తెలంగాణ

గుంతలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 24: తాత్కాలిక సిబ్బందితో నిర్వహిస్తున్న ఆర్టీసీ బస్సుల కారణంగా వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పూర్తిస్థాయిలో అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్లు బస్సులు నడిపిస్తుండటంతో అనునిత్యం ఏదోఒక చోట ప్రమాద ఘటనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా గురువారం నిజామాబాద్ మండలం మల్లారంగండి సమీపంలో భారీ రోడ్డు దుర్ఘటన బారి నుండి పదుల సంఖ్యలో ప్రయాణికులు త్రుటిలో తప్పించుకోగలిగారు. అదుపు తప్పి ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన గుంతలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు చెట్టు అడ్డుగా నిలువడంతో బస్సు బోల్తా కొట్టలేదు. లేనిపక్షంలో ఊహించని రీతిలో భారీ నష్టం సంభవించి ఉండేదని ప్రయాణికులు, స్థానికులు పేర్కొన్నారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ డిపోకు చెందిన ఏపీ.29జడ్.718 నెంబర్ గల ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి బాన్సువాడకు గురువారం మధ్యాహ్న సమయంలో బయలుదేరింది. బస్సులో సుమారు 80మంది వరకు ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. మల్లారంగండి సమీపంలోకి చేరుకున్న మీదట, ఎదురుగా వస్తున్న మోటార్ సైక్లిస్టును బస్సు ఢీకొట్టింది. ఈ క్రమంలోనే అదుపు తప్పి ఎడమ వైపున రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి జారుకుంది. ఈ హఠాత్ పరిణామానికి బస్సులో కిక్కిరిసి ఉన్న ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు. బస్సు బోల్తాపడే క్రమంలో అదృష్టవశాత్తు ఓ పెద్ద చెట్టుకు ఒరిగి, పూర్తిగా ఒక పక్కన వంగిపోయిన స్థితిలో అక్కడే నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయ్యింది. అప్పటికే బస్సు కుదుపులకు గురికావడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. చెట్టు ఆసరా లభించకుండా ఒకవేళ బస్సు బోల్తా కొట్టినా, మరికొంత ముందుకు వెళ్లినా నాలుగైదు అడుగుల దూరంలోనే ఉన్న నీటి గుంతలోకి జారిపోయి భారీ నష్టం సంభవించి ఉండేది. అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరుగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మార్గం గుండా వచ్చిపోయే వాహనదారులు, స్థానికుల సహాయంతో బస్సులోని ప్రయాణికులు కిటికీల గుండా, డ్రైవర్ వైపున ఉండే డోర్ గుండా బయటపడ్డారు. అప్పటివరకు మహిళలు, చిన్నారులు ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళనతో బస్సు లోపల బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని, ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో తమ ప్రాణాలను పణంగా పెట్టాడని ప్రయాణికులు ఆరోపించారు. కాగా, ఆర్టీసీ బస్సుల కారణంగా తరుచూ జరుగుతున్న ప్రమాద ఘటనలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని పీడీఎస్‌యూ నాయకుడు సాయికృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండా సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను నడుపుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.

*చిత్రాలు.. అదుపుతప్పి గుంతలోకి జారిపోయి చెట్టుకు ఆనుకుని ఆగిన ఆర్టీసీ బస్సు
* ప్రమాద స్థలికి నాలుగు అడుగుల దూరంలో ఉన్న నీటి గుంత