తెలంగాణ

సమ్మె యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది. విధుల్లో చేరికకు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించినప్పటికీ ఎవరూ విధుల్లో చేరడం లేదని, తామంతా ఒకే మాట మీద నిలబడ్డామని జేఏసీ పేర్కొంది. అక్కడక్కడా కొందరు కార్మికులు విధుల్లో చేరుతున్నట్టు లేఖలు ఇచ్చినప్పటికీ వారి సంఖ్య పరిగణనలోకి తీసుకోదగ్గ స్థాయిలో లేదని పేర్కొంది. ఆర్టీసీ కార్మికులను బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కార్మికులు లొంగడం లేదని జేఏసీ గుర్తు చేసింది. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రి ముగియనున్న నేపథ్యంలో విద్యానగర్‌లో ఆర్టీసీ కార్మికుల సంఘం కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక, యువజన సంఘాలతో సమావేశం నిర్వహించింది. సమ్మెను కొనసాగించాల్సిందేనని, వారికి తాము వెన్నంటి ఉంటామని అఖిలపక్ష నేతలు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా కార్మికులు చెక్కుచెదరకుండా సమష్టిగా ఒకేమాటపై నిలబడ్డారన్నారు. ఇదే పోరాట స్ఫూర్తిని డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు. కొందరు కార్మికులు విధుల్లో చేరడానికి లేఖలు ఇచ్చినప్పటికీ వారు కూడా తమ బాటలోనే నడుస్తామని తిరిగి వెనక్కి వచ్చేశారన్నారు. ప్రభుత్వం ఎన్ని డెడ్‌లైన్లు పెట్టినా సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. చర్చల ద్వారా కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలనే తాము కోరుతున్నామన్నారు. చర్చల ప్రక్రియ ప్రారంభించకుండా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. ఆర్టీసీని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. కేంద్రం అనుమతి లేకుండా ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చెల్లదని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోకుండా ఉద్యమ స్ఫూర్తితో డిమాండ్లను సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
*చిత్రం... హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ కార్యాలయంలో మంగళవారం అఖిలపక్ష నేతల సమావేశంలో మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి