తెలంగాణ

బాబ్లీ గేట్ల మూతకు వరద అడ్డంకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 28: నిజామాబాద్ జిల్లాకు ఆనుకుని గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్ల మూసివేతకు వరద ప్రవాహం అడ్డంకిగా మారింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ గత జూలై 1న బాబ్లీకి చెందిన 14 గేట్లను పైకి ఎత్తారు. వీటిని ఈనెల 29వ తేదీన సీడబ్ల్యుసీ ప్రతినిధి సమక్షంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో బాబ్లీ గేట్లను కిందకు దించి గోదావరి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాల్సి ఉంది. అయితే సీజన్ చివర ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం ఒకింత ఉద్ధృతంగానే కొనసాగుతోంది. దీంతో ఈయేడు బాబ్లీ గేట్లను నిర్ణీత సమయానికి మూసివేసే పరిస్థితి ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ మంగళవారం మధ్యాహ్నం బాబ్లీ ప్రాజెక్టు వద్దకు తరలివెళ్లేందుకు ఎస్సారెస్పీ అధికారులు సమాయత్తం అయ్యారు. సాయంత్రం లోపు వరద ప్రవాహం తగ్గుముఖం పడితే బాబ్లీ గేట్లను మూసివేయనున్నారు. అయితే ప్రస్తుత వరద ప్రవాహాన్ని బట్టి చూస్తే గేట్లు కిందకు దించే పరిస్థితి ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం నాటికి కూడా ఎస్సారెస్పీలోకి 88 వేల క్యూసెక్కుల పైచిలుకు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్‌లో గరిష్ఠ సామర్థ్యం మేరకు 1091.00 అడుగులు, 90.313 టీఎంసీల మేర నీటిని నిలువ ఉంచుతూ, వచ్చిన వరద జలాలను వచ్చినట్టుగానే దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. 23 ఫ్లడ్‌గేట్ల ద్వారా 87,500 క్యూసెక్కులను వదులుతుండగా, కాకతీయ కాలువ ద్వారా 5500క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కుల మిగులు జలాలు దిగువకు విడుదలవుతున్నాయి. ఇదే తరహాలో దాదాపుగా గత వారం రోజుల నుండి వరద ప్రవాహం కొనసాగుతూ వస్తోంది. మరో రెండుమూడు రోజుల వరకు కూడా ఇదే తరహాలో ఇన్‌ఫ్లోలు దిగువకు వచ్చి చేరతాయని అంచనా వేస్తున్నారు. దీంతో వరద ప్రవాహం తగ్గేంత వరకు బాబ్లీ గేట్లు తెరిచే ఉంచనున్నారు. ఇప్పటికే మహారాష్టల్రోని విష్ణుపురి, గైక్వాడి, అంధురా, బాలేగాం, బాబ్లీ తదితర ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో నీటిని నిలువ చేసుకునే అవకాశాలు లేకపోవడంతో బాబ్లీ మీదుగా మరికొన్ని రోజుల పాటు వరద ప్రవాహం దిగువకు కొనసాగనుందని స్పష్టమవుతోంది. కాగా, వరద తగ్గిన వెంటనే బాబ్లీ గేట్లను మూసివేసినా, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు వచ్చే నష్టమేమీ ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. బాబ్లీ గేట్లు ఈ సీజన్‌లో మూసుకున్న అనంతరం తిరిగి వచ్చే ఏడాది 2020 జూన్ 30వ తేదీన తెరుచుకోనున్నాయి. ఇప్పటికే సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల ఈ నెల 21వ తేదీ నాటికే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకోవడం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. నిర్ణీత సమయానికి కొన్ని రోజులు ఆలస్యంగానైనా బాబ్లీ గేట్లు మూసివేసినప్పటికీ, తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఒనగూరే నష్టమేమీ ఉండదని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఖరీఫ్ పంటలు చేతికందుతుండగా, వచ్చే రబీతో పాటు ఖరీఫ్ సీజన్‌కు కూడా వారాబందీ ప్రకారం సాగు జలాలు అందించేందుకు సరిపడా నీటి నిల్వలు సరిపడతాయని భావిస్తున్నారు. దీంతో బాబ్లీ గేట్ల మూసివేత విషయమై ఈసారి రైతులతో పాటు ఇరిగేషన్ అధికారుల్లోనూ అంతగా ఆందోళన కనిపించడం లేదు. నిజానికి గత రెండేళ్లుగా బాబ్లీ గేట్ల మూసివేతకు సంబంధించి అన్నివర్గాల వారిలోనూ ఎనలేని ఆందోళన వ్యక్తమైంది. చివరకు 2015 జూలైలో జరిగిన గోదావరి మహాపుష్కరాల సమయంలోనూ నీటి లభ్యత తగినంతగా లేని కారణంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బాబ్లీ వద్ద 0.40 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉండడంతో, వాటిని గేట్లు పైకెత్తి దిగువకు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించినప్పటికీ, వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకుని మహాసర్కార్ అప్పట్లో సున్నితంగా తిరస్కరించింది. అయితే ఈసారి వరద ప్రవాహం నిర్విరామంగా కొనసాగుతుండటంతో బాబ్లీ గేట్లను నిర్ణీత సమయానికి మూసివేసే పరిస్థితి లేకుండా పోయింది.
*చిత్రాలు.. మహారాష్ట్ర సరిహద్దులోని త్రివేణి సంగమ ప్రాంతమైన కందకుర్తి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది
* ఎస్సారెస్పీ ఫ్లడ్‌గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న మిగులు జలాలు