తెలంగాణ

27న పరిషత్ ఓట్ల లెక్కింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 27 న నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని, అల్లర్ల కారణంగా ఎక్కడ కూడా రీపోల్ జరగలేదన్నారు. సాంకేతిక కారణాల మూలంగా మూడుచోట్ల మాత్రం రీపోల్ జరిగిందని వివరించారు. పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఏడుచోట్ల బ్యాలెట్‌పేపర్లలో తప్పిదాలు జరిగినట్టు గుర్తించామన్నారు. మొత్తం మీద 77.46 శాతం ఓట్లు పోలయ్యాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా 87.02 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, వికారాబాద్ జిల్లా 70.40 శాతంతో చివరిస్థానంలో నిలిచిందన్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని కదిరెపాడు ఎంపీటీసీ స్థానానికి ఈ నెల 17 న తాజాగా పోలింగ్ నిర్వహిస్తామన్నారు. కదిరెపాడులో బ్యాలెట్ పత్రాలు తప్పుగా జారీ కావడంతో మళ్లీ పోలింగ్ నిర్వహిస్తున్నామని వివరించారు. పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు 536 స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశామని నాగిరెడ్డి తెలిపారు. పటిష్టమైన పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూంలు ఉన్నాయని వివరించారు. పోలింగ్ కోసం 65,000 బ్యాలెట్ బాక్సులను వినియోగించామని (20 శాతం రిజర్వ్ బాక్సులతో కలిపి), 3.50 కోట్ల బ్యాలెట్ పేపర్లను వాడామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 123 కేంద్రాల్లో 978 హాళ్లను వినియోగిస్తామని, 11,882 మంది సూపర్‌వైజర్లు, 23,647 మంది కౌంటింగ్ అసిస్టెంట్ల సేవలను వినియోగిస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన తప్పులపై అధ్యయనం చేసిన తర్వాత పరిషత్ ఎన్నికల సమయంలో ముందస్తు చర్యలు తీసుకున్నామని, అందువల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు.
పోలింగ్ కోసం 32,045 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 2,488 కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ జరిగిందని నాగిరెడ్డి గుర్తు చేశారు. పోలింగ్ కోసం 1,86,000 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగించామని, 54,604 మంది రక్షణ సిబ్బంది పనిచేశారన్నారు.
ఏకగ్రీవ ఎన్నిక
538 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల కోసం నోటీస్ జారీ చేయగా నాలుగు స్థానాల్లో ఏకగ్రీవం జరిగిందని, 534 చోట్ల పోలింగ్ జరిగిందని నాగిరెడ్డి తెలిపారు. 5817 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకోసం నోటీస్ ఇవ్వగా 158 స్థానాల్లో ఏకగ్రీవం జరిగిందని, 5,659 చోట్ల పోలింగ్ జరిగిందని తెలిపారు.
జూలై 4 న కొత్త సారథులు
ప్రస్తుతం పనిచేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీల కాలపరిమితి 2019 జూలై 3 వరకు ఉందని, కొత్తగా ఎన్నికయ్యే ప్రతినిధులు 2019 జూలై 4 న బాధ్యతలు స్వీకరిస్తారని నాగిరెడ్డి తెలిపారు. జూలై 5 తర్వాత జడ్పీ చైర్మన్ల ఎన్నిక ఉంటుందని వివరించారు. ఖమ్మం జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ పదవీ కాలం 2019 ఆగస్టు 5 వరకు ఉందని ఆ తర్వాతే ఈ జిల్లాకు కొత్త జడ్పీ చైర్‌పర్సన్ వస్తారన్నారు.