తెలంగాణ

‘సబ్సిడీ బియ్యం’ స్వాహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 8: దారిద్య్ర రేఖకు దిగువన జీవనం వెళ్లదీస్తున్న కుటుంబాలకు చేరాల్సిన సబ్సిడీ బియ్యం తన రూపాన్ని మార్చుకుని నల్లబజారుకు చేరుకుంటోంది. అధికారుల నిఘా వైఫల్యాన్ని ఆసరాగా చేసుకుని పలువురు ముఠాగా ఏర్పడి నెలనెలా రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి కూడా సబ్సిడీ బియ్యాన్ని ఇక్కడికి రప్పించి వివిధ రైస్‌మిల్లులలో రీసైక్లింగ్ చేసి యథేచ్ఛగా స్వేచ్ఛా విఫణికి చేరవేస్తున్నారు. అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్, ఐరిస్ విధానాల ద్వారా రేషన్ పంపిణీ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అక్రమార్కుల ఆగడాల ముందు ఇవన్నీ బలాదూర్‌గానే నిలుస్తున్నాయి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఉదంతాలు ఇప్పటికే అనేక పర్యాయాలు వెలుగుచూడగా, వారంలో కనీసం రెండు పర్యాయాలైనా సబ్సిడీ బియ్యం నిల్వలు పట్టుబడుతున్నాయి. రెండు రోజుల క్రితమే నగరంలో రేషన్ బియ్యాన్ని పక్కా సమాచారం మేరకు వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఇదివరకు అర్సపల్లి రైస్‌మిల్లులో రీసైక్లింగ్ కోసం ఉంచిన సబ్సిడీ బియ్యం పెద్ద ఎత్తున పట్టుబడగా, మరికొద్ది రోజులకే ఖానాపూర్ రైస్‌మిల్లు నుండి కూడా అధికారులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా నుండి తరలిస్తున్న బియ్యం లారీని కంఠేశ్వర్ ప్రాంతం వద్ద పట్టుకున్నారు. ఈ సంఘటనలను బట్టి చూస్తే ఇందూరు కేంద్రంగా రేషన్ బియ్యం స్వాహా పర్వాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. తరుచూ ఈ తరహా సంఘటనలు వెలుగు చూస్తున్నప్పటికీ, అధికారుల నియంత్రణ కొరవడడంతో ఈ అక్రమ వ్యాపారానికి కళ్లెం వేయలేకపోతున్నారు. పక్కా సమాచారం అందితే తప్ప, దాడులు చేసే పరిస్థితి లేదు. అది కూడా సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటేనే విశ్వసనీయ సమాచారానికి స్పందన లభిస్తోంది. ఆహార భద్రత పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 6.30 లక్షల కుటుంబాలను ఎంపిక చేశారు. కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి ఆరు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డులు కలిగిన వారికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుహోల్డర్లకు 10 కిలోల వంతున ప్రతీ నెలా ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 13,233మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యాన్ని కిలో రూపాయి చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇవి కాకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి, హాస్టళ్ల విద్యార్థుల కోసం మరో 1171 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని నెలనెలా సమకూరుస్తున్నారు.