల్ కాలేజీలో 300 మందికి పైగా బోధనా సిబ్బంది పోస్టులున్నాయి. హైదరాబాద్ (ఉస్మానియా, గాంధీ), వరంగల్ (కాకతీయ) నగరాల్లోని మెడికల్ కాలేజీలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్ధిపేట, మహబూబ్‌నగర్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలున్నాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ తదితర పాత కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు గత రెండేళ్ల నుండి భారీ ఎత్తున పదవీ విరమణ చేస్తున్నారు. దాంతో మెడికల్ కాలేజీల్లో చాలా వరకు బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. పదవీ విరమణ చేస్తున్న వారి వల్ల బోధనాసుపత్రుల్లో కూడా భారీగా ఖాళీలున్నాయి. మరో ఏడాది, రెండేళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని వాస్తవ పరిస్థితి వెల్లడిస్తోంది. ఒక్కో బోధనాసుపత్రిలోని ఒక శాఖలో 10 మంది వైద్యులు పనిచేయాల్సిన చోట ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. దాంతో రోగులకు సరైన చికిత్స అందడం లేదు. మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు బోధించే సిబ్బంది సంఖ్య కూడా తక్కువగా ఉంది.
ఇలా ఉండగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పదవీ విరమణ చేస్తున్న సీనియర్ వైద్యుల సేవలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల వారు ఉపయోగించుకుంటున్నారు. గత రెండేళ్లలో ఈ విధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చేరిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సంఖ్య 200 పైగా ఉన్నట్టు తెలిసింది.
బోధనా సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంచడం పట్ల తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం, జూనియర్ డాక్టర్ల సంఘాలు (జూడా) లు వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంలో ఒక నిపుణుల కమిటీని నియమించి, సమగ్ర అధ్యయనం చేసి వారి నివేదిక ప్రకారం విధాన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని పలువురు సీనియర్ వైద్యులు అభిప్రాయపడ్డారు.