తెలంగాణ

కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 12: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలు అవలంబిస్తూ బలిదానాలతో తెలంగాణ తెచ్చుకున్న విద్యార్థి లోకం భవిష్యత్‌ను నాశనం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ దుయ్యబట్టారు. ఆదివారం నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలతో 28మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా, విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ గ్లోబరీనా సంస్థ, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతోనే ఫలితాల్లో అవకతవకలకు దారితీసిందని తేల్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలను పరామర్శించలేని సీఎం కేసీఆర్ విహార యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు, ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలు సాగించడం విడ్డూరమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీయైపోయిందన్నారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో తాను చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసిన ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విద్యాశాఖ మంత్రి, బోర్డు కమిషనర్‌ను, గ్లోబరీనాను వెనకేసుకొచ్చిన తీరు ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు పెద్ద ఎత్తున మూతపడి నిరుద్యోగులు వీధిన పడ్డారన్నారు. డీఎస్సీ నియామకం చేయకుండా ఏళ్ల తరబడి నాన్చుతూ ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టుపటిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయాల్లో, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో 50 శాతం ఖాళీలున్నాయని, అర్హతలేని అధ్యాపకులతో ఇంటర్ పత్రాల మూల్యాంకనం చేసి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేసిన తీరుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇంటర్ ఫలితాల నిర్వాకంలో దోషులను శిక్షించేదాకా, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసేదాకా, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చేదాకా బీజేపీ తన ఉద్యమాన్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తుందన్నారు. కేంద్ర హోంశాఖ, రాష్టప్రతిలను కలిసి ఇంటర్ విద్యార్థుల సమస్యను వివరించి నివేదికలు తెప్పించుకోవాలని కోరుతామని లక్ష్మణ్ వెల్లడించారు. ఈనెల 15,16 తేదీల్లో తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ, బీజేవైఎంలు నిరసన దీక్షలు సాగిస్తాయన్నారు. కేంద్రంలో రానున్నది మరోసారి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వమేనన్నారు. 300 సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందని, బీజేపీయేతర పార్టీల కూటమి పాలన కోసం ఇద్దరు చంద్రులు చంద్రబాబు, చంద్రశేఖర్‌రావుల కలలు పగటి కలలుగా మిగిలిపోనున్నాయన్నారు. కేంద్రంలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో బీజేపీ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా నిలిచేందుకు, కల్వకుంట్ల కుటుంబం నుండి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌కు బీ టీమ్‌గా మారిపోగా, ఆ పార్టీ శాసన సభ పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యే దుస్థితిలో ఉందన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్రంలో నీటి బుడగ మాదిరిగా ఉందని, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమితో ఆ పార్టీ పతనం మొదలైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల పిదప త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో, టీఆర్‌ఎస్ పార్టీలో అనూహ్య పరిణామాలు రాబోతున్నాయని కల్వకుంట్ల కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాదిరిగానే టీఆర్‌ఎస్‌లోని ప్రజాస్వామిక వాదులంతా బీజేపీ రాజకీయ వేదికపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, రామోజీ షుణ్ముక, పి.శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ లక్ష్మణ్