రాష్ట్రీయం

వుడా, తుడా వెలతెల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 31: రాష్ట్రంలోని నగరాభివృద్ధి సంస్థలు అనేక సంవత్సరాలుగా అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నగరాభివృద్ధి సంస్థలకు చైర్మన్లను, పూర్తి స్థాయిలో డైరక్టర్లను నియమించింది. 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ కొన్ని నగరపాలక సంస్థలకు చైర్మన్లను నియమించినా, బోర్డును ఏర్పాటు చేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలోనూ బోర్డుల నియామకం జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా బోర్డులపై ఉలుకూ పలుకూ లేదు.
విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)కు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్‌ఎ రెహమాన్‌ను చైర్మన్‌గా నియమించారు. అప్పట్లో పూర్తిస్థాయి బోర్డు సభ్యులను కూడా నియమించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బోర్డు రద్దయింది. ఆ తరువాత వుడా చైర్మన్‌గా రవిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అయితే డైరక్టర్లను నియమించలేదు. రవి వైదొలగాక వుడాకు చైర్మన్‌గా ఎవ్వరినీ నియమించలేదు. ఈ సంస్థకు తానే చైర్మన్‌గా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించుకున్నారు. దీనికి క్యాబినెట్ ఆమోదం కూడా లభించింది. ఆ తరువాత ఎందుకో ఆయన ఈ చైర్మన్‌గిరీని స్వీకరించడానికి ముందుకు రాలేదు. జూన్-ఆగస్ట్ మధ్య గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఎవరికి ఈ పదవిని కట్టబెట్టినా, మిగిలిన ఆశావహులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉంటాయని భావించి, ఈ నియామకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు విశ్వసనీయ సమాచారం. జివిఎంసి ఎన్నికల్లో నాయకుల పనితీరునుబట్టి నియామకాలు ఉంటాయని చెపుతున్నారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి నగరాభివృద్ధి సంస్థలకు కూడా చాలాకాలంగా చైర్మన్‌ను నియమించలేదు. 2013లో శ్రీనివాసరెడ్డి చైర్మన్‌గా ఉండేవారు. ఆ తరువాత ఆయన ఆ పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడు ఈ విజిటిఎం వుడాను పూర్తిగా క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీగా (సిఆర్‌డిఏ)గా మార్చేశారు.
దీనికి చంద్రబాబు నాయుడు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తిరుపతి నగరాభృవృద్ధి సంస్థ(తుడా)కు 2013లో కరుణాకరరెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన టిటిడి చైర్మన్‌గా వెళ్లిన తరువాత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తుడాకు చైర్మన్‌గా పనిచేశారు. ఆయన తరువాత వెంకటరమణ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన మరణం తరువాత తుడాకు చైర్మన్‌ను నియమించలేదు. కరుణాకరరెడ్డి చైర్మన్‌గా పనిచేసినప్పుడు కూడా పూర్తి స్థాయి బోర్డును ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అలాగే, కుప్పం నగరాభివృద్ధి సంస్థ, నెల్లూరు నగరాభివృద్ధి సంస్థలు కూడా బోర్డుల కోసం ఎదురు చూస్తున్నాయి.
ఎందుకు వెనకంజ?
నగరాభివృద్ధి సంస్థలకు చైర్మన్‌లను, బోర్డును ఏర్పాటు చేయకపోవడంపై పార్టీ వర్గాలు రకరాలుగా విశే్లషించుకుంటున్నాయి. చంద్రబాబు పార్టీ నాయకుల కన్నా, అధికారులనే ఎక్కువగా నమ్ముతుంటారు. అందుకే నగరాభివృద్ధి సంస్థ బాధ్యతలను స్పెషల్ ఆఫీసర్లకు అప్పగించారని చెపుతున్నారు. అదేవిధంగా నగరాభివృద్ధి సంస్థలు ఉన్న ప్రతి జిల్లాలోనూ ఆయా పదవుల కోసం చాలా మంది కాచుకు కూర్చున్నారు. వీరిలో ఒకరికి పదవి ఇస్తే, మిగిలిన వారంతా అసమ్మతి జెండాలు ఎగరేస్తారని బాబు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా, మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బడిముబ్బడిగా నాయకులు వచ్చి చేరారు. ఈమధ్య వైకాపా నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, నాయకులు వచ్చి చేరుతున్నారు. పై పదవుల కోసం వీరి నుంచి కూడా వత్తిడి పెరుగుతోంది. వారికి పదవులు కట్టబెడితే సొంత పార్టీలో చిచ్చు రేగుతుందన్న ఉద్దేశంతో నగరాభివృద్ధి సంస్థ చైర్మన్, డైరక్టర్ల పదవుల నియామకాలను పక్కన పెడుతున్నారని తెలుస్తోంది.