తెలంగాణ

ప్రైవేట్‌కే మొగ్గు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: ఆర్టీసీని ప్రైవేటీకరించడంతో ప్రస్తుతం ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని ఈడీల అధ్యయన నివేదికలో స్పష్టంగా తేల్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం ఆర్టీసీపై మీడియాకు వివరించిన అంశాలనే ఈడీల అధ్యయన నివేదికలో పేర్కొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా డ్యూటీలో శుక్రవారం ఎంతమంది కార్మికులు చేరారన్న అంశాలపై సీఎం ఆరా తీశారు. కచ్చితమైన సమాచారం లేదంటూ అధికారులు చెప్పడంతో సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని ముఖ్యమంత్రికి దృష్టికి అధికారులు తీసుకెళ్లగా ఇంకా వేగంగా భర్తీ చేయడానికి ప్రయత్నించాలని సీఎం ఆదేశించారు. పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇవ్వవచ్చునని ఆ నివేదికలో పొందుపర్చారు. ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తున్న 26 అంశాలపై ఈడీలు సమీక్షించారు. ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై అధ్యయన కమిటీ 45 పేజీల నివేదికను రూపొందించింది. అయితే, ఈ నివేదికలో ఆర్టీసీ విలీన అంశం గురించి ప్రస్తావించలేదు. మరోపక్క ఆర్థిక అంశాల జోలికి కూడా పోలేదు. ఆర్థిక, విధానపరమైన అంశాలను ముఖ్యమంత్రి నిర్ణయానికే ఈడీలు వదిలేశారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ ముఖ్యమంత్రికి అందజేశారు. ఈడీల నివేదికను సీఎం పరిశీలించినట్లు తెలిసింది. ఈడీలు ఇచ్చిన అంశాలతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన అంశాలను కోర్టుకు ఈనెల 28న ప్రభుత్వం సమర్పించనున్నది. ప్రజా రవాణా ద్వారా ప్రజలకు వంద శాతం బస్సులు తిప్పడానికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఆర్టీసీని రక్షిస్తూనే, కార్మికుల భవిష్యత్‌పై సీఎం ఖచ్చితమైన విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నోటీసులు జారీ చేసే అంశంపై ఆర్టీసీకి నష్టాలు వచ్చే విధంగా జేఏసీ నేతలు వ్యవహరించారని కోర్టుకు వివరించనున్నారు. సమ్మె చేయడానికి న్యాయపరమైన విధివిధానాలను జేఏసీ నేతలు చెప్పలేకపోయారని ఆ నివేదికలో చేర్చారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ముందు కార్మికుల న్యాయమైన కోర్కెలను జేఏసీ నేతలు చెప్పలేదని నివేదిక అభిప్రాయపడింది. దసరా పండుగ ఉన్నందున సమ్మెను వాయిదా వేసుకోవాలని, సమ్మెతో ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయని త్రిసభ్య కమిటీ సూచించినా అందుకు జేఏసీ నేతలు ససేమిరా అంటూ సమ్మెలోకి వెళ్ళారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆర్టీసీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించిందని, మరిన్ని నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద చాలినంత నిధులు లేవన్న అంశాన్ని కోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేయబోతోంది. కార్మికులు డ్యూటీలో చేరి పనిచేస్తేనే వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. జేఏసీ నేతలు సూచించిన 21 అంశాలపై ఈడీల అధ్యయన కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. లాభనష్టాలను బేరీజువేసిన అధ్యయన కమిటీ నివేదిక వివరాలను కోర్టుకు అందజేయనున్నారు. ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ఈడీలు తమ అధ్యయన నివేదికలో తేల్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను ఈడీల కమిటీ పక్కన పెట్టింది. ఈ అధ్యయన కమిటీలో పేర్కొన్న అంశాలపై ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ ప్రభుత్వం సూచించే విధానాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సీఎం గ్రీన్‌సిగ్నల్?
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈమేరకు కార్మికులతో సీఎం శనివారం చర్చలు జరుపనున్నట్టు భోగట్టా.