తెలంగాణ

విస్తరణ చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: మంత్రివర్గ విస్తరణ అధికార టీఆర్‌ఎస్‌లో చిచ్చురేపింది. మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరిగా అసమ్మతి బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతనకు మాట ఇచ్చి తప్పారని మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి బహాటంగానే అసమ్మతిని వెళ్లగక్కగా మరో మాజీ మంత్రి జోగురామన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న వార్తలు కలకలం రేపాయి. అలాగే మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తనకు విప్ పదవిని నిరాకరిస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం ఆయన పార్టీ ఆధిష్ఠానానికి సమాచారం అందించారు. తనకు కేటాయించిన గన్‌మెన్లను కూడా ప్రభుత్వానికి సరండర్ చేశారు. ఇప్పటికే తన గన్‌మెన్లను జోగురామన్న సరండర్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధినాయకత్వంపై మంత్రి ఈటల రాజేందర్ రాజేసిన అసమ్మతి సెగ రోజు రోజుకు ఇతర నేతలకు కూడా పాకుతుండటంతో ఆదిలోనే అడ్డుకట్ట వేసే దిశగా టీఆర్‌ఎస్ దృష్టిసారించింది. మంత్రిపదవి ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించడానికి అధినేత రంగంలోకి దిగారు. కేబినెట్ హోదా కలిగిన పదవుల భర్తీకి కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు కూడా ఆ పార్టీ వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణతో అసమ్మతికి ఆదిలోనే అరికట్టవచ్చని వేసిన అంచనాలు తప్పడంతో ఈ పరిణామాలకు ఇంతటి ఆపాలని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రంగంలోకి దిగారు. మాజీ మంత్రి జోగురామన్నతో మాట్లాడటానికి కేటీఆర్ ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం. ఎలాగైనా ఆయన్ను కలిసి
తన వద్దకు తీసుకరావాలనే పార్టీ ముఖ్యనేతలను పురమాయించినట్టు చెబుతున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నరసింహారెడ్డితో పార్టీ అధినేత కేసీఆరే నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మంత్రి పదవి ఆశించిన భంగపడిన నిజామాబాద్ జిల్లాకు చెందిన బాజీరెడ్డి గోవర్దన్, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే అసంతృప్తిగా ఉన్నట్టు వచ్చిన కథనాలను మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో వారంతా ఖండించారు. పార్టీ అధిష్ఠానం పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని, తమకు తప్పకుండా న్యాయం చేస్తారన్న విశ్వాసాన్ని వాళ్లు వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేశారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వారితో ఫోన్లో మాట్లాడిన తర్వాతనే వారు అధిష్ఠానంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేసినట్టు సమాచారం.
ఇలా ఉండగా పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తికి లోనుకాకుండా మంత్రివర్గ విస్తరణకు ముందు రోజుననే 12 మంది ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లకు సముచిత పదవులు ఇవ్వబోతున్నట్టు సీఎం కేసీఆర్ మీడియాకు ప్రకటన కూడా విడుదల చేశారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఒక్కొక్కరిగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో వెంటనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. దీనిలో భాగంగానే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి రాజ్యసభకు అవకాశం కల్పించనున్నట్టు హామీ ఇవ్వనున్నట్టు తెలిసింది. బాజీరెడ్డి గోవర్దన్‌కు రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మిషన్ భగీరథ చైర్మన్, జూపల్లి కృష్ణారావుకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.