తెలంగాణ

కాంగ్రెస్‌కు భయపడేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 1: ఎన్నో ఏళ్లుగా దేశాన్ని పరిపాలించి ప్రజల కష్టాలు తీర్చని దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి భయపడేది లేదని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజల ఆశీర్వాద సభకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మాయలకూటములు ఎన్ని వచ్చినా ఇక్కడ ఎవ్వరు భయపడేవారు లేరని.. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడ్డ చంద్రబాబుతో కాంగ్రెస్ జతకట్టడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ నాయకులు దెబ్బతీశారని ఆరోపించారు. చంద్రబాబు చేతిలో నాయకుల జుట్లు ఉన్నాయని ఆ జుట్లను బాబు పూర్తిగా కత్తిరించక తప్పదని ఎద్దేవా చేశారు. మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో దోస్తీ కట్టిన చంద్రబాబు టీఆర్‌ఎస్‌కు ఓ లెక్కే కాదని.. అలాంటి నాయకులకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌తో చరిత్రలో కాలగర్భంలో కలుపుతానని శపథం చేసి ఎన్టీఆర్ టీడీపీని తీసుకువచ్చారని.. కానీ ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి రాజకీయాలు వల్ల చేయడం ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. వందమంది చంద్రబాబులు కాంగ్రెస్‌తో జతకట్టినా తెలంగాణలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఇంచ్ కూడా ఏమీ చేయలేరని ఘాటైన విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌నే ఓడించిన ఘన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉందని ఆ చరిత్రను కల్వకుర్తిలో ప్రజలు సృష్టించారన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించొద్దని కేంద్రానికి, కృష్ణ ట్రిబ్యునల్‌కు 30 ఉత్తరాలు రాసింది చంద్రబాబు కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు దుర్మార్గమైన ఆలోచన చేసిన చంద్రబాబును ఆయనతో జతకట్టి తెలంగాణ ప్రజల ముందుకు ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్‌ను పాలమూరు ప్రజానీకం తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 57 ఏళ్లు కాంగ్రెస్, 17 ఏళ్లు టీడీపీ పరిపాలించిందని వీరి పరిపాలనలో పాలమూరు పచ్చబడలేదని విమర్శించారు. ఈ నాయకులు రైతుల నోట్లో మట్టికొడుతూ మళ్లీ పాలమూరు జిల్లాలో దత్తత తీసుకున్నామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసి దగాచేసిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీ నాయకులదేనని ధ్వజమెత్తారు. పాలమూరు రైతాంగానికి ఎదైనా మేలు జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగున్నర ఏళ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే జరిగిందన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేస్తూ దాదాపు 9లక్షల ఎకరాలకు కృష్ణా జలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీడుబారిన పొలాల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్ నాయకులకు కడుపుమంట మొదలైందని ఘాటైన విమర్శలు చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, కాలేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీడీపీనాయకులు దాదాపు 200కేసులు వేశారని ఆరోపించారు. తెలంగాణ రైతాంగం బాగుకోసం కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మిస్తుంటే దిక్కుమాలిన కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రాజెక్టులను ఆపేందుకు కోర్టుల్లో కేసులపై కేసులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలను తెలంగాణ ప్రజలు ఆషామాషీగా తీసుకోవద్దని తెలంగాణ పునర్‌నిర్మాణం ఆగిపోకూడదని అందుకే ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు అండగా ఉండి కేసీఆర్‌ను ఆశీర్వదించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతూ కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని కారుకూతలు కూస్తున్నారని వారి నోటికి ప్రజలే తాళం వేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగసభలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, ఎడ్మా కిష్టారెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.