తెలంగాణ

మన జైళ్లు దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 31: శిక్షా కాలం పూర్తయ్యాక సమాజంలో గౌరవంగా బతికేలా ఖైదీలకు ఉపాధి రంగాల్లో శిక్షణను ఇస్తూ తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రి ఎండీ.మహమూద్ అలీ పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలోని పాత జైలు సముదాయంలో ఖైదీల ఆధ్వర్యంలో నిర్వహించే భారత్ పెట్రోలియం సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన మై నేషన్ ఫిల్లింగ్ స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల విభాగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిందని, పోలీసు విభాగాన్ని పటిష్ట పర్చిందని తెలిపారు. తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని, విద్యుత్ సమస్య తలెత్తుతుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించాడని, నేడు మన రాష్ట్రంలో విద్యుత్ మిగులుబాటవుతోందని, నక్సలిజం ఎక్కడా లేదని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. క్షణికావేశంలో నేరాలు చేసి జైలు జీవితం గడుపుతున్న వారు తిరిగి బయటకు వెళ్లాక నేర ప్రవృత్తి నుండి దారి మళ్లించేందుకు జైళ్ల శాఖ మంచి సదుపాయాలతో వివిధ రకాల శిక్షణ ఇస్తుండటం ముదావహమని అన్నారు. వరంగల్ జైలులో ఖైదీలు నేసిన తివాచీలు ప్రసిద్ధమని, నాణ్యతతో కూడిన స్టీల్ ఫర్నిచర్‌కు ఎంతో మంచి పేరుందని కితాబిచ్చారు. దేశంలోనే తెలంగాణ జైళ్ల విభాగం పరిపాలన తీరు బాగుందని, ఖైదీలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. జైళ్ల విభాగం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 పెట్రోల్ బంకులు నడుస్తున్నాయని, సంగారెడ్డిలో ప్రారంభమైన ఫిల్లింగ్ స్టేషన్‌తో సంఖ్య 19కి చేరిందని వివరించారు. ఒక్కో బంకులో 10 నుండి 15 మంది ఖైదీలకు ఉపాధి కలుగుతుండటంతో వారి కుటుంబాలు సమాజంలో గౌరవంగా బతుకుతున్నాయని సంతృప్తిని వ్యక్తం చేసారు. ఉత్తమమైన ప్రమాణాలతో నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందిస్తే ఏ మారుమూలన పెట్రోల్ బంకును పెట్టినా వాహన చోదకులు వచ్చి సేవలను పొందుతారని పేర్కొన్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ సమీపంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు దేశంలోనే 6వ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. మహిళలతో పెట్రోల్ బంకులను నడుపుతున్న ఘనత జైళ్ల శాఖదే అన్నారు. జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ సైదయ్య మాట్లాడుతూ ఖైదీలకు పునరావాసం కల్పించడం, నిరుపయోగంగా ఉన్న జైళ్ల స్థలాలను ఉపయోగంలోకి తేవాలనే ఉద్దేశంతో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. భారత్ పెట్రోలియం ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్‌కు మూడు నుండి ఐదు లక్షల లాభం చేకూరవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి నెల రూ.35 వేలు లీజు రూపేణ సమకూరుతాయన్నారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్‌లో పని చేసే ఖైదీలకు నెలకు రూ.12 వేల చొప్పున వేతనం వస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో 350 మంది ఖైదీలకు జీవనోపాధి కల్పించినట్టు స్పష్టం చేసారు. జిల్లా కలెక్టర్ హన్మంతరావు మాట్లాడుతూ ఖైదీలు నేర ప్రవృత్తిని వీడనాడి సత్ప్రవర్తనతో మెలిగేందుకు జైళ్ల శాఖ ఎన్నో సంస్కరణల బాటపడుతూ ఖైదీలకు పునరావాసం, సామాజిక హోదా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజుశ్రీ, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేది, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న హోం మంత్రి మహమూద్ అలీ